శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

వాయేజర్ 2 యాత్రా పత్రిక

Posted by V Srinivasa Chakravarthy Saturday, September 24, 2022

 

వాయేజర్ మిషన్ల లో మనుషులే ఉండి ఉంటే నౌక కెప్టెన్ యాత్రాపత్రిక నడిపిస్తూ ఉండేవాడు. వాయేజర్ 1, 2 లలో జరిగిన సంఘటనల సంకలనాన్ని వర్ణించే యాత్రా పత్రిక ఇలా ఉంటుందేమో.

 1 రోజుపరికరాలలో దోషాలు ఉన్నాయని ఆఖరి నిముషంలో తెలిశాక ఆందోళన పడుతూనే కేప్ కెనావరల్ నుండి లిఫ్ట్ ఆఫ్ అయ్యి గ్రహాల, తారల దిశగా దూసుకుపోయాం.

2 రోజుసైన్స్ ప్రయోగాల వేదికని పట్టుకునే బూమ్ ని ప్రయోగించడంలో సమస్య వచ్చింది. సమస్యని గాని పరిష్కరించకపోతే మా చిత్రాలు, తదితర వైజ్ఞానిక సమాచారాన్ని పోగొట్టుకున్నట్టే.

13 రోజువెనక్కు తిరిగి చూసి అంతరిక్షంలో భూమి, చందమామలని పక్కపక్కగా చూసి సుందర దృశ్యాన్ని ఫోటో తీశాం. చూడచక్కని జంట.

150 రోజుమధ్యంతర కక్ష్య సవరణ కోసం ఇంజిన్లు కాసేపు మండాయి.

170 రోజుసాధారణ నిర్వహణా కార్యక్రమాలు. కొన్ని నెలలు  చీకూచింతా లేకుండా గడచిపోయాయి.

185 రోజు విజయవంతంగా తీసిన జూపిటర్ క్రమాంకన చిత్రాలు

207 రోజుబూమ్ సమస్య పరిష్కరించబడింది. ముఖ్య రేడియో ట్రాన్స్మిటర్ విఫలమయ్యింది. బాకప్ ట్రాన్స్మిటర్ ని పన్లోకి దింపాము. అది కూడా విఫలమైతే మా నుండి ఇక భూమికి ఎప్పుడూ సమాచారమూ అందదు.

215 రోజుమార్స్ కక్ష్యని దాటాము. సమయంలో మార్స్ గ్రహం సూర్యుడికి అవతలి వైపు వుంది.

295 రోజుఉల్కాశకల వలయం లోకి ప్రవేశించాం. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద బండలు గిరికీలు కొడుతూ అంతరిక్షంలో కొట్టుకుపోతున్నాయి. వాటిలో చాలా వాటికి ఇంకా పేర్లు పెట్టలేదు. వాటి మీద నిఘా ఉంచమని మనుషుల్ని పెట్టాను. నౌక వాటిని గుద్దుకోకుండా జాగ్రత్తపడాలి.

475 రోజుప్రధాన ఉల్కాశకల వలయం లోంచి బ్రతుకు జీవుడా అని బయటపడ్డాం.

570 రోజుజూపిటర్ ఆకాశంలో క్రమంగా పెద్దదవుతోంది. ఇంతవరకు భూమి మీద అతి పెద్ద టెలిస్కోప్ లు కూడా చూడలేనంత వివరంగా గ్రహం ఇప్పుడు మాకు కనిపిస్తోంది.

615 రోజుజూపిటర్ గ్రహమంతా వ్యాపించిన బృహత్తరమైన వాతావరణ వ్యవస్థ, అల్లకల్లోలమైన దాని మేఘమండలంఇవన్నీ చూస్తూ మంత్రముగ్ధులం అయ్యాము. బ్రహ్మాండమైన గురుగ్రహపు పరిమాణం చూసి అబ్బురపోయాము. మిగతా అన్ని గ్రహాలని కలపగా ఏర్పడ్డ రాశికి రెండు రెట్లు ద్రవ్యరాశి గల గ్రహమది. అక్కడ కొండలు, లోయలు, అగ్నిపర్వతాలు,  నదులుఇవేవీ లేవు. నేలకి, నింగికి మధ్య సరిహద్దు లేదు. సాంద్రమైన వాయు, ధూళి మేఘాల సమూహం దాని వాతావరణం. ఉపరితలమే లేని వింత ప్రపంచం. జూపిటర్ మీద మనకి కనిపించేదంతా దాని ఆకాశంలో తేలుతూ కనిపిస్తుంది.

630 రోజుజూపిటర్ వాతావరణం మిరుమిట్లు గొల్పుతోంది. ఇంత భారీ గ్రహం దాని అక్షం మీద ఒకసారి పది గంటల కన్నా తక్కువ సమయంలోనే తిరుగుతుంది. అతివేగవంతమైన దాని ఆత్మభ్రమణం, సౌరశక్తి, గ్రహపు అంతరాళం లోంచి పైకి తన్నుకొస్తున్న తాపం శక్తులన్నీ కలిసి దాని ఉధృతమైన వాతావరణాన్ని అదిలిస్తున్నాయి.

 

640 రోజుమేఘాల ఆకృతులు అసామాన్యంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి. వాన్ గో (Van Gogh)  చిత్రించిన Starry Night చిత్రం గుర్తొస్తోంది.  విలియమ్ బ్లేక్, ఎడ్వర్డ్ మంచ్ కృతులని తలపిస్తున్నాయి. కాని అది కొద్దిగానే. ఎందుకంటే ఇలాంటి చిత్రాలు వేసిన చిత్రకారుడు ఇంతవరకు లేడు. ఎందుకంటే వాళ్లెవరూ కూడా మన భూమిని  ఎప్పుడూ విడిచిపెట్టలేదు.  భూమి మీదే బందీగా మిగిలిన చిత్రకారుడు ఎవడూ ఇంతవరకు అలాంటి అలౌకికమైన, అపూర్వమైన సౌందర్యాన్ని ఊహించి ఉండడు.

 

బృహస్పతిని అలంకరించే  పలువన్నెల వలయాలు ఇప్పుడు మరింత దగ్గరగా కనిపిస్తున్నాయి. తెల్లని చారలు బహుశా అమోనియా స్ఫటికాలతో నిండిన మబ్బులు కావచ్చు. కాస్త గోధుమ వన్నె చారలు వాతావరణంలో మరింత వేడెక్కిన, లోతైన భాగాలు కావచ్చు. నీలపు భాగాలు పైన తేలే మబ్బుల్లో ఏర్పడ్డ పెద్ద రంధ్రాలు. వాటి లోంచి చూస్తే నిర్మలాకాశం కనిపిస్తుంది.

 

జూపిటర్ మీద సర్వత్ర కనిపించే ఎరుపు-గోధుమ రంగుల మిశ్రమానికి కారణం తెలియదు. బహుశ ఫాస్ఫరస్, సల్ఫర్ లకి సంబంధించిన రసాయ చర్యలే దానికి కారణం కావచ్చు. బృహస్పతి వాతావరణంలో ఉండే మీథేన్, అమోనియా, నీరు మొదలైన పదార్థాల మీద సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు పడినప్పుడు అణువులు విచ్ఛిన్నమై రంగురంగుల, సంక్లిష్టమైన కర్బన రసాయనాలు పుట్టి ఉండొచ్చు. ఎరుపు-గోధుమ రంగుకి కారణం అణువులే కారణమై ఉండొచ్చు. అదే నిజమైతే భూమి మీద నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం జీవం పుట్టుకకి కారణమైన రసాయన చర్యలే ఇప్పుడు జూపిటర్ మీద జరుగుతున్నాయి అన్నమాట.

 

647 రోజుపెద్ద ఎర్రని బొట్టు. పెద్ద వాయు స్తంభం ఇరుగు పొరుగు మబ్బుల కన్నా ఎంతో ఎత్తుకి ఎగజిమ్ముతోంది. అందులో అరడజను భూములు పట్టేస్తాయేమో. మరింత లోతుల్లో పుట్టే సంక్లిష్టమైన అణువులని అది పైకి తెస్తోంది కనుకనే అది ఎర్రగా కనిపిస్తోందేమో. కొన్ని కోట్ల సంవత్సరాలుగా సాగుతున్న ప్రయళభీకర తుఫాను అందులో నాట్యం చేస్తోంది.

650 రోజుబృహస్పతితో సమాగమం. అద్భుతమైన అనుభవం. జూపిటర్ యొక్క వికిరణ వలయాలల (radiation belts)  లోంచి విజయవంతంగా, సురక్షితంగా ప్రయాణించాము. ప్రయాణంలో మా అదృష్టం బాగుండి కేవలం ఒకే ఒక పరికరం నాశనం అయ్యింది. దాన్ని ఫాస్ఫో పోలారిమీటర్ (phosphopolarimeter) అంటారు. జూపిటర్ చుట్టూ ఉండే వలయాల తలాన్ని (ring plane) విజయవంతంగా  దాటాము. ఇటీవలే కనుక్కోబడ్డ జూపిటర్ వలయాలలో ఉండే రేణువులతో గాని, బండలతో గాని ఢీకొనకుండా సురక్షితంగా దాటగలిగాము. జూపిటర్ ఉపగ్రహాలలో ఒకటైన అమాల్తియా (Amalthea)  ని చక్కని చిత్రాలు తీశాము. ఇదో చిన్ని, ఎర్రని ప్రపంచం. జూపిటర్ వికిరణ వలయాల హృదయంలో ఉంటుందిది. అలాగే పలువన్నెల అయో (Io)  ని  కూడా చూశాము. యూరోపా మీద గజిబిజి గీతలని తిలకించాము. గానిమీడ్ మీద సాలీడు గూళ్ల వంటి రేఖా విన్యాసాలని సందర్శించాము. కాలిస్టో మీద పలువర్ణాల, విశాల పల్లపు ప్రాంతాన్ని పరిశీలించాము. కాలిస్టో చుట్టూ తిరిగి, జూపిటర్ చందమామలలో కెల్లా పెద్ద కక్ష్య కలిగిన జూపిటర్ 13 కక్ష్యని దాటాము. బృహస్పతికి వీడ్కోలు చెప్పాము.

 

662 రోజుమా పార్టికిల్ డిటెక్టర్ లు, ఫీల్డ్ డిటెక్టర్ లు జూపిటర్  వికిరణ వలయాలని దాటి పోయామని తెలుపుతున్నాయి. జూపిటర్ గురుత్వ శక్తి వల్ల మేము వేగం పుంజుకున్నాము. జూపిటర్ గురుత్వ ప్రభావం నుండి విముక్తి పొంది మళ్లీ విశాల వ్యోమసముద్రం మీద మా యాత్రని కొనసాగించాము.

 

874 రోజు -  మా నౌకలో ఒక పరికరం ఎప్పుడూ కానోపస్ తార దిశగా గురిపెట్టి ఉంటుంది. అది మా నౌకకి చుక్కాని వంటిది. దాని వల్లనే దిక్కు తెలియని చీకటి అంతరిక్షంలో నౌకకి దిశానిర్దేశం చెయ్యడానికి వీలవుతోంది. పరికరం తాత్కాలికంగా పని చెయ్యడం మానేసింది. మా ఆప్టికల్ సెన్సారు ఆల్ఫా, మరియు బీటా సెంటారీ తారలజంటని కానోపస్ తార అనుకుని పొరబడ్డాయి. మా తదుపరి గమ్యం మరో రెండేళ్ల దూరంలొ వుంది. అది సాటర్న్ వ్యవస్థ.

 

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts