జీవం పుట్టుకకి
అనువైన పరిస్థితులు – మధ్యస్థమైన ఉష్ణోగ్రత, ద్రవరూపంలో నీరు, ఆక్సిజన్ గల వాయుమండలం మొదలైనవి – భూమి మీద ఉండడం కేవలం కాకతాళీయం అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. కాని అది
కొంత వరకు కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో జరిగే పొరబాటు. భూమి వాసులమైన
మనం భూమి మీద పరిస్థితులకి పూర్తిగా అలవాటు పడిపోయాం. ఎందుకంటే మనం
ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లం. వెనకటి యుగాలలో
అలా అలవాటు పడలేని జీవాలు సమసిపోయాయి. అలా పృథ్వీ పరిస్థితులకి తట్టుకుని బట్టకట్టిన జీవాలకి మనం వారసులం. అలాగే భిన్న
పరిస్థితులు గల అన్య ప్రపంచాల మీద పరిణామం చెందిన జీవులు కూడా అక్కడి పరిస్థితులని ప్రశంసిస్తూ ఉంటారేమో.
భూమి మీద
జీవం అంతా పరస్పరం అనుసంధానమై వుంది. మనందరికీ ఆధారమై
వున్న కర్బన రసాయన శాస్త్రం ఒక్కటే. మన పరిణామ
పారంపర్యం ఒక్కటే. ఆ కారణం
చేత మన జీవశాస్త్రవేత్తలు శోధించే క్షేత్రం చాలా పరిమితమైనది. వాళ్లు కేవలం ఒక ప్రత్యేక రకమైన జీవశాస్త్రాన్నే అధ్యయనం చేస్తారు. విశ్వసంగీతంలో ఒక
చిట్టి బాణీనే పట్టుకు వేలాడతారు. వేవేల కాంతిసంవత్సరాల
పరిధిలో మనకి మిగిలింది ఈ ఒంటరి కూనిరాగమేనా? లేదా అది సంక్లిష్టమైన రాగమాలికలతో, రకరకలాల లయలతో, అనులయలతో, వేవేల
వాయిద్యాలతో, శతకోటి గొంతికలతో పాలపుంత మొత్తం వినిపించే విశ్వబృందగానమా?
విశ్వసంగీతంలో ఓ
చిన్ని చరణం గురించి ఓ కథ చెప్తాను. అది క్రీ.శ.
1185 సంవత్సరం. అంటోకు అనే ఏడేళ్ల పిల్లవాడు అప్పుడు జపాన్ ని పాలిస్తున్న చక్రవర్తి. హైకే అనే
సమూరాయ్ తెగకి అతడు నాయకుడు. ఈ తెగకి
గెంజీ అనే మరో సమూరాయ్ తెగకి మధ్య తెగని
విద్వేషాలు ఉన్నాయి. పారంపర్యంగా రాజసింహాసనం తమది అంటే కాదు తమది అని రెండు వర్గాల వారు కలహించుకునేవారు. 1185, ఏప్రిల్ 24 నాడు రెండు తెగల మధ్య ఓ కీలక సముద్ర
యుద్ధం జరిగింది. డానో-ఉరా అనే రేవు సమీపంలో జరిగిందా యుద్ధం. బాలచక్రవర్తి కూడా
యుద్ధంలో స్వయంగా పాల్గొన్నాడు. కాని ప్రతిపక్షాలతో పోలిస్తే హైకేల స్థితి బలగంలోను, బలం లోను
బలహీనంగా వుందని తేలింది. ఎంతో మంది
హతులయ్యారు. బతికిన వారు వీరధర్మాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద సంఖ్యలో సముద్రంలో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు. చక్రవర్తికి బామ్మగారైన మహారాణి ‘నీ’,
ఆమెగాని, తన మనవడు
అంటోకు గాని, ఎట్టి పరిస్థితుల్లో శత్రువుల చేతికి చిక్కకూడదని నిశ్చయించుకుంది. ఆ తరువాత ఏం
జరిగిందో ‘’హైకే గాధ’’లో
ఇలా వర్ణించబడింది:
“ ఆ ఏట చక్రవర్తికి
ఏడేళ్లే నిండాయి కాని అంతకన్నా పెద్దవాడిలా కనిపిస్తాడు. రూపంలో ముగ్ధమనోహరుడు. ప్రచండమైన తేజాన్ని చిందిస్తుంటాడు. అతడి పొడవాటి నల్లని కురులు నడుముని దాటేవి. ఆశ్చర్యం, ఆందోళన
నిండిన ముఖంతో అ పిల్లవాడు మహారాణి
నీ ని సమీపించి, “నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?” అని ప్రశ్నించాడు.
చిన్నారి సామ్రాట్టుని
చూడగానే మహారాణి ముఖాన అశ్రుధారలు ప్రవహించాయి. పసివాణ్ణి అక్కున జేర్చుకుని, పావురాయి వంటి తెల్లని మెత్తని వస్త్రంతో అతడి పొడవాటి కురులని ముడివేసింది. కన్నీరు క్రమ్మిన కళ్లతో ఆ బాలసామ్రాట్టు ముద్దులొలికే
తన చిట్టి చేతులని జోడించాడు. ముందుగా తూర్పు
దిశకి తిరిగి ఐజ్ దేవతకి వీడ్కోలు చెప్పాడు. తరువాత పశ్చిమానికి
తిరిగి నెమ్ బుట్సూ ప్రార్థన (అమితాభ బుద్ధుని
గౌరవార్థం) చేశాడు. మహారాణి
నీ ఆ పసిరాజుని తన
గుండెలకి బలంగా హత్తుకుంది. “ఈ సముద్రపు ఒడిలోనే
ఇక మన రాజధాని,” అనే చివరి మాటలతో సముద్రంలోకి దూకి, పిల్లవాడితో పాటు
సముద్రజలాలలో కనుమరుగయ్యింది.
(ఇంకా వుంది)
2. విశ్వ
బృందగానంలో ఒక గొంతిక
“విశ్వప్రభువుకి నన్ను నేను సమర్పించుకుంటున్నాను.
ఆయనే మనను ధూళి లోంచి సృష్టించాడు…”
-
కొరాన్, సురా 40.
తత్వసిద్ధాంతాలు అన్నిట్లోకి పురాతనమైనది పరిణామ తత్వం. మతవిద్య
ప్రభావం బలంగా ఉండే సహస్రాబ్దంలో దాన్ని కట్టగట్టి ఓ చీకటి గుయ్యారంలోకి విసిరేశారు.
ఒక ప్రాచీన భావనకి డార్విన్ కొత్త ఊపిరి పోశాడు. పాత సంకెళ్లు తెగిపోయాయి. ప్రాచీన గ్రీకుల చింతన మళ్ళీ
జన్మించింది. డెబ్బై తరాల మనుషులు స్వీకరించి, స్వాగతించిన మూఢనమ్మకాల కన్నా మరింత వీశ్వజనీనమైనవి, విలువైనవి అని ప్రాచీన గ్రీకుల భావాలు మళ్లీ తమ సత్తా నిరూపించుకున్నాయి.”
-
టి.హెచ్. హక్స్లీ,
1887.
“భూమి మీద జీవించిన ప్రతీ కర్బన రసాయన్ జీవి, మొట్టమొదటి
సారి ఊపిరి పోసుకున్న ఒక ఆదిమ రూపం నుండి ఆవిర్భవించి ఉంటాయి… ఇలాంటి జీవన దృక్పథంలో ఓ గొప్పదనం వుంది… స్థిరమైన గురుత్వ
ధర్మాన్ని అనుసరించి ఈ గ్రహం అనాదిగా సంచరిస్తూ ఉన్న సమయంలో, అలాంటి సామాన్యమైన ఆరంభం నుండి అతిసుందరమైన, అత్యద్భుతమైన
జీవనాకృతులు అనవధికంగా పరిణామం చెందాయి.”
-
చార్లెస్
డార్విన్, “జీవజాతుల ఆవిర్భావం’’ (The Origin
of Species, 1859)
‘’మరెక్కడైనా జీవం ఉంటుందా?” అన్న ప్రశ్న గురించి నా జీవితం అంతా ఆలోచిస్తూ వచ్చాను. ఉంటే అది
ఎలా ఉంటుంది? దాని పదార్థం
ఎలా ఉంటుంది? మన గ్రహం
మీద ఉండే జీవరాశి అంతా కర్బన రసాయనాలతో నిర్మించబడి ఉంటుంది. ఆ రసాయనాలు
కార్బన్ పరమాణువు ముఖ్య పాత్ర పోషించే సంక్లిష్టమైన సూక్ష్మ నిర్మాణాలు. జీవం ఆవిర్భవించక ముందు ఒక దశలో భూమి అంతా మోడువారి నిస్సారమై ఉండేది. కాని ఇప్పుడు
మన ప్రపంచం అంతా జీవకళతో తొణికిసలాడడం కనిపిస్తుంది. ఈ మార్పు ఎలా
జరిగింది? జీవం లేని
కాలంలో కర్బన రసాయనాలు ఎలా నిర్మించబడేవి? జీవ
పదార్థం మనలాంటి సంక్లిష్టమైన జీవులుగాను, తమ ఆవిర్భావ రహస్యాన్ని తామే శోధించుకోగల సచేతన జీవులుగాను, ఎలా పరిణామం చెందింది?
ఇతర సూర్యుళ్ల
చుట్టూ పరిభ్రమించే ఇతర గ్రహాల మీద కూడా జీవం ఉంటుందా?అన్యధరా జీవం
(extraterrestrial life) అనేదే
ఉంటే అది కూడా కర్బన రసాయనాల మీదనే ఆధారపడి ఉంటుందా? ఇతర ప్రపంచాలకి
చెందిన జీవులు భూమి మీద సంచరించే జీవాల లాగే ఉంటారా? లేదా ఊహించలేనంత
భిన్నత్వం ఉంటుందా? ఇతర పరిసరాల
అనుసారం జరిగిన పరివర్తనల వల్ల అలాంటి భిన్నత్వం సాధ్యమేమో? అన్యధరా జీవంలో
ఇంకా ఏం సాధ్యం? భూమి మీద
జీవం యొక్క లక్షణం, ఇతర గ్రహాల
మీద జీవం కోసం అన్వేషణ – ఇవి రెండూ ఒకే ప్రశ్న యొక్క రెండు ముఖాలు. ‘’మనమెవరం?’’ అనే ప్రశ్న యొక్క రెండు పార్శ్వాలు.
తారల నడుమ
ఉండే విశాల నిశీధిలో వాయుధూళి మేఘాలు, కర్బన రసాయన
పదార్థం పలుచగా విస్తరించి ఉంటుంది. రేడియో టెలిస్కోప్
ల సహాయంతో కొన్ని
డజన్ల రకాల కర్బన రసాయనాలు అక్కడ కనుక్కున్నారు. ఈ రసాయనాలు విరివిగా కనిపించే తీరును బట్టి విశ్వమంతా జీవపదార్థం విస్తరించి వుందని అనుకోవలసి ఉంటుంది. తగినంత సుదీర్ఘ
సమయం అంటూ ఉంటే విశ్వంలో జీవావిర్భావం, జీవపరిణామం అనివార్యం అనుకోవాలి. మన పాలపుంత
గెలాక్సీలోని బిలియన్ల గ్రహాలలో కొన్నిట్లో జీవం ఎన్నటికీ ఆవిర్భవించకపోవచ్చు. మరి కొన్నిట్లో ఆవిర్భవించి అంతరించిపోవచ్చు. లేదా జీవం దాని ప్రాథమిక శైశవ రూపాలకి మించి వికాసం చెందకపోవచ్చు. అత్యల్ప
శాతం ప్రపంచాలలో ప్రజ్ఞ గల జీవులు పుట్టుకు రావచ్చు. మనకన్నా ఉన్నతమైన
నాగరికతలు వెల్లివిరియొచ్చు.
.
postlink