ఆమ్లాలు కొన్ని లోహాలతో చర్య జరిపినప్పుడు పుట్టే ఒక ప్రత్యేకమైన వాయువు మీద కావెండిష్ ప్రత్యేకించి దృష్టి సారించాడు. గతంలో ఈ వాయువుని బాయిల్, హేల్స్ తదితరులు ఉత్పన్నం చేశారు. కాని 1766 లో కావెండిష్ మొట్టమొదటి సారిగా ఈ వాయువుని క్రమబద్ధంగా శోధించాడు. కనుక ఆ వాయువుని కనుక్కున్న ఘనత సామాన్యంగా ఈయనకే ఆపాదిస్తుంటారు. తదనంతరం ఆ వాయువుకి హైడ్రోజెన్ అని పేరు పెట్టారు.
ఒక నియత ఘనపరిమాణం గల వివిధ వాయువులని తీసుకుని, వాటి బరువులు కొలిచి, ఆ వాయువుల సాంద్రత కొలిచిన వారిలో ప్రథముడు కావెండిష్. హైడ్రోజెన్ చాలా తేలికైన వాయువు అని అతడు త్వరలోనే గుర్తించాడు. గాలి బరువులో దీని బరువు పదో వంతు మాత్రమేనని తెలుసుకున్నాడు. (మనకి తెలిసినంతవరకు ఇదే అన్నిటికన్నా తేలికైన వాయువు). దీనికి మరో అసాధారణమైన గుణం కూడా ఉంది. గాలికి గాని, కార్బన్ డయాక్సయిడ్ కి గాని లేని గుణం ఇది. హైడ్రోజెన్ సులభంగా భగ్గుమంటుంది. అంత తేలిగ్గా ఉంటూ, అంత సులభంగా నిప్పంటుకునే ఈ వాయువే అసలు ఫ్లాగిస్టాన్ అయ్యుండచ్చని కావెండిష్ సందేహించాడు.
ఇక ఆ రెండవ రసాయనికుడి పేరు జోసెఫ్ ప్రీస్లీ (1733-1804). ఇతడు యూనిటేరియానిజమ్ అనే ఓ క్రైస్తవ శాఖలో మతబోధకుడుగా పనిచేసేవాడు. రసాయన శాస్త్రం కేవలం ఇతడికో హాబీ మాత్రమే.
1760 లలో ఇతగాడు ఇంగ్లండ్ లో లీడ్స్ నగరంలో పాస్టర్ గా పని చేసేవాడు. అతడు పని చేసే చర్చి పక్కనే ఓ మద్యకర్మాగారం ఉండేది. మద్యాన్ని తయారుచేసేందుకు గాని గింజలని నానబెట్టి పులియబెట్టాలి. ఆ చర్యలో కార్బన్ డయాక్సయిడ్ ఉత్పన్నం అవుతుంది. అలా పెద్ద మొత్తాల్లో ఉత్పన్నం అయ్యే కార్బన్ డయాక్సయిడ్ ని ప్రీస్లీ తన ప్రయోగాలకి వాడుకునేవాడు. అలా ఉత్పన్నం అయ్యే కార్బన్ డయాక్సయిడ్ ని ప్రీస్లీ నీటి మీదుగా గ్రహించేవాడు. అలా నీటి మీదుగా గ్రహించబడ్డ కార్బన్ డయాక్సయిడ్ లో కొంత భాగం నీట్లో కరుగుతోందని గమనించాడు ప్రీస్లీ. ఆ నీటికి ఘాటైన, కటువైన రుచి ఉండడం గమనించాడు. ఆ నీటినే మనం “సోడా” అంటాము. ఆ పానీయానికి కొంచెం తీపి, కొన్ని కృత్రిమ రుచులు కలిపితే వచ్చేదే మనందరికీ తెలిసిన “సాఫ్ట్ డ్రింక్” . కనుక ఆధునిక సాఫ్ట్ డ్రింక్ పరిశ్రమకి జోసెఫ్ ప్రీస్లీ మూలకర్త అని భావించవచ్చు. (సశేషం…)
0 comments