నిన్న ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం -
http://www.andhrabhoomi.net/intelligent/computer-075
సృజనాత్మకత, అభినివేశం మొదలైన మానసిక లక్షణాల ప్రమేయం లేకుండా ఇచ్చిన ఆదేశాలని తుచ తప్పకుండా అనుసరిస్తూ, ఆ క్రియలని మానవసాధ్యం కానంత వేగంతో, స్థాయిలో అమలుచేస్తూ, వర్తమాన ప్రపంచంలో కంప్యూటర్ మనిషికి చేదోడువాదోడుగా ఉంటోంది. అయితే ఇచ్చిన పనినే కేవలం స్వామిభక్తితో చెయ్యకుండా, కంప్యూటర్ కి దానికంటూ ఒక బుద్ధి, వివేచన, మనసు ఉండి స్వతంత్రంగా వ్యవహరిస్తే ఏమవుతుంది? అన్న ప్రశ్న ఎంతో మందిని ఆలోచింపజేసింది. అలాంటి కంప్యూటర్లు కాల్పనిక వైజ్ఞానిక సాహిత్యంలో ఎన్నో చోట్ల కనిపిస్తాయి. స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వంలో సినిమాగా రూపుదిద్దుకున్న ఆర్థర్ క్లార్క్ నవల “2001: ఎ స్పేస్ ఒడిసీ’ అనే చిత్రంలో ఓ వ్యోమనౌకలో వ్యవహారాలని నిర్వహించే హాల్ 9000 అనే కంప్యూటర్ భావావేశాలని వ్యక్తం చెయ్యడం మొదలెడుతుంది. దాని సామర్థ్యాలని పొగిడినప్పుడు దాని “గొంతు” లో సంతోషం, గర్వం తొణికిసలాడతాయి. అవతలి వారి మాటతీరు బట్టి వారు కోపంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో గుర్తుపట్ట గలుగుతుంది. అది చూసి బెంబేలెత్తిన సిబ్బంది దాన్ని డిస్కనెక్ట్ చెయ్యాలని ప్రయత్నిస్తారు. అది నచ్చని హాల్ ప్రణాళికాబద్ధంగా నౌక సిబ్బందిలో ఒక్కొక్కర్నీ వరుసగా “హత్య” చేస్తుంది.
తెలివితేటలు అంటే మరీ ఇలాంటి “చావు” తెలివితేటలు కాదు గాని, కాస్త మన మనసు తెలిసి, సమయస్ఫూర్తి కలిగి, “కార్యేషు దాసీ...” అన్నట్టు మరింత ’పర్సనల్’ గా కంప్యూటర్లు మసలుకోగలిగితే బావుంటుందన్న ఆలోచన కొంత కాలంగా కంప్యూటర్ నిర్మాతల మనసుల్లో మెదులుతోంది. ఆ ఊహే భావావేశపు కంప్యూటింగ్ (affective computing) అనే ఓ కొత్త పరిశోధనా రంగంగా వికాసం చెందుతోంది. ఎం.ఐ.టి. కి చెందిన రోసలిండ్ పికార్ద్ వంటి వారు ఈ రంగంలో పురోగాములు. అసలైనా కంప్యూటర్ కి భావావేశాలు ఎందుకు? కేవలం తార్కికంగా, సమాచారాన్ని విశ్లేషిస్తూ, ఒక విధమైన యాంత్రికమైన హేతుశక్తిని కబరిస్తే చాలదా? మామూలుగా వివేచనకి, భావావేశాలకి చుక్కెదురు అనుకుంటాం గాని నాడీ శాస్త్రానికి చెందిన నిపుణులు భావావేశానికి, వివేచనకి మధ్య ఓ కీలకమైన సంబంధం ఉంటుంది అంటున్నారు. కేవలం వివేచన మీద ఆధారపడితే జీవితంలో ఎన్నో సమస్యాత్మక సందర్భాలలో శతకోటి మార్గాంతరాలు కనిపించి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తార్కికంగా ఆ మార్గాంతరాలు అన్నిటినీ ఒక్కొటొక్కటిగా విశ్లేషించి అత్యుత్తమ మార్గాన్ని ఎన్నుకోవాలని బయల్దేరితే పుణ్యకాలం తీరిపోతుంది. అలాంటప్పుడు హృదయం, భావావేశాలు ఒక దిశలో మొగ్గుచూపి, కార్యాచరణలో వేగంగా ముందుకి తోస్తాయి. అందుకే మనిషి మెదడులో భావావేశాలని అన్వయించి, నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే ప్రీఫ్రాంటల్ ప్రాంతం దెబ్బ తింటే, భావావేశాలు చప్పబడిపోవడంతో పాటు, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని అశక్తత చోటు చేసుకుంటుంది. ఆ విధంగా హేతు శక్తి సమర్థవంతంగా పనిచెయ్యడానికి (తగు మోతాదులో) భవావేశాలు ఎంత అవసరమో మేటి నాడీ శాస్త్రవేత్త ఆంటోనియో డమాసియో తన రచనల్లో విపులీకరిస్తాడు.
భావావేశాలు కలిగి ఉండడం, వ్యక్తం చెయ్యడమే కాదు, అవతలి వారిలో భావావేశాలు గుర్తించగలగడం కూడా మానవ సంబంధాలకి గొప్ప బలాన్నిస్తుంది. మరి కంప్యూటర్ మనిషిలోని భావావేశాలని ఎలా గుర్తిస్తుంది? మనం ఎలా గుర్తిస్తామో, అదీ అంతే! మనిషి ముఖకవళికలని కెమేరాలో పట్టి బంధించి, ఆ చిత్రాల విశ్లేషణ బట్టి మనిషి యొక్క మానసిక స్థితి గురించి కంప్యూటర్ తెలుసుకోగలుగుతుంది. అలాగే స్వరం బట్టి కూడా ఎంతో తెలుస్తుంది. గాద్గదిక స్వరం, జీరవోయిన గొంతు – వీటి బట్టి అవతలివాడు బాధలో ఉన్నాడని తెలుసుకోవడం కష్టం కాదు. చేతి ముద్రలు, హావభావాలు, శరీరం యొక్క భంగిమ – వీటి బట్టి కూడా కంప్యూటర్ ఎంతో సమాచారం రాబట్టగలదు. ఇవి కాకుండా ఈ.సీ.జీ., శ్వాస లయ, చర్మం యొక్క నిరోధకత మొదలైవి కూడా భావావేశ నిర్ణయంలో వినియోగించబడతాయి. ఈ వివిధ సమాచార స్రవంతులని వేరువేరుగా కాకుండా, అన్నిటినీ మేళవించి మరింత కచ్చితంగా భావావేశాన్ని బేరీజు వేసుకోవడానికి వీలుంటుంది.
ఇలాంటి భావావేశపు కంప్యూటర్లు భవిష్యత్తులో మన జీవితంలో ఎలాంటి పాత్ర ధరిస్తాయో సులభంగా ఊహించుకోవచ్చు. ఓ రోజు రాత్రి ఆలస్యంగా ఇంటొకొచ్చిన ప్రసాద్ కి ఇలాంటి ఓ మనసున్న కంప్యూటర్ పెట్టిన ఉత్తరం: “మీరు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యుంటుంది. అమ్మగారు పిల్లలు పదింటికి పడుకున్నారు. మీ భోజనం ఫ్రిడ్జ్ లో ఉంది. మైక్రోవేవ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉదయానే ఐదింటికి కాల్ టాక్సీ చెప్పాను. ట్రిప్ ఐడి మోబైల్ లో ఉంటుంది చూసుకోండి. రేపు వర్షం పడొచ్చు. గొడుగు తీసుకెళ్ళండి. ఇవాళ పనెక్కువ కావడంతో అలిసిపోయి పదకొండు నలభై రెండు నిముషాలకి షట్ డౌన్ అవుతున్నాను. లేకపోతే మీరు వచ్చే వరకు మేలుకుని ఉండాలనే అనుకున్నాను. ఏమీ అనుకోరు కదూ... ప్రేమతో, ఇట్లు, మీ కంప్యూటర్.”
0 comments