ఇంత చేసినా లెవోషియేకి సంతృప్తి కలగలేదు. లోహం గాలితో కలిసి తుప్పు పదార్థంగా మారింది. కట్టె గాలితో కలిసి బూడిదగా మారింది. బాగానే ఉంది. కాని ఆ ఆ ప్రక్రియలో గాలి మొత్తం పాల్గొనలేదు. ఐదో వంతు భాగం మాత్రమే పాల్గొంది. ఇలా ఎందుకు జరుగుతోంది?
1774 లో “ఫ్లాగిస్టాన్ రహిత గాలి” ని కనుక్కున్న ప్రీస్లీ పారిస్ నగరాన్ని సందర్శించాడు. ఆ సమయంలో అతడు లెవోషియేని కలుసుకుని తన ఆవిష్కరణల గురించి చెప్పాడు. ప్రీస్లీ ప్రయోగాల ప్రాముఖ్యతని వెంటనే అర్థం చేసుకున్న లెవోషియే 1775 లో తన అభిప్రాయాలని విపులంగా ప్రచురించాడు.
ఆ వ్యాసంలో లెవోషియే ఇలా రాశాడు. గాలి శుద్ధ, మౌలిక పదార్థం కాదు. 1:4 నిష్పత్తి లో కలిసిన రెండు వాయువుల మిశ్రమం. గాలిలో ఐదో వంతు ప్రీస్లీ కనుక్కున్న “ఫ్లాగిస్టాన్ రహిత గాలి”. (అయితే దురదృష్టవశాత్తు ఆ వ్యాసంలో ఆ సత్యాన్ని కనుక్కున్న ప్రీస్లీ పేరుని పేర్కొనడం మర్చిపోయాడు లెవోషియే.) గాలిలో ఈ భాగమే జ్వలన క్రియకి కారణం అవుతోంది. లోహం తుప్పు పట్టడానికి కారణం అవుతోంది. ముడి పదార్థం నుండి బొగ్గులోకి ప్రవేశించేది అదే. ప్రాణాన్ని నిలిపే వాయువు కూడా అదే.
ఆ వాయువుకి ఆక్సిజన్ అని పేరు పెట్టింది లెవోషియేనే. “ఆమ్ల జనకం” అన్న అర్థం గల గ్రీకు పదాల నుండి వచ్చిందది. ఆమ్లాలు అన్నిట్లో ఆక్సిజన్ ఉంటుందనే అభిప్రాయం ఉండేది తనకి. ఆ విషయంలో మాత్రం అతడు పొరబడ్డాడు.
ఇక మిగిలిన నాలుగు/ఐదు వంతు గాలి జ్వలన క్రియని గాని, జీవస్థితిని గాని పోషించలేదు. దీన్నే రూథర్ఫర్డ్ “ఫ్లాగిస్టీకృత గాలి” అన్నాడు. ఇది పూర్తిగా బిన్నమైన వాయువు. దీనికి లెవోషియే “అజోట్” అని పేరు పెట్టాడు. ఆ పదం “జీవరహిత” అన్న అర్థం గల గ్రీకు పదం నుండి వచ్చింది. కాని కాలక్రమేణా ఆ పేరు తొలగిపోయి దాని స్థానంలో “నైట్రోజెన్” అన్న పేరు అమరింది. నైటర్ అన్నది నైట్రోజెన్ భాగంగా గల ఓ సామాన్య ఖనిజం.
జ్వలన క్రియని పోలిన ప్రక్రియ ఏదో జీవనానికి ఆధారంగా ఉందని లెవోషియే భావించేవాడు. ఎందుకంటే మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డయాక్సయిడ్ తక్కువగా ఉంటుంది. కాని మనం విడిచిన గాలిలో ఆక్సిజన్ తక్కువ అవుతుంది, కార్బన్ డయాక్సయిడ్ పాలు ఎక్కువ అవుతుంది. లెవోషియే తన సహోద్యోగి అయిన పియర్ సిమోన్ ద లాప్లాస్ (1749-1827) (ఇతడు తదనంతరం ఓ గొప్ప ఖగోళశాస్త్రవేత్త అవుతాడు) తో కలిసి జంతువులు పీల్చిన గాలిలోని ఆక్సిజన్ పాలు, విడిచిన గాలిలోని కార్బన్ డయాక్సయిడ్ పాలు, కొలవడానికి ప్రయత్నించాడు. కాని ఫలితాలు కాస్త విడ్డూరంగా అనిపించాయి. ఎందుకంటే లోనికి పీల్చుకున్న ఆక్సిజన్ లో కొంత భాగం బయటికి విడిచిన కార్బన్ డయాక్సయిడ్ లో కనిపించలేదు.
1783 నాటికి కావెండిష్ ఇంకా తన జ్వలనీయ వాయువుతో కుస్తీ పడుతున్నాడు. ఆ వాయువుని మండించి ఏం జరుగుతుందో పరీక్షించాడు. దాని నుండీ పుట్టిన ఆవిర్లు ఘనీభవించి ఏదో ద్రవంగా మారాయి. ఆ ద్రవాన్ని పరిశీలించి చూడగా అది నీరు తప్ప మరేమీ కాదని తేలింది. ఇది చాలా ముఖ్యమైన ప్రయోగం. గ్రీకులు బోధించిన మూలతత్వాల సిద్ధాంతానికి ఇది గొడ్డలి పెట్టు అయ్యింది. నీరు ఓ మూలతత్వం అని బోధించిన ఆ సిద్ధాంతం తప్పని తేలింది. నీరు రెండు వాయువుల సంయోగం వల్ల పుడుతుందని తెలిసింది.
ఈ ప్రయోగం గురించి విన్న లెవోషియే, కావెండిష్ కనుక్కున్న వాయువుకి ‘హైడ్రోజన్’ (నీటిని పుట్టించేది) అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ తో కలిసి హైడ్రోజెన్ మండడం వల్ల పుట్టింది కనుక నీరు హైడ్రోజెన్ – ఆక్సిజన్ల సంయోగం కావచ్చని అనిపించింది. ఆహర పదార్థం లోనే కాక జీవ పదార్థంలో కూడా హైడ్రోజెన్, కార్బన్ లు కలిసి ఉంటాయనిపించింది. గాలిని లోపలికి పీల్చుకున్నప్పుడు అందులోని ఆక్సిజన్ జీవపదార్థంలోని కార్బన్ తో కలిసి కార్బన్ డయాక్సయిడ్ ఏర్పడుతోంది. అలాగే ఆ ఆక్సిజన్ హైడ్రోజెన్ తో కలిసి నీరుగా మారుతోంది. అందుకే పీల్చుకున్న గాలిలో కన్నా బయటికి విడిచిన గాలిలో ఆక్సిజన్ పాలు తక్కువగా ఉందని అంతకు ముందు శ్వాస ప్రక్రియ మీద చేసిన ప్రయోగాలలో ఎందుకు కనిపించిందో అర్థమయ్యింది.
(సశేషం…)
0 comments