అంటువ్యాధులు కొన్ని సందర్భాలలో విశృంఖలంగా వ్యాపించి అపారమైన ప్రాణనష్టానికి దారితీస్తాయని కిందటి సారి గమనించాం. ఇన్ఫ్లూయెన్జా లాగానే కోట్ల సంఖ్యలో ప్రాణ నష్టాన్ని కలుగజేసిన మరో వ్యాధి వుంది. పద్నాల్గవ శతాబ్దపు యూరప్ లో బ్యూబోనిక్ ప్లేగ్ అనే ఓ భయంకరమైన వ్యాధి విలయతాండవం చేసింది. అయితే ఈ వ్యాధికి కారణం వైరస్ కాదని ప్రస్తుతం మనకి తెలుసు. దానికి కారణం యెర్సీనియా పెస్టిస్ అనే బాక్టీరియా. చైనాలో మొదలైన ఈ వ్యాధి పాశ్చాత్యానికి వ్యాపించిందని అంటారు. ఒక్క చైనాలోనే 25 మిలియన్ల మందిని అంటే దేశ జనాభాలో 30% మందిని పొట్టన బెట్టుకుంది. అది సిల్కు దారి ద్వారా మధ్యధరా సముద్ర తీర ప్రాంతాన్ని చేరి, అక్కణ్ణుంచి మొత్తం యూరప్ అంతా వ్యాపించి యూరప్ జనాభాలో 30-60% మందిని తుదముట్టించింది. ఆ ఒక్క శతాబ్దంలో ఈ వ్యాధ వాత బడి 400 మిలియన్ ప్రజలకి పైగా ప్రాణాలు కోల్పాయారని అంచనా. అపర మృత్యు దేవతలా అంత మందిని పొట్టనబెట్టుకున్న ఆ వ్యాధికి black death అని పేరు.
అంటువ్యాధుల వ్యాప్తికి మురికి, అశుభ్రత ఎంతో దొహదం చేస్తాయి. ఆ రోజుల్లో యూరప్ లోఊళ్లు రోతపుట్టించే మురికి వాడలై ఉండేవి. మురుగు కాలవల సదుపాయం ఉండేది కాదు. ఇరుకైన వాడలలో మితిమీరిన జన సందోహం ఉండేది. (పరిశుభ్రతకి వ్యాధి నియంత్రణకి మధ్య సంబంధాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న పాశ్చాత్య దేశాలు ఆధునిక యుగంలో పరిశుభ్రతా ప్రమాణాలని గణనీయంగా పెంచుకున్నాయి. ఆ సత్పరిమాణం మన దేశంలో ఇంకా పూర్తిగా రాలేదనే చెప్పాలి. మన దేశంలో మురికి అంటే ఇప్పటికీ “మమకారం” హెచ్చు!)
(ఇంగ్లండ్ లో ఆనాటి మురికి వాడలు - వికీ)
అలాంటి పరిసరాలలో అంటువ్యాధులు సులభంగా పెచ్చరిల్లేవి. కొన్ని వ్యాధులు ఒకరి నుండి ఒకరికి సోకుతాయన్న అవగాన ఉండడం వల్ల, తమ పరిసరాలలో వ్యాధి గ్రస్థులు ఉన్నారని తెలియగనే వ్యాధి నుండి తప్పించుకోడానికి ఆ ప్రాంతాలని వదిలి దూరంగా పారిపోయేవారు. కాని ఆ ప్రయత్నంలో తెలియకుండానే వ్యాధి కారక క్రిములని మరింత వేగంగా విస్తపింపజేసి వ్యధిని మరింత సులభంగా వ్యాపింపజేసేవారు.
అయితే అంటువ్యాధుల వ్యాప్తిలో ఓ చిత్రమైన ధోరణిని ఆ రోజుల్లో కూడా ప్రజలు గమనించారు. వ్యాధి సోకిన అందరూ పోతారని నియమం ఏమీ లేదు. కొందరిలో వ్యాధి లక్షణాలు కొద్దిగా కనిపించి సద్దుమణుగుతాయి. కొందరు వ్యాధికి లొంగి ప్రాణాలు పోగొట్టుకుంటారు. కొన్ని వ్యాధుల విషయంలో అయితే వ్యాధి ఒకసారి సోకితే, ఆ వ్యాధి సోకిన వ్యక్తికి మళ్లీ రాకుండా ఒక విధమైన సహజ రక్షణ ఏర్పడుతుంది. Measles, mumps, small pox మొదలైన వ్యాధుల విషయంలో అదే జరుగుతుంది. ఈ మూడూ కూడా వైరల్ వ్యాధులే. వ్యాధి ఒకసారి కలిగాక మళ్లీ కలగకుండా శరీరంలో రక్షణ ఎలా ఏర్పడుతోంది? ఆ రక్షణ ఏదో ముందే కల్పించి ఒక్కసారి కూడా వ్యాధి సోకకుండా చెయ్యగలమా? ఈ ఆలోచనా ధోరణి ఆధారంగా జరిగిన ప్రయత్నాలు ఎలా వున్నాయో చూద్దాం.
పద్దెనిమిదవ శతాబ్దపు చివరి వరకు కూడా small pox ఓ భయంకరమైన వ్యాధిగా పేరుపొందింది. ఆ వ్యాధి అంటే భయపడడానికి కారణం ప్రాణభయం మాత్రమే కాదు. ఆ వ్యాధి మనిషి యొక్క రూపురేఖలని దారుణంగా వికారపరిచి, ప్రాణాన్ని మిగిల్చినా మానవత్వాన్ని కాజేస్తుంది. ఆ రోజుల్లో జనాభలో అధిక శాతం ప్రజల ముఖాల్లో small pox వ్యాధి సోకిన ఆనవాళ్లు కనిపించి వ్యాధి యొక్క దారుణ ప్రభావాన్ని నలుగురికీ గుర్తు చేస్తూ ఉండేవి.
(స్మాల్ పాక్స్ సోకిన పసి వాడు - వికీ)
పదిహేడవ శతాబ్దపు టర్కీ దేశంలో జనం small pox నుండి ఆత్మరక్షణ కోసం ఓ దారుణమైన పద్ధతిని అవలంబించారు. కాస్త తక్కువ స్థాయి తీవ్రతలో small pox గల రోగి నుండి వ్యాధిని ఉద్దేశపూర్వకంగా తమలోకి ఎక్కించుకునేవారు. రోగి ఒంటి మీద కురుపుల లోనుండి స్రవించే ద్రవాన్ని సేవించేవారు. అలాంటి ప్రక్రియ వల్ల కొందరిలో తక్కువ స్థాయి తీవ్రత గల వ్యాధి అవతలి వారికి సోకేది. ఏ వికార పరిణామం నుండి, సౌందర్య వినాశనం నుండి అయితే తప్పించుకోవాలని అనుకున్నారు ఆ దురదృష్టాన్ని వాళ్ళు పనిగట్టుకుని ఇంటికి ఆహ్వానించినట్టు అయ్యేది. దిక్కులేకుండా చచ్చే కన్నా ఈ కాస్త ఉపశమనం అయినా చాలునన్న ఆలోచనతో ఇలాంటి ప్రమాదకర చర్యలకి ఒడిగట్టేవాళ్ళు.
1718 లో లండన్ కి చెందిన మేరీ మాంటెగూ అనే ఓ సౌందర్యరాశి టర్కీ దేశంలో స్మాల్ పాక్స్ నియంత్రణ విషయంలో జరుగుతున్న తంతు గురించి విన్నది. ఆమె కుటుంబ సమేతంగా టర్కీకి వెళ్ళి ఇంటిల్లి పాదికీ స్మాల్ పాక్స్ “మందు” ఇప్పించింది. అదృష్టవశాత్తు ఏ హానీ కలగకుండా అందరు సురక్షితంగా ఇంగ్లండ్ కి తిరిగొచ్చారు. ఆ ‘మహత్యాన్ని’ జనం ఎందుచేతనో పెద్దగా పట్టించుకోలేదు. మేరీ మాంటెగ్యూ యొక్క వ్యక్తిత్వం మీద జనానికి ఉండే చిన్నచూపే ఆ నిర్లక్ష్యానికి కారణం కావచ్చు.
ఇలాంటి ప్రయత్నమే ఒకటి అమెరికాలో జరిగింది. బాస్టన్ నగరానికి చెందిన జాబ్డియెల్ బాయిస్టన్ అనే వైద్యుడు 241 మందికి స్మాల్ పాక్స్ ‘మందు’ ఇచ్చాడు. అందులో ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు. బతికి బట్టకట్టిన 235 మందిని పక్కనబెట్టి పోయిన ఆరు ప్రాణాలకి గాని ఆయన్ని నలుగురు ఆడిపోసుకున్నారు.
ఇలా ఉండగా ఇంగ్లండ్ లో గ్లౌసెస్టర్ షైర్ అనే చిన్న ఊళ్లో ఆ ఊరి జనం స్మాల్ పాక్స్ ని అరికట్టడానికి ఓ కొత్త పద్ధతిని ఊహించారు. ఎక్కువగా ఆవులకి, కొన్ని సార్లు మనుషులకి కూడా సోకే, cow pox అనే ఓ వ్యాధి గాని మనిషికి ఓ సారి సోకితే, దాని వల్ల ఆ మనిషికి కౌ పాక్స్ నుండే కాక స్మాల్ పాక్స్ నుండి కూడా రోగనిరోధకత ఏర్పడుతుందని ఊరి వారికి ఓ నమ్మకం. అదే నిజమైతే చాలా గొప్ప విశేషమే. ఎందుకంటే కౌ పాక్స్ వల్ల ఒంటి మీద పెద్దగా మచ్చలు రావు.
తక్కువ తీవ్రత గల కౌపాక్స్ మనిషికి సోకేలా చేస్తే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు అవుతుంది.
ఆ ఊరికి చెందిన ఓ వైద్యుడికి ఈ “మూఢనమ్మకం” చాలా ఆసక్తికరంగా అనిపించింది. అదే నిజమైతే స్మాల్ పాక్స్ కి ఓ చక్కని చికిత్స చేజిక్కినట్టే. ఆ మూఢనమ్మకం నిజమో కాదో తేల్చుకోవాలనుకున్నాడు ఆ వైద్యుడు.
(ఇంకా వుంది)
References:
Isaac Asimov, Guide to Science 2: Biological Sciences, Pelican Books. (Chapter on Micro-organisms), 1972.
http://en.wikipedia.org/wiki/Black_Death
http://en.wikipedia.org/wiki/Smallpox
0 comments