32 వ అధ్యాయం
భూమి లోతుల్లో అద్భుతాలు
ఆగస్టు 13 తరీఖున అందరం తెల్లారే లేచిపోయాం. మునుపటి కన్నా వేగంగా, సులభంగా ప్రయాణించే కొత్త పద్ధతి అవలంబించాం.
తెరచాప కట్టిన కట్టె కోసం రెండు పొడవాటి కట్టెలని కలిపి కట్టాం. మేం వాడే దుప్పట్లలో ఒకటి తెరచాపగా వాడాము. బోలెడంత త్రాడు వాడి తెప్పని, తెరచాపని పకడ్బందీగా, ధృఢంగా నిర్మించాం.
వెచ్చాలు, సామాన్లు, పరికరాలు, తుపాకులు, రాళ్ల మధ్య నుండి ఊరే మంచినీటితో నింపిన తిత్తులు – అన్నీ మా చిన్ని పడవ మీదకి ఎక్కించాం. సరిగ్గా ఆరు గంటల కల్లా బయల్దేరాలని ప్రొఫెసర్ సంజ్ఞ చేశాడు. హన్స్ పడవకి ఓ చుక్కాని తగిలించాడు. లంగరు ఎత్తబడింది. పడవ నీట్లోకి ప్రవేశించింది. కాసేపట్లోనే మా పడవ చిట్టి కెరటాల మీద సునాయాసంగా జారుతూ ముందుకు సాగిపోయింది. ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా ఆ ప్రదేశానికి ఏదో పేరు పెట్టడం మామయ్యకి పరిపాటి అయిపోయింది. ఇప్పుడు మేం విడిచి పెడుతున్న రేవుకి నా పేరు పెడతానన్నాడు.
“నాకు అంత కన్నా మంచి ఆలోచన ఉంది,” అన్నాన్నేను. “గ్రౌబెన్ అని పెడదాం. గ్రౌబెన్ రేవు. వింటానికి బావుంది. మ్యాపు మీద కూడా బావుంటుంది.”
“సరే అయితే. గ్రౌబెన్ రేవు అనే పెడదాం,” మామయ్య ఒప్పుకున్నాడు.
ఆ విర్లాండ్* వయ్యారి పేరు ఈ విధంగా చిరస్మరణీయం కావడం నాకెంతో సంతోషం కలిగించింది.
(* విర్లాండ్ అనేది జర్మనీలో ఓ చిన్న ప్రాంతం. ఏక్సెల్ ప్రియురాలు గ్రౌబెన్ ఆ ప్రాంతానికి చెందింది. – అనువాదకుడు)
ఉత్తర-పశ్చిమ దిశ నుండి గాలి హోరుమని వీస్తోంది. మా పడవని జోరుగా ముందుకి తోస్తోంది.
మామయ్య మా చలనం మీద లెక్కలు కడుతున్నాడు. ఈ లెక్కన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై కోసులు ప్రయాణించగలం అన్నాడు. త్వరలోనే ఆవలి తీరాన్ని చేరుకోగలం అన్నాడు.
నేను సమాధానం చెప్పలేదు. వెళ్లి పడవ ముందు భాగంలో కూర్చున్నాను. దిక్చక్రం వద్ద ఉత్తర తీరం నెమ్మదిగా కనుమరుగవుతోంది. తూర్పు, పశ్చిమ తీర భాగాలు కూడా మెల్లగా దూరం అవుతూ వీడ్కోలు చెప్తున్నాయి. ఇక ఎదుట హద్దులేని సముద్రమే ఆహ్వానిస్తోంది. పైన నల్లని మహామేఘాల నీడలు నీట్లో పడి నీరు నల్లబారినట్టు అనిపిస్తోంది. ఆగాగి మెరిసే తటిల్లతా కాంతులు పడవ వెనుక ఎగసి పడుతున్న తుంపర మీద పడగా, మా పడవ వెనుక ఓ చిత్రమైన వెలుగుబాట ఏర్పడినట్టు అనిపిస్తోంది. కాసేపట్లో తీరం పూర్తిగా మాయమైపోయింది. కనుచూపు మేరలో ఒక్క వస్తువు కూడా కనిపించడం లేదు. మా పడవ వెనుక వెలిగే నురగ తెరగే లేకపోయుంటే పడవ కదుల్తోందో లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది.
పన్నెండు గంటల ప్రాంతానికి మా చుట్టూ దట్టమైన సముద్రపు నాచు కనిపించింది. ఈ సముద్రపు నాచు సత్తా నాకు కొత్తేమీ కాదు. పన్నెండు వేల అడుగుల లోతులో పెరుగుతాయి, నాలుగొందల వాతావరణాల పీడనం వద్ద పునరుత్పత్తి చెందుతాయి. పెద్ద పెద్ద ఓడలనే ఆపగలిగేటంత బలంగా, ఏపుగా ఎదుగుతాయి. కాని ఇక్కడ ఈ లిండెన్ బ్రాక్ సముద్రం మీద తేలుతూ కనిపిస్తున్న ఈ నాచు గోడల లాంటి నాచుని నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు.
ఈ నాచుగోడలు ఆకుపచ్చని మహా సర్పాలలా సముద్రపు ఉపరితలం మీద మెలికలు తిరుగుతూ పోతున్నాయి. ఆ గోడల వెంటే మా బుల్లి పడవ వాటి అంతు ఎక్కడుందో తడుముకుంటూ నెమ్మదిగా ముందుకి సాగిపోతోంది.
(ఇంకా వుంది)

0 comments