బ్లాక్ కనుక్కున్న విషయాలు చాలా ముఖ్యమైనవి అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కట్టెని కాల్చినప్పుడు, ఖనిజాన్ని వేడిచేసినప్పుడు కూడా ఒకే వాయువు – కార్బన్ డయాక్సయిడ్ – పుడుతుందని నిరూపించాడు. ఆ విధంగా జీవ పదార్థానికి, జీవరహిత పదార్థానికి మధ్య సంబంధం ఉందని చూపించాడు. ఇది మొదటి విషయం.
అతడు నిరూపించిన మరో కొత్త విషయం ఉంది. మామూలుగా వాయువులు ఎప్పుడూ ఘనపదార్థాల నుండి, ద్రవాల నుండి వెలువరించబడడం వరకే అంత వరకు రసాయనికులకి తెలుసు. కాని వాయువులు ఘనపదార్థాలతో, ద్రవాలతో చర్య జరపగలవని బ్లాక్ నిరూపించాడు. ఈ దెబ్బతో వాయువుల పట్ల మన అవగాహనలో కొన్ని మబ్బులు విడిపోయాయి. వాయువులు అంటే ఏవో విచిత్రమైన, ప్రత్యేకమైన పదార్థాలు అన్న భావన తొలగిపోయింది. ఘనపదార్థాలకి, ద్రవాలకి, వాయువులకి మధ్య కొన్ని సామాన్య (రసాయనిక) లక్షణాలు ఉన్నాయని తెలిసింది.
బ్లాక్ మరో ఆసక్తికరమైన విషయం కూడా నిరూపించాడు. కాల్షియమ్ ఆక్సయిడ్ ని ఊరికే గాలిలో ఉంచితే చాలు అది కాల్షియమ్ కార్బనేట్ గా మారిపోతుందని గమనించాడు. దీంతో అతడు గాలిలోనే కొంత కార్బన్ డయాక్సయిడ్ ఉందన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ దెబ్బతో గాలి మౌలిక పదార్థం కాదని తేటతెల్లమయ్యింది. గ్రీకుల నమ్మకాలు తప్పని తేలింది. మూలకం అన్న పదార్థానికి బాయిల్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం గాలి మూలకం కాదు. అందులో కనీసం రెండు పదార్థాలు కలిసి ఉన్నాయి. అవి – మామూలు గాలి, కర్బన్ డయాక్సయిడ్.
కాల్షియమ్ కార్బనేట్ ని వేడి చేసినప్పుడు జరిగిన రసాయనిక చర్య వల్ల దాని బరువు ఎంత తగ్గిందో కూడా బ్లాక్ కొలిచాడు. అలాగే ఒక మోతాదు ఆసిడ్ ని తటస్థీకరించడానికి (neutralise) ఎంత కాల్షియమ్ కార్బనేట్ కావాలో కూడా అతడు కొలిచాడు. ఆ విధంగా సంఖ్యాత్మక పద్ధతులని రసాయన శాస్త్రంలో పెద్ద ఎత్తున ప్రవేశపెట్టగలిగాడు బ్లాక్. ఈ పద్ధతుల వినియోగాన్ని తదనంతరం లెవోషియే అత్యున్నత స్థాయికి తీసుకుపోతాడు.
(సశేషం...)
0 comments