శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
విజయుడై ఇండియాకి తిరిగొచ్చిన బోస్ చెవిన ఓ శుభవార్త పడింది. ప్రెసిడెన్సీ కాలేజిలో, భౌతిక శాస్త్ర అధ్యయనంలో, పరిశోధనలో, బ్రిటిష్ “సామ్రాజ్యం యొక్క హోదాకి తగ్గ” ఓ సాటిలేని కేంద్రాన్ని స్థాపించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ, రాయల్ సొసయిటీకి అధ్యక్షుడిగా ఉన్న లార్డ్ లిస్టర్, భారత రాష్ట్ర కార్యదర్శికి ఓ ఉత్తరువు పంపించాడు. అందుకు మొదటి విడతగా 40,000 పౌన్ల నిధులు కూడా మంజూరు అయ్యాయి. అయితే బోస్ పొడ గిట్టని బెంగాల్ విద్యా విభాగ అధికారులు ఆ ప్రాజెక్టు ముందుకు సాగనీకుండా అడ్డు పడ్డారు. ఆ రోజుల్లోనే బోస్ ని సందర్శించి అభినందనలు చెప్పడానికి రవీంద్ర కవి ఒకసారి బోస్ ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో బోస్ ఇంట్లో లేడు. మఖత: మెచ్చుకోలు మాటలు చెబ్దామని అనుకున్న కవి, ఆ శాస్త్రవేత్త కోసం ఓ పలువన్నెల పూల గుత్తిని విడిచి వెళ్లాడు. ఆఫీసు రాజకీయాలతో విసిగిపోయిన ఉన్న బోస్ సాయంత్రం ఇంటికి రాగానే నవ్వులు చిందించే ఆ సుమాలు కాస్తంత స్వాంతన నిచ్చాయి.

అలా నిరంతరాయంగా వేధింపులు కొనసాగుతూనే ఉన్నా బోస్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తన పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాడు. ఆ శ్రమ లోంచి 1898 లో విద్యుదయస్కాంత తరంగాల మీద ఆణిముత్యాల్లాంటి నాలుగు పేపర్లు వెలువడ్డాయి. Proceedings of the Royal Society లోను, ప్రఖ్యాత Nature పత్రికలోను అవి ప్రచురితమయ్యాయి.

ఇదిలా ఉండగా 1899 లో బోస్ ఓ విచిత్రమైన విషయాన్ని గుర్తించాడు. విద్యుదయస్కాంత తరంగాలని గ్రహించే ’కొహెరర్’ (coherer) అని తను చేసిన ఓ పరికరాన్ని నిరంతరాయంగా ఎక్కువ సేపు వాడితే దాని సునిశితత్వం (sensitivity) తగ్గడం కనిపించింది. కాని కాసేపు దానికి ’విశ్రాంతి’ నిచ్చి మళ్లీ వాడడం మొదలెడితే మునుపటి సునిశితత్వం మళ్లీ వచ్చింది. పని ఎక్కువ కావడం వల్ల కొహెరర్ లోని లోహపు పదార్థం “అలసిపోయిందా”? మనుషులకి, జంతువులకి అలసట ఉన్నట్టే లోహానికీ అలసట ఉంటుందా? బోస్ ఆలోచనలు కొత్త దారులు తొక్కడం మొదలెట్టాయి. జీవరహిత లోహాల లక్షణాలని, జీవపదార్థం యొక్క లక్షణాలని తులనాత్మకంగా అధ్యయనం చెయ్యడం ప్రారంభించాడు.

వివిధ పదార్థాలు బాహ్య ప్రేరణలకి ఎలా ప్రతిస్పందిస్తాయో పరీక్షిస్తూ వచ్చాడు బోస్. కొద్దిగా వెచ్చజేసిన మాగ్నెటిక్ ఐరన్ ఆక్సయిడ్ యొక్క ప్రతిస్పందన తీరు, కండరాల ప్రతిస్పందన తీరు ఎంతో పోలిక కలిగి ఉండడం గమనించాడు. ఒత్తిడి ఎక్కువై, ప్రతిస్పందన బలహీనం అయినప్పుడు, రెండు పదార్థాలని కొంచెం గోరువెచ్చని నీట్లో కాసేపు ముంచి తీస్తే, రెండూ తేరుకున్నాయి. నిస్సత్తువ (fatigue) పోయి మునుపటి ప్రతిస్పందన మళ్లీ కనిపించింది. తదితర లోహాలు కూడా ఈ విధంగా జీవపదార్థాన్ని పోలిన విడ్డూరమైన పోకడలు ప్రదర్శించాయి. లోహపు ఉపరితలం మీద ఆమ్లాన్ని (acid) పోసి, తరువాత దాని ఛాయలు కూడా లేకుండా బాగా రుద్దాక కూడా, ఆమ్లం పోయని ప్రదేశానికి, మునుపు ఆమ్లం పోసిన చోటికి మధ్య ప్రతిస్పందనలో తేడా కనిపించింది. ఆమ్లపు ఆనవాళ్లు కూడ లేకుండా రుద్దిగా ఇంకా దాని ఉన్కిని తెలిపే ప్రత్యేక ప్రతిస్పందన ఎందుకు కనిపిస్తోంది? ఆమ్లంతో సంపర్కం వల్ల లోహంలో మిగిలిన ఒక రకమైన స్మృతికి ఇది ఫలితం అని వివరించాడు బోస్.

ఈ ప్రయోగ ఫలితాలన్నిటినీ బోస్ 1900 లో పారిస్ లో జరిగిన International Congress of Physics అనే సమావేశంలో ప్రదర్శించాడు. ’De la généralité des phénomènes Moleculaires Produits par l'électricité sur la matière inorganique et sur la matière vivante (జీవ, జీవరహిత పదార్థాలలో విద్యుత్ ప్రభావం వల్ల పుట్టిన అణుసంబంధిత చర్యలలో సమానత ) అన్న పేరు గల ఫ్రెంచ్ పత్రంలో “ప్రకృతిలో బయటికి కనిపించే వైవిధ్యం వెనుక దాగి ఉన్న ఐక్యత” గురించి విడమర్చి చెప్పాడు. “జీవరహిత చర్యలు ఇక్కడ అంతం అవుతాయని, జీవసహిత చర్యలు ఇక్కడ ఆరంభం అవుతాయని గిరి గీసి చెప్పడం అసంభవం” అన్నాడు. అలాంటి సంచలనాత్మక సూచన విన్న కాంగ్రెస్ సభ్యులు నోళ్లు వెళ్లబెట్టారు. సమావేశం అధ్యక్షుడే “అవాక్కయ్యా” నని చెప్పుకున్నాడు.
(సశేషం...)

5 comments

  1. సత్యేంద్రనాథ్‌బోస్ లాంటి విజ్ఞానఋషిని గురించి తెల్పుతున్నందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు. బోస్ గారి వ్యక్తిత్వం అత్యద్బుతమైనది. వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

     
  2. budugu Says:
  3. i think here we are talking abt jagadish chandrabose..not satyedranath bose.

     
  4. Yes. These articles are about JC Bose.

     
  5. kanthisena Says:
  6. జెసి బోస్‌పై మీరు ఇక్కడ పొందుపర్చిన విషయాలను కలిపి ఒక ఈ బుక్ గా అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తప్పక దీనికి పూనుకోగలరు. తెలుగులో ఎంత చక్కటి సైన్స్ పత్రిక ఆన్‌లైన్‌లో వస్తోందో గదా.. సైన్స్ లోని సంక్లిష్ట విషయాలను కూడా ఇంత సులభశైలిలో, కవితాత్మకంగా వివరిస్తున్నారు. మీ బృందం మొత్తానికి అభినందనలు.
    రాజశేఖర్
    చందమామ
    blaagu.com/chandamamalu

     
  7. ప్రోత్సాహానికి ధన్యవాదాలు. బోస్ మీద వ్యాసాలని పుస్తక రూపంలో తెచ్చే ఉద్దేశం తప్పకుండా ఉంది. అది జరినప్పుడు ఈ బ్లాగ్ లో తెలియజేస్తాను.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts