కెప్లర్
దృష్టిలో టైకో బ్రాహే పని చేసే రంగం, కాలం యొక్క దుష్పరిమాణాలకి అందని ఓ దివ్యధామం. ఇంతవరకు
తాను కలలు కంటున్న ‘’విశ్వరహస్యం’’ టైకో బ్రాహే సన్నిధిలో నిర్ధారించబడుతుందని కెప్లర్ కి ప్రగాఢమైన నమ్మకం. ఎలాగైనా టైకో
లాంటి మహానుభావుడితో కలిసి పని చెయ్యాలి. అప్పటికి ముప్ఫై
ఏళ్లుగా టైకో బ్రాహే, టెలిస్కోప్ కూడా
లేని కాలంలో, గొప్ప నిబద్ధతతో, నిర్దుష్టతతో విశ్వగతులని పరిశీలిస్తూ వచ్చాడు. అలాంటి వాడితో
చేతులు కలిపితే తన సిద్ధాంతాలని నిజం చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాని కెప్లర్ ఆశలు అన్నీ అడియాసలే అయ్యాయి. కెప్లర్ ఊహకి, టైకో ప్రవృత్తికి మధ్య చాలా భేదం వుంది. స్వతహాగా డాంభికుడు
టైకో. అతడి ముఖాన
ఓ విచిత్రమైన హంగు
బంగారంతో చేసిన ముక్కు. ఒక సందర్భంలో
టైకోకి అతడి శిష్యుడితో ఎవరు గొప్ప గణివేత్త అని వివాదం వచ్చింది. శిష్యుడు కత్తి
దూసి గురువుగారి ముక్కు కోసాడు. పోయిన ముక్కు
స్థానంలో బంగారు ముక్కు కట్టించుకున్నాడు టైకో. అతడి నివాసం
ఎప్పుడూ అనుచరులతో, శిష్యగణంతో, బంధువులతో, సందర్శకులతో కోలాహలంగా, గందరగోళంగా ఉండేది. వారి కేకలు, కేరింతలు, మిడిసిపాటు, సూటిపోటి మాటలు కెప్లర్ కి రుచించలేదు. పల్లెటూరి బడిపంతులు అన్నట్టుగా తనని వారు చులకన చేసే తీరు అతడి మనసుని గాయపరిచింది. “టైకో… అత్యంత సంపన్నుడే
కాని ఆ ఐశ్వర్యాన్ని ఎలా
ఉపయోగించాలో అతడికి
తెలీదు. అతడి వద్ద
ఉన్న పరికరాలలో ఏ ఒక్క దాన్ని
తీసుకున్నా దాని విలువ నా
పరివారపు మొత్తం ఆస్తిని కూడా మించిపోతుంది.”
ఒక పక్క టైకో సేకరించిన అపారమైన ఖగోళ సమాచారాన్ని జుర్రుకోవాలని కెప్లర్ తహతహలాడుతున్నాడు. టైకో అడపాదపా రెండు మెతుకులు రాల్చి ఊరిస్తాడే గాని మొత్తం గుట్టు విప్పడం లేదు. “టైకో తన వద్ద ఉన్న సమాచారాన్ని నేను తెలుసుకునే అవకాశమే ఇవ్వడం లేదు. భోజనాల వద్ద, ఇతర సందర్భాలలోను మాటవరసకి రెండు ముక్కలు ప్రస్తావించి ఊరుకుంటాడు. ఈ రోజు ఫలానా
గ్రహం యొక్క అతిదూర స్థానం (apogee) అలా
వుందనో, మర్నాడు మరో
గ్రహం యొక్క శీర్షబిందువులు (nodes) మరోలా
ఉన్నాయనో పొడిపొడిగా ఏదో మాట్లాడతాడు. టైకో వద్ద ఉన్న పరిశీలనా సమాచారాం అనుపమానమైనది. పైగా తనతో పాటు జమాజెట్టీల్లాంటి వారు కృషి చేస్తున్నారు… తనకి కావల్సినదంతా ఆ అపారమైన సమాచారాన్ని
అంతటినీ సమీకరించి, ఓ సమగ్రరూపాన్ని
ఇవ్వగల ప్రతిభాశాలి…” ఆ రోజుల్లో ఖగోళ
పరిశీలనల్లో టైకోని మించిన వారు లేరు. సైద్ధాంతిక రంగంలో
కెప్లర్ ని మించిన వారూ లేరు. ఇద్దరిలో ఏ
ఒక్కరూ కూడా ఉన్న ఖగోళ సమాచారాన్ని అంతటినీ జీర్ణించుకుని ఓ సమగ్రమైన విశ్వదర్శనాన్ని
ఇవ్వలేరని వాళ్లకే తెలుసు. అలాంటి విశ్వదర్శనం
ఇప్పుడు చేయి చాచితే అందేటంత దూరంలో ఉందని కూడా వాళ్లకి తెలుసు. కాని టైకో
కి, తన
జీవితమంతా కష్టపడి సేకరించిన పరిజ్ఞానాన్ని, తన కన్నా బాగా చిన్నవాడు, తనతో పోటీపడగలవాడు, అయిన కెప్లర్ కి ఇచ్చే ఉద్దేశం లేదు. ఇద్దరూ కలిసి
పరిశోధన చేసినా, ఆ పరిశోధనా
ఫలితాలని సహరచయితలుగా కలిసి రాయడం ఇద్దరికీ ఇష్టం లేదు. ఆ విధంగా
సిద్ధాంతం, ప్రయోగాల సంగమం లోంచి పుట్టాల్సిన ఆధునిక విజ్ఞానం యొక్క జనన ముహూర్తం ఇద్దరు ప్రముఖుల మధ్య ఏర్పడ్డ అవిశ్వాసం వల్ల వాయిదా
పడుతూ వచ్చింది. టైకోకి మిగిలిన
ఆయుష్షు మరో పద్దెనిమిది నెలలు మాత్రమే. ఆ కాస్త
సమయంలోను ఇద్దరూ పదే పదే ఘర్షణ పడుతూ, మళ్లీ మళ్లీ
రాజీ పడుతూ కాలం గడిపారు.
ఇలా ఉండగా ఒక రోజు రోసెన్ బర్గ్ కి చెందిన బారన్ ఏర్పాటు చేసిన విందులో టైకో తప్పతాగి “సభ్యత్వపు నియమాలని, ఆరోగ్య సూత్రాలని గాలికి వదిలాడు.” ఆహారపానీయాల విషయంలో కాస్త సంయమనం పాటించమని వైద్యులు హెచ్చరిస్తున్నా వినకుండా స్వతంత్రించిన టైకో ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అప్పటికే తనని పీడిస్తున్న మూత్రపిండాల వ్యాధి మరింత ప్రబలింది. ఇక మరణ
ముహూర్తం ఆసన్నమయ్యింది. మంచం పట్టి కొన ఊపిరితో ఉన్న టైకో కెప్లర్ ని పిలిచి తను జీవితాంతం సేకరించిన పరిశీనలా సంపదని ఆ కుర్ర గణితవేత్తకి
ధారాదత్తం చేసున్నట్టుగా ప్రమాణం చేశాడు.
ఆ సమయంలో టైకో ఈ ఆఖరు మాటలని
పదే పదే ఏదో గీతం ఆలపిస్తున్నట్టుగా అన్నాడట – “జీవితాన్ని వృధా చేసుకున్న వాడిగా, లోకం నన్ను
చూడనీయకు… జీవితాన్ని వృధా
చేసుకున్న వాడిగా, లోకం నన్ను
చూడనీయకు.”
టైకో
మరణం తరువాత కెప్లర్ ఆస్థాన గణితవేత్తగా రడోల్ఫ్-II
కొలువులో
చేరాడు. టైకో బంధు
వర్గం నుండి అతడి ఖగోళ పరిశీనలా సమాచారాన్ని సాధించడానికి కెప్లర్ మూడు చెరువుల నీరు తాగాల్సి వచ్చింది. గ్రహ కక్ష్యలకి, ఐదు ప్లాటోనిక్ ఘనాలకి మధ్య అంతవరకు తను ఊహించిన సంబందాన్ని, ఇటు టైకో పరిశీలనలు గాని, అంతకు ముందు
కోపర్నికస్ అందించిన పరిశీలనలు గాని సమర్ధించలేదు. అటు పిమ్మట కనుక్కోబడ్డ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో
మొదలైన గ్రహాల ఆవిష్కరణ వల్ల, అతడి
‘విశ్వరహస్యం’ పటాపంచలు అయ్యింది. ఎందుకంటే ప్లాటోనిక్
ఘనాలు ఐదే ఉన్నాయి. ఈ కొత్త
గ్రహాలకి
‘విశ్వ
రహస్యం’ లో చోటు
లేకుండా పోయింది. గ్రహాల మాట
అటు ఉంచితే గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాల గురించిన ప్రస్తావన ‘విశ్వ రహస్యం’లో ససేమిరా లేదు. ఉదాహరణకి భూమి
చుట్టూ తిరిగే చందమామకి గాని, అప్పటికే గెలీలియో
కనుక్కున్న జూపిటర్ చుట్టూ తిరిగే నాలుగు ఉపగ్రహాలకి గాని ‘విశ్వ రహస్యం’లో స్థానం
లేదు. ఇవన్నీ అర్థం
చేసుకున్న కెప్లర్ బాధతో కృంగిపోలేదు. కొత్త సమాచారం తెచ్చిన కొత్త ఉత్సాహంతో ఇంకా తెలియని ఉపగ్రహాలు ఏవైనా ఉన్నాయేమో కనుక్కోవాలని బయల్దేరాడు. పైగా ఒక గ్రహం చుట్టూ ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి అన్న ప్రశ్నకి సైద్ధాంతికంగా ఏదైనా సమాధానం వుందా అని ఆలోచించాడు. తనలో జరుగుతున్న మథన గురించి గెలీలియోకి ఇలా జాబు రాశాడు – “ఈ కొత్త గ్రహాలని
కూడా నా ‘విశ్వరహస్యం’ సిద్ధాంతంలో ఎలాగైనా ఇమడ్చగలమా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ సిద్ధాంతం ప్రకారం
యూక్లిడ్ బోధించిన ఐదు ప్లాటోనిక్ ఘనాలకి అనుబంధంగా సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల సంఖ్య కేవలం అరే ఉండాలి… జూపిటర్ చుట్టూ
నాలుగు ఉపగ్రహాలు తిరుగుతున్నాయన్న వాస్తవం నాలో గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తోంది. వీలైతే ఓ మంచి టెలిస్కోప్
ని అందిపుచ్చుకుని మీ కన్నా ముందు కొన్ని ఆవిష్కరణలు చెయ్యాలని చాలా వుంది. నా అంచనా
ప్రకారం మార్స్ చుట్టూ రెండు ఉపగ్రహాలు, సాటర్న్ చుట్టూ
ఆరు నుండి ఎనిమిది ఉపగ్రహాలు, మెర్క్యురీ, వీనస్
ల చుట్టూ బహుశా
చెరొక ఉపగ్రహం తిరుగుతూ ఉండాలి.” మార్స్ చుట్టూ నిజంగానే రెండు ఉపగ్రహాలు తిరుగుతూ ఉండాలని తరువాత తెలిసింది. అతడి ఆవిష్కరణకి
మన్ననగా, ఆ రెండిట్లో
పెద్దదాంట్లో కనిపించిన ఓ ముఖ్యమైన భౌగోళిక
విశేషానికి ‘కెప్లర్
గట్టు’ (Kepler ridge) అని కెప్లర్ పేరే పెట్టారు. కాని మెర్క్యురీ, వీనస్, సాటర్న్ ల
విషయంలో అతడు పూర్తిగా పొరబడ్డాడు. అంతేకాక గెలీలియో కనుక్కున్న దాని కన్నా జూపిటర్ మీద మరెన్నో ఉపగ్రహాలు ఉన్నాయి. మన సౌరమండలంలో
మొత్తం తొమ్మిదే గ్రహాలు ఎందుకు ఉన్నాయో, అంతకన్నా తక్కువ
గాని, ఎక్కువగాని ఎందుకు
లేవో, సూర్యుడి నుండి
వాటి దూరాలు అలాగే ఎందుకు ఉన్నాయో ఇప్పటికీ మనకి స్పష్టంగా తెలియదు. (అధ్యాయం 8 చూడండి).
తారల
స్థిర నేపథ్యం మీదుగా మార్స్, మొదలైన గ్రహాల
వ్యక్త గతికి (apparent motion) సంబంధించిన
పరిశీలనలన్నీ టైకో ఏళ్ల తరబడి చేశాడు. టెలిస్కోప్ ఆవిష్కరణకి
ముందు చేయబడ్డ ఖగోళ పరిశీలనలలో కెల్లా ఇవి అత్యంత నిర్దుష్టమైన పరిశీలనలు. ఆ గ్రహాల
చలనాన్ని అర్థం చేసుకోడానికి కెప్లర్ ఏకాగ్ర చిత్తంతో పని చేశాడు. సూర్యుడి చుట్టూ
భూమి, మార్స్ ల
వాస్తవ చలనం ఏ విధంగా ఉంటే, భూమి నుండి చూస్తున్నప్పుడు మార్స్ ప్రదర్శించే వ్యక్త గతిలో ‘తిర్యక్
చలనం’’ మొదలైన విశేషాలు కనిపిస్తాయి? మార్స్ చలనం మీద దృష్టి పెట్టమని టైకో కెప్లర్ ని అడిగాడు. ఎందుకంటే గ్రహాలు
అన్నిట్లోకి మార్స్ యొక్క వ్యక్త చలనమే
ఎంతో అసంగతంగా అనిపిస్తుంది. గ్రహాల వాస్తవ చలనం వృత్తాకారంలో జరుగుతుంది అనుకుంటే, ఆ వృత్తాలకి
మార్స్ వ్యక్త చలనంలో కనిపించే విచిత్రమైన వలయాలకి మధ్య పొందికే లేనట్టు ఉంటుంది. (అంతుపొంతూ లేని అతడి గ్రహ గతుల లెక్కల పట్ల విసుగు పుట్టిన పాఠకుడికి అతడు చేసిన విన్నపం ఇది – “నేను అవలంబించిన
ప్రయాసాత్మక విధానం చూసిన మీకు వేసట కలిగినట్లయితే, ఇక ఆ విధానాన్ని డెబ్బై
సార్లు చేసిన నా సంగతి ఒకసారి ఆలోచించండి.”)
క్రీ.పూ. ఆరవ
శతాబ్దంలో పైథాగొరాస్ గాని, ప్లేటో, టోలెమీ, ఆ తరువాత కెప్లర్
కి ముందు వచ్చిన ఇతర క్రైస్తవ ఖగోళ వేత్తలు గాని, అందరూ గ్రహ
కక్ష్యలు వృత్తాకారంలో ఉంటాయనే నమ్మారు. అనాదిగా వృత్తం
ఒక పరిపూర్ణ జ్యామితిక వస్తువుగా భావింపబడేది. కిందన ఈ ఇహలోకపు “మాలిన్యానికి” అందనంత ఎత్తులో, ఎక్కడో పైన
దివిసీమలలో సంచరించే గ్రహాలకి కూడా, ఏదో చెప్పలేని “పరిపూర్ణత” ఆపాదించబడేది. గెలీలియో, టైకో, కోపర్నికస్ లు
ముగ్గురూ సమవేగంతో సాగే వృత్తాకార చలనానికే కట్టుబడి ఉన్నారు. గ్రహగతుల విషయంలో
అలాంటి చలనం తప్ప మరే ఇతర చలనాన్నయినా “ఊహించుకోడానికే ఒళ్లు జలదరిస్తోంది” అన్నాడు కోపర్నికస్. “ఎందుకంటే పరిపూర్ణంగా తీర్చిదిద్దబడ్డ సృష్టిలో అలాంటి చలనాన్ని ఊహించుకోవడం తగని పనిలా తోచుతుంది.” కాబట్టి భూమి, మార్స్ లు
సూర్యుడి చుట్టూ వృత్తాకార కక్ష్యలలో తిరుగుతాయనే నమ్మకంతోనే ముందు కెప్లర్ తన ప్రయత్నం మొదలుపెట్టాడు.
మూడేళ్ల
కృషి తరువాత మార్స్ యొక్క వృత్తాకార కక్ష్యకి సంబంధించిన కచ్చితమైన విలువలు దొరికాయి అనిపించింది. తన అంచనాలకి, టైకో ఇచ్చిన
సమాచారంలో పది వాస్తవ పరిశీలనలకి మధ్య కేవలం రెండు కోణీయ నిముషాల దోషంతో చక్కగా సరిపోతోంది. ఒక డిగ్రీలో 60 కోణీయ నిముషాలు ఉంటాయి. అలాగే దిక్చక్రం
(horizon) నుండి ఆకాశమధ్య బిందువు (zenith) కి మధ్య కోణం 90 డిగ్రీలు, అంటే లంబకోణం. కాబట్టి కొద్దిపాటి కోణీయ నిముషాలు అంటే చాలా చిన్న దోషం అన్నమాట. ముఖ్యంగా అవన్నీ టెలిస్కోప్ లేకుండా చేసిన పరిశీలనలు అని గుర్తుంచుకోవాలి. ఇక్కణ్ణుంచి నిండు చందమామని చూసినప్పుడు దాని కోణీయ వ్యాసం (angular diameter) లో ఇది 1/15 భాగం.
కాని కెప్లర్ పారవశ్యం అంతలోనే పటాపంచలు అయ్యింది. టైకో పరిశీలనలలో
మరి రెండు పరిశీలనలకి, కెప్లర్ గణించిన కక్ష్యకి మధ్య ఎనిమిది కోణీయ నిముషాల వరకు దోషం వుంది.
“దైవానుగ్రహం
వల్ల టైకో బ్రాహే వంటి సునిశిత పరిశీలన గల శాస్త్రవేత్త మనకి దొరికాడు… ఆయన పరిశీలనల
బట్టి ఈ అంచనాలలో ఎనిమిది
నిముషాల దోషం వస్తోంది; ఇది భగవంతుడి
కానుకగా గ్రహించి కృతజ్ఞత కలిగి వుండడమే సరైన పని… ఆ
ఎనిమిది నిముషాల దోషాన్ని పట్టించుకోనక్కర్లేదు అనుకుంటే, నా సిద్ధాంతాన్ని
కొద్దిపాటి మార్పులు చేర్పులతో సమర్ధించుకునేవాణ్ణి. కాని అలా దోషాన్ని నిర్లక్ష్యం చెయ్యడం సాధ్యం కాదని నమ్మబట్టి, ఆ ఎనిమిది
నిముషాలు ఖగోళ శాస్త్రంలో సంపూర్ణ
విప్లవానికి దారి తీశాయి.”
వృత్తాకార
కక్ష్యకి, వాస్తవ కక్ష్యకి
మధ్య తేడా గుర్తించాలంటే ఎంతో సునిశితమైన పరిశీలనలు కావాలి. వాస్తవాలు ఎలా
ఉన్నా సమ్మతించే ధైర్యం కావాలి. “ప్రగాఢమైన సామరస్యాలతో ఈ విశ్వం మొత్తం
అలంకరించబడి వుంది. కాని ఆ
సామరస్యాలు వాస్తవ అనుభవంతో ఘర్షణ పడకూడదు.” వృత్తాకార కక్ష్యలని త్రోసిపుచ్చాల్సి రావడం కెప్లర్ మనసుని కలచివేసింది. భగవంతుడు జ్యామితికారుడు అనే భావన ఇప్పుడు పటాపంచలయ్యింది. ఖగోళ శాస్త్రంలో అంతవరకు రాజ్యం చేసిన వృత్తాలని, సర్పిలాని శుభ్రంగా
తుడిచేశాక ఇక మిగిలింది ఓ చిత్రమైన, సాగదీసిన
వృత్తం లాంటి ఆకృతి. కోడుగుడ్డు లాంటి
ఆకారం. ఆ ఆకారాన్ని “ఓ
పెద్ద బండెడు పేడ” అని
తిట్టిపోసుకున్నాడు కెప్లర్.
(ఇంకా వుంది)
0 comments