https://www.youtube.com/watch?v=c24Ah-Qs7zE&feature=youtu.be&fbclid=IwAR17bg8EXAwmN3GYDvOfPb32RAhdEl1MMH0a-9ev9zxfZ4WNlNkP_Ro8-qA
దివి లోకపు ధర్మాల గురించి తెలుసా?
ఆ ధర్మాలని భువిలో స్థాపించగలవా?
- Book
of Job
మనిషికి గాని, ఇతర ప్రాణులకి గాని కలిగే మంచి, చెడు అంతా ఏడు
నుండి, పన్నెండు నుండి వస్తుంది. రాశిచక్రంలోని పన్నెండు రాశులు కాంతి పక్షాన పని చేసే
పన్నెండు సేనాపతులు అని మతం చెప్తుంది; ఇక ఏడు గ్రహాలు చీకటి పక్షాన పని చేసే ఏడుగురు
సేనాపతులు. ఏడు గ్రహాలు సమస్త సృష్టిని భ్రష్టు పట్టిస్తాయి. సృష్టిని మరణ మార్గాన ముందుకు తోస్తాయి. రాశిచక్రంలోని
పన్నెండు రాశులు, ఏడు గ్రహాలు జగతి జాతకాన్ని నిర్ణయిస్తాయి.
- జోరాష్ట్రియన్ల
పుస్తకం, మెనోక్ ఇ జ్రాట్
“ప్రతీ వస్తువుకి ఒక రహస్య, ప్రత్యేక లక్షణం ఉంటుందని, ఆ లక్షణం
బట్టి అది కొన్ని ప్రత్యేక ప్రభావాలని ప్రదర్శిస్తుందని అన్నప్పుడు, నిజానికి మనం చెప్తున్నది
ఏమీ లేదు. అలా కాకుండా మొత్తం చలనానికి సంబంధించి రెండు, మూడు సామాన్య ధర్మాలని నిర్వచించి,
ఆ ధర్మాల సహాయంతో అన్ని రకాల వస్తువుల చలనాలని వర్ణించగలగడం చాలా పెద్ద మెట్టు అవుతుంది.”
- ఐసాక్
న్యూటన్, కాంతిశాస్త్రం
“పక్షులు ఎందుకు పాడుతాయి అని మనం అడగం. ఎందుకంటే పాడడం వాటికి
ఆనందాన్నిస్తుంది. పాట కోసమే అవి సృష్టించబడ్డాయి. అలాగే దివిసీమల సహస్యాలని శోధించాలని
మనిషి మనసు ఎందుకు తపిస్తుంది అని అడగడం అనవసరం… ప్రకృతి గతులలో ఉండే ఘనమైన వైవిధ్యం,
దివిసీమల నిండా విస్తరించిన అద్భుత విజ్ఞాన ఐశ్వర్యం, మానవ మేధకి అనుక్షణం కమ్మని విందు
చేస్తున్నాయి.”
- యోహానెస్
కెప్లర్, Mysterium Cosmographicum.
మార్పు
అనేదే లేని గ్రహం మీద మనం జీవించినట్లయితే, ఇక మనకి చేయడానికి ఏమీ ఉండదు. శోధించి తెలుసుకోడానికి
ఏమీ ఉండదు. వైజ్ఞానిక పరిశోధన
పట్ల ప్రేరణ ఉండదు. ఇందుకు భిన్నంగా
పూర్తిగా యాదృచ్ఛికమైన ప్రపంచం మీద జీవిస్తున్నట్లయితే, అనూహ్యమైన మార్పులో ప్రపంచమంతా అతలాకుతలంగా ఉంటే, ఇక అలాంటి
లోకంలో మనం తెలుసుకోగలిగేది ఏమీ ఉండదు. అప్పుడు కూడా
శాస్త్ర శోధన అసంభవం అవుతుంది. కాని మనం
జీవించే విశ్వం మధ్యంతరంగా ఉంటుంది. ఇందులో మార్పు
ఉంటుంది గాని ఆ మార్పు కొన్ని
సూత్రాలని, విధానాలని అనుసరించి
ఉంటుంది. వాటినే మనం
ప్రకృతి ధర్మాలు అంటాము. ఓ కట్టెని
గాల్లోకి విసిరేస్తే అది ఎప్పుడూ తిరిగి భూమి మీదే పడుతుంది.
పశ్చిమంలో
అస్తమించే సూర్యుడు మర్నాడు క్రమం తప్పకుండా తూర్పున ఉదయిస్తాడు. అలా ప్రకృతి గతులలో క్రమం ఉండడం చేత వాటి గురించి తెలుసుకోడానికి వీలవుతుంది. శాస్త్ర శోధన సాధ్యమవుతుంది. శాస్త్ర విజ్ఞానంతో మన జీవితాలని ఉద్ధరించుకోడానికి వీలవుతుంది.
ప్రపంచాన్ని
ఎలా అర్థం చేసుకోవాలో మనుషులకి బాగా తెలుసు. అనాదిగా ఆ
ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. వేటాడినా, వంటచరకుతో
మంట వేసినా కొన్ని విషయాలు తెలుసు కనుకనే చేస్తున్నాం. వెనకటి రోజుల్లో టీవీ లేదు. సినిమాలు, రేడియో, పుస్తకాలు లేవు. మానవుడి అస్తిత్వం
అధికభాగం అలాంటి కాలంలోనే జరిగింది. చితుకులు పేర్చి, చలిమంట వేసి, చందమామ ముఖం
చాటేసిన అమవస నిశిలో మినుకుమనే తారలకేసి చూస్తూ యుగాలు గడిపాం.
చీకటి
ఆకాశం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏ ప్రయత్నమూ
లేకుండానే తారల మాటున ఆకారాలని ఊహించుకోవచ్చు. ఉదాహరణకి ఉత్తర ఆకాశంలో ఒక చోట ఎలుగుబంటి ఆకారాన్ని పోలినట్టుగా ఒక తారారాశి కనిపిస్తుంది. దాన్ని కొన్ని సంస్కృతులలో గ్రేట్ బేర్ (Great Bear, మహాభల్లూకం) అంటారు. మరి కొందరికి
అక్కడ మరేవో ఆకృతులు కనిపిస్తాయి. అయితే అక్కడ నిజంగా ఏ ఆకారాలూ లేవని
గుర్తుంచుకోవాలి. అవన్నీ ఊహచేత కల్పించబడ్డ ఆకృతులు. ఒకప్పుడు వేటాడి
పొట్టపోసుకునేవాళ్లం. అందుకే ఆ తారా రాశులలో
మనకి వేటగాళ్లు, వేటకుక్కలు, ఎలుగులు, ఎలనాగలు కనిపించారు. భూమి మీద మనకి నచ్చినవన్నీ ఆకాశంలో చూసుకున్నాం. పదిహేడవ శతాబ్దపు యూరొపియన్ నావికులు దక్షిణ ఆకాశాన్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు అక్కడ పదిహేడవ శతాబ్దపు సుపరిచిత వస్తుసంజాతాన్ని చూసుకున్నారు – రంగుతురాయిగల టూకన్ పక్షులు,
నెమళ్లు, టెలిస్కోప్ లు, మైక్రో
స్కోప్ లు, దిక్సూచులు, ఓడల వెనుక భాగాలు మొదలైనవి. తారారాశులకి పేర్లు
పెట్టే ప్రయత్నం ఇరవయ్యవ శతాబ్దంలో జరిగితే అక్కడ మనకి సైకిళ్లు, రెఫ్రిజెరేటర్లు, రాక్
అండ్ రోల్ ‘తారలు’, అణువిస్ఫోటంలో పుట్టే పుట్టగొడుగు మబ్బులు మొదలైనవి కనిపిస్తాయేమో. అలా మన ఆశలని, ఆందోళనలని ఆకాశమంతా
పులుముకుంటాం.
అప్పుడప్పుడు
మన పూర్వీకులకి బారైన కుచ్చుతోకతో మెరిసే తార ఆకాశంలో ప్రత్యక్షమయ్యేదేమో. ఆకాశంలో కాంతిబాణంలా దూసుకుపోతూ క్షణకాలం ఉండి మాయమయ్యే తార. దానికి
రాలే తార అని పేరు పెట్టారు. అదంత మంచి
పేరు కాదు. ఎందుకంటే ఆ
తార రాలిపోయాక కూడా పాత తారలు ఎప్పట్లాగే ఆకాశంలో మినుకుమినుకు మంటున్నాయి. కొన్ని ఋతువులలో ఆ రాలే తారలు
వానలా వర్షిస్తాయి. మరి కొన్ని సార్లు పలచని కాంతిచినుకులుగా అరుదుగా పడతాయి. ఆ రాలే
తీరులో కూడా ఒక క్రమం కనిపిస్తుంది.
సూర్య చంద్రుల లాగానే తారలు కూడా తూర్పున ఉదయించి పడమట్లో అస్తమిస్తాయి. రాత్రంతా ప్రయాణిస్తూ చీకటి ఆకాశాన్ని దాటుతాయి. వివిధ ఋతువులలో వివిధ తారారాశులు కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక ఋతువు ఆరంభంలో ఒకే తారారాశి ఉదయిస్తుంది. తారల తీరులో ఒక క్రమం, గణనీయత, శాశ్వతత్వం కనిపిస్తుంది. నిరంతరం మారే విశ్వంలో స్థిరంగా కనిపించే తారలు ఒక విధంగా ఊరట కలిగిస్తాయి.
(ఇంకా వుంది)