రెండు బిలియన్
సంవత్సరాల క్రితం లైంగిక సంపర్కం ఆరంభమయ్యింది. అంతవరకు యాదృచ్ఛిక ఉత్పరివర్తనలు కాలానుగతంగా
పోగై నవ్య జీవాలు ఉత్పన్నం అయ్యేవి. జన్యు ఆదేశాలలో
ఒక్కొక్క అక్షరం మారుతూ వస్తుంటే ఒక దశలో జీవం స్థాయిలో గణనీయమైన మార్పు సంభవించి కొత్త జీవం పుట్టుకొచ్చేది. ఆ కారణం చేత
పరిణామం అతి నెమ్మదిగా జరిగేది. లైంగిక సంపర్కం
మొదలయ్యాక రెండు జీవాలు తమ డీ.ఎన్.ఏ రహస్య సందేశావళి
నుండి మొత్తం పేరాలు, పేజీలు, పుస్తకాలు
ఇచ్చిపుచ్చుకునేవి. అలా పుట్టిన నవ్యజీవాలు ప్రకృతి ఎంపిక అనే జల్లెడ లోంచి ప్రవేశించడానికి సిద్ధమయ్యేవి. ఆ విధంగా మనుగడ
కోసం జీవాలు లైంగిక చర్యలో పాల్గొనాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. లైంగిక సంపర్కానికి
కావలసిన ఆకర్షణ లోపించిన జీవాలు వేగంగా వినష్టమైపోయేవి. ఆ విషయం రెండు
బిలియన్ సంవత్సరాల క్రితం బతికిన సూక్ష్మక్రిములకి మాత్రమే వర్తించదు. నేడు మనుషులు
కూడా తమ డీ.ఎన్.ఏ. ని
ఇతరులతో పంచుకోవాలని
ఎంతో తహతహలాడుతుంటారు.
ఒక బిలియన్
సంవత్సరాల క్రితం మొక్కలు కలిసికట్టుగా పని చేస్తూ పృథ్వీవాతావరణంలో అద్భుతమైన పరివర్తన సాధించాయి. పచ్చని చెట్లు
అణురూపంలో ఆక్సిజన్ ఉత్పన్నం చేస్తాయి. అప్పటికే సముద్రాలు
చిన్న చిన్న పచ్చటి మొక్కలతో నిండిపోయి వున్నాయి. భూమి చుట్టూ
వాయుమండలంలో ఆక్సిజన్ ఒక ప్రథాన అంశంగా పరిణమిస్తోంది. ఒకప్పుడు హైడ్రోజెన్ ప్రథానంగా గల వాయుమండలం ఇప్పుడు తిరిగిమార్చరాని విధంగా మారిపోతోంది. ఆ విధంగా అంతవరకు
అజీవ ప్రక్రియల చేత జీవపదార్థ నిర్మాణం జరుగుతూ వచ్చిన యుగం సమాప్తమయ్యింది. కాని ఆక్సిజన్ కి కర్బన అణువులని విచ్ఛినం చేసే దుర్గుణం ఒకటి వుంది.
ఆక్సిజన్ పట్ల
మనకి ఎంత వల్లమాలిన అభిమానం వున్నా, అరక్షితమైన కర్బన
రసాయనాల పాలిటి విషంలా దాపురిస్తుందది. ఆక్సీకృత వాతావరణంగా రూపాంతరం చెందడం భూమి మీద జీవచరిత్రలో ఓ బృహత్ సంకటంగా పరిణమించింది. ఆక్సిజన్ ధాటికి తట్టుకోలేని ఎన్నో జీవరాశులు సమసిపోయాయి. ఆ దశలో బతికి
బట్టకట్టిన బోటులిజమ్, టెటనస్ బాసిలీ వంటి
కొన్ని ఆదిమ జీవరూపాలు ఇప్పటికీ ఆక్సిజన్ రహిత పరిసరాలలోనే మనగలవు. భూమి మీద
వాయుమండలంలోని నైట్రోజెన్ రసాయనికంగా మరింత తటస్థంగా ఉంటుంది. కాబట్టి దాని
చర్య ఆక్సిజన్ కన్నా మరింత హితవుగా ఉంటుంది. అయితే అది
కూడా జీవక్రియల చేతనే పోషించబడుతుంది. కాబట్టి నేడు పృథ్వీ వాయుమండలంలో 99 శాతం జీవ మూలాల నుండే పుట్టుకొచ్చినదే. జీవప్రపంచం ఆకాశానికి ఆధారమై నిలిచింది.
జీవావిర్భావం తరువాత
మొదటి నాలుగు బిలియన్ సంవత్సరాలు నీలి-ఆకుపచ్చ రంగు
అల్గీ అనే సూక్ష్మజీవులే సాగరాలలో నిండి వుండేవి. తరువాత సుమారు 600
మిలియన్ సంవత్సరాల క్రితం ఆల్గీ ల ఏకఛత్రాధిపత్యపు పట్టు సడలింది. జీవసృష్టి కట్టలుతెంచుకుంది. అసంఖ్యాకమైన నవ్యరూపాలు పుట్టుకొచ్చాయి. ఆ సంఘటననే కేంబ్రియన్
విస్ఫోటం (Cambrian explosion) అంటారు.
భూమి
ఏర్పడ్డాక ఇంచుమించు వెనువెంటనే జీవోత్పత్తి జరిగింది. కాబట్టి భూమి
లాంటి గ్రహం మీద జీవం అనేది ఒక అనివార్య రసాయనిక పర్యవసానం అనుకోవచ్చు. కాని మొదటి మూడు బిలియన్ సంవత్సరాల పాటు నీలి-ఆకుపచ్చ రంగు
ఆల్గీలకి మించి జీవపరిణామం ముందుకు సాగకపోవడం బట్టి ప్రత్యేక అవయవాలు గల పెద్ద పెద్ద జీవరూపాలు పరిణమించడం చాలా కష్టమని, ప్రాథమిక జీవోత్పత్తి
కన్నా ఈ పెద్ద జీవాల పరిణామం చాలా కష్టమని అర్థమవుతోంది. ఆ కారణం చేతనే
పుష్కలంగా సూక్ష్మక్రిములు ఉన్నా, మొక్కలు, మృగాలు
లేని ఎన్నో గ్రహాలు ఉండే అవకాశం వుంది.
కేంబ్రియన్ విస్ఫోటం
జరిగిన వెంటనే సముద్రాలు ఎన్నో క్రొంగొత్త జీవరూపాలతో తొణికిసలాడాయి. 500 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయిలోబైట్ ల దండులు ఉండేవి. చక్కని శరీర నిర్మాణం గల పెద్ద పెద్ద పురుగుల లాంటివవి. కొన్ని సముద్రాల
అడుగున నేల మీద దండులుగా వెంటాడేవి. అవి వాటి
కళ్లలో ఒక ప్రత్యేకమైన స్ఫటికాలని
(crystals) భద్రపరచుకునేవి. ఆ స్ఫటికాలు ధృవీకృత
కాంతికి (polarised light) స్పందించేవి. కాని నేడు ట్రయిలోబైట్ లు సజీవంగా లేవు. గత
200 మిలియన్ సంవత్సరాలుగా కూడా ఈ జీవాల నామరూపాలు
లేవు. అలాగే ప్రస్తుతం
భూమి మీద సంచరించే ప్రతీ జీవజాతి ఒకప్పుడు లేనిదే. రాళ్ల పొరల్లో
మనలాంటి జంతువుల ఆనవాళ్లు సుతరామూ లేవు. ఉత్పత్తి చెందిన
జీవాలు లిప్తకాలం వెలిగి ఉఫ్ఫున ఆరిపోతాయి.
కేంబ్రియన్ విస్ఫోటానికి ముందు
జీవజాతులు ఒకదాని తరువాత ఒకటి పరంపరగా నెమ్మదిగా వికాసం చెందేవి. దీనికి కారణం
కొంతవరకు మరీ సుదూరమైన గతానికి సంబంధించి మనకున్న సమాచారంలోని వెలితే కావచ్చు. మన గ్రహం
యొక్క మొట్టమొదటి చారిత్రక దశలలో కఠిన దేహాలు గల జీవాల సంఖ్య అతి తక్కువగా ఉండేది. మరి మెత్తని
జీవాల ఆనవాళ్లు రాళ్లలో మిగలవు. ఇది కాక
కేంబ్రియన్ విస్ఫోటానికి ముందు నవ్యరూపాల అవతరణ మందకొడిగా సాగడం అనేది ఒక వాస్తవం. ప్రచ్ఛన్నంగా సాగే
జీవకణపు పరిణామం, అతి నెమ్మదిగా
సాగే జీవరసాయనచర్యల వికాసం శిలాజాల సాక్ష్యాలలో కనిపించే బాహ్యరూపాలలో ప్రకటం కాదు. కాంబ్రియన్ విస్ఫోటం
తరువాత అనూహ్యమైన వేగంతో జీవసృష్టిలో కొత్త కొత్త అనుసరణలు పుట్టొకొచ్చాయి. వేగంగా, వరుసగా మొదటి చేప, మొట్టమొదటి
కశేరుకం అవతరించాయి. అంతవరకు సముద్రాలకే పరిమితమైన మొక్కలు ఖండాల మీదకి దండెత్తాయి. మొదటి కీటకం పుట్టింది. దాని వారసులు
నేల మీద జంతువుల సహనివేశన
(colonization) ప్రయత్నంలో
పురోగాములు అయ్యాయి. ఉభయచరాలతో పాటే
రెక్కల పురుగులు కూడా ఊపిరి పోసుకున్నాయి. లంగ్ ఫిష్ వంటి జీవాలు నేల మీద, నీట్లోనూ మనగలగడం నేర్చుకున్నాయి. మొదటి తరువులు, మొదటి సరీసృపాలు
పుట్టుకొచ్చాయి. తరువాత డైనోసార్లు ఉద్భవించాయి. తరువాత క్షీరదాలు (mammals). ఆ తరువాత మొదటి
పక్షులు. తొలి పూవులు
పూశాయి. అంతలో డైనోసార్లు
అంతరించాయి. డాల్ఫిన్ లకి, తిమింగలాలకి
పూర్వీకులైన సెటేషియన్లు పుట్టాయి. అదే సమయంలో
కోతులకి, వానరాలకి, నరులకి
పూర్వీకులైన ప్రథమజీవులు (primates) పుట్టుకొచ్చాయి. పది మిలియన్ సంవత్సరాల క్రితం లోపే మనుషులకి అతిసన్నిహితమైన పోలికలు గల జీవులు అవతరించారు. ఆ కాలంలోనే మెదడు
పరిమాణం గణనీయంగా పెరిగింది. ఆ తరువాత
కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితమే మొట్టమొదటి అసలు మనుషులు అవతరించారు.
(ఇంకా వుంది)
postlink