పద్దెమినిదవ శతాబ్దపు చివరి దశ కల్లా ఎన్నో వాయువులు కనుక్కోబడ్డాయి. వాటి మీద రకరకాల అధ్యయనాలు జరిగాయి. అయితే అలా పోగైన సమాచారాన్ని అంతటినీ సమీకరించి ఓ సామాన్య వేదిక మీద నిలబెట్టగల సిద్ధాంతం యొక్క వెలితి కనిపించింది. అలాంటి సిద్ధాంతానికి ప్రాణం పోయగల ఓ మేధావి ఆ దశలో రంగప్రవేశం చేశాడు. అతడే ఫ్రెంచ్ రసాయన వేత్త ఆంట్వాన్ లోరాన్ లెవోషియే (1743-1794).
తన అధ్యయనాలు మొదలెట్టిన తొలి దశల నుండి కూడా లెవోషియే కచ్చితమైన కొలత పద్ధతుల ప్రాముఖ్యతని గుర్తించాడు. ఆ గుర్తింపుతోనే 1764 లో ముఖ్యమైన అధ్యయనాన్ని ప్రారంభించాడు. జిప్సమ్ అనే ఖనిజం లోని అంశాలని విశ్లేషించడమే ఆ అధ్యయనం యొక్క లక్ష్యం. జిప్సమ్ ని వేడి చేసి ఆ చర్య ఫలితంగా అందులోంచి వెలువడ్డ నీటిని కొలిచాడు. ఆ విధంగా కొలమాన పద్ధతులని రసాయన చర్యలలో వాడి కావెండిష్, బ్లాక్ మొదలైన వారి కోవలో చేరిపోయాడు లెవోషియే. అయితే వారి కన్నా లెవోషియే ఈ పద్ధతులని క్రమబద్ధంగా వాడాడు. వాటినిక ఆయుధంగా వాడి పనికిమాలిన, పాత తప్పుడు సిద్ధాంతాలని కూలదోయడానికి వినియోగించాడు. రసాయన శాస్త్ర పురోగతికి అడ్డుపడుతున్న పాత సిద్ధాంతాలని మట్టుబెట్టడానికి ప్రయత్నించాడు.
లెవోషియే ధ్వజమెత్తిన పాత సిద్ధాంతాలలో రూపాంతరీకరణ (transmutation) ఒకటి. విశ్వంలోని పదార్థం అంతా ఐదు మూలతత్వాల సంయోగమే నని ప్రాచీన గ్రీకులు భావించేవాళ్లు. పైగా ఆ మూలతత్వాలు ఒకటి మరొకదానిగా మారగలవని కూడా నమ్మేవాళ్లు. 1770 కాలానికి కూడా ఇలాంటి భావాలని సమ్మతించిన వాళ్ళు ఉండేవారు. ఉదాహరణకి నీరు మట్టిగా మారగలదని ఒక తప్పుడు నమ్మకం ఉండేది. (లెవోషియే కూడా మొదట్లో ఈ విషయాన్ని నమ్మాడు.) ఒక పాత్రలో కాస్తంత నీరు తీసుకుని ఆరుబయట విడిచిపెట్టి తగినంత కాలం వేచి ఉంటే, లోన నీరంగా ఇగిరిపోయి అడుగున కాస్తంత మట్టి మిగులుతుంది. నీరే ఆ మురికిగా మారిందని ఆ రోజుల్లో భ్రమపడేవారు.
ఈ ప్రతిపాదనని గుడ్డిగా నమ్మకుండా లెవోషియే ఆ విషయాన్ని నిశితంగా పరీక్షించదలచాడు. ఒక పాత్రలో తగినంత నీరు తీసుకుని దాన్ని 101 రోజుల పాటు మరిగించాడు. అలా మరిగించగా వచ్చిన ఆవిరిని మరో పాత్రలో పట్టి స్వేదనం చేత తిరిగి నీటిగా మారేలా చేశాడు. నీటి నుండి పుట్టిన అంశాలేవీ ఎక్కడా బయటికి పోకుండా జాగ్రత్త పడ్డాడు. అంతే కాక ఈ విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకోడానికి వేడి చేయక ముందు, వేడి చేసిన తరువాత పాత్రలోని నీటి బరువునే కాక, పాత్ర బరువు కూడా కొలిచాడు.
ఈ సారి కూడా నీరు ఆవిరి అయ్యాక అడుగున అవక్షేపం కనిపించింది. కాని మరిగించడం వల్ల నీటి బరువు మాత్రం మారలేదు. కనుక అవక్షేపం నీటి నుండి అంటే నీరు “రూపాంతరీకరణ” చెందగా వచ్చింది కాదని తేలిపోయింది. కాని పాత్ర అడుగున పేరుకున్న అవక్షేపాన్ని గోకి తొలగించిన తరువాత పాత్ర బరువు కాస్త తగ్గినట్టు తెలిసింది. పాత్ర బరువులో వచ్చిన వెలితి, అవక్షేపం యొక్క బరువుతో సమానం అయ్యింది. కనుక అవక్షేపం నీటి నుండి, అంటే నీరు “రూపాంతరీకరణ” చెందగా, వచ్చింది కాదని, దీర్ఘకాలం నీరు పోసి మరిగించడం వల్ల పాత్ర గోడలలోని పదార్థం నీట్లో కలియగా ఏర్పడినదేనని తేలిపోయింది. ఆ విధంగా కంటితో చూసి భ్రమించే పరిస్థితుల్లో కూడా, కచ్చితమైన కొలతల సహాయంతో సత్యాన్ని నిరూపించడానికి సాధ్యమవుతుందని నిరూపించాడు లెవోషియే.
(సశేషం…)
interesting..