శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

  

వైకింగ్ 1 విషయంలో, ఆర్బిటర్ తీసిన చిత్రాల బట్టి, భూమి నుండి ఆఖరి నిముషంలో తీసుకున్న రాడార్ పరిశీలనల బట్టి, మొదట అనుకున్న లాండింగ్ స్థానం మాకు చాలా ప్రమాదకరంగా అనిపించింది. వెనకటికి ఎగిరే డచ్ దేశస్థుడి కథలోలా, వైకింగ్ శాశ్వతంగా మార్స్ చుట్టూ ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉండాలని దాని తలరాతలో ఉందా అని కొంత బాధపడ్డాను కూడా. కొంత గాలింపు తరువాత మరో సముచితమైన లాండిగ్ స్థానం దొరికింది. ఇది కూడా క్రైసే ప్రాంతంలోనే వుంది గాని, సరిగ్గా నాలుగు కాలువల సంగమ స్థానంలో కాక, అక్కడికి కాస్త దూరంలో వుందిది. కారణం చేత ముందు ఆశ పడ్డట్టు, జూలై 4, 1976 లో వైకింగ్ ని మార్స్ మీద దింపలేకపోయాం. అయినా తొందరి పడి దింపినా, అది కాస్తా కూలిపోతే, అది అమెరికా దేశం యొక్క ద్విశతవార్షిక పుట్టిన రోజు తగ్గ కానుక కాలేదు కనుక మించిపోయిందేమీ లేదని సరిపెట్టుకున్నాము. నాటికి మరో పదహారు రోజుల తరువాత వైకింగ్ లాండర్ కక్ష్యని వదిలి మార్షియన్ వాయుమండలంలోకి ప్రవేశించింది.


ఏడాదిన్నర పాటు సుదీర్ఘ గ్రహాంతర యానం చేసి, నూరు మిలియన్ కిలోమీటర్ల దూరం సూర్యుడి చుట్టూ ప్రయాణించిన తరువాత, వైకింగ్ ఆర్బిటర్-లాండర్ జంటలు మార్స్ చుట్టూ సరైన కక్ష్యలోకి ప్రవేశించాయి. ఆర్బిటర్ లు మార్స్ చుట్టూ కక్ష్యలో తిరిగి మార్స్ చుట్టూ తగిన లాండింగ్ స్థానాలని బేరీజు వేశాయి. తగిన సమయంలో లాండర్ లు రేడియో ఆదేశాలని అనుసరిస్తూ మార్స్ వాయుమండలంలోకి ప్రవేశించాయి. వాటి సంక్షయ కవచాలు సరైన దిశలోనే తిరిగాయి, వాటి పారాచూట్లు సరిగ్గానే తెరుచుకున్నాయి, వాటి పై తొడుగులు సరిగ్గానే ఊడిపడి నేలరాలాయి, వాటి రెట్రో రాకెట్లు సరిగ్గా మండాయి. క్రైసే లోను, యుటోపియాలోను కూడా మానవ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఎర్ర గ్రహం మీద సుతిమెత్తగా, సురక్షితంగా నేలమీద వాలింది. మార్స్ లాండింగ్ లో సాధించిన విజయాల వెనుక వైకింగ్ నౌక రూపకల్పనలో, నిర్మాణంలో, పరిక్షలోను, దిశానిర్దేశంలోను ప్రదర్శించబడ్డ అసమాన ప్రతిభ కారణం అని అనుకున్నా, మార్స్ వంటి ప్రమాదకరమైన, విచిత్రమైన గ్రహం మీద వాలడానికి అదృష్టం కూడా కలిసి రావడం ఎంతో ముఖ్యం  అనిపిస్తుంది.


మార్స్ మీద వాలిన మరుక్షణం అక్కడి నుండి తీసిన చిత్రాలు భూమికి ప్రసారం అయ్యాయి. మేం ఎంచుకున్న స్థలాలు అవిశేషమైనవని ముందే తెలుసు. కాని మనసులో ఆశ చావలేదు. వైకింగ్ 1 లాండర్ తీసుకున్న మొట్టమొదటి చిత్రం దాని కాలి పాడ్ కి చెందిన చిత్రం. దాని కాళ్లు కారణం చేతనైనా మట్టిలో కూరుకుపోతే సంగతి మాకు లాండర్ పూర్తిగా భూస్థాపితం కాకముందే తెలియాలిమా ఎదురుగా తెర మీద మార్స్ నుండి ప్రసారమైన చిత్రం క్రమంగా ఏర్పడుతుంటే ఉత్క్లంఠతో కనార్పకుండా చూశాం. మార్స్ లాండర్ యొక్క పాదం మట్టిలో కాకుండా గట్టి నేల మీద మోపి ఉండడం చూడగానే మా అందరికీ ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. అనతికాలంలోనే మరిన్ని చిత్రాలు ఒక్కొక్కటిగా భూమికి ప్రసారం అయ్యాయి.



మార్స్ మీద నింగి, నేల కలిసే అంచుని లాండర్ తీసిన మొదటి చిత్రాన్ని చూడగానే నేను దిగ్ర్భాంతి చెందాను. అదేదో అలౌకిక ప్రపంచం కాదు. ఇలాంటి ప్రదేశాలని నేను కొలరాడో లోను, ఆరిజోనాలోను, నెవాడా లోను చూశాను. అక్కడ కనిపించే శిలలు, ఇసుక తిన్నెలు చూస్తుంటే ఏవో పోలికలు మనసులో మెదులుతున్నాయి. భూమి మీద కనిపించే ఎన్నో దృశ్యాలకి మల్లె అతి సామాన్యంగా ఉందా దృశ్యం. అయితే నెరిసిన గడ్డంతో, గాడిమీదెక్కి, బంగారం కోసం దేవుళ్ళాడే ప్రాస్పెక్టరో దేవుళ్ళా ప్రత్యక్షమైతే ఆశ్చర్యపడాలి గాని, అక్కడి నేల రూపురేఖలు చూస్తే మాత్రం ముందు అనుకున్నంత ఆశ్చర్యం కలగలేదు. ఇందుకు భిన్నంగా వెనెరా 9, 10 నౌకలు పంపిన  వీనస్ చిత్రాలని కూడా ఎన్ని గంటల పాటు చూసినా అలా మామూలుగా అనిపించలేదు. ఎలా చూసినా మార్స్ మీద ఏదో ఒకనాడు మనం పాదం మోపవలసిన లోకమేనని క్షణమే మనసులో బలంగా ముద్ర పడింది.
 
మార్స్ భూతలం ఎండుగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఎనలేని సోయగంతో వెలిగిపోతుంటుంది. అల్లంత దూరాన ఏనాడో ఏర్పడ్డ ఉల్కాబిలం లోంచి చివ్వున ఎగజిమ్మబడ్డ బండరాళ్లు. మరలామరలా మట్టి పూత వేయబడ్డ మహాశిలలు. గ్రహతలమంతా సవారి చేసే ప్రళయభీకర సమీరాలు మోసుకుపోయే సన్నని రజనులాంటి ఇసుక. రాళ్లన్నీ ఎక్కణ్ణుంచి వచ్చాయి? గాలి ఎంత ఇసుకని మోసుకుపోతుంది? వక్కలైన రాతి ముక్కలని, పూడుపోయిన బండలని, నేలలో తీరుగా దొలిచిన గోతులని మలచాలంటే లోకంలో ఎన్ని యుగాలు గడిచి వుంటాయో? పొడిగా మారిన రాళ్లే ఇసుకగా మరాయా? ఆకాశం గులాబి వన్నెలో ఎందుకు ఉంటుంది? గాలిలో ఏముంటుంది? నిలుపు లేని గాలుల వేగం ఎంత? భూకంపాలలో అంగారకకంపాలూ ఉంటాయా? ఋతువులు మారుతుంటే వాతావరణ పీడనం, నేల రూపురేఖలు ఎలా మారుతాయి?


ప్రశ్నలన్నిటికీ వైకింగ్ కచ్చితమైన సమాధానాలు ఇచ్చింది. లేని పక్షంలో సమంజసమైన వివరణలు ఇచ్చింది. వైకింగ్ మిషన్ల లాండింగ్ స్థలాలు ముందు అవిశేషంగా ఉన్నాయనుకున్నాం గాని, తీరా సమాచారాన్ని విశ్లేషిస్తే అవి ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి. కాని షియాపెరెల్లీ ఊహించుకున్న కృత్రిమ కాలువలేవీ ఫోటోలలో కనిపించలేదు. బార్సూమ్ కథలలో కనిపించే చిట్టి విమానాలు గాని, ఛురకత్తులు గాని, రాకుమార్తెలు గాని, రాకాసులు గాని, లేరు. చిత్రమైన కాలి గుర్తులు గాని, బ్రహ్మజెముడు మొక్కలు గాని, ఆఖరుకి ఎడారి ఎలుక గాని లేవు. మాకు కనిపించినంత వరకు మార్స్ మీద జీవపు ఛాయలు ససేమిరా లేవు.[1]


మార్స్ మీద మహా మృగాలు ఉన్నాయేమో మరి తెలియదు. కాని అవి మేము పరిశీలించిన రెండు లాండింగ్ స్థలాలలో మాత్రం లేవు. మహా మెకాలు కాకపోయినా బండల మాటున, ఇసుక రేణువుల మధ్యన సూక్ష్మ క్రిములెన్నో ఉండి ఉండొచ్చు. పృథ్వీ చరిత్రలో కూడా, నీరు లేని ఎన్నో ప్రాంతాలు ప్రస్తుతం మార్స్ ఉన్నట్టే ఉండేవి. ఇక్కడ కూడా ఒకప్పుడు వాతావరణంలో కార్బన్ డయాక్సయిడ్ పుష్కలంగా ఉండేది. ఓజోన్ విరహితమైన వాయుపొరని ఛేదించుకుంటూ తీక్షణమైన అతినీలలోహిత కాంతులు నేలని వ్రేలుస్తూ ఉండేవి. పృథ్వీ చరిత్రలో ఆఖరు 10 శాతం కాలం పాటు మాత్రమే మొక్కలు, మెకాలు నేలని ఆక్రమించాయి. కాని మూడు బిలియన్ ఏళ్ల పాటు భూమి మీద ప్రతీ చోట సూక్ష్మక్రిములు విలసిల్లాయి. మార్స్ మీద జీవం కోసం వెతకాలంటే సూక్ష్మక్రిముల కోసం వెతకాలి.


వైకింగ్ లాండర్ మానవ సామర్థ్యాలని అన్య ప్రపంచాలకి విస్తరింపజేస్తోంది. ఒక విధంగా చూస్తే వైకింగ్ లాండర్ తెలివితేటలు ఒక తూనీగకి ఉండే పాటి తెలివితేటలని మించి ఉండవని చెప్పుకోవచ్చు. మరో విధంగా చూస్తే బాక్టీరియా కణానికి ఉండేపాటి తెలివితేటలు లాండర్ కి వున్నాయి. అలాగని దాని తెలివితేటల్ని కించపరుస్తున్నామని కాదు. ఒక బాక్టీరియమ్ ని పరిణమింపజేయడానికి ప్రకృతికి కొన్ని వందల మిలియన్ల సంవత్సరాలు పట్టింది. ఒక తూనీగని నిర్మించడానికి కొన్ని బిలియన్ల సంవత్సరాలు పట్టింది. ఇలాంటి వ్యవహారంలో ఎంతైనా మన అనుభవం కాస్త తక్కువే. కాని త్వరగానే నైపుణ్యం సంపాదిస్తున్నాం. మనలాగే వైకింగ్ కి కూడా రెండు కళ్లు ఉంటాయి. పైగా అవి పరారుణ కాంతులని కూడా చూడగలుగుతాయి. మరి మన కళ్లకి అలాంటి కళలు లేవు. రాళ్లని కదిలించి, నేలని తవ్వి, మట్టిని సేకరించగల ఒక భుజం కూడా వుంది. గాలి వేగాన్ని, దిశని కొలవగల వేలు వంటి హంగు కూడా వుంది. అతి సూక్ష్మమోతాదుల్లో దొరికే రసాయనాలని కూడా కొలవగల ఒక ముక్కు వంటి, లేదా నాలుక వంటి అంగం కూడా వుంది. అది మన ముక్కు కన్నా, నాలుక కన్నా సునిశితమైనది. అంగారకకంపాలని వినగల చెవి కూడా వుంది. చెవి గాలి తాకిడికి అంతరిక్షనౌకలో పుట్టే సున్నితమైన కంపనాన్ని కూడా గుర్తుపట్టగలదు. ఇవి గాక సూక్ష్మక్రిములని కనిపెట్టగల యంత్రజాలం కూడా వుంది. అంతరిక్షనౌకలో ఒక రేడియో థార్మిక శక్తి మూలం కూడా వుంది. దాని నుండి ఇక బాహ్య శక్తి మూలం నుండి ఆధారపడకుండా కావలసినంత శక్తి పుడుతుంది. అంతరిక్షనౌక అది సేకరించిన సమాచారాన్ని అంతటినీ ఎప్పటికి అప్పుడు భూమికి రేడియో సంకేతాల ద్వార ప్రసారం చేస్తుంటుంది. అలాగే భూమి నుండి వచ్చే ఆదేశాలని కూడా అది విని అమలు చేస్తుంటుంది. అది పంపిన సందేశాలని భూమి పుత్రులు విని, అర్థం చేసుకుని, ఇవి కాక ఇంకా ఏవైనా కొత్తగా చెయ్యమని అభ్యర్థిస్తూ ఉంటారు.


అయితే పరిమాణం మీద, వ్యయం మీద, ఇంధనం మీద ఇన్ని పరిమితులు పెట్టుకుని, మార్స్ గ్రహం మీద సూక్ష్మక్రిముల కోసం గాలించడానికి అత్యంత శ్రేష్ఠమైన పద్ధతి అంటూ ఏదైనా వుందా? ఇక్కడి నుండి అక్కడికి సూక్ష్మజీవశాస్త్రవేత్తలని (microbiologists)  ప్రస్తుతానికైతే పంపడానికి వీలుపడదు. నాకు ఒకప్పుడు వొల్ఫ్ విష్నియాక్ అనే స్నేహితుడు ఉండేవాడు. అతడొక గొప్ప సూక్ష్మజీవశాస్త్రవేత్త. అతడు న్యూ యార్క్ లో యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ లో పని చేసేవాడు. 1950 లలో అప్పుడే మేము మార్స్ మీద జీవఛాయల కోసం వెతికే ప్రయత్నాల గురించి ఆలోచిస్తునాం. సందర్భంలో నా మిత్రుడు విష్నియాక్ వైజ్ఞానిక సమావేశానికి హాజరు అయ్యాడు. సమావేశంలో ఖగోళశాస్త్రవేత్త చేసిన వ్యాఖ్య నా మిత్రుణ్ణి చాలా ప్రభావితం చేసింది. ఇప్పటికి కూడా సూక్ష్మక్రిమిని విశ్వసనీయంగా గుర్తుపట్టగలిగే యంత్రం కూడా లేకపోవడం జీవశాస్త్రంలో తీరని లోటు అన్నాడా ఖగోళశాస్త్రవేత్త. అది విన్న విష్నియాక్ సమస్యకి ఏదైనా పరిష్కారం ఆలోచించాలని నిశ్చయించుకున్నాడు.


 ఇతర గ్రహాలకి పంపదగ్గ చిన్న పరికరాన్ని తయారు చేశాడు. అతడి మిత్రులు దానికి వొల్ఫ్ ట్రాప్ (Wolf Trap)  అని పేరు పెట్టారు. అందులో కర్బన రసాయనాల రూపంలో కొన్ని పౌష్టిక పదార్థాలు ఉన్న చిన్న సీసా లాంటిది ఉంటుంది. అందులో మార్స్ మన్నుని కాస్తంత కలపబడుతుంది. మన్నులో సూక్ష్మక్రిములు ఏవైనా ఉంటే సీసాలోని ద్రవం యొక్క రూపురేఖల్లో నెమ్మదిగా మార్పులు వస్తాయి. మరో మూడు సూక్ష్మజీవశాస్త్ర ప్రయోగాలతో పాటు వొల్ఫ్ ట్రాప్ ని వైకింగ్ లాండర్ తో పాటు మార్స్ కి ప్రయాణించడానికి ఎంపిక చేశారు. మిగతా మూడు ప్రయోగాలలో రెండు ప్రయోగాలు మార్స్ జీవుల కోసం కాస్తంత ఆహారాన్ని తీసుకుపోవాలని నిశ్చయించుకున్నాయి. వొల్ఫ్ ట్రాప్ పరికరం పని చెయ్యాలంటే మార్స్ కి చెందిన సూక్ష్మక్రిములకి నీరు అంటే ఇష్టం ఉండాలి. విష్నియాక్ పరికరం పాపం బుల్లి మార్షియన్లని ముంచేయడానికి తప్ప ఎందుకూ పనికిరాదని కొందరు మాటలన్నారు. విష్నియాక్ పరికరంతో ఒక లాభం ఏమిటంటే అందులో పడ్డ సూక్ష్మక్రిములు ఆహారంతో ఏం చేస్తాయి అన్న విషయం ముఖ్యం కాదు. ఆహారాన్ని సేవించి అవి ఎదగాలంతే, వాటి సంఖ్య పెరగాలంతే. కాని తక్కిన ప్రయోగాలన్నీ మార్స్ సుక్ష్మక్రిములు ప్రయోగాలలో ఏర్పాటు చెయ్యబడ్డ ఆహారాన్ని సేవించడం వల్ల పుట్టే వాయువుల గురించి కొన్ని నమ్మకాల మీద ఆధారపడ్డాయి. అయితే అవి పెద్దగా వైజ్ఞానిక ఆధారాలు లేని పెళుసైన నమ్మకాలు.
 
అమెరికాలో గ్రహాంతర యాన కార్యకలాపాలని నడిపించే National Aeronautics and Space Administration (NASA) సంస్థలో అనుకోకుండా ఎన్నో సార్లు బడ్జెట్ మీద వేటు పడుతూ ఉంటుంది. బడ్జెట్ అనుకోకుండా పెరిగే సందర్భాలు మాత్రం చాలా అరుదు. నాసా సంస్థ చేసే వైజ్ఞానిక పరిశోధనలకి ప్రభుత్వం నుండి పెద్దగా మద్దతు దొరకదు. నాసా నుండి ఎప్పుడైనా నిధులు తొలగించాలంటే ముందు వైజ్ఞానిక ప్రయోజనాల కోసం కేటాయించిన నిధుల మీదే అందరి కళ్లూ పడతాయి. 1971 లో వైకింగ్ మిషన్లో వెళ్లాల్సిన నాలుగు సూక్ష్మజీవశాస్త్ర ప్రయోగాలలో ఒక దాన్ని తొలగించాలని పై నుండి ఆదేశం వచ్చింది. దెబ్బకి వొల్ఫ్ ట్రాప్ ని పక్కకి తప్పించడం జరిగింది. అది విన్న విష్నియాక్ నీరుగారిపోయాడు. దాని రూపకల్పనలో అతడు పన్నెండేళ్ల పాటు పడ్డ కష్టం అంతా బూడిద పాలయ్యింది.
 
(ఇంకా వుంది)



[1] క్రైసే ప్రాంతంలో ఓ చిన్న బండ మీద B  అక్షరం ఆకారపు గుర్తు ఒకటి కనిపించగానే చిన్న సంచలనం మొదలయ్యింది. కాని దానికి కారణం వెలుగు, నీడల మధ్య దోబూచులాటేనని, వాస్తవంలో లేని దాన్ని ఊహించుకుని విభ్రాంతి చెందే మనిషి మనసేనని తరువాత తెలిసింది. అయినా లాటిన్ అక్షరాలని మార్షియన్లు స్వతంత్రంగా కనుక్కోగలగడం కూడా కాస్త విడ్డూరంగా  ఉంటుంది. ఆ వార్త విన్నప్పుడు మాత్రం నా చిన్నతనంలో విన్న బార్సూమ్ అన్న పదం కాసేపు నా ఎద కనుమలలో మారుమ్రోగింది.

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts