శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

“ఇది కుక్కగొడుగుల కారడవి!”

Posted by శ్రీనివాస చక్రవర్తి Monday, March 18, 2013
ఐదొందల అడుగుల దూరంలో ఓ చదునైన ఎత్తైన ప్రదేశంలో ఓ చిన్న అడవి లాంటిది కనిపించింది. అందులో మరీ పొట్టి, మరీ పొడవు కాని చెట్లు గొడుగుల్లా నిటారుగా లేచి వున్నాయి. గాలి చలనాలకి వాటి ఆకారం మీద ఎలాంటి ప్రభావమూ ఉన్నట్టు లేదు. బిర్రబిగుసుకున్నట్టు నిశ్చలంగా ఉన్నాయి.


ఈ చిత్రమైన వృక్షసృష్టిని ఏవని పిలవాలో నాకు అర్థం కాలేదు. ఇంతవరకు మనిషికి తెలిసిన రెండు లక్షల వృక్షజాతులలో ఇవి కూడా ఉన్నట్టేనా? ముఖ్యంగా మంచినీటి జలాశయాల పరిసరాలలో పెరిగే వృక్ష జాతులకి చెందినవా? దగ్గరికి వెళ్లీ చూస్తే నా ఆశ్చర్యం అబ్బురపాటుగా మారింది. మట్టిలోంచి పుట్టుకొచ్చిన ఆ మహాకాయాలని చూసి మామయ్య అన్నాడు.

“ఇది కుక్కగొడుగుల కారడవి!”

ఆలోచిస్తే ఆయన అన్నది నిజమే అనిపించింది. వెచ్చదనం, తేమ పుష్కలంగా ఉండే వాతావరణం అవసరమైన ఈ మొక్కలు ఇక్కడ ఇంత ఏపుగా పెరగడంలో ఆశ్చర్యం లేదు. బులియార్డ్ అనే శాస్త్రవేత్త ప్రకారం లైకొపోడియం జైగాంటియమ్ అనే రకం కుక్కగొడుగులు ఎనిమిది, తొమ్మిది అడుగుల వ్యాసం పరిణామానికి పెరుగుతాయి. కాని ఇక్కడ నా ఎదుట పాలిపోయినట్టుగా ఉన్న ఈ కుక్కగొడుగులు ముప్పై, నలభై అడుగుల ఎత్తుకలిగి, అంతే వ్యాసం కలిగి వున్నాయి. పైగా ఇవి వేల సంఖ్యలో ఉన్నాయి. వాటి విస్తారమైన శంఖాకారపు తలల మధ్య నుండి ఒక్క కిరణం కూడా చొరబడలేదు. వాటి మహాకాయాల కింద అంతా చిమ్మ చీకటి. అవి చిన్న చిన్న గుంపులుగా గుమిగూడి వున్నాయి. మధ్య ఆఫ్రికాకి చెందిన పల్లెల్లోని గుడిసెలని తలపిస్తున్నాయి.వాటి గుబుళ్ళ కింద చీకట్లో చొచ్చుకుపోదామని అనుకున్నాను గాని రెండు అడుగులు వెయ్యగానే విపరీతమైన చలి ఆవరించింది. ఓ అరగంట పాటు ఆ అడవి అంచుల వద్దనే తచ్చాడి మళ్ళీ సముద్ర తీరానికి వచ్చాము.

భూగర్భపు వృక్షసంపద ఇలాంటి శిలీంధ్రాలకే పరిమితం కాదు. అల్లంత దూరంలో రంగులేని ఆకులు గల పొడవైన చెట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూమి ఉపరితలం మీద అవి చిన్నపాటి పొదలు. ఇక్కడ అవి అల్లంత ఎత్తుకి ఎదిగాయి. మూడొందల అడుగుల ఎత్తున్న లైకోపోడియమ్ లు; మన బొగ్గు గనుల్లో దొరికే సిగిలారియా మొక్కలు; అనేక నాళాలుగా విడివడ్డ కాండంతో, పొడవాటి ఆకులతో, బ్రహ్మజెముడు మొక్కల్లాంటి గుచ్చుకునే ముళ్లు గల లెపిడో డెండ్రా మొక్కలు – ఇవన్నీ కనిపించాయి.

“అద్భుతం, అత్యద్భుతం!” మామయ్య ఉత్సాహం పట్టలేక అరిచాడు. “భూమి మీద రెండవ దశ, అంటే సంక్రమణ దశకి, చెందిన మొక్కలన్నీ ఇక్కడ వున్నాయి. ప్రస్తుతం మన తోటల్లో వెలసిన పొట్టి మొక్కలన్నీ ఆ దశలో మహా వృక్షాలు. చూడు ఏక్సెల్. ఈ మహాద్భుతాన్ని కళ్లారా చూడు. ఇంత మహద్భాగ్యం ఏ వృక్షశాస్త్రవేత్తకీ కలగదేమో.”

“నువ్వన్నది నిజమే మామయ్యా! ఈ విశాల అటవీ సంరక్షణా శిబిరంలో ఏ దివ్యహస్తమో ఈ ప్రాచీన వృక్షసంపద నంతటినీ చేరదీసి ఇక్కడ భద్రంగా నిలిపింది.”

“ఇది నిజంగా అటవీ సంరక్షణా కేంద్రమే ఏక్సెల్. కాని ఇది బహుశ జంతు సంరక్షణా కేంద్రం కూడానేమో?” అడిగాడు మామయ్య.

“జంతు సంరక్షణా? అదెలా సాధ్యం?” నమ్మలేక అడిగాను.

“అవును. సందేహం లేదు. కావాలంటే నీ కాళ్ల కింద మట్టిలో చూడు.

“అవును నిజమే!” గట్టిగా అరిచాను. “వినష్టమైన జంతువుల ఎముకలు.”

అవినాశమైన సున్నపు ఫాస్ఫేట్ లతో చెయ్యబడ్డ ఈ ఎముకలని జాగ్రత్తగా పరిశీలించాను. కుళ్లి పడ్డ చెట్ల మొదళ్లలా ఆ ప్రాంతం అంతా విసిరేసినట్టున్న పెద్ద పెద్ద ఎముకలని గుర్తుపట్టి వాటికి పేర్లు పెట్టడం మొదలెట్టాను.“ఇది మాస్టడాన్ యొక్క కింది దవడ,” గడ గడా చెప్పుకొచ్చాను. “ఇవి డైనోతీరియమ్ యొక్క దంతాలు. ఈ మహాకాయాలు అన్నిట్లోకి పెద్దదైనా మెగాతీరియం యొక్క ఫీమర్ ఎముక అయ్యుంటుంది ఇది. ఇది నిజంగా ఓ జంతు సంరక్షణా శిబిరమే. ఎందుకంటే ఈ ఎముకలు వరదల్లో కొట్టుకొచ్చినవి కావు. భూగర్భంలోని సముద్ర తీరం మీద, ఆ మహావృక్షాల ఛాయల్లో సంచరించిన జీవాలవి. ఇక ఇక్కడ కొన్ని సంపూర్ణ అస్తిపంజరాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. కాని ఈ కఠిన రాతి గుహలో ఈ నాలుగు కాళ్ల జీవాలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు.”“ఎందుకని?”

“భూమి మీద జంతు జాతులు రెండవ దశలో మాత్రమే ప్రవేశించాయి. ఆ దశలోనే నదీ జలాల అవక్షేపాల వల్ల అవక్షేపక శిల ఏర్పడింది. ఆ శిలే ప్రాథమిక దశలో ఉండే ప్రజ్వలిత శిల స్థానంలో వచ్చి చేరింది.”

“సరే అయితే ఏక్సెల్! ఇది ఒండ్రుమట్టి అంటే ఒప్పుకోవు కదూ. దానికి చాలా సరళమైన సమాధానం వుంది.”

“ఏంటి? భూమి ఉపరితలానికి అడుగున ఇంత లోతులోనా?”

“అవును. నిస్సందేహంగా. దీనికి భౌగోళిక శాస్త్ర పరంగా వివరణ కూడా వుంది. ఒక దశలో భూమి మీద కేవలం ఓ స్థితిస్థాపకమైన పొర మాత్రమే వుండేది. దాని మీద పై నుండి కింది నుండి మారి మారి ఒత్తిళ్ళు పని చేసేవి. ఆ పై పొరలో చీలికలు ఏర్పడి పైనున్న అవక్షేపక పదార్థం లోతుగా చొచ్చుకుపోయి ఉండొచ్చు.”“కావచ్చు. కాని మరి ఇప్పుడు మన చుట్టూ కనిపిస్తున్న వినష్ట జీవాలు ఇప్పటికీ సజీవంగా ఎందుకు లేవు? ఆ చెట్ల మాటునో, ఆ గుట్టల వెనుకో ఎందుకు పొంచి లేవు?”అసలా భయంకరమైన ఆలోచన మనసులో స్ఫురించగానే నా చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఓ సారి బెదురుగా పరిశీలించాను. కాని కను చూపు మేరలో మృగం లాంటిది ఏదీ కనిపించలేదు.ఒక్క సారిగా ఒళ్లంతా ఎందుచేతనో బడలిక ఆవరించింది. ఇక ఓపిక చచ్చి ఆ గట్టు అంచున వెళ్లి చతికిల బడ్డాను. పిల్ల కెరటాలు గట్టు మీద చేస్తున్న దాడులకి ఎగసిన తుంపర మొహం మీద చిందుతోంది. అక్కణ్ణుంచి చూస్తుంటే తీర ప్రాంతంలో ప్రతీ భాగం స్పష్టంగా కనిపిస్తోంది. దాని కొసలో రెండు గుట్టల మధ్య ఓ సహజ రేవు లాంటిది ఏర్పడినట్టు కనిపిస్తోంది. అందులో సులభంగా ఓ ఓడ, రెండు మూడు చిట్టి పడవలు పట్టేస్తాయనిపించింది. ఆ రేవు నుండి ఏ క్షణమైనా ఓ ఓడ బయట పడి, తెరచాప పైకెత్తుకుని, దక్షిణ పవనాలు ముందుకు తోస్తుంటే విశాల సముద్రం మీద ముందుకు దూసుకుపోతుందేమో నని అనిపించింది.కాని ఆ భ్రాంతి కాసేపే వుంది. ఈ భూగర్భ ప్రపంచంలో మిగిలిన జీవులం మేం మాత్రమే. ఇంతలో గాలి చలనం ఆగింది. ఎడారి నిశ్శబ్దం లాంటిది ఆ కరకు శిలలని ఆవరించి, నిశ్చల సముద్ర జలాల మీద విస్తరించింది. దూరాన పొగమంచు లాంటిది కమ్ముకుని ఆవల ఏం వుందో కనిపించకుండా వుంది. ఈ సముద్రాని అంచేది? దీనికి ఆవలి గట్టెక్కడ?మామయ్యని ఇదేదీ పెద్దగా కలవరపెడుతున్నట్టు లేదు. నాకైతే ఆలోచిస్తుంటే ఆశ్చర్యంతో పాటు, భయం కూడా వేస్తోంది.

ఆ అద్భుత దృశ్యాన్ని తదేకంగా చూస్తూ, ధ్యానిస్తూ ఓ గంట పాటు గడిపాను. తరువాత ముగ్గురం గుహ దారిని పట్టాము. ఏవో విడ్డూరమైన ఆలోచనలు తలలో తాండవం చేస్తుంటే ఎప్పుడు పట్టిందో తెలీదు గాఢంగా నిద్ర పట్టేసింది.(ముప్పయ్యవ అధ్యాయం సమాప్తం)1 Responses to “ఇది కుక్కగొడుగుల కారడవి!”

  1. Naresh Says:
  2. nice article................

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email