ఇప్పుడు మీకు
వయసు ఐపోతోంది అనుకోండి (మనిషి అన్నాక తప్పదు కదండీ మరి!). మీకు వయసు పెరుగుతున్న కొద్ది
నేను పలచబడి పోతుంటాను. నా అడుగున వున్న సిరలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. కొవ్వు
కరిగిపోవడంతో నాలో ముడుతలు కనిపిస్తాయి. యవ్వనపు నిగ్గు, నిగారింపు ఇప్పుడు ఉండదు.
కళ్ల కింద చారలు కనిపిస్తాయి. దవడల కింద చర్మం వేలాడే పరిస్థితి ఏర్పడవచ్చు.
చర్మంతో వచ్చే ఓ ముఖ్యమైన సమస్య కాన్సర్. సూర్యకిరణాలతో అధికంగా
సంపర్కం కలిగినప్పుడు కాన్సర్ వచ్చే ప్రమాదం వుంటుంది. నుదురు, ముక్కు, చెవులు ఈ సమస్య
తలెత్తే ముఖ్య స్థానాలు. అయితే ఎన్నో రకాల కాన్సర్ ని సకాలంలో గుర్తించగలిగితే నిశ్చయంగా
నయం చెయ్యడానికి వీలవుతుంది. కాని ఏదేమైనా కాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి. కనుక చర్మం
మీద ఎక్కడైనా అసహజంగా రక్త స్రావం జరుగుతూ, త్వరగా నయం కాకుండా ఉన్నట్టయితే అశ్రద్ధ
చెయ్యకుండా డాక్టర్ కి చూపించుకోవాలి.
మరి ఈ విషయంలో
నివారణ చర్యగా మీరు చెయ్యగలిగేది ఏమైనా వుందా? తప్పకుండా వుంది. ఎక్కువగా ఎండలో తిరగడం
మానెయ్యడం! ఆదివారం పగలంతా క్రికెట్ ఆడడం తప్పనిసరి
అనుకుంటే కాప్ పెట్టుకోవడం. అలాగే చలికాలంలో ఎక్కువగా నీట్లో నానడం మంచిది కాదు. అందువల్ల
చర్మంలో తేమ తగ్గి పొడిపొడిగా అయిపోతుంది.
చివరిగా చెప్పేదేమంటే
మీరు ఎంత శ్రద్ధ తీసుకున్నా, నాలుగు రోజుల కోసారి ఎంత నలుగు స్నానాలు చేసినా నాతో కాస్త
ఇబ్బందేనండి! మీకు, ఈ బాహ్య ప్రపంచాన్ని వేరు చేసే గోడని కదా మరి? అందుచేత నాకు సంబంధించిన
రోగాలు కోకొల్లలు. కచ్చితంగా చెప్పాలంటే 2000
పైగా! చర్మరోగాల్లో ముఖ్యమైనది సోరియాసిస్ (Psoriasis). మామూలుగా 27
రోజులకి ఒకసారి ఎపీడెర్మిస్ కణాలు కొత్తవి పుడుతుంటాయి. కాని సోరియాసిస్ లో
ఈ పుట్టుక ఐదు రోజులకి ఓ సారి జరుగుతుంది. కనుక చర్మం మీద ఎర్రగా మచ్చల్లా ఏర్పడతాయి.
ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు.
అలాంటిదే మరో చర్మ సమస్య షింగిల్స్. చికెన్
పాక్స్ వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది.
చర్మం అంతా కురుపుల్లా ఏర్పడతాయి. కురుపులు నయం అయినా కూడా బాధ కొంత కాలం ఉండొచ్చు.
ఇలాంటి పరిస్థితిల్లో
తప్పకుండా డాక్టర్ ని సంప్రదించాలి. అదేం ఖర్మమో ఈ చర్మంతో అన్నీ సమస్యలే అనుకుంటున్నారేమో!
పొరబాటు! సిపాయికి కవచం ఎంత ముఖ్యమో, శరీరానికి చర్మం అంత ముఖ్యం. చర్మంలోని మర్మం
అంటే అదే.
0 comments