లెవోషియే ప్రతిపాదించిన ఈ కొత్త సిద్ధాంతాలు రసాయన శాస్త్రాన్ని మరింత తర్కబద్ధంగా, అర్థవంతంగా మార్చేశాయి. నిరాధారమైన “తత్వాలు” అన్నీ ఈ శాస్త్రం నుండి ఏరివేయబడ్డాయి. ఆ నాటి నుండి తూచదగ్గ, కొలవదగ్గ పదార్థాలకే రసాయనికుల ధ్యాస పరిమితం అయ్యింది.
అటువంటి బలమైన, సంఖ్యాత్మకమైన పునాదిని ఏర్పాటు చేశాక, ఆ పునాది మీద బారైన శాస్త్రనిర్మాణాన్ని చెయ్యడానికి ఉపక్రమించాడు లెవోషియే. 1780 లలో మరి ముగ్గురు ఫ్రెంచ్ రసాయనికులతో (లూయీ బెర్నార్డ్ గయ్టన్ ద మోర్వో (1737-1816), క్లాడ్ లూయీ బెర్థోలే (1748-1822), మరియు ఆంట్వాన్ ఫ్రాస్న్వా ద ఫూర్క్రాయ్ (1755-1809)) చేయి కలిపి మరింత తార్కికమైన రసాయనిక నామపరిభాషని (chemical nomenclature) రూపొందించాడు. వీరి కృషి 1787 లో ప్రచురితం అయ్యింది.
(పాదపీఠిక - లెవోషియే కన్నా ముందే తను ప్రతిపాదించిన సిద్ధాంతాలని పోలిన భావాలని వ్యక్తం చేసిన ఓ రష్యన్ రసాయనికుడు ఉన్నాడు. అతడి పేరు – మిఖాయిల్ వాసిలియేవిచ్ లోమొనొసోవ్ (1711-1765). అతడు 1756 లో అంటే లెవోషియే జ్వలన ప్రక్రియ మీద కృషి చేసిన నాటిని ఇరవై యేళ్ల క్రితమే, ఫ్లాగిస్టాన్ సిద్ధాంతాన్ని త్రోసి పుచ్చాడు. గాలిలో ఒక అంశంతో వస్తువులు సంయోగం చెందడం వల్లనే జ్వలనం జరుగుతుంది అన్నాడు. అయితే అతడి రచనలన్నీ రష్యన్ లో ఉండడం చేత, లెవోషియే లాంటి పాశ్చాత్య యూరప్ కి చెందిన రసాయనికులకి అతడి కృషి గురించి అవగాహన లేకపోయింది. పరమాణువుల గురించి, ఉష్ణం గురించి ఎంతో ఆధునికమైన దృక్పథాన్ని వ్యక్తం చేశాడు లోమొనొసోవ్. ఆ విధంగా అతడు ఓ నూటయాభై సంవత్సరాలు ముందు పుట్టాడని చెప్పుకోవచ్చు. పశ్చిమ యూరప్ లో వైజ్ఞానిక ప్రగతి ఉధృతంగా సాగుతున్న దశలో తూర్పు యూరప్ లో పుట్టిన దురదృష్టవంతుడు లోమొనొసోవ్.)
పరుసవేదం లో జరిగినట్టుగా, నానా నామాల కలగూరగంపలా ఉన్న స్థితి నుండి రసాయనశాస్త్రం బయటపడింది. అంత వరకు అవతలి వాళ్లతో సంబంధం లేకుండా ఎవరి పద్ధతి వాళ్ళు అనుసరిస్తూ పోయేవారు. తక్కిన వాళ్లకి ఆ పద్ధతి అసంగతంగా, అర్థరహితంగా తోచేది. కాని లెవోషియే వంటి వారి కృషితో ఈ అయోమయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందరూ అనుసరించదగ్గ ఓ ప్రామాణిక వ్యవస్థ నెలకొంది. తార్కికమైన మూల సూత్రాల మీద ఆధారపడ్డ ఈ వ్యవస్థలో ఒక పదార్థం యొక్క నామాన్ని బట్టి అందులో ఉన్న మూలకాలు ఏవో గుర్తుపట్టొచ్చు. ఉదాహరణకి కాల్షియమ్ ఆక్సయిడ్ లో కాల్షియమ్, ఆక్సిజన్ లు ఉంటాయి. సోడియమ్ క్లోరైడ్ లో సోడియమ్, మరియు క్లోరిన్ లు ఉంటాయి. హైడ్రోజెన్ సల్ఫైడ్ లో హైడ్రోజెన్ మరియు సల్ఫర్ లు ఉంటాయి.
0 comments