1894 లో
ఆల్బర్ట్ మరో సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంకటానికి బీజాలు బడిలో లేవు, ఇంట్లో వున్నాయి. ఆల్బర్ట్ తండ్రి హర్మన్ చెస్తున్న వ్యాపారం దివాలా తీసింది. ఇలా దివాలా తీయడం కొత్తేమీ కాదు. కాని ఇంతలా దివాలా తీయడం ఇదే మొదటి సారి. తండ్రి ఘోరంగా అప్పుల పాలయ్యాడు. బంధువులు అంతోఇంతో సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. కాని తండ్రి చేసిన అప్పులు ఆ సహాయానికి అందనంత స్థాయిలో వున్నాయి. పాలిన్, హర్మన్ దంపతులు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశిలించారు. అప్పులు తీరాలంటే ఇక ఉంటున్న ఇంటిని అమ్మక తప్పేలా లేదు. అయితే ఆ ఇల్లంటే వారికి ప్రాణం. పిల్లలు ఆల్బర్ట్, మాయా లు పెరిగిన ఇల్ల్లు. ఎంతో మంది బంధుమిత్రులు వచ్చి పోయిన ఇల్లు. ఆ ఇంటికి వదులుకోవడానికి వారికి మనస్కరించలేదు.
ఏం
చెయ్యాలో దిక్కు తోచక ఆ దంపతులు మథన పడుతున్న తరుణంలో ఓ అనుకోని చోటి నుండి సహాయం అందింది. ఇటలీలో మిలాన్ నగరంలో పాలిన్ కి బంధువులు ఉన్నారు. వీళ్లు శ్రీమంతులు. మిలాన్ లో మంచి అవకాశాలు ఉన్నాయని, అక్కడ హర్మన్ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సహాయం చేస్తామని వాళ్లు ముందుకొచ్చారు. ఐన్ స్టయిన్ దంపతుల సంతోషానికి హద్దుల్లేవు.
మిలాన్
కి బదిలీ గురించిన వార్త అందరి కన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది ఆల్బర్ట్ కేనేమో. మిలాన్
నుండి ఒకసారి వాళ్లింటికి కొందరు చుట్టాలు వచ్చారు. మిలాన్ సౌందర్యం గురించి, అక్కడి వెచ్చని వాతావరణం గురించి వాళ్ల నుండి ఎంతో విన్నాడు. అక్కడ బడులు కూడా జర్మనీలో బడులలా వుండవని, అక్కడి చదువు సరదాగా ఉంటుందని విన్నాడు. ఎలాగైనా ఈ నరకం నుండి బయటపడి మిలాన్ కి వెళ్లిపోవాలని తహతహలాడాడు.
కాని
ఆల్బర్ట్ తల్లిదండ్రుల ఆలోచనలు వేరే విధంగా వున్నాయి. ఆల్బర్ట్ ఆ సమయంలో హైస్కూల్ చదువుతున్నాడు. ఆ సమయంలో బడి మారిస్తే చదువు పాడవుతుంది. కనుక హైస్కూల్ ముగిసినంత వరకు ఆల్బర్ట్ మాత్రం ఇక్కడే వుండాలని తండ్రి హర్మన్ వివరించాడు. స్కూలు పూర్తయ్యాక కాలేజి చదువుల కోసం కావాలంటే మిలాన్ కి రావచ్చని తండ్రి సలహా ఇచ్చాడు.
ఆల్బర్ట్
కి కాళ్ల కింద నేల చీలినట్టయ్యింది. ఈ నరక కూపంలో ఒంటరిగా గడపాలా? తల్లి చేసే గారాబానికి దూరంగా, చెల్లెలి ప్రేమకి, సాన్నిహిత్యనికి దూరంగా… ఇంతకాలం బళ్లో అనుభవం ఎంత చేదుగా వున్నా ఇంట్లో తనకి దక్కే ప్రేమానురాగాలే అలాంటి అనుభవాన్ని భరిస్తూ బతుకు వెళ్ళబుచ్చేలా చేశాయి. కాని ఇప్పుడు ఆ ఒక్క ఆధారమూ తొలగిపోతే?
ఇక
గత్యంతరం లేక కరకు ఒంటరి జీవితాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు.
ఐన్
స్టయిన్ కుటుంబానికి దూరపు బంధువు ఒకడు మ్యూనిక్ లో ఓ హాస్టల్ నడిపేవాడు. అక్కడ ఆల్బర్ట్ ని చేర్పించి, తల్లిదండ్రులు, చెల్లెలు
మిలాన్ కి వెళ్లిపోయారు. పుస్తకాల నేస్తాలతో తన ఒంటరి జీవితాన్ని నింపుకునే ప్రయత్నం చేశాడు ఆల్బర్ట్. యూక్లిడ్, న్యూటన్, డే కార్త్ మొదలైన మహామహుల భావప్రపంచంలో విహరిస్తూ కొంత స్వాంతన పొందాడు.
కాని
తన ఒంటరి తనానికి చేసుకుంటున్న ఈ ‘పుస్తకాల చికిత్స’ ఎంతో కాలం పని చెయ్యలేదు. చిన్న వాడైన ఆల్బర్ట్ కి ఈ ఏకాంత జీవనం దుర్భరంగా తోచింది. ఇంటికి రాగానే తల్లిలా ప్రేమగా దగ్గరికి తీసుకునే వాళ్ళు లేరు, తండ్రిలా మంచిచెడ్డలు అడిగేవాళ్లు లేరు, చెల్లిలా గిల్లికజ్జాలు ఆడేవారు లేరు. క్రమంగా ఆరోగ్యం దెబ్బ తినసాగింది. తనకి ఇష్టమైన పుస్తకాల మీదకి కూడా మనసు పోనని మొరాయించింది. ఎలాగైనా,
ఎలాంటి కుతంత్రం పన్ని అయినా, తన వారిని చేరుకోవాలి.
(ఇంకా
వుంది)
యూక్లిడ్, న్యూటన్, డే కార్త్ మొదలైన మహామహుల భావప్రపంచంలో విహరిస్తూ కొంత స్వాంతన పొందాడు.
కాని తన ఒంటరి తనానికి చేసుకుంటున్న ఈ "పుస్తకాల చికిత్స" ఎంతో కాలం పని చెయ్యలేదు.
అనువాదం అద్భుతంగా పాఠకుల అంతరంగాన్ని దోచేటట్లున్నది గురువుగారూ!