గెలీలియోకి
బుద్ధిగత వారసుడైన న్యూటన్ ఈ రకమైన సాపేక్షతకి ఒక మౌలికమైన అంశాన్ని జత చేశాడు. న్యూటన్ ప్రకారం సాపేక్షం, నిరపేక్షం రెండూ వున్నాయి. ఉదాహరణకి చలనాన్నే తీసుకుంటే సాపేక్ష చలనమే కాకుండా నిరపేక్ష చలనం కూడా వుందన్నాడు. చలనానికి
ఆధారభూతమైన స్థలం (space), కాలాల (time) లో కూడా అదే విధంగా సాపేక్ష, నిరపేక్షాలు వున్నాయన్నాడు. అదేంటో న్యూటన్ మాటల్లోనే విందాం.
ఐసాక్
న్యూటన్
“నిరపేక్షమైన, సత్యమైన, గణితపరమైన కాలం, ఏ బాహ్య విషయాలతోను సంబంధం లేకుండా స్వయంగా, స్వతస్సిద్ధంగా ప్రవహిస్తుంది. దానినే వ్యవధి అంటాం. (అందుకు భిన్నంగా) సాపేక్షమైన, అనుభవైకమైన, సామాన్యమైన కాలాన్ని చలనం గల బాహ్య సాధనాలతో కొలవడానికి వీలవుతుంది. సత్యమైన కాలానికి బదులుగా ఈ విధమైన వ్యావహారిక కాలాన్నే మనం సామాన్యంగా వాడుతుంటాము.”
న్యూటన్
రెండు రకాల కాలాలు ఉంటాయని అంటున్నాడు. ఒకటి వ్యావహారిక కాలం. ఇది స్థలాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు
మన దేశంలో సమయం ఉదయం 9 గం అయితే అదే సమయంలో ఇంగ్లండ్ లో ఉదయం 4:30 గం
అవుతుంది.
అయితే ఊరికే అనవాయితీగా, ప్రజా సౌకర్యం కోసం ఒక్కొక్క దేశంలో ఒక్కక్క కాలమానాన్ని వాడుతున్నాం గాని, కావాలనుకుంటే ప్రపంచం అంతటా ఒకే కాలమానం ఉండేలా ఏర్పాటుచేసుకోవచ్చు. గ్రీనిచ్ కాలమానం (‘Greenwich time’) ఆ రకమైన కాలమే. అలాంటి సార్వజనీన కాలమానమే విశ్వమంతా వర్తించేలా వుందని అనుకుందాం. న్యూటన్ చెప్పే నిరపేక్షమైన, సత్యమైన కాలం అదే. అయితే దాన్ని తెలుసుకోలేం గనుక, కొలవలేం గనుక మామూలుగా సాపేక్షమైన, వ్యావహారికమైన కాలాన్ని వాడుతాం.
నిరపేక్ష
కాలం వున్నట్లుగానే నిరపేక్షమైన స్థలం కూడా ఉంటుంది అంటాడు న్యూటన్.
“నిరపేక్షమైన స్థలం ఏ బాహ్య వస్తువులతోను సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకే విధంగా నిశ్చలంగా, నిర్వికారంగా ఉంటుంది. సాపేక్షమైన స్థలానికే చలనం వుంటుంది. అందులో వుండే వస్తువుల ఆధారంగా దాన్ని కొలవడానికి వీలవుతుంది. అలా కొలవదగ్గ సాపేక్ష స్థలాన్నే మనం నిరపేక్ష స్థలం అనుకుని పొరబడతాం…”
ఆ
విధంగా నిరపేక్షమైన కాలం, నిరపేక్షమైన స్థలం వున్నాయని ప్రతిపాదించాక నిరపేక్షమైన చలనాన్ని ప్రతిపాదించడం కష్టం కాదు.
“నిరపేక్షమైన చలనం అంటే నిరపేక్షమైన స్థలంలో ఒక వస్తువు ఒక చోటి నుండి మరొక చోటికి కదలడం…”
న్యూటన్
ప్రతిపాదించిన
నిరపేక్ష కాలం, నిరపేక్ష స్థలం అనే భావనలు తదనంతరం వచ్చిన న్యూటోనియన్ భౌతిక శాస్త్రానికి ఆయువు పట్టు అయ్యాయి. విశ్వంలోని వస్తువులన్నిటి వెనుకా ఓ నిర్లిప్తమైన నేపథ్యంగా నిరపేక్షమైన స్థలం వుందన్న భావన వల్ల వస్తువులు ఎక్కడున్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలం అన్న విశ్వాసం ఏర్పడుతుంది. అదే విధంగా విశ్వమంతటా సమంగా, ఒకే విధంగా ప్రవహించే కాలం వుందన్న భావన ఆధారంగా విశ్వంలోని ప్రతీ ఘటన యొక్క కాలనిర్ణయం చెయ్యగలం అన్న విశ్వాసం ఏర్పడింది.
నిరపేక్ష
స్థల, కాలాలు అన్న భావనలు తాత్వికంగా చాలా లోతైనవే అయినే తదనంతరం అభివృద్ధి చెందిన ఈ భావనల వల్ల కొన్ని జటిలమైన సమస్యలు తలెత్తాయి.
అలాంటి
సమస్య ఒకటి కాంతి సిద్ధాంతంలో ఏర్పడింది.
(ఇంకా వుంది)
0 comments