http://www.andhrabhoomi.net/intelligent/k-648
కర్డషేవ్ ఊహించిన నాగరికతలు 0, 1, 2, 3 రకం నాగరికతలుగా వర్గీకరించబడ్డాయని క్రిందటి వారం వ్యాసంలో చెప్పుకున్నాం. నాగరికతల లోని ఈ స్థాయి ఆ నాగరికత యొక్క శక్తివినియోగం మీద ఆధారపడుతుంది. ప్రస్తుతం మనం ఉన్న నాగరికత యొక్క శక్తి వినియోగం సాధ్యమైన భావి నాగరికతలతో పోల్చితే అంత ఎక్కువ కాదు గనుక మన నాగరికతని 0 రకం నాగరికతగా కర్డషేవ్ వర్గీకరిస్తాడు. శక్తి వినియోగం లోని ఆధిక్యతని సంఖ్యాత్మకంగా వ్యక్తం చెయ్యడానికి కర్డషేవ్ ఒక కొలమానాన్ని ప్రతిపాదించాడు. దీన్ని 'కర్డషేవ్ స్థాయి' (Kardashev scale) అంటారు. ఈ స్థాయి 0 తో మొదలై 4 వరకు పోవచ్చు. ఒక నాగరికత యొక్క శక్తి వినియోగంలో కొన్ని మైలురాళ్లని కర్షషేవ్ పేర్కొంటాడు. ఒక్కొక్క మైలురాయిని దాటుకుంటూ మానవనాగరికత మరింత ఉన్నత రకం నాగరికతగా పరిణామం చెందుతుంటుంది.
ఒక గ్రహం మీద సాధ్యమైన గరిష్ఠ శక్తివినియోగ స్థాయిని చేరుకున్న నాగరికత 1 వ రకం నాగరికత స్థాయికి ఎదుగుతుంది. మన భూమినే తీసుకుంటే ఆ సాధ్యమైన గరిష్ఠ శక్తి వినియోగ స్థాయి 1.74 X 10^17 watts అని చెప్పుకుంటారు. ఇది భూమి మీద పడే మొత్తం సౌరశక్తి విలువ. మనం వినియోగించే శక్తి వనరులలో అధిక శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూర్యుడి మీద ఆధారపడ్డవే కనుక భూమి మీద ప్రసారమయ్యే మొత్తం సౌరశక్తి విలువని ఆ గరిష్ఠవిలువగా తీసుకున్నారు. ప్రస్తుతం భూమి మీద మన మొత్తం శక్తి వినియోగం 10^12 watts దరిదాపుల్లో ఉంటుంది. కనుక ప్రస్తుత నాగరికత యొక్క కర్డషేవ్ స్థాయి 0.71 గా శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు.
మన శక్తి వినియోగం 1.74 X 10^17 watts చేరుకున్నప్పుడు మన నాగరికత కర్డషేవ్ స్థాయి 1 ని చేరుకుంటుంది. ప్రస్తుతం భూమి మీద మన శక్తి వినియోగం పెరుగుతున్న వేగం బట్టి ఆ స్థాయిని మనం మరో 100 ఏళ్లలో చేరుకుంటామని నిపుణుల నమ్మకం. ఆ దశలో ఇక మనం భూమి మీద పడే సౌరశక్తిలో అధిక భాగాన్ని గ్రహించి మానవవ్యవహారాలలో వినియోగించుకుంటాం అన్నమాట.
తీవ్రవిభజనలతో సంక్షోభంగా ఉండే 0 రకం నాగరికత క్రమంగా తన అంతరంగ సంఘర్షణలని పరిష్కరించుకుంటూ ఏకత్వం దిక్కుగా వికాసం చెందుతుంది. అలాంటి ఏకీకరణకి చక్కని తార్కాణాలు గత శతాబ్దంలో ఏర్పడ్డ ఐక్యరాజ్యసమితి మొదలైన అంతర్జాతీయ వ్యవస్థలే. మానవ జాతి యొక్క వికాసక్రమంలో ఏదో దశలో ఇలాంటి సమైక్యత ఏర్పడవలసిందే. వైవిధ్యం మానవ సహజం కావచ్చు కాని, విభేదం, విభజన, మానవ సమాజాల సుదీర్ఘవృధ్ధికి హానికరం. అలాంటి సమైక్యతకి, సామరస్య జీవనానికి దొహదం చేసే రాజకీయ వ్యవస్థని ఏర్పరచుకుంటూ, శక్తి వనరుల వినియోగాన్ని క్రమంగా పెంచుకుంటూ 1 వ రకం నాగరికత పురోగమిస్తుంది.
ఇలాంటి పురోగమన క్రమంలో ఒక దశలో, ఇక గ్రహం మీద హరించడానికి పెద్దగా శక్తి వనరులు మిగలని దశలో, గ్రహాన్ని వొదిలి గ్రహానికి బయట అంతరిక్షంలో గాని, ఇతర గ్రహాల మీద గాని, లభ్యమయ్యే శక్తివనరుల కోసం ఆ జాతి అన్వేషణ మొదలెడుతుంది. ఏ తారా వ్యవస్థలో అయినా, గ్రహాల మీద కన్నా ఆ గ్రహాలు ప్రదక్షిణ చేస్తున్న తారలోనే అధిక శాతం శక్తి వనరులు ఉంటాయి. కనుక ఆ తార నుండి వెలువడే మొత్తం శక్తిని గ్రహించి వినియోగించగల నాగరికత 2 రకం నాగరికతగా ఎదుగుతుంది.
మరి సూర్యుడి నుండి వచ్చే కాంతిలో అతి చిన్న భాగం మాత్రమే భూమి మీద పడుతుంది. మరి సూర్యుడి నుండి వెలువడే మొత్తం కాంతి శక్తిని గ్రహించేదెలా? అందుకు ఫ్రీమాన్ డైసన్ అనే ఖగోళశాస్త్రవేత్త ఓ బ్రహాండమైన ఆలోచనని ప్రతిపాదించాడు. తన ఊహాగానం ప్రకారం సూర్యుడి చుట్టూ సుమారు 150 మిలియన్ కిమీ.ల దూరంలో పెద్ద సంఖ్యలో సౌర శక్తిని సౌరఫలకాల సహాయంతో గ్రహించే ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతుంటాయి. ఒక్కొక్క ఉపగ్రహం యొక్క వ్యాసం 10^7 కిమీలు (ఇది భూమికి చంద్రుడికి మధ్య ఉన్నంత దూరం) ఉంటుంది. ఇలాంటి ఊహాతీతమైన ఉపగ్రహాల మహావలయాన్ని 'డైసన్ వలయం' (Dyson ring) అంటారు (కింది చిత్రం). ఈ స్థాయిలో పితృ తార నుండి శక్తిని రాబట్టే సాంకేతిక సత్తా ఉన్న నాగరికత 2 వ రకం నాగరికతగా పరిణమిస్తుంది. ఈ దశలో దాని శక్తి వినియోగం 4 X 10^26 watts ఉండొచ్చని కర్డషేవ్ విశ్లేషణ చెప్తుంది.
కాని ఏదో ఒక దశలో అలా బృహత్ స్థాయిలో జరిగే శక్తి వినియోగం కూడా పెరుగుతున్న నాగరిక అవసరాలకి సరిపడకపోవచ్చు. పితృతార నుండి వచ్చే శక్తిలో అధిక భాగం వాడుకుంటున్నా ఇంకా ఇంధనం కోసం ఆకలి తీరకపోవచ్చు. అలాంటి నాగరికత తన పితృతారకి చెందిన తారావ్యవస్థని వదిలి ఇతర తారావ్యవస్థలలో శక్తి వనరుల కోసం వేట మొదలుపెడుతుంది. ఇతర తారల పరిసరాలలో నివాసయోగ్యమైన గ్రహాలని కనుక్కుని అక్కడ నివాసాలు ఏర్పరుచుకుంటుంది. అలా ఒక గ్రహం మీద ఆవిర్భవించిన జాతి, క్రమంగా ఇతర తారావ్యవస్థలకి వ్యాపించి గెలాక్సీ మొత్తం విస్తరించిన ఓ అద్భుత మహాసామ్రాజ్యాన్ని స్థాపించే పరిణామాన్ని ఎంతో మంది ఊహించారు. కర్డషేవ్ విశ్లేషణ ప్రకారం అలాంటి నగరికత యొక్క శక్తివినియోగం రమారమి 10^37 watts ఉండొచ్చు. అలాంటి బ్రహ్మాండమైన నాగరికత అసిమోవ్ ఫౌండేషన్ నవలామాలికలో వర్ణించబడుతుంది. అయితే వాస్తవంలో మన ప్రస్తుత నాగరికత ఆ దిశలో పరిణామం చెందుతుందా, చెందితే ఆ స్థితిని చేరుకోడానికి ఎన్ని సహస్రాబ్దాలు, ఎన్ని లక్షల ఏళ్లు పడుతుంది? మొదలైన ప్రశ్నలకి కచ్చితమైన సమాధానాలు ప్రస్తుతం లేవు.
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్ని మా అగ్గ్రెగేటర్లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు
Super info Sir..
Regards,
Pardhu
/ఓ బ్రహాండమైన ఆలోచనని ప్రతిపాదించాడు/ - TRUE!!
1.What is basis for Kardashev scale?
2. How much energy is required to send& place satellites of area 10^7 km at 150Gm from the Sun?
3. What type of rockets to be used?
4. How much energy can be produced with that ring? and
5. How to bring the energy back to the Earth?
6. Would there be any counter effects?(global warming etc leading to destruction of life on the Earth )
Any estimated figures?
Thanks.