1858లో నవంబర్ 30 నాడు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న మైమెన్సింగ్ లో జన్మించాడు బోస్.
బోస్ తండ్రి గొప్ప దేశభక్తుడు. నవతరం మీద బ్రిటిష్ విద్యావ్యవస్థ యొక్క హానికరమైన ప్రభావాన్ని బాగా గుర్తించినవాడు. పాశ్చాత్య విషయాలని నిర్విమర్శగా స్వీకరించే బానిస ప్రవృత్తి, పాఠ్యాంశాలని గుడ్డిగా కంఠస్థం చేసే పద్ధతి – ఇవీ బ్రిటిష్ విద్యా వ్యవస్థ మనకు మిగిల్చిన వారసత్వం. కనుక బోస్ తండ్రి బ్రిటిష్ వారు నడిపించే బడికి కాకుండా, సాంప్రదాయబద్ధమైన ఓ పాఠశాలకి జగదీశ్ చంద్రుణ్ణి పంపించాడు.
నాలుగేళ్ళ బోస్ రోజూ పాఠశాలకి వెళ్లే తీరు చిత్రం గా ఉండేది. ఓ పెద్ద గజదొంగ తన వాహనం. అతగాడి భుజాల మీద స్వారీ చేస్తూ ఠీవిగా బడికి వెళ్లేవాడు బోస్. ఈ గజదొంగ చాలా కాలం జైల్లో ఉండి బయటికి వచ్చినవాడు. ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోతే జగదీశ్ చంద్రుడి తండ్రి దయదలిచి తన వద్ద పనికి పెట్టుకున్నాడు. ఆయన ఉదారగుణానికి హృదయపరివర్తన కలిగిన ఆ దొంగ నమ్మకంగా ఆయన వద్ద పనిచెయ్యసాగాడు. జగదీశ్ చంద్రుణ్ణి రోజూ తన భుజాల మీద బడికి మోసుకుపోతూ దార్లో తన గతానికి చెందిన చిత్రవిచిత్ర సాహసగాధలు చెప్తుండేవాడు. సమాజం దుర్మార్గుడని ముద్రవేసిన ఆ మనిషిలో ఎంత మంచితనం, మానవత్వం దాగి ఉన్నాయో పసివాడైన బోస్ గుర్తించాడు. ఆ విషయం గురించే తరువాత ఇలా రాసుకున్నాడు: “చట్టవ్యతిరేక లోకానికి రారాజైన ఆ మనిషికి ఉన్నంత మెత్తని హృదయం ఏ ఆయాకీ ఉండదేమో. చట్టం యొక్క, సమాజం యొక్క కృత్రిమమైన కట్టుబాట్లని ఒక పక్క వెక్కిరిస్తూనే ఉన్నా, వ్యక్తిగత జీవితంలో చాలా ఉన్నతమైన నైతిక ప్రమాణాలని కలిగి ఉండేవాడు.”
అలాగే కూలి నాలి చేసుకునే వారితో, పామర వర్గంతో, రైతులతో తన సావాసం ప్రకృతి గురించి ఎన్నో పాఠాలు నేర్పింది అంటాడు. ఆ విషయమే చాలా కాలం తరువాత ఓ వైజ్ఞానిక సమావేశంలో చెప్పుకున్నాడు: “నాగలి చేతబట్టి మట్టిలో పచ్చని సంపత్తిని వెలయింపజేసే కర్షకుల నుండి, మహానదులలో, నిశ్చల తటాకాలలో కనిపించే విచిత్ర జలజీవాల గురించి కథకథలుగా చెప్పే జాలరిబాలుర నుండి, నేను నా ప్రప్రథమ ప్రకృతి పాఠాలు నేర్చుకున్నాను. ప్రకృతి అంటే ప్రేమ నాకు వాళ్లు నేర్పినదే.”
సెయింట్ జేవియర్ కాలేజిలో చదువు పూర్తి చేశాడు బోస్. గణిత, భౌతిక శాస్త్రాలలో అక్కడ బోస్ కనబరచిన ప్రతిభ అక్కడ ఫాదర్ లాఫాంట్ అనే ఓ టీచరు దృష్టిని ఆకట్టుకుంది. సివిల్ సర్విసెస్ చదవడానికి ఇంగ్లండ్ వెళ్లమని ఆయన బోస్ ని ప్రోత్సహించాడు. అధికార వర్గంలో ఉండేవారిలో మానవత్వం క్రమంగా ఎలా అణగారిపోతుందో స్వయంగా చూసిన బోస్ తండ్రి, బాహ్యసామ్రాజ్యాన్ని ఏలే పాలకుడిగా కాక, ఆత్మసామ్రాజ్యాన్ని ఏలుకునే పండితుడిగా ఎదగమని కొడుక్కి సలహా ఇచ్చాడు.
మొదట లండన్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చేద్దాం అని వెళ్లాడు. కాని ఆ శవపరిచ్ఛేదాలు, ఆ కంపు అతడికి పడలేదు. ఆరోగ్యం దెబ్బ తిని మధ్యలో చదువు నిలిపేయాల్సి వచ్చింది.
తరువాత కేంబ్రిడ్జ్ లో క్రైస్ట్ కాలేజిలో ప్రకృతి శాస్త్ర అధ్యయనాలలో చేరాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ప్రకృతి శాస్త్రంలో ట్రైపోస్ పట్టం కూడా పుచ్చుకున్నాడు. తరువాత లండన్ విశ్వవిద్యాలయం లో బి.యస్.సి. లో చేరాడు. అక్కడ బోస్ భౌతిక, రసాయన, వృక్షశాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆయారంగాల్లో మహామహులు అక్కడ బోధకులుగా వచ్చేవారు. గాలిలో ఆర్గాన్ ఉందని కనుక్కున్న లార్డ్ రాలీ, పరిణామ సిద్ధాంతకారుడు చార్లెస్ డార్విన్ కొడుకైన ఫ్రాన్సిస్ డార్విన్ తదితరులు అక్కడ పాఠాలు చెప్పేవారు. 1884 లో లండన్ విశ్వవిద్యాలయం నుండి బాచెలర్స్ డిగ్రీ అందుకున్నాడు.
ఇంగ్లండ్ లో చదువు పూర్తి చేసుకుని 1885 లో ఇండియాకి తిరిగి వచ్చాడు బోస్.
(సశేషం...)
0 comments