ఇంచుమించు
ఇలాంటి సిద్ధాంతాన్నే 1892 లో
హెన్రిక్ లోరెన్జ్ అనే డచ్ భౌతిక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. లోరెన్జ్, ఫిట్ జెరాల్డ్ లు ప్రతిపాదించిన సిద్ధాంతాలు గణితపరంగా సమంజసంగానే వున్నా వాటి వల్ల కొత్త సమస్యలు తలెత్తాయి. ఈథరు గాలి వల్ల వస్తువులు కుంచించుకుపోవడం ఏమిటి? అదసలు ఎలా జరుగుతుంది? అంతకన్నా ముందు అసలు ఈథర్ అంటే ఏంటి? దాని లక్షణాలేంటి? దానికి ద్రవ్యరాశి వుంటుందా? సాంద్రత వుంటుందా? ఉంటే మరి అన్ని వస్తువుల లాగానే అదీ కదలాలిగా? మరి ఓ నిశ్చల నేపథ్యంలా విశ్వమంతా వ్యాపించి వుండడం ఏంటి? ఈ ప్రశ్నలు వేటికీ సమాధానాలు లేవు. పరిస్థితి ఇలా అగమ్య గోచరంగా ఉన్న తరుణంలో ఓ పేటెంట్ ఆఫీసులో గుమాస్తాగా పని చేస్తున్న అజ్ఞాత మేధావి మన ఆల్బర్ట్ ఐన్స్టయిన్ రంగప్రవేశం చేశాడు.
ఈథర్
అన్న భావన వల్ల వచ్చిన తంటాలన్నీ అర్థం చేసుకున్న ఐన్స్టయిన్ అసలు ఈథర్ అనేదే లేదన్న భావన మీద తన సిద్ధాంతాన్ని నిలబెట్టాడు. ఈథర్
లేకపోవడం వల్ల మూలం యొక్క ప్రమేయం లేకుండా కాంతి అన్ని దిశలలో ఒకే విధంగా ఎందుకు కదులుతోందో వివరించవలసిన అవసరం లేకుండా పోయింది.
శూన్యంలో
కాంతి అన్ని దిశలలోను (కాంతి మూలంతో సంబంధం లేకుండా) ఒకే వేగంతో (c = 3 X 108
m/s) కదులుతుంది.
ఐన్స్టయిన్ సిద్ధాంతానికి ఈ
సూత్రం మొదటి పునాది రాయి అయ్యింది.
ఈథర్
అనే ఊహాత్మకమైన నిశ్చల నేపథ్యం లేకపోవడం వల్ల, ఇక చలనానికి నిరపేక్షమైన ప్రమాణం అనేది లేకుండా పోయింది. కనుక ఒక వ్యవస్థ యొక్క చలనాన్ని మరో వ్యవస్థ బట్టి, అంటే వ్యవస్థకి సాపేక్షంగా (relative) మాత్రమే
వర్ణించడానికి
వీలవుతుంది.
ఒక వ్యవస్థ నుండి చూసినప్పుడు కదులుతున్నట్టు కనిపించే వస్తువు, మరో వ్యవస్థ నుండి చూస్తున్నప్పుడు నిశ్చలంగా ఉన్నట్టు కనిపించొచ్చు. అంటే వేగం సాపేక్షం అన్న మాట. ఇది సాపేక్షతకి రెండవ సూత్రం. దీన్ని మరింత శాస్త్రీయంగా ఇలా నిర్వచిస్తారు.
మొదటి
ప్రత్యేక సాపేక్షతా సూత్రం: “రెండు
వ్యవస్థలు ఒక దాని బట్టి ఒకటి సమవేగంతో కదులుతున్నప్పుడు, మొదటి వ్యవస్థలో ఏ భౌతిక ధర్మాలు వర్తిస్తున్నాయో, రెండవ వ్యవస్థలో కూడా అవే ధర్మాలు వర్తిస్తాయి. అంటే, అన్ని జడ చట్రాలలోను భౌతిక ధర్మాలు ఒకే విధంగా ఉంటాయి.
అయితే
ఒక్క కాంతి మాత్రమే ఈ సాపేక్షతకి అతీతంగా ప్రత్యేక హోదా కలిగి వుంటుంది. కనుక రెండవ సూత్రాన్ని ఇలా వర్ణిస్తారు.
రెండవ
ప్రత్యేక సాపేక్షతా సూత్రం: సమ
వేగంతో కదిలే ఏ వ్యవస్థ నుండి చూసినా కాంతి మాత్రం శూన్యంలో ఎప్పుడూ ఒకే వేగంతో కదలడం కనిపిస్తుంది. ఆ వేగం విలువ 3 X 108 m/s.
కదిలే
వ్యవస్థ నుండి చూసినా కాంతి వేగంలో మార్పు రాకపోవడం శాస్త్రవేత్తలకి ఆశ్చర్యం కలిగించింది. కాని దాన్ని కొట్టిపారేయడానికి లేదు. కనుక కాంతి యొక్క ఈ
ప్రత్యేక లక్షణాన్ని నిజమని స్వీకరిస్తే అందుకు సైద్ధాంతికంగా ఎన్నో ప్రగాఢమైన పర్యవసానాలు వున్నాయని గుర్తించాడు ఆల్బర్ట్ ఐన్స్టయిన్. భౌతిక
ప్రపంచంలో మనం రోజు వ్యవహరించే అతి సామాన్యమైన రాశుల విషయంలో కూడా ఇంతవరకు మనకు వున్న అవగాహన తప్పని సూచించాడు. ఆ అవగాహన మార్చుకోవలసి వుందని సైద్ధాంతికంగా నిరూపించాడు. ఐన్స్టయిన్ ప్రతిపాదించిన సిద్ధాంతం
ఎంత నవీనమైనది అంటే మొట్టమొదట దాన్ని ప్రతిపాదించినప్పుడు వైజ్ఞానిక ప్రపంచానికి అది సులభంగా మింగుడు పడలేదు. తొలిదశలలో మొత్తం ప్రపంచంలో ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న వారు పన్నెండు మందికి మించి వుండరు అని ఒక నమ్మకం కూడా వుంది. అయితే అది కేవలం పుకారు మాత్రమే అయ్యుండాలి. ఆ సిద్ధాంతం ఎంత వినూత్నమో చెప్పడానికి అలాంటి అతిశయోక్తి వాడి వుంటారు.
(ఇంకా వుంది)
postlink