ఇలాంటి వాదనల పట్ల బోర్హావే విమర్శల మాట ఎలా ఉన్నా పద్దెనిమదవ శతాబ్దంలో ఫ్లాగిస్టాన్ సిద్ధాంతానికి బాగా ప్రాచుర్యం పెరిగింది. 1780 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఆ సిద్ధాంతాన్ని రసాయనికులు సమ్మతించారనే చెప్పాలి. ఎందుకంటే ఆ సిద్ధాంతం ఎన్నో విషయాలని ఎంతో ఇంపుగా వివరించగలిగింది.
అయితే ఫ్లాగిస్టాన్ సిద్ధాంతంతో ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆ సమస్యని స్టాల్ గాని, అతని అనుచరులు గాని పరిష్కరించలేక పోయారు. కలప, కాగితం, కొవ్వు మొదలైన జ్వలనీయ పదార్థాలలో చాలా మటుకు మండిన తరువాత ఇంచుమించి ఆనవాలు లేకుండా మాయమైపోతాయి. మండాక మిగిలిన మసి గాని, బూడిద గాని మూల పదార్థం కన్నా మరింత తేలిగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక విధంగా ఇది ఆశించిన పరిణామమే. ఎందుకంటే మూల పదార్థంలో ఉండే ఫ్లాగిస్టాన్ ఇప్పుడు ఆ మసిలోగాని, బూడిదలో గాని లేదు.
కాని లోహాలు తుప్పు పట్టినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. స్టాల్ సిద్ధాంతం ప్రకారం తుప్పు పట్టిన లోహం కూడా ఫ్లాగిస్టాన్ ని కోల్పోతోంది. కాని మరి తుప్పు పట్టిన లోహపు ముక్క, శుద్ధ రూపంలో ఉన్న లోహం కన్నా మరింత బరువుగా ఉంది. (1490 నాటికే రసవాదులకి ఈ విషయం తెలుసు). మరయితే ఫ్లాగిస్టాన్ యొక్క బరువు ఋణ రాశి అనుకోవాలా? అందుకే దాన్ని కోల్పోయిన వస్తువులు మరింత బరువెక్కాయని అనుకోవాలా? పద్దెనిమిదవ శతాబ్దపు రసాయనికులు కొందరు అలాగే భావించారు. కాని అప్పుడు రెండు రకాల ఫ్లాగిస్టాన్ లు ఉన్నాయని అనుకోవాల్సి ఉంటుంది. ఒక దానికి మామూలు (ధనాత్మక) భారం ఉంటే, రెండవ దానికి ఋణాత్మక భారం ఉంటుంది.
అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ సమస్య పెద్ద సమస్యలా అనిపించలేదు. ఇప్పుడు మనకి విషయాలని కచ్చితంగా కొలవడం అలవడింది. కనుక భారంలో అనుకోని పరిణామాలు వస్తే మనం ఇబ్బంది పడతాం. కాని పద్దెనిమిదవ శతాబ్దపు రసాయనికులకి రాశులని కచ్చితంగా కొలవడం ఎంత ముఖ్యమో ఇంకా అర్థం కాలేదు. కనుకనే భారంలో అలా అర్థం కాని మార్పులు వచ్చినా పట్టించుకోకుండా వదిలేశారు. ఫ్లాగిస్టాన్ సిద్ధాంతం బయటికి కనిపించే పై పై మార్పులని వివరించగలిగితే చాలు. భారంలో వచ్చే వ్యత్యాసాలని పట్టించుకోనక్కర్లేదు అని సరిపెట్టుకున్నారు.
(సశేషం...)
0 comments