ఆ జలచరాన్ని ఓ సారి శ్రద్ధగా చూశాను. నిజమే. దానికి కళ్లు లేవు. మళ్లీ గాలానికి ఎర వేసి నీట్లోకి విసిరాం. ఈ సముద్రం చేపలతో కిటకిట లాడుతున్నట్టు వుంది. కొద్ది గంటల్లో టెరిక్ థైడ్ జాతికి చెందిన బోలెడు చేపలు పట్టుకున్నాం. అలాగే వినష్ట జాతి అయిన డిప్టెరీడ్ కుటుంబానికి చెందిన చేపలని కూడా పట్టుకున్నాం. అయితే వాటి జాతి ఏమిటో మామయ్య పోల్చుకోలేక పోయాడు. ఈ చేపలన్నిటికీ కళ్లు లేవు. ఇలా చిక్కిన చేపల పుణ్యమా అని మా ఆహార పదార్థాల సంపత్తి కాస్త పెరిగింది.
ఈ సముద్రం లో చిక్కిన జీవాలని చూస్తుంటే ఒక్కటి అర్థమవుతోంది. శిలాజ స్థితిలో ఉన్న జీవరాశులు మాత్రమే ఈ సముద్రంలో ఉన్నట్టు ఉన్నాయి. ఈ చేపలు గాని, సరీసృపాలు గాని, గతంలో ఎంత దూరానికి పోతే వాటి రూపురేఖలు కూడా అంత అవిస్పష్టంగా ఉన్నాయి.
బహుశ అదృష్టం బావుంటే ప్రస్తుతానికి మనకి అస్తికల రూపంలో మాత్రమే అస్తిత్వం తెలిసిన సౌరియన్ (saurian) జీవాలు కూడా చేతికి చిక్కొచ్చు. దూరదర్శినితో ఓ సారి నలు దిశలా పరికించాను. ఎటు చూసినా హద్దులేని, ఎడారి లాంటి సముద్రం. తీరానికి బాగా దూరంగా వచ్చేశాం.
ఓ సారి తలెత్తి గాల్లోకి చూశాను. కూవియే మహనీయుడు పునర్నిర్మించిన విచిత్రమైన పక్షులు మళ్లీ ఈ సాంద్ర వాతావరణంలో రెక్కలు అల్లారుస్తాయేమో నని ఆశగా చూశాను. వాటి మనుగడకి కావలసినంత జలచర సంపద ఈ సముద్రంలో వుంది. వాతావరణం కూడా పూర్తిగా రిక్తంగా కనిపించింది.
నా మనసు ఎందుకో పురాజీవ శాస్త్రం (paelentology) చేసిన అద్భుత ఊహాగానాల మీదకి మళ్లింది. తెలీకుండానే ఓ పగటి కలలోకి జారుకున్నాను. తేలే దీవుల్లాంటి తాబేళ్లు నా మనో నేత్రం ముందు కదలాడాయి. భూమి తొలి దశల్లో జీవించిన మహాకాయాలైన స్తన్య జీవాలు అల్లంత దూరంలో కదులుతున్నట్టు ఊహించుకున్నాను. బ్రెజిల్ దేశపు కొండ గుహల్లో కనిపించే లెప్టో తీరియమ్ లు, సైబీరియాకి చెందిన హిమ తలాల మీద సంచరించే మెరికో తీరియమ్ లు, కనిపించాయి. మరి కాస్త దూరంలో దళసరి చర్మం గల లోఫియోడాన్ లు కనిపించాయి. పంది ఆకారంలో ఉండే టాపిర్ లు రాళ్ళ వెనుక నక్కి వున్నాయి. గుర్రం, ఒంటె, రైనోసరస్, హిపోపొటమస్ లు కలగలిసి నట్టు ఉండే అనోప్లోతీరియమ్ లు ఈ టాపిర్ లతో వేటలో పోటీ పడడం చూశాను. మదగజాల్లాంటి మాస్టడన్ లు తమ తొండాలని అటు ఇటు ఊపుతూ, భయంకరంగా ఘీంకరిస్తూ, తమ వాడి దంతాలతో రాళ్లని పొడిచి పిండి చేస్తున్నాయి. ఇక బృహత్ కాయం గల మెగాతీరియం తన బలమైన వెనుక కాళ్ల మీద కూర్చుని, ముంగాళ్లతో నేల మీద బలంగా గోకుతుంటే చుట్టూ ఉండే బండల మధ్య ఆ భీకర రొద ప్రతిధ్వనించింది. ఇక కాస్త ఎత్తు మీద చూస్తే ప్రొటో పితికా (ఈ లోకంలో అవతరించిన మొట్టమొదటి కోతి) నిటారైన బండల మీద బిర బిర ఎగబ్రాకుతోంది. ఇంకా ఎత్తులో ఓ టెరోడాక్టిల్ (చిత్రం) గజిబిజి గతిలో ఎగురుతూ దట్టమైన గాలిని ఛేదిస్తోంది. ఇక గాలి యొక్క పైపొరలలో విశాల విహంగాలు తమ సుదీర్ఘమైన రెక్కలని అల్లారుస్తూ అడ్డొస్తున్న కఠిన శిలని కసి తీరా మోదుతున్నాయి.
ఆ విధంగా శీలాజాలకే పరిమితమైన మర్త్యప్రపంచం అంతా ఒక్కసారిగా ఊపిరి పోసుకుని నా ఊహాలోకంలో కదలాడసాగింది. భూమి మీద మానవ అవతరణకి పూర్వం పరిస్థితులు ఎలా ఉండేవి అన్న విషయం గురించి అధ్యాత్మిక గ్రంథాలలో ఇవ్వబడ్డ వివరణల మీదకి ఎందుకో ఓ సారి మనసు పోయింది. జీవ సృష్టికి పూర్వపు భూమిని నా ఊహలు తాకడానికి ప్రయత్నించాయి. ముందుగా స్తన్య జీవాలు మాయం అయ్యాయి. తరువాత పక్షులు. ఆ తరువాత రెండవ కాలానికి చెందిన సరీసృపాలు మాయం. నెమ్మదిగా చేపలు మొదలైన జలచరాలు మాయం. క్రమంగా సంక్రమణ దశకి చెందిన వృక్షసదృశ (zoophytes) జంతువులు కూడా అదృశ్యం అయ్యాయి. ఇక భూమి మీద మిగిలిన ఏకైక జీవి నేనే. లోకంలోని జీవశక్తి అంతా నా గుండె స్పందన లోనే కేంద్రీకృతమై ఉన్నట్టు అనిపించింది.
ఇక ఋతువులు లేవు. వాతావరణ భేదాలు లేవు. భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగి పెరిగి సూర్యతాపంలో పోటీ పడుతున్నాయి.
(ఇంకా వుంది)
0 comments