(రసాయన శాస్త్ర చరిత్ర అనువాదం ఆ మధ్యన అర్థాంతరంగా ఆగిపోయింది. దాన్ని మళ్లీ కొనసాగిస్తున్నాను…)
ఊదుడు గొట్టం లాంటి నూతన పద్ధతుల వల్ల రసాయన విజ్ఞానంలో ఎన్నో కొత్త రహస్యాలు బయటపడ్డాయి. అలా కొత్తగా లభ్యమైన పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని క్రాన్స్టెడ్ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఖనిజాలని కేవలం వాటి బాహ్య రూపురేఖల ఆధారంగానే కాక వాటి రసాయనిక లక్షణాల బట్టి కూడా వర్గీకరించొచ్చని భవించాడు. ఈ విధమైన వర్గీకరణ గురించి విపులంగా వివరిస్తూ అతడు 1758 లో ఓ పుస్తకాన్ని ప్రచురించాడు.
స్వీడెన్ కి చెందిన టోబెర్న్ ఓలోఫ్ బెర్గ్మన్ (1735-1784) అనే ఖనిజవేత్త ఈ కొత్త దిశలో కృషిని కొనసాగించాడు. రసాయనిక చర్యలు కొన్ని ఖనిజాల మధ్య జరుగుతాయి గాని మరి కొన్ని ఖనిజాల మధ్య ఎందుకు జరగవు అన్న విషయం గురించి బెర్గ్మన్ ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వివిధ పదార్థాల మధ్య వివిధ స్థాయిలలో “సంగత్వం” (affinities), అంటే ఆకర్షణ, ఉంటుందని అతడు తలపోశాడు. పదార్థాల జతల మధ్య “సంగత్వాలని” వివరిస్తూ అతడు పెద్ద పెద్ద పట్టికలు తయారుచేశాడు. అతడి జీవిత కాలలోనే కాక అతడి మరణానంతరం కొన్ని దశాబ్దాల వరకు ఆ పట్టికలు బాగా ప్రాచుర్యం పొందాయి.
అంతకు ముందు మనం ప్రస్తావించిన మేటి స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త షీలే నిజానికి ఓ మందుల అంగడిలో పనివాడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడిలోని సహజ ప్రతిభని గుర్తించిన బెర్గ్మన్ అతడిని చేరదీసి ప్రోత్సహించాడు. షీలే ఎన్నో కొత్త ఆసిడ్లని కనుక్కున్నాడు. వృక్ష లోకం నుండి – టార్టారిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్, బెంజాయిక్ ఆసిడ్, ఆక్సాలిక్ ఆసిడ్, మాలిక్ ఆసిడ్, గాలిక్ ఆసిడ్ మొదలైన ఆసిడ్లని; జంతు లోకం నుండి
లాక్టిక్ ఆసిడ్, యూరిక్ ఆసిడ్ మొదలైన ఆసిడ్లని; ఖనిజ లోకం నుండి మాలిబ్డిక్ ఆసిడ్, ఆర్సీనియస్ ఆసిడ్ మొదలైన ఆసిడ్లని అతడు కనుక్కున్నాడు.
అతడు మూడు అత్యంత విషపూరితమైన వాయువులని తయారు చేసి శోధించాడు. అవి – హైడ్రోజెన్ ఫ్లోరైడ్, హైడ్రోజెన్ సల్ఫైడ్, హైడ్రోజెన్ సయనైడ్. (అతడు తయారు చేసే రసాయనాల పరీక్షలో భాగంగా ఎన్నో సార్లు వాటిని రుచి చూసేవాడు కూడా. చిన్న వయసులోనే అతడు మరణించడానికి కారణం కూడా ఈ ‘విషాహారమే’ నని చెప్పుకుంటారు).
ఎన్నో మూలకాల అన్వేషణలో కూడా అతడు ముఖ్యమైన పాత్ర వహించాడు. అయితే చివరికి ఆ మూలకాలని కనుక్కున్న ఘనత స్వీడెన్ కి చెందిన తన సహోద్యోగులకే దక్కింది. అన్నిటికన్నా ముఖ్యంగా అతడు 1771 లో ఆక్సిజన్ ని, 1772 లో నైట్రోజెన్ ని తయారుచేశాడు. ఆక్సిజన్ తో అంత గాఢంగా కలవని ఎన్నో పదార్థాలని అతడు వేడి చేసి ఆక్సిజన్ తయారుచేశాడు. అలంటి పదార్థాలలో మెర్క్యురిక్ ఆక్సయిడ్ కూడా ఉంది. ఈ మెర్క్యురిక్ ఆక్సయిడ్ ని వాడి మరో రెండేళ్ల తరువాత ప్రీస్లీ ఆక్సిజన్ తయారుచేశాడు.
షీలే తన ప్రయోగాలన్నీ చాలా జాగ్రత్తగానే వర్ణించాడు. కాని ప్రచురణ కర్త చేసిన అశ్రద్ధ వల్ల 1777 వరకు కూడా ఆ వివరణలు అచ్చు కాలేదు. కాని అప్పటికే రూథర్ఫర్డ్, ప్రీస్లీ తదితరుల కృషి గురించిన వార్త ప్రచురితం అయ్యింది. కనుక ఆ ఆవిష్కరణలు చేసిన ఘనత అంతా వారికే దక్కింది.
(సశేషం…)
0 comments