5 వ అధ్యాయం
ఎర్ర గ్రహంపై నీలి నీడలు
“వేలుపుల వనాలలో అతడు కాలువలని కనిపెట్టుకుని వుంటాడు.” ఎనూమా ఎలిష్, సుమర్, క్రీపూ 2500.
“కోపర్నికస్ వంటి వారు సూర్యుడు భూమి తన చుట్టూ తిప్పుకుంటూ,
దాని మీద కాంతులు కురిపిస్తూ ఉంటాడని భావించారు. మరి ఇతర గ్రహాలని కూడా అలాగే తన్ చుట్టూ
తిప్పుకుంటాడా అని సందేహం వస్తుంది…మరి ఇతర గ్రహాల మీద కూడా మన లాగానే నరులు, నివాసాలు,
వస్త్రాలు, వాహనాలు ఉంటాయా అనిపిస్తుంది. అయితే అలాంటి విషయాల గురించి శోధించడం వల్ల
ప్రయోజనం లేదని కొందరు అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటి శోధనకి అంతూ పొంతూ ఉండదు… కాని
కొంత కాలం క్రితం ఆ విషయం గురించి లోతుగా ఆలోచిస్తుంటే
అనిపించింది… అలాంటి శోధన మరీ అసాధ్యమేమీ కాదని, అందులో ఎదురయ్యే అవరోధాలు మరీ అధిగమించలేనివి
ఏమీ కాదని, ఆ విషయం మీద కొంత ఆసక్తికరమైన ఊహాగానం చేయొచ్చని అనిపించింది.”
“ఏదో ఒకనాడు మనుషులు తమ దృష్టిని మరింత దూరాలకి సారించి… భూమి
లాంటి గ్రహాలని కనుక్కోగలుగుతారు.” క్రిస్టఫర్ రెన్. ప్రారంభోత్సవ ప్రసంగం. గ్రీషమ్
కాలేజి, 1657.
ఎన్నో ఏళ్ల
క్రితం ఓ పేరుమోసిన వార్తాపత్రిక
ఓ ప్రఖ్యాత ఖగోళ
శాస్త్రవేత్తకి ఇలా ఓ టెలిగ్రామ్ పంపింది – “మార్స్ మీద జీవం ఉందా లేదా ఐదొందల పదాలతో టెలిగ్రామ్ పంపవలసినది.” అందుకా ఖగోళశాస్త్రవేత్త చాలా శ్రద్ధగా ఇలా టెలిగ్రామ్ పంపించాడట – “ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలీదు,…”
250 సార్లు. ఒక పక్క నిపుణులు తెలియదు తెలియదని అని పదే పదే మొత్తుకుంటున్నా, ఆ విషయం పట్టించుకోకుండా, మార్స్ మీద జీవం ఉన్నట్టు ఆధారాలు దొరికేశాయని కొందరు సాధికారికంగా ప్రకటనలు చెయ్యడం వింటూంటాం. కొందమందికి మార్స్
మీద జీవం ఉండాలని చాలా వుంటుంది; మరి కొందరికి
జీవం ఉండకూడదని ఉంటుంది. రెండు వర్గాలలోను
అతిశయించినవాళ్లు చాలా మంది ఉన్నారు. రెండు వర్గాల
వాళ్లు విపరీత సిద్ధాంతాన్ని పట్టుకుని వేళాడడం వల్ల, మధ్యస్థ వైఖరి
అంటే జనం విసిగిపోయారు. కాని తెలియమి, తటస్థవైఖరి వైజ్ఞానిక
ప్రయాసలో తప్పవని అర్థం చేసుకుని ఓర్పువహించడం చాలా ముఖ్యం. కొంతమందికి కచ్చితంగా
ఏదో సమాధానం కావాలి. సమాధానం ఎటువంటిది
అయినా ఫరవాలేదు. రెండు పరస్పర
విరుద్ధమైన సిద్ధాంతాలు తలలో తగాదా పడుతుంటే వాళ్లకి ఇబ్బందిగా ఉంటుంది కాబోలు. మార్స్ మీద
జీవరాశులు ఉన్నాయని బల్లగుద్ది చెప్పినవాళ్లు తీసుకున్న ఆధారాలని గమనిస్తే అవి చాలా బలహీనమైనవని తదనంతరం విచారిస్తే తెలిసింది. ఇక కొంతమంది
మార్స్ జీవరహితం అని కరాఖండిగా చెప్పేశారు. ఎందుకంటే వాళ్లు ఊహించుకున్న జీవాకృతుల కోసం గాలింపు అక్కడ విఫలమయ్యింది. ఎర్ర గ్రహం పట్ల మన అవగాహనపై నీలి నీడలు ఆవరించాయి.
మార్షియన్లు, మార్షియన్లని
ఎందుకంత గుడుసుళ్లు పడతాం? ఒక్క మార్షియన్ల
గురించే ఎందుకంత విశృంఖల ఊహాగానం జరిగింది? సాటర్నియన్ల గురించో, ప్లూటోనియన్ల గురించో ఎందుకు కలవరించం? ఎందుకంటే మార్స్
చాలా భూమి పోలికలో ఉంటుంది. మనం ఉపరితలాన్నీ
చూడగలిగే గ్రహాలలోకెల్లా అతి దగ్గరి గ్రహం. హిమావృతమైన ధృవాలు, తేలాడే తెల్లని మబ్బులు, దుమ్ము లేపే
దుమారాలు, చక్రికంగా మారుతూ
దాని ఎర్రని ముఖాన్ని మార్చే ఋతువులు, ఇవన్నీ కాక
ఇరవై నాలుగు గంటల పొడవు గల దినాలు – ఇవీ మార్స్ ప్రత్యేకతలు. ఇవన్నీ
చూశాక మార్స్ మీద జీవారాశులు ఉన్నాయేమోనన్న ఆత్రుత కలగడం సహజం. మన ఆశలకి, ఆందోళనలకి మూర్తిరూపమైన ఓ స్వప్నలోకంలా మార్స్
ని మనం తీర్చిదిద్దుకున్నాం. అయితే మన మానసిక ప్రవృత్తులు, మన ఇష్టాఇష్టాలు మన కళ్లకి గంతలు వెయ్యకూడదు. మనకి కావలసింది ఒక్కటే – శాస్త్రీయమైన ఆధారం. మరి ఆ
ఆధారాలు ఇంకా మనకి వశం కాలేదు. కాని ఎర్రని
మార్స్ ఓ మహత్తరమైన ప్రపంచం. దాని భావి అవకాశాలు దాని పట్ల మన గత భాయాలని పారద్రోలుతాయి. మన జీవితకాలంలోనే మార్స్ మీద మట్టిని తడిమాం. మన ఉనికిని
అక్కడ నెలకొలిపాం. ఒక శతాబ్దకాలపు కలలని అక్కడ సాకారం చేసుకున్నాం.
మానవ ప్రజ్ఞ
కన్నా మిన్న అయిన ప్రజ్ఞ, కాని మనిషి
లాగానే మర్త్యమైన ప్రజ్ఞ, మనని చాలా
నిశితంగా గమనిస్తోంది అంటే ఈ పందొమ్మిదవ శతాబ్దపు
చివరి ఏళ్లలో ఎవరూ నమ్మరు. మనుషులు వాళ్ల
వ్యవహారాలలో వాళ్లు నిమగ్నమై ఉంటే, వాళ్లని చాలా
క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక నీటి బొట్టులోని క్షణికమైన సూక్ష్మక్రిములని మనిషి మైక్రోస్కోప్ లో ఎలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడో అలామే మనని వాళ్లు పరిశీలిస్తున్నారు. మనుషులు ఏమీ పట్టనట్టు వాళ్ల అల్పవ్యవహారాలలో మునిగితేలుతూ ప్రపంచం అంతా సంచరిస్తున్నారు. పదార్థం మీద వాళ్ల అధిపత్యానికి అంతులేదని విర్రవీగుతున్నారు. బహుశా మైక్రోస్కోప్ లో మనం చూసే సూక్ష్మక్రిములు కూడా అలాగే అనుకుంటాయోమే. మన కన్నా వయసు పైబడ్డ అంతరిక్ష ప్రాంతాల నుండి మనకి ప్రమాదం వుందని ఎప్పుడూ అనుకోం. ఆయా ప్రాంతంలో
అసలు జీవమే ఉండడమే అసాధ్యమైనదని, ఆసంభవమని కొట్టిపారేస్తాం. ఆ వెనకటి రోజుల
మానసిక ఆచారాలని ఒక సారి తలచుకుంటే విస్మయం కలుగుతుంది. మహా అయితే మార్స్ మీద మరో రకం మనుషులు ఉంటారని అప్పుడప్పుడు మనుషులు అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్లు
మనకన్నా అధములని, మన కన్నా
బలహీనులని నమ్ముతారు. వాళ్ల వస్తే
రారమ్మని, చోద్యం చూద్దాం
లెమ్మని వాళ్లని ఆహ్వానిస్తూ ఉంటారు. పశువుల మనసులకి, మన మనసులకి మధ్య ఎంత తేడా వుందో, మన మనసుల
కన్నా అంత ఉన్నతమైన మనసులు, బృహత్తరమైన మనసులు, ప్రగాఢమైన అంతరిక్షపు సీమల నుండి నిశ్చింతగా, నిర్దయగా మనని గమనిస్తున్నాయి. నెమ్మదిగా, నిశ్చలంగా మన
సమూల వినాశనానికి వ్యూహాలు తయారుచేస్తున్నాయి.
1897 లో హెచ్. జి.
వెల్స్ రాసిన సైఫై నవల The War of the Worlds (విశ్వసంగ్రామం) లోని మొట్టమొదటి పంక్తులివి.[1] ఆ మాటల్లోని భయంకరమైన
సమ్మోహనం ఇప్పటికీ పాఠకుల మనసుల మీద పని చేస్తుంది. భూమికి అవతల
ఎక్కడో జీవం వుందన్న భయం, లేదా
ఆశ, మానవ
చరిత్రలో మొదటి నుండి మనతోనే వుంది. గత నూరేళ్లలో
ఆ భావన చీకటి
ఆకాశంలో కనిపించే ఓ మెరిసే ఎర్రని
చుక్క మీదే నిలిచింది. The War of the Worlds ప్రచురణకి మూడేళ్లకి ముందు బోస్టన్ నగరానికి చెందిన పార్సివల్ లొవెల్ అనే వ్యక్తి ఓ గొప్ప నక్షతశాల
నిర్మించాడు. అక్కడి నుండి చేసిన పరిశీలనల బట్టి మార్స్ మీద జీవానికి ఆధారాలు దొరికాయని పెద్ద పెద్ద ప్రకటనలు వెలువడ్డాయి. ఈ లొవెల్ యవ్వనంలో ఖగోళశాస్త్రం
గురించి నాలుగు ముక్కలు వంటబట్టించుకున్నాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. దౌత్యహోదాలో కొరియా సందర్శించాడు. ఇక డబ్బున్న వాళ్ల వ్యాపకాలన్నీ ఇతడికీ ఉండేవి. 1916 లో అతడు చనిపోయే ముందు గ్రహాల గురించి, వాటి పరిణామ
రహస్యాల గురించి ఎంతో విలువైన సమాచారం కనుక్కున్నాడు. విశ్వం వ్యాకోచిస్తోంది అన్న సిద్ధాంతాన్ని సమర్ధించే ఆధారాలు కొన్ని సేకరించాడు. ప్లూటో గ్రహం యొక్క ఆవిష్కరణలో ఇతడి పాత్ర ఎంతో వుంది. అందుకే ఆ
గ్రహానికి ఒక విధంగా తన పేరే పెట్టారు. ప్లూటో పేరులోని
మొదటి రెండు అక్షరాలు (P. L.) లొవెల్ పేరు (Percival Lowell) లోని మొదటి అక్షరాలు.
(ఇంకా వుంది)
[1]
1938 లో ఆ పుస్తకానికి ఆర్సన్ వెలెస్
రేడియో ప్రసంగ రూపంలో ప్రసారం చేశాడు. ఇంగ్లండ్ లో జరిగిన మార్స్ దండయాత్ర వృత్తాంతాన్ని,
అమెరికాలో తూర్పు తీరం మీదకి తెచ్చి, అప్పటికే యుద్ధంతో బెంబేలెత్తిపోయిన అమెరికాని
నిజంగా మార్షియన్లు దాడి చేసేస్తున్నారన్న భయంతో హడలగొట్టాడు.