అయస్కాంత
శక్తి, గురుత్వం ఒకటి
కావు. కాని కెప్లర్
చేసిన సూచన ఇక్కడ నిజంగా విప్లవాత్మకం అని చెప్పుకోవాలి. భూమి మీద పని చేసే సంఖ్యాత్మక, భౌతిక ధర్మాలే, దివిసీమలని కూడా
శాసిస్తున్నాయని ఇక్కడ సూచిస్తున్నాడు. ఖగోళ చలనాల విషయంలో అధ్యాత్మిక భావాలతో ఎలాంటి సంబంధమూ లేకుండా, శుద్ధ భౌతిక
వివరణ ఇవ్వడంలో చరిత్రలో ఇదే మొదలు కాబోలు. “ఖగోళశాస్త్రం భౌతిక శాస్త్రంలో భాగమే,” నని తేల్చి చెప్పాడు కెప్లర్. కెప్లర్ చుట్టూ
చరిత్ర మలుపు తిరిగింది.
వినమ్రత, అణకువ మొదలైనవి కెప్లర్ నిఘంటువులో లేని పదాలు కాబోలు. తన ఆవిష్కరణల గురించి ఇలా చెప్పుకున్నాడు –
“ఈ
విశ్వబృందగానంతో కాలాంతం వరకు జరిగే వృత్తాంతాన్ని గంటలో ప్రదర్శించి పరమ విద్వాంసుడైన ఆ భగవంతుడి ఆనందాన్ని
రవంత రుచిచూడొచ్చు…. ఆ పవిత్ర పారవశ్యంతో
మమేకం అవుతున్నాను… నేడు పావులు కదిలిస్తున్నాను. ఈ గ్రంథ రచనకి
పూనుకుంటున్నాను. దీన్ని ఈ తరం చదివినా, భావి తరాలు చదివినా నాకు ఒకటే. దీన్ని అర్థం
చేసుకునే పాఠకుడి కోసం ఓ శతాబ్దం ఎదురుచూడమన్నా
చూస్తాను. సృష్టికర్త అయిన
దేవుడు గత 6000 వేళ్లు చేసినట్టు
సాక్షిగా నిలుస్తాను.”
కెప్లర్
ఊహించుకున్న “విశ్వబృంద గానం”లో ఒక్కొక్క
గ్రహం యొక్క వేగం, ఆ రోజుల్లో
లాటిన్ ప్రపంచంలో చలామణిలో ఉండే సంగీత స్వరాలతో (డో,
రీ, మీ, ఫా, సో, లా, టే, డో) సమానం. ఆ
స్వరావళిలో భూమికి చెందిన స్వరాలు ‘ఫా’
మరియు ‘మీ’లు. రెండూ
కలిపితే లాటిన్ పదం ‘ఫామీన్’
(famine) వస్తుంది. అంటే కరువు. ఆ ఒక్క నిషాధమైన
పదం భూమి మీద పరిస్థితిని వర్ణిస్తుంది అని వాదించాడు.
కెప్లర్
తన మూడవ నియమాన్ని కనుక్కున్న ఎనిమిదవ రోజున యూరప్ లో ముప్పై ఏళ్ల యుద్ధానికి దారి తీసిన ఒక దుర్ఘటన జరిగింది. ఆ దారుణ
యుద్ధం కొన్ని లక్షల ప్రాణాలని పొట్టనపెట్టుకుంది. దానికి ఆహుతైన వారిలో కెప్లర్ కూడా ఒకడు. సైనికులు మోసుకు
వచ్చిన ఓ అంటువ్యాధికి అతడి
భార్య, బిడ్డలు బలయ్యారు. అతడికి ఉద్యోగం ఇచ్చిన రాజు పదవీచ్యుతి పొందాడు. మత సంబంధిత
విషయాలలో పదే పదే తన వ్యక్తిత్వాన్ని చాటుకుని, స్వతంత్రించిన పాపానికి
లూథరన్ చర్చి అతణ్ణి మతం నుండి బహిష్కరించింది. కెప్లర్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. భుక్తి కోసం
దేశసంచారం మొదలెట్టాడు. క్రైస్తవ మతంలోని కాథలిక్, ప్రొటెస్టంట్ వర్గాల
మధ్య జరిగిన పవిత్ర యుద్ధంగా ఒక పక్క ఇరు
వర్గాల వాళ్లు చాటుకుంటున్నా, అది నిజానికి రాజ్య కాంక్ష కోసం కొందరు వ్యక్తులు మత మౌఢ్యాన్ని వాడుకుని చేసిన రక్తతర్పణం. గతంలో రాజుల ఖజానాలు ఖాళీ కాగానే యుద్ధాలు నిలిచిపోయేవి. కాని ఇప్పుడు ఊరు, వాడలని
కొల్లగొట్టి సేనలకి కావలసిన సరుకులు సరఫరా చేసే దోపిడీ విధానం పుట్టుకొచ్చింది. నాగళ్లని, పలుగులని, ఖడ్గాలుగా, బల్లేలుగా మలచి యుద్ధంలో వాడుకుంటుంటే యూరప్ లో పల్లెవాసులు నిస్సహాయులై ఉండిపోయారు.
మతోన్మాదం
సమాజంలో గంగవెర్రులు ఎత్తింది. అకారణమైన భయాందోళనలతో
సంఘం అతలాకుతలం అయ్యింది. ఆ మౌఢ్యానికి
ఎందరో అమాయకులు బలయ్యారు. ముఖ్యంగా వయసు
పైబడి ఒంటరిగా జీవించే స్త్రీలని మంత్రప్రయోగం చేస్తున్నారన్న నెపంతో దారుణంగా హింసించేవారు. కెప్లర్ తల్లిని రాత్రికి రాత్రి ఒక బట్టలపెట్టెలో బంధించి మోసుకుపోయారు. కెప్లర్ సొంతూరు అయిన వైల్ డెర్ స్టాట్ లో 1615 కి
1629 లకి మధ్య ఏటేటా సగటున ముగ్గురు స్త్రీలు మంత్రగత్తెలు అన్న నెపంతో హింసించి చంపబడ్డారు. వృద్ధురాలైన కెపర్ తల్లి కాథరినా అసలే కయ్యాలకోరు. ఊళ్ళోని పెద్దమనుషులతో చీటికి మాటికి పేచీ పడుతూ ఉండేది. నాటు వైద్యం
పేరుతో ఏవో మత్తు పదార్థాలు అమ్మి పొట్టపోసుకునేది. ఆమె నిర్బంధానికి ఒక విధంగా తనే కారణం అని కెప్లర్ వాపోయాడు.
ఆ దుర్ఘటనకి ఒక నేపథ్యం వుంది. విజ్ఞానాన్ని జనరంజకంగా
చెయ్యాలనే ఉద్దేశంతో కెప్లర్ ఒక కాల్పనిక వైజ్ఞానిక (science fiction, సైఫై) నవల రాశాడు. చరిత్రలో మొట్టమొదటి సైఫై రచనల్లో అదొకటి కావచ్చు. ఆ నవల
పేరు సోమ్నియమ్ (Somnium), అంటే కల. అందులో
కొందరు అంతరిక్ష యాత్రికులు చందమామ కి ప్రయాణించి అక్కడ చంద్రుడి ఉపరితలం మీద నించుని భూమిని సందర్శిస్తున్నట్టుగా ఊహించుకుని రాశాడు. చీకటి ఆకాశంలో
భూమి నెమ్మదిగా పరిభ్రమిస్తున్నట్టుగా వారికి కనిపించింది. కెప్లర్ కాలంలో భూమి తన అక్షం మీద తాను పరిభ్రమిస్తోందని జనం ఒప్పుకునేవారు కారు. ఎందుకంటే భూమి
మీద నించున్న వారికి ఆ చలనం తెలియదు
అని వారి వాదన. సోమ్నియమ్ పుస్తకంలో
భూమి పరిభ్రమణం గురించి నాటకీయంగా, మనోరంజకంగా వర్ణించి పాఠకులని
ఒప్పించే ప్రయత్నం చేస్తాడు కెప్లర్. “సమాజం పొరబడనంత కాలం, నేను సమాజం
వైపే ఉంటాను. అందుకే సత్యాన్ని
వీలైనంత మందికి తెలియజేయాలని తాపత్రయ పడుతుంటాను. (మరో సందర్భంలో ఓ ఉత్తరంలో ఇలా
రాస్తాడు – “గణిత గణనాల గానుగకి కట్టి నన్ను నిర్బంధించొద్దు – తత్వ చింతనలో కూడా ఓలలాడనివ్వండి. అదే నాకు పరమానందాన్ని ఇస్తుంది.”)[1]
టెలిస్కోప్
ఆవిష్కరణ తరువాత కెప్లర్ “చంద్ర భౌగోళిక
శాస్త్రం” అని పిలిచిన
ఓ కొత్త రంగానికి
పునాదులు పడ్డాయి. సోమ్నియమ్ లో
అతడు చంద్రుడి ఉపరితలం అంతా కొండలతో, లోయలతో నిండి
వున్నట్టు ఊహించుకున్నాడు. “అసంఖ్యాకమైన గుహలతో,
సొరంగాలతో
చిల్లులు పడి సచ్ఛిద్రంగా ఉంటుంది.” అప్పటికి కొంత కాలం క్రితమే గెలీలియో తన టెలిస్కోప్ సహాయంతో చంద్రుడి మీద కనుక్కున్న ఉల్కాబిలాలనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు కెప్లర్. అలాగే చందమామ
మీద కూడా జీవులు ఉంటారని, స్థానిక వాతావరణానికి
వాళ్లు అలవాటుపడి ఉంటారని కూడా ఊహించుకున్నాడు. చందమామ ఉపరితలం నుండీ చూస్తున్నప్పుడు నెమ్మదిగా తిరుగుతున్నట్టు కనిపించే భూమిని వర్ణించాడు. భూమి నుండీ చూసినప్పుడు చంద్రుడి మీద పేదరాసి పెద్దమ్మలు మొదలైన ఆకారాలు కనిపించినట్టే, చందమామ నుండి భూమి మీద ఖండాలని, సాగరాలని చూస్తున్నప్పుడు
వాటి రూపురేఖల్లో మానవాకారాలని చూసుకోవచ్చని వర్ణించాడు. జిబ్రాల్టర్ జల సంధి వద్ద స్పెయిన్ దేశపు దక్షిణ కొస, ఉత్తర
ఆఫ్రికాకి దగ్గరిగా వచ్చిన చోటు, పొడవాటి సుందర
అంబరాలని దాల్చిన కన్య తన ప్రియుణ్ణి ముద్దాడుతున్న సన్నివేశాన్ని తలపిస్తోందని రాశాడు. నాకైతే ఆ
చిత్రం ఇద్దరు ప్రేమికులు ముక్కులు రాసుకుంటున్నట్టు అనిపిస్తుంది.
చందమామ
మీద రేయి, పగలు బాగా
దీర్ఘంగా ఉంటాయి అని గమనించిన కెప్లర్, అక్కడ “వాతావరణ
పరిస్థితులు పరమ భీకరంగా ఉంటాయి,
విపరీతమైన
తాపానికి, విపరీతమైన శైత్యానికి
మధ్య ఊగిసలాట కనిపిస్తుంది” అని రాశాడు.
అతడు
రాసింది అక్షరాలా సత్యం. అయితే చందమామ
గురించి అతడు చెప్పినవన్నీ నిజం కాదు. ఉదాహరణకి చందమామ
మీద దట్టమైన వాతావరణం ఉంటుందని, సముద్రాలు, జీవరాసులు
ఉంటాయని రాశాడు. అవేవీ నిజం కాదు. చందమామ మీద
సర్వత్ర కనిపించే ఉల్కాబిలాల గురించి అతడు చేసిన పోలిక కాస్త విచిత్రంగా ఉంటుంది. ఉల్కాబిలాల వల్ల
చంద్రుడి ఉపరితలం “స్ఫోటకపు మచ్చలతో
వికారమైన పిల్లవాడి ముఖం” లా ఉంటుందని
రాశాడు. చంద్రుడి మీద
మనకి కనిపించే విశేషాలు గుంతలు అని, గుట్టలు కావని కూడా సరిగ్గానే గుర్తించాడు. ఎన్నో ఉల్కాబిలాల చుట్టూ ప్రాకారాల వంటి ఎత్తైన నిర్మాణాలు ఉంటాయని, కొన్ని ఉల్కాబిలాల
నడిమధ్యలో కొండలు పైకి పొడుచుకొస్తుంటాయని కూడా గమనించాడు. కాని ఆ
బిలాలు అంత తీరుగా వృత్తాకారంలో ఉండడానికి కారణం వాటిని చందమామ మీద జీవించే ప్రజ్ఞ గల జీవులే నిర్మించారని అంటాడు. కృత్రిమ నిర్మాణాలకే
అంత తీరైన ఆకారం ఉంటుందని వాదించాడు. అయితే అంతరిక్షం
నుండి నేల మీద పడే ఉల్కల వల్లే చందమామ మీద, ఇతర
గ్రహాల మీద ఆ ఉల్కాబిలాలు ఏర్పడ్డాయని, పెద్ద పెద్ద బండలు మట్టిలో పడినప్పుడు అన్నిపక్కలా సౌష్టవంగా ఉండే బిలాలు ఏర్పడే అవకాశం వుందని అతడికి తెలియదు. అవన్నీ “ఎవరో
ప్రజ్ఞ గల జీవులు చంద్రుడి మీద తవ్విన గోతులు. అలాంటి వారు
ఎందరో ఉండడం చేత తలా ఒక గొయ్యి తవ్వి ఉంటారు”
అని రాశాడు. అంతంత పెద్ద
నిర్మాణ కార్యక్రమాలు తలపెట్టడం అసాధ్యం అని విమర్శించిన వారికి ప్రతికూలంగా ఈజిప్ట్ మీద పిరమిడ్లు, చైనా గోడ
వంటి నిర్మాణాలు ఉన్నాయి కదా అని వాదించాడు. నిజానికి ఆ
నిర్మాణాలని ఇప్పటికీ అంతరిక్షం నుండి స్పష్టంగా చూడొచ్చు. జ్యామితిబద్ధమైన క్రమం ప్రజ్ఞకి
సంకేతం అన్న భావన కెప్లర్ చింతనలో కేంద్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. చంద్రుడి మీద ఉల్కాబిలాల గురించి అతడి సిద్ధాంతం ఆ తరువాత వచ్చిన ‘’మార్స్ మీద కాలువల’’ వివాదానికి పూర్వరూపం
అని స్పష్టంగా తెలుస్తోంది (అధ్యాయం 5). అన్యధరా జీవనం గురించి అన్వేషణ టెలిస్కోప్ కనిపెట్టబడ్డ తరంలోనే ఆరంభం కావడం, అదీ ఆ
కాలంలో అతి శ్రేష్ఠుడైన సైద్ధాంతికవేత్త
అలాంటి అన్వేషణకి శ్రీకారం చుట్టడం గమనార్హం.
(ఇంకా వుంది)
[1] కెప్లర్ లాగానే బ్రాహే కూడా జ్యోతిష్యానికి
వ్యతిరేకి కాడు. అయితే ఆ రోజుల్లో చలామణిలో ఉండే జ్యోతిష్యం కన్నా తన సొంత ఫక్కీలో
ఓ కొత్త జ్యోతిష్యాన్ని రూపొందించుకున్నాడు. మూఢనమ్మకాలకి ఇది మరింత దగ్గరగా ఉంటుందని
అతడి ఆలోచన. 1598 లో Astronomiae
Instauratae Mechonica అనే పుస్తకం రాశాడు.
తారాస్థానాలు కచ్చితంగా లెక్కించగలిగితే జ్యోతిష్యం ‘మనం అనుకున్న దాని కన్నా మరింత
విశ్వసనీయంగానే ఉంటుంది’ అన్నాడు. అతడు ఇంకా ఇలా రాశాడు – “నా 23 వ ఏటి నుండి ఖగోళ
శాస్త్రంలోనే కాక, పరుసవేదంలో కూడా అధ్యయనాలు చేస్తూ వస్తున్నాను.” కాని ఈ రెండు కుహనా
శాస్త్రాలలోను సామాన్య ప్రజానీకానికి సులభంగా మింగుడు పడని ప్రమాదకరమైన రహస్యాలు ఎన్నో
ఉన్నాయి. (అయితే తనని పోషించే రాజుల చేతుల్లో మాత్రం ఆ రహస్యాలు భద్రంగానే ఉంటాయన్నాడు.)
ప్రగాఢమైన జ్ఞానం శాస్త్రవేత్తల చేతుల్లోను, మతాధికారుల చేతుల్లోను మాత్రమే సురక్షితంగా
ఉంటుందని, కాబట్టి వారికే పరితమై ఉండాలనే ప్రమాదకరమైన సాంప్రదాయాన్నికి బ్రాహే కూడా
వత్తాసు పలికాడు. “వాటి వల్ల ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి వాటిని అందరితోను
పంచుకోవడం మంచిది కాదు,” అని రాసుకున్నాడు. అందుకు భిన్నంగా కెప్లర్ మాత్రం ఖగోళ శాస్త్రం
గురించి కళాశాలల్లో ఉపన్యసించేవాడు. ఖగోళశాస్త్రం గురించి విస్తృతంగా రాశాడు. తన రచనలని
ఎన్నో సందర్భాల్లో తన సొంత ఖర్చుతో ప్రచురించాడు. అది గాక కాల్పనిక విజ్ఞానం కూడా రాశాడు.
అది తన తోటి శాస్త్రవేత్తల కోసం కాక, సామాన్య ప్రజల కోసం రాశాడు. ఆధునిక దృక్పథంతో
చూసినప్పుడు కెప్లర్ ప్రముఖ వైజ్ఞానిక రచయిత అని చెప్పుకోలేకపోవచ్చు. కాని టైకోకి,
కెప్లర్ కి మధ్య గడచిన ఒక్క తరంలో వైజ్ఞానిక విషయాల పట్ల ప్రజల దృక్పథంలో వచ్చిన మార్పు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.