http://www.andhrabhoomi.net/intelligent/einstein-medadu-rahasyam-151
వ్యాసం
ఐన్స్టయిన్ మెదడు రహస్యం
“నా మనవడు కిందటి జన్మలో ఏ ఈనిస్టోనో అయ్యుంటాడు.” మోకాళ్ళ మీద లెక్కల పుస్తకం వేసుకుని బొమ్మలా కూర్చున్న ఐదేళ్ల బాబిగాణ్ణి చూసి మురిపెంగా అంది రాంబాయమ్మ. (“అందుకే కాబోలు ఎప్పుడూ పక్కింటి ’కాంతి’ తో ఆడుకుంటూ ఉంటాడు,” ఆ చదువు ఏపాటిదో తెలిసిన తండ్రి గోపాళం మనసులోనే అనుకున్నాడు.)
తెలివితేటలు అనగానే ఐన్స్టయినే (మార్చ్ 14, 1879-ఏప్రిల్ 18, 1955) గుర్తొస్తాడు. ఇరవయ్యవ శతాబ్దంలో వైజ్ఞానిక రంగంలో మానవత సాధించిన ప్రగతి మొత్తానికి ప్రతినిధిగా నిలవగల ఒక్క పేరును ఎన్నుకోవాల్సి వస్తే ఐన్స్టయినే ముందుంటాడేమో. ఒక్క మనిషిలో అంత ప్రతిభ, అన్ని తెలివితేటలు ఉండడం ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోగోరిన కొందరు శాస్త్రవేత్తలు ఏకంగా ఆయన మీదే పరిశోధనలు చేశారు. ఉండగా చెయ్యనివ్వడు కనుక, ఆయన పోయాక ఆయన మెదడు మీద నానా రకాల పరిశీలనలు జరిపారు... ఆయన ’మనసులోని మర్మం’ తెలుసుకుందామని.
ఐన్స్టయిన్ మరణానంతరం, ఆయన పరివారం అనుమతితో, థామస్ హార్వే అనే పెథాలజిస్టు, పోస్ట్ మార్టెమ్ చేసి శరీరం లోంచి మెదడుని తొలగించాడు. మెదడుకి రక్తసరఫరా చేసే కెరాటిడ్ ధమనుల లోంచి 10% ఫార్మలిన్ ద్రావకాన్ని పోనిచ్చి సుతిమెత్తగా ఉండే మెదడుకి కొంత దారుఢ్యం కలిగేలా చేశాడు. అప్పుడా మెదడుని నానా కోణాల నుండి ఫోటోలు తీసి, రమారమి 1cc ఘనపరిమాణపు ముక్కలుగా కోసి, సెల్లాయిడిన్ అనే మైనం లాంటి పదార్థంలో ఆ ముక్కలని భద్రపరిచాడు.
ఐన్స్టయిన్ మెదడు మీద జరిగిన పరిశోధనల సారాంశం గురించి చెప్పుకోవాలంటే, ముందు మెదడు లోని ముఖ్య ప్రాంతాల గురించి, కొన్ని ముఖ్యమైన కొండగుర్తుల గురించి చెప్పుకోవాలి. మెదడు కుడి ఎడమగా రెండు అర్థగోళాలుగా విభజించబడి ఉంటుంది. ఒక్కొక్క అర్థగోళం నాలుగు ముఖ్యమైన ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. అవి – ఫ్రాంటల్, పెరైటల్, టెంపొరల్, ఆక్సిపిటల్ ప్రాంతాలు (చిత్రం). ఇప్పుడు అధ్యయనాల సంగతి చూద్దాం.
1999 లో కెనడాలో మక్ మాస్టర్ యూనివర్సిటీకి చెందిన సాంద్రా విటిల్సన్ యొక్క బృందం కొన్ని అధ్యయనాలు చేసింది. ఐన్స్టయిన్ మెదడు ఫోటోలని బాగా ఎగాదిగా చూసిన ఈ బృందం అతడి మెదడులోని పెరైటల్ ప్రాంతం సగటు మెదళ్లలో కన్నా 15% పెద్దదిగా ఉందని గమనించారు. ముఖ్యంగా ఎడమ అర్థగోళంలోని దిగువ పెరైటల్ ప్రాంతమే మనం చూసే, వినే, తాకే భాగోతం అంతటినీ పోగేసి, ఆ సమాచారాన్ని కాచి వడబోసి, అందులోంచి భాషా సంబంధమైన ఉన్నత భావనలని వెలికి తీస్తుంది. ఆ ప్రాంతం మరి ఐన్స్టయిన్ మెదడులో విస్తరించి ఉండడం విశేషమే. కాని భారీగా ఉంటుందనుకున్న ఆ మహామేధావి మెదడు కేవలం 1230 gms బరువుతో సగటు మెదడు కన్నా ఓ పిసరు తక్కువే ఉండడం పరిశోధనా బృందాన్ని కొంచెం నిరుత్సాహ పరిచింది.
తదనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ లోని డీన్ ఫాక్ అనే ఆంత్రపాలజిస్ట్ బృందం చేసిన పరిశోధనల్లో కూడా ఐన్స్టయిన్ మెదడులో పెరైటల్ ప్రాంతం విస్తరించి ఉండడం నిర్ధారించబడింది. నామరూపాత్మకమైన జగతిలో నామం, అంటే భాష, కన్నా రూపాన్ని అర్థం చేసుకోవడంలో పెరైటల్ ప్రాంతం దిట్ట. భాషా శబ్దాలు, సమీకరణాలు కాకుండా, ఎక్కువగా ఆకృతులే ఐన్స్టయిన్ ఊహాశక్తికి ఇంధనంగా పనిచేసేవని అంటారు. కనుక ఈ పెరైటల్ ప్రాధాన్యత కాస్త అర్థవంతంగానే కనిపిస్తోంది.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలీ, కి చెందిన మారియేన్ డైమండ్ అనే ప్రొఫెసర్ బృందం చేసిన అధ్యయనాలలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఐన్స్టయిన్ మెదడులోని దిగువ పెరైటల్ ప్రాంతంలో గ్లయల్ కణాలు అనబడే కణాలు, సగటు మెదడులో కన్నా కాస్త ఎక్కువగా ఉన్నాయట. మెదడు క్రియలలో ముఖ్య పాత్రధారులైన న్యూరాన్ కణాలకి కేవలం ఆసరాగా ఈ గ్లయల్ కణాలు పనిచేస్తాయని ఎంతో కాలంగా అనుకునేవారు. ఇటీవల కాలంలో వీటిలోనూ విద్యుత్ చలనాలు ఉన్నాయని, వీటికీ న్యూరాన్ల రసాయనిక సందేశాలని అర్థం చేసుకునే సామర్థ్యం ఉందని, వీటికీ బాహ్యప్రేరణలకి స్పందించే గుణం ఉందని తెలిశాక వీటి తాహతు బాగా పెరిగింది.
మొత్తం మీద ఐన్స్టయిన్ మెదడుకి, మనబోటి వాళ్ల మెదళ్లకి మధ్య తేడాలయితే ఉన్నాయి గాని అవంత సంచలనాత్మకంగా లేకపోవడం మనకి స్ఫూర్తిదాయకంగా ఉండొచ్చు గాని, పరిశోధకులకి కాస్త నిరుత్సాహకరంగానే ఉంది. దానికి కారణం తెలివితేటల రహస్యాలు మృత మెదళ్ళలో కనిపించే అవకాశం తక్కువ. తెలివితేటలు అనేవి మెదడులోని “సాఫ్ట్ వేర్” (నాడీ కణాలలోని విద్యుత్ చలనాలు, నాడీ కణాల మధ్య కనెక్షన్ల విన్యాసాలు మొ||) కి సంబంధించినవి గాని, “హార్డ్ వేర్” (భారం, రూపం, బాహ్య విశేషాలు మొ||) కి సంబంధించినవి కాకపోవచ్చు. చేతిరేఖలు చూసి జాతకం చెప్పినట్టు, మెదడు ఉపరితల విశేషాలు చూసి మనిషి గుణగణాలు చెప్పడం కాస్త ప్రమాదకరమైన వ్యవహారం. ఆ విధంగా ఐన్స్టయిన్ మెదడు మీద పరిశోధనల వల్ల, తెలివితేటలకి సంబంధించిన మెదడు లక్షణాలు ఏవో పెద్దగా తెలియకపోయినా, ఏవి కావు అన్న విషయం మీద కొంత అవగాహన పెరిగింది. సంతోషం.
0 comments