శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

 భూమి  మీద ఉండే జీవప్రజ్ఞ జ్యామితిబద్ధమైన నిర్మాణాల ద్వార దానినది వ్యక్తం చేసుకుంటుంది. కాబట్టి లొవెల్ ఊహించిన కాలువలు మార్స్ మీద నిజంగా ఉన్నట్లయితే ప్రజ్ఞ గల జీవులు మార్స్ మీద ఉన్నారని నమ్మవలసి ఉంటుంది. ఫోటోలని బట్టి (అవి కక్ష్య నుండి తీసిన ఫోటోలే కావచ్చు) మార్స్ మీద జీవం ఉనికిని గుర్తుపట్టాలంటేఅక్కడి జీవులు మార్స్ ఉపరితలాన్ని పెద్ద ఎత్తున రూపాంతరీకరించుకోవాలి. అధునాతన సాంకేతికత గల నాగరికతలని, కాలువల తవ్వే సమాజాలని సులభంగా గుర్తుపట్టొచ్చు. కాని ఒకటి రెండు విడ్డూరమైన ఆకృతులు తప్ప, మానవరహిత ప్రోబ్ లు మార్స్ ఉపరితలాన్ని ఎంతో వివరంగా తీసిన ఫోటోలలో కూడా గొప్ప అద్భుతమైన ఆకృతులు లేవీ కనిపించలేదు. మార్స్ పరిస్థితుల గురించి ఎంతో వైవిధ్యంతో కూడిన అవకాశాలని ఊహించుకోవచ్చు. పెద్ద పెద్ద వృక్ష జంతు జాతులు ఉండొచ్చు. లేదా సూక్ష్మక్రిములతో సరిపెట్టుకోవచ్చు. లేదా నేడే కాక ఆది నుండి అది జీవరహిత గ్రహమే అయ్యుండొచ్చు


భూమి కన్నా సూర్యుడికి మార్స్ మరింత దూరంలో ఉంది కనుక ఇక్కడి కన్నా ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉంటాయి. దాని గాలి పలచగా ఉంటుంది. అధికశాతం అందులో కార్బన్ డయాక్సయిడ్  ఉంటుందికొంత నైట్రోజెన్, ఆర్గాన్ కూడా ఉంటాయి. అతి సూక్ష్మమైన పాళ్లలో నీటి ఆవిరి, ఆక్సిజన్, ఓజోన్ లు ఉంటాయి. వాతావరణంతో సంపర్కం కలిగిన, విశాలమైన జలాశయాలు మార్స్ మీద ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ వాతావరణ పీడనం ఎంత తక్కువ అంటే అతి చల్లని నీరు కూడా ఇట్టే మరిగి ఆవిరైపోతుంది. మట్టి లోపల ఎక్కడైనా సూక్ష్మమైన మోతాదుల్లో నీరు కుహరాలలో చిక్కుకుని ఉండే అవకాశం మాత్రం ఉంది. అక్కడ గాలిలో ఆక్సిజన్ ఎంత తక్కువగా ఉంటుందంటే దాన్ని పీల్చి మనిషి బతకలేడు. అక్కడ ఓజోన్ శాతం కూడా ఎంత తక్కువ అంటే మామూలుగా సూక్ష్మక్రిమి సంహారక లక్షణం గల అతినీలలోహిత కాంతి సూర్యుడి నుండి సూటిగా, నిరంతరాయంగా మార్స్ ఉపరితలం మీద పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో సూక్ష్మక్రిములు కూడా ఎలా జీవించగలవు?

ప్రశ్నని శోధించడానికి కొన్నేళ్ల క్రితం మా సహోద్యోగులు, నేను కలిసి ఒక ప్రయోగం చేశాము. మార్స్ మీద పరిస్థితులని అనుకరించేలా కొన్ని మందిరాలు తయారు చేసి, వాటిలోని భూమి మీద దొరికే సూక్ష్మక్రిములని ప్రవేశపెట్టి, అవి బతుకుతాయో లేదో గమనించాము మందిరాలకి మార్స్ జాడీలు అని పేరు. మార్స్ మీద మిట్టమధ్యాహ్నపు వేళ ఉష్ణోగ్రత నీరు ఘనీభవించే ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. తెల్లారే సమయంలో అది -80 డిగ్రీల సెల్షియస్ వద్ద ఉంటుంది. మార్స్ జాడీలలో కూడా అలాంటీ ఉష్ణోగ్రతలే కల్పించాము. అలాగే వాటిలోని గాలిలో కూడా ఎక్కువగా CO2, N2 వాయువులే ఉన్నాయి. ఆక్సిజన్ రహితమైన గాలి అది. అతినీలలోహిత లాంపులు భీకరమైన సౌరతేజాన్ని అనుకరించాయి. ఇసుకరేణువుల మీద సన్నని తడి పూత తప్ప ద్రవ రూపంలో నీరు కూడా లేదు. కొన్ని సూక్ష్మక్రిములు మొదటి రాత్రికే గడ్డకట్టుకుని చచ్చిపోయాయి. కొన్ని ప్రాణవాయువు లేక, ఊపిరాడక, ప్రాణాలు వదిలాయి. కొన్ని దాహంతో చచ్చిపోయాయి. కొన్ని తీక్షణమైన అతినీలలోహిత కిరణాలలో వ్రేలిపోయాయి. కాని ఆక్సిజన్ లేకుండా మనగలిగే ఎన్నో ధరాగత సూక్ష్మక్రిమి జాతులు ఎప్పుడూ ఉంటాయి. ఉష్ణోగ్రతలు మరీ తక్కువైతే తాత్కాలికంగా స్థబ్దుగా మారిపోయే సూక్ష్మక్రిములు కూడా ఉన్నాయి. కొన్ని అతినీలలోహిత కాంతి బారిన పడకుండా రాళ్ల అడుగున, ఇసుక పొరల్లోను తలదాచుకుని బతికి బట్టగలిగాయి. మరి కొన్ని ప్రయోగాలలో, ద్రవ్యరూపంలో నీరు ఉన్న సందర్భాలలో, సూక్ష్మక్రిముల సంఖ్య నిజానికి పెరిగింది. ధరాగత సూక్ష్మక్రిములు మార్స్ వాతావరణంలో పెరిగాయంటే, ఇక మార్స్ మీద జీవించే సూక్ష్మక్రిములలో  మరెంత సత్తా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాని అదేంటో తెలుసుకోవాలంటే ముందు మార్స్ ని చేరుకోవాలి.

సోవియెట్ యూనియన్ లో మానవరహిత గ్రహాన్వేషణ మిషన్లు ఎప్పుడూ ముమ్మరంగా కొనసాగుతూ ఉండేవి. ఒకటి, రెండేళ్లకి ఒకసారి, కెప్లర్ న్యూటన్ లు రూపొందించిన భౌతిక శాస్త్రం ప్రకారం, వీనస్, మార్స్ గ్రహాలకి, అతి తక్కువ ఇంధన వ్యయంతో అంతరిక్ష నౌకని పంపే అవకాశం వస్తుంది. 1960 నుండి కూడా యు.ఎస్.ఎస్.ఆర్. అలాంటి అవకాశాలని ససేమిరా వదలకుండా అంతరిక్షనౌకలు పంపింది. రంగంలో సోవియెట్ చూపిన పట్టుదల, సాంకేతిక కౌశలం చివరికి సత్ఫలితాల నిచ్చాయి. ఐదు సోవియెట్ నౌకలు (వెనెరా 8 నుండి 12 వరకు) వీనస్ మీద వాలి, అక్కడి నుండి విజయవంతంగా సమాచారాన్ని భూమికి పంపాయి. వీనస్ మీద ఉండే అతితీవ్ర తాపానికి, పీడనానికి, క్షయకర వాతావరణానికి తట్టుకుని అక్కడి నుండి సమాచారం పంపడం సామాన్యమైన విషయం కాదు. కాని ఎందుచేతనో మరి సోవియెట్ పంపిన అంతరిక్షనౌకలేవీ మార్స్ మీద మాత్రం విజయవంతంగా వాలలేకపోయాయి. మామూలుగా ఆలోచిస్తే మార్స్ మీద పరిస్థితులు మరింత సానుకూలంగా ఉన్నాయని అనుకోవాలి. వాతావరణం మరింత చల్లగా ఉంటుంది, గాలి మరింత పలచగా ఉంటుంది, వాయువులు మరీ అంత ప్రమాదకరమైనవి కావు. హిమావృత ధృవాలు ఉంటాయి. నారింజకాంతులు చిందే నిర్మలాకాశాలు ఉంటాయి. ఎత్తైన ఇసుక తిన్నెలు ఉంటాయి. ప్రాచీన నదీ పరీవాహక ప్రాంతాలు ఉంటాయి. లోతుతెలియని ఒక అగాధమైన లోయ ఉంటుంది. మొత్తం సౌరమండలంలోనే, మనకి తెలిసినంత వరకు, అత్యంత ఎత్తైన అగ్నిపర్వత సముదాయం ఉంటుంది. భూమధ్య రేఖా పరిసర ప్రాంతాలలో వెచ్చని గ్రీష్మాలు ఉంటాయి. వీనస్ కన్నా ఇది మరింత పృథ్వీ సదృశ గ్రహం అని నిశ్చయంగా చెప్పొచ్చు.

1971 లో సోవియెట్ పంపిన మార్స్ 3 నౌక మార్స్ వాతావరణం లోకి ప్రవేశించింది. సమయంలో అది వెనక్కి పంపిన రేడియో సందేశాల బట్టి తెలిసందేమంటే, అది కిందవాలడానికి అవసరమయ్యే వ్యవస్థ సక్రమంగా పని చేసింది, అది దాని సంక్షయ కవచాన్ని (ablation shield) సరైన పద్ధతిలో కిందికి తిప్పగలిగింది, దాని అవరోహణని అదుపు చేసే పారాచూట్ సక్రమంగానే తెరుచుకుంది, అవరోహణకి అంతంలో సక్రమంగానే దాని రెట్రో రాకెట్లు పని చేశాయి. విధంగా మార్స్ 3 పంపిన సమాచారం బట్టి అది మార్స్ గ్రహం మీద సుస్థిరంగా వాలి ఉండాలి. కాని తీరా వాలాక వ్యోమనౌక తన పరిసరాలని తీసిన 22 సెకన్ల వీడియో మాత్రమ్ భూమికి ప్రసారం చేసింది గాని, వెనువెంటనే  విచిత్ర పరిస్థితుల్లో పని చెయ్యడం ఆగిపోయింది.1973 లో ఇంచుమించు అలాంటి విచిత్రమైన పరిస్థితులే మార్స్ 6 వ్యోమనౌక విషయంలో కూడా జరిగాయి. నేల మీద వాలిన ఒక సెకనులోనే నౌక పని చెయ్యడం ఆపేసింది. ఇంతకీ ఏం జరిగిందక్కడ?

నేను మొట్టమొదట మార్స్ 3 అంతరిక్షనౌక చిత్రాన్ని సోవియెట్ స్టాంపు (దాని విలువ 16 కొపెక్కులు) మీద చూశాను. చిత్రమైన నేరేడు రంగు బురదలోకి నౌక దిగుతున్నట్టు చిత్రంలో వుంది. దుమ్ము, ఈదురు గాలులు కూడా చిత్రంలో వ్యక్తం చెయ్యాలని చిత్రకారుడు ప్రయత్నిస్తున్నాడు అనుకుంటా. గ్రహవ్యాప్తంగా పెద్ద దుమారం రేగుతున్న సమయంలో మార్స్ 3 మార్స్ వాతావరణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. అమెరికా పంపిన మారినర్ 9 మిషన్ నుండి అందిన సమాచారం బట్టి దుమారంలో 140 కిమీ/సెకను వేగంతో గాలులు వీచాయని తెలిసింది. అంటే మార్స్ మీద శబ్ద వేగంలో సగం కన్నా హెచ్చు వేగం అన్నమాట. దీన్ని బట్టి మేము, మా సోవియెట్ మిత్రులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. పారాచూట్ తెరుచుకోవడం వల్ల అనుకున్నట్లే మార్స్ 3 అంతరిక్ష నౌక నిలువు దిశలో నెమ్మదిగానే దిగింది, గాని గాలుల తాకిడి వల్ల అడ్డు దిశలో అధిక వేగంతో కదులుతూ కిందికి దిగి వుంటుంది. పెద్ద పారాచూట్ ఆసరాగా కిందికి దిగుతున్న వ్యోమనౌక వాలుగా వీచే గాలుల ప్రభావానికి సులభంగా లొంగుతుంది. అలాంటి పరిస్థితుల్లో నేల మీద వాలిన మార్స్ 3 బండనో ఢీకొని, పక్కకి ఒరిగి, భూమితో రేడియో లింకును పోగొట్టుకుని ఉంటుంది.

కాని అసలు మార్స్ 3 అంత పెద్ద దుమారంలో గ్రహం మీద వాలడానికి ఎందుకు ప్రయత్నించింది? మార్స్ 3 యొక్క ప్రణాళిక అంతా లాంచ్ కి ముందే పూర్తిగా నిశ్చయించబడింది. అది చేపట్టవలసిన ప్రతీ చర్య దాని ఆన్ బోర్డ్ కంప్యూటర్ లో అది భూమి నుండి బయల్దేరక ముందే ప్రోగ్రాం చెయ్యబడింది. ఒక సారి లాంచ్ జరిగాక ప్రోగ్రాం ని మార్చే ప్రసక్తే లేకపోయింది. 1971లో అంత పెద్ద దుమారం మార్స్ ఉపరితలాన్ని అతలాకుతలం చేస్తున్నా ప్రోగాం ను మార్చకుండా దూరం నుండి  చూస్తే ఉండిపోవాల్సిన అశక్తత నెలకొంది. అంతరిక్ష అన్వేషణా పరిభాషలో చెప్పాలంటే మార్స్ 3 ని ముందే ప్రోగ్రాం చేశారు, దాని పనితీరులో సందర్భోచితమైన సవరణకి వీలులేక పోయింది. మార్స్ 6 విఫలం కావడానికి కారణాలు ఇంమ్కా విచిత్రంగా అనిపిస్తాయి. నౌక మార్స్ వాతావరణం లోకి ప్రవేశించినప్పుడు గ్రహ వ్యాప్తమైన దుమారం లాంటిది ఏమీ లేదు. అలాగే అది నేల మీద వాలిన చోట స్థానికంగా ఏదైనా దుమారం ఉండొచ్చని అనుకోడానికి కూడా లేదు. బహుశా సరిగ్గా నేల మీద వాలిన క్షణంలోనే ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడి ఉండొచ్చు. అసలు మార్స్ ఉపరితలం మీద మనకి తెలియని ప్రమాదం ఏదో పొంచి ఉండొచ్చు.

 

మార్స్ 3 మిషన్







(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts