జంతువుల్లో ఉన్నట్టుగానే మిమోసా మొక్కలో ఒక రకమైన ’ప్రతిక్రియా చాపం’ (reflex arc) ఉంటుందని చూపించాడు బోస్. మన చేయి ఒక వేడి వస్తువును తాకగానే అదేంటో తెలీకుండానే అప్రయత్నంగానే చేతిని వెనక్కు తీసేసుకుంటాం. అలాంటప్పుడు వేడి వస్తువు నుండి వచ్చిన సంవేదనలు (sensations) నాడుల ద్వారా వెన్నుపాముని చేరుకుని, అక్కడే కొన్ని నాడీకణాల ద్వార ప్రసారం అయ్యి, తిరిగి వెన్నుపాములో అదే భాగం నుండి వచ్చే సంకేతాలు నాడుల ద్వారా ముందుకు ప్రవహించి, కండరాన్ని అదిలించి, చేతిని కదిలిస్తాయి. ఇలా వేగంగా, అప్రయత్నంగా చేసే చర్యలనే ’అసంకల్పిత ప్రతిక్రియలు (reflexes)’ అంటారు. ప్రత్యేకించి వెన్నుపాము లాంటి అవయవం లేకపోయినా మొక్కలో కూడా ఇలాంటి ప్రతిక్రియ ఉండడం చాలా ఆశ్చర్యకరం.
అలాగే డెస్మోడియం గైరాన్స్, లేదా టెలిగ్రాఫ్ మొక్కలో మరో విశేషమైన ప్రవర్తనని గమనించాడు. చిన్న కాడతో పాటు ఆ మొక్క నుండి ఒక ఆకుని తెంపి, ఆ ఆకు కాడని వంచిన, నీరు నిండిన పరీక్షానాళంలో ముంచితే కాసేపయ్యాక ఆ ఆకు, తెంపిన గాయం నుండి తేరుకుని, దానంతకు అదే నెమ్మదిగా, లయబద్ధంగా స్పందించడం మొదలెట్టింది. కొమ్మ నుండి వేరుపడ్డ ఆకు దానంతకు అది స్పందించడం ఓ చూడచక్కని దృశ్యం! దీన్ని చూస్తే రింగర్స్ ద్రావకంలో పదిలం చెయ్యబడ్డ జంతు గుండె కొట్టుకోవడం గుర్తొస్తుంది. అలాగే గుండెలో రక్త పీడనం బాగా తగ్గినప్పుడు ఎలాగైతే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో, మళ్లీ రక్తపీడనం తిరిగి పెంచినప్పుడు ఎలాగైతే గుండె తిరిగి కొట్టుకోవడం మొదలెడుతుందో, డెస్మోడియం ఆకులో కూడా పసరు యొక్క పీడనాన్ని తగ్గిస్తే ఆకు స్పందించడం ఆగిపోయి, తిరిగి పసరు పీడనం పెంచాక స్పందన తిరిగి పుంజుకుంది.
ఒకరోజు బోస్ ఉష్ణోగ్రతని మార్చుతూ మొక్కలో అత్యధిక చలనాన్ని తెప్పించే పరిస్థితుల కోసం అన్వేషిస్తున్నాడు. ఒక దశలో చలనం పూర్తిగా ఆగిపోయింది. ఆగిపోయే ముందు ఆ మొక్కలో ఒక్కసారిగా కంపన బయలుదేరింది... చివరి శ్వస విడుస్తున్న జంతువులోలా... కచ్చితంగా ఏ ఉష్ణోగ్రత వద్ద మరణం సంభవిస్తుందో తెలుసుకోడానికి ’మరణమానిని’ (morometer) అనే ఓ పరికరాన్ని తయారుచేశాడు, ఎన్నో రకాల మొక్కల్లో ఆ కీలక ఉష్ణోగ్రత 60 డిగ్రీలు కావడం విశేషం. కాని ఎన్నో ప్రత్యేక మొక్కల్లో మాత్రం ఆ ఉష్ణోగ్రత విలువ మొక్క వయసు మీద, మొక్కకి అంతకు ముందు ఇవ్వబడ్డ ప్రేరణల చరిత్ర మీద ఆధారపడింది. మితిమీరిన అలసట చేత, విషప్రభావం చేత మొక్క యొక్క నిరోధకతని కృత్రిమంగా తగ్గిస్తే, మొక్క చనిపోయే ఉష్ణోగ్రత కొన్ని సార్లు 23 C కి పడిపోయింది. చనిపోయే ముందు మొక్క భారీ ఎత్తున విద్యుత్ శక్తిని వెలువరిస్తుంది. ఐదొందల పచ్చ బఠాణీల నుండి ఐదొందల వోల్ట్ ల విద్యుత్తును పుట్టించొచ్చు కనుక, వాటితో, వాటిని వండబోయిన వంటవాడినే వండేయొచ్చు, నని బోస్ చమత్కారం ఆడతాడు ఒకచోట!
మొక్కల ఎదుగుదలకి కార్బన్ డయాక్సయిడ్ మంచిది అని మామూలుగా అనుకుంటాం. కాని అది కూడా మరీ మితిమీరితే మొక్క కూడా జంతువులు, మనుషులలాగే ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుందని గుర్తించాడు బోస్. అలాంటి పరిస్థితుల్లో మనుషులకి చేసినట్టుగానే పుష్కలంగా ఆక్సిజన్ ని పట్టించి మొక్కని ఆ స్థితి నుండి బయటి తీసుకురావచ్చు. మొక్కలలో కూడా విస్కీ, జిన్ పట్టిస్తే వాటికీ “స్పృహ కోల్పోవడం”, “తిరిగి స్పృహ రావడం,” స్పృహ వచ్చాక కూడా చాలా సేపు మత్తు వదలకపోవడం (hangover) మొదలైన లక్షణాలన్నీ గమనించాడు. ఇలాంటి వందలాది ప్రయోగాలని క్రోడీకరిస్తూ 1906 – 1907 కాలంలో రెండు అద్భుత గ్రంథాలని ప్రచురించాడు.
వాటిలో ఒకటైన Plant response as a means of physiological investigation (మొక్కల ప్రతిస్పందనల ఆధారంగా జీవక్రియలలోకి శోధన) అన్న 781 పేజీల పుస్తకంలో 315 ప్రయోగాలు వర్ణించబడ్డాయి. ఆ ప్రయోగాలలో జీవక్రియలకి సంబంధించి ఆ రోజుల్లో చలామణిలో ఉన్న ఒక మౌలిక భావన తప్పని ఋజువు అయ్యింది. ఆ విషయం గురించి బోస్ స్వయంగా ఇలా అంటాడు: “ఎలాగైతే ట్రిగ్గరు నొక్కినప్పుడు తుపాకి లోంచి తూటా బయటికి దూసుకొస్తుందో, ఇంధనం భగ్గు మన్నప్పుడు అంతర్ జ్వలన యంత్రంలో చలనం వస్తుందో, అదే విధంగా [జీవపదార్థంలోజరిగే] ప్రతిస్పందన ఎప్పుడూ విస్ఫోటాత్మకంగా జరిగే రసాయన చర్య వల్ల జరుగుతుందని, అది ముగియగానే శక్తి అంతా తప్పనిసరిగా హరించుకుపోతుందని అనుకోవడం పరిపాటి.” కాని బోస్ ప్రయోగాలలో మొక్కలలో చలనాలకి, కాండంలో పసరు పైకి ఎగయడానికి, మొక్కల ఎదుగుదలకి కావలసిన శక్తి అంతా మొక్కలు తమ పరిసరాల నుండి తిసుకుంటాయని తేలింది. అలా గ్రహించిన శక్తిని మొక్కలు తమలో నిలువ ఉంచుకుని భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటాయి.
ఇలాంటి విప్లవాత్మక భావాలతో భౌతిక శాస్త్రవేత్తల మన్ననలని పొందినా వృక్షశాస్త్రవేత్తలతో మాత్రం కోరి శత్రుత్వం కొని తెచ్చుకున్నాడు. బొటానికల్ గెజిట్ అనే పత్రిక ఒక పక్క బోస్ కృషిని మెచ్చుకుంటూనే, మరో పక్క “రచయిత తను వ్యవహరిస్తున్న రంగంలో పెద్దగా ప్రవేశం లేకపోవడం చేత ఎన్నో చోట్ల పొరబాట్లు చేశాడు,” అని విమర్శించింది.
(సశేషం...)
0 comments