శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.



ఒక రోజు నేను తక్కువ పవర్ గల ఒక బైనాక్యులర్ మైక్రోస్కోప్ లో అప్పుడే కొత్తగా వచ్చిన ఒక డ్రోసోఫైలా బ్యాచి ఈగలని చూస్తున్నాను. గాజు స్లయిడ్ మీద ఈథర్ తో స్థిరపరచబడ్డ ఈగలవి. మైక్రోస్కోప్ లోంచి చూస్తూ ఒంటె జుట్టు కుంచెతో వాటిని వర్గాలుగా వేరు చేస్తున్నాను. అలా చేస్తుంటే విభిన్నమైన జాతి నా కళ్లకి తారసపడింది. ఎరుపు రంగు కళ్లో, మెడమీద వెంట్రుకలు ఉండడమోఇలాంటి తేడాలు కావు. దీని సంగతి వేరు. దీని రెక్కలు మరింత పెద్దగా ఉన్నాయి. పొడవాటి నునుపైన కొండేలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఒక్క తరంలో ఇందులో గొప్ప పరిణామాత్మక మార్పు ఇందులో సంభవించింది అనిపించింది. ఏదైతే ముల్లర్ జరగదన్నాడో అదే ఇక్కడ జరిగింది. అదెలా జరిగిందో వివరించాల్సిన బృహత్కార్యం ఇప్పుడు నా నెత్తిన పడింది.
గుండె దిటవు చేసుకుని ఆయన గది తలుపు తట్టాను. “లోపలికి రా,” అని లోపలి నుండి తగ్గుస్వరంలో గొంతు వినిపించింది. గదిలోకి అడుగుపెట్టాను. ఆయన పని చేస్తున్న మైక్రోస్కోప్ బల్ల వద ఉన్న చిన్న దీపం తప్ప గదంతా చీకటిగా వుంది. మసక చీకట్లో బిక్కుబిక్కు మంటూ నా వివరణ మొదలెట్టాను. నాకు చాలా భిన్నమైన ఈగ దొరికింది. బెల్లం ముక్కల మీద పుట్టిన ఇతర ప్యూపాల లోనుండే ఇది కూడా వచ్చిందని నాకు గట్టి నమ్మకం. ముల్లర్ మనసు నొప్పించాలని నా ఉద్దేశం కాదు

అది లెపిడోటెరా వంటిదా, డిప్టెరా వంటిదా?” సూటిగా అడిగారాయన. కింది నుండి పడుతున్న మైక్రోస్కోప్ దీపపు కాంతిలో ఆయన ముఖం వెలిగిపోతోంది. నాకా ప్రశ్న అర్థం కాక బిక్క మొఖం వేశాను.

దానికి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయా? కుచ్చులున్న కొండేలు ఉన్నాయా?”

అవునని తలూపాను.

ముల్లర్ తల పైన లైటు వేసి స్నేహపూర్వకంగా నవ్వారు. ఇదొక పాత కథ. డ్రోసొఫైలా జన్యు ప్రయోగశాలలో పరిస్థితులకి అలవాటు పడ్డ ఒకరకమైన శలభం (moth)  ఇది. డ్రోసొఫైలా ఈగకి దీనికి పోలిక లేదు. దీనికి కావలసింది డ్రోసొఫైలా ఈగలు ముసిరే బెల్లం ముక్కలు. ఈగలని లోపల పెట్టడానికో, బయటికి తీయడానికో పాల సీసా మూత తీసి మూసే కాస్త సమయంలో, దారేపోయే తల్లి శలభం  ఒడుపుగా దాని గుడ్లు యుద్ధవిమానాలు శత్రు క్షేత్రంలో బాంబులు పడేసినట్టు సీసాలో పడేసింది. నేను కనిపెట్టినది ఉత్పరివర్తన కాదు. పరిసరాలకి తగ్గట్టుగా ప్రకృతిలో జీవరాశులు చేసుకునే సర్దుబాటుకి ఇదో తార్కాణం. అలాంటి సర్దుబాటే ఒక విధంగా ఉత్పరివర్తనకి, ప్రకృతి చేసే ఎంపికకి తార్కాణం.


పరిణామంలో రెండు రహస్యాలు ఉన్నాయిఒకటి చావు, మరొకటి కాలం. పరిసరాలకి సరిగ్గా అలవాటు పడలేని    జీవరాశులు పెద్దసంఖ్యలలో చనిపోవడం. దీర్ఘకాలం మీదుగా చిన్న చిన్న ఉత్పరివర్తనలు పోగై, అవి జరుగుతున్న జీవరాశులు యాదృచ్ఛికంగా పరిసరాలకి అనుగుణంగా రూపొందడం. హితవైన ఉత్పరివర్తనలు పోగై మరింత సమర్ధవంతమైన జీవం ఏర్పడడానికి దీర్ఘకాలం పడుతుంది మరి. అలాంటి వివరణ నిజం అని ఒప్పుకోవాలంటే యుగయుగాలుగా కాకపోయినా కొన్ని వేల ఏళ్ళుగా  పరిణామం జరిగిందని సమ్మతించాలి. డార్విన్, వాలెస్ సిద్ధాంతం పట్ల తిరస్కారం అక్కడే మొదలయ్యింది. డెబ్బై ఏళ్లు బతికే జీవుల దృష్టిలో డెబ్బై మిలియన్ సంవత్సరాల కాలానికి అర్థం ఏముంటుంది? ఒక్క రోజు రెక్కలు రెపరెపలాడించి రాలిపోయే భ్రమరాల వంటి వాళ్ళం మనం. అదే శాశ్వతం అనే భ్రమలో ఉంటాము.

భూమి మీద జరిగిన జీవపరిణామం వంటిదే ఒక మోస్తరుగా ఇతర ప్రపంచాల మీద కూడా జరిగి ఉండొచ్చు. అయితే ప్రోటీన్లని శాసించే రసాయన శాస్త్రం, మెదణ్ణి శాసించే నాడీ శాస్త్రం మొదలైన వివరాలలో మాత్రం భూమి మీద జరిగిన జీవనవికాస గాధ మొత్తం పాలపుంత గెలాక్సీలోనే ప్రత్యేకమై ఉండొచ్చు. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం తారాంతర వాయుధూళి మేఘాల లోనుండి భూమి ఘనీభవించింది. శిలాజాల సాక్ష్యాలని బట్టి తరువాత అనతికాలంలోనే అంటే 4.0 బిలియన్ సంవత్సరాల క్రితమే భూమి మీద మురికిగుంటల్లో, మహార్ణవాల్లో జీవం ఆవిర్భవించింది. మొట్టమొదటి జీవరాశులు ఏకకణ జీవుల అంత సంక్లిష్టమైనవి ఏమీ కావు. జీవం పుట్టుకలో తొలి ప్రయత్నాలు చాలా ప్రాథమికమైనవి. తొలినాళ్లలో సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కాంతి, తటిల్లతా విన్యాసం మొదలైన శక్తులు ప్రాచీన వాయుమండలంలో ఉండే హైడ్రోజెన్ సహిత అణువులని విచ్ఛిన్నం చేస్తూ ఉండేవి. అలా ఏర్పడ్డ రసాయన శకలాలు అప్రయత్నంగా మళ్లీ కలిసి మరింత సంక్లిష్ట అణువులుగా ఏర్పడేవి. అలా ఏర్పడ్డ ప్రాచీన రసాయన ఉత్పత్తులు సముద్రాలలో కరిగిపోయాయి. అలా సముద్రజలాలు ఒక విధమైన కర్బనరసాయన రసంగా మారి, అంతకంతకు సంక్లిష్టం కాసాగాయి. అలా వికాసం కొనసాగుతుండగా ఒక దశలో, బహుశా యాదృచ్ఛికంగా, ఒక అణువు జనించింది.  మరింత సరళమైన అణువులని మూలరూపాలుగా, పునాదిరాళ్లుగా వాడుకుంటూ దానికదే ప్రతులు నిర్మించుకోగల సత్తాగల మహత్తర అణువు అది. ( అంశం గురించి మరో చోట ప్రస్తావిద్దాము.)


అలా పుట్టినదే పృథ్వీ జీవరసాయనానికి అణురాజం అని చెప్పుకోదగ్గ  డీ ఆక్సీ రైబో న్యూక్లీక్ ఆసిడ్ (DNA)’  కి మొట్టమొదటి పూర్వీకుడు. మెలిక తిరిగిన నిచ్చెనలా ఉంటుందా అణువు. దాని మెట్లు నాలుగు రకాల రసాయనిక అంశాలతో నిర్మించబడి ఉంటాయి. అవే నాలుగు అక్షరాలతో కూడుకున్న జన్యులిపి. న్యూక్లియోటైడ్ లు అని పిలువబడే నిచ్చెన మెట్లే ఒక జీవాన్ని నిర్మించడానికి కావలసిన అనువంశిక ఆదేశాలని వ్యక్తం చేస్తాయి. భూమి మీద ప్రతీ జీవానికి దాని నిర్మాణానికి కావలసిన ఒక విలక్షణమైన ఆదేశావళి ఉంటుంది. వాటి భాష ఒకటే, లిపి ఒకటే, ఆదేశాలే వేరు. జీవరాశుల మధ్య తేడాలు వాటి న్యూక్లీక్ ఆసిడ్ ఆదేశాలలో భేదాల వల్ల కలుగుతున్నవే. ఒక తరం నుండి తదుపరి తరానికి  న్యూక్లీక్ ఆసిడ్ వరుస తన ప్రతి తాను నిర్మించుకుంటున్న ప్రక్రియలో వచ్చిన దోషమే  ఉత్పరివర్తన. ఉత్పరివర్తనలు యాదృచ్ఛికంగా న్యూక్లియోటైడ్ లలో వచ్చే మార్పులు కనుక, వాటిలో చాలా మటుకు హానికరంగా కాని, ప్రాణాంతకంగా కాని దాపురిస్తాయి. వాటి వల్ల నిష్క్రియమైన ఎన్జైమ్ లు ఉద్భవిస్తాయి.  ఉత్పరివర్తన వల్ల మరింత సమర్ధవంతమైన  ప్రాణి  ఏర్పడాలంటే చాలా కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అది చాలా అరుదైన, అపురూపమైన సంఘటన. అయినా కూడా సెంటీమీటర్ లో ఒక కోటి వంతు పొడవు ఉండే న్యూక్లియోటైడ్ లో వచ్చే మార్పులే భూమి మీద జీవపరిణామ రథచక్రాలని నడిపిస్తాయి.

నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి అద్భుత రసాయనిక నందనవనంలా ఉండేదేమో.  అప్పటికి ఇంకా వేటాడగల మహామృగాలు లేవు. కొన్ని అణువులు వాటినవి తప్పులతడకలుగా పునరుత్పత్తి చేసుకునేవి. పునరుత్పత్తి, ఉత్పరివర్తన, ప్రకృతి ఎంపిక చేత అసమర్థమైన రూపాంతరాల  ఏరివేత యంత్రాంగంతో పరిణామం ముందుకు నడిచింది. అలా యుగాలు దొర్లాయి. అణువులు మరింత సమర్ధవంతంగా పునరుత్పత్తి చేసుకోవడం నేర్చుకున్నాయి. ప్రత్యేకమైన క్రియలు గల అణువులు కొన్ని ఒక దశలో చేతులు కలిపాయి. అణువుల మధ్య ఒక రకమైన సహకార బృందం ఏర్పడింది. అదే మొట్టమొదటి జీవకణం. వృక్షకణాలలో నేడు ఒక రకమైన అణు కర్మాగారాలు ఉంటాయి. వాటినే క్లోరోప్లాస్ట్ లు (chloroplasts) అంటారు. వాటి వల్లనే సూర్యకాంతి, నీరు, కార్బన్ డయాక్సయిడ్ కలయిక వల్ల కార్బోహైడ్రేట్ లు, ఆక్సిజన్ ఏర్పడతాయి. పరివర్తననే కిరణజన్యసంయోగ క్రియ (photosynthesis)  అంటారు. ఒక రక్తపు బొట్టులో ఉండే జీవకణాలలో మరో రకం కర్మాగారం ఉంటుంది. దాన్నే మైటోకాండ్రియాన్ (mitochondrion) అంటారు. అది ఆహారాన్ని ఆక్సిజన్ తో కలిపి పనికొచ్చే శక్తిగా మారుస్తుంది. ప్రస్తుతం వృక్ష జంతు కణాలలో ఉండే కర్మాగారాలు బహుశ ఒకప్పుడు స్వతంత్ర కణాలు అయ్యుండొచ్చు.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts