అలాగే మరో సందర్భంలో ఓ ఫిలాసఫీ
ప్రొఫెసరు నాతో కాన్సర్ పట్ల తనకి వుండే ఫోబియా గురించి చెప్పుకొచ్చాడు. అప్పటికే అతడు
ఎన్నో ఎక్స్-రే లు తీయించుకున్నాడు. కాని ఎందులోను కాన్సర్ ఆనవాళ్లు కనిపించలేదు. అయినా
కూడా తనకి ఏదో హానికరమైన ట్యూమర్ వుందని అతడు భయపడుతుంటాడు. “ఏమీ లేదని తెలుసు. కానీ
ఏవైనా వుంటే?” అని అడుగుతాడు. ఈ ఆలోచన ఎక్కణ్ణుంచి వచ్చింది? ఇది సచేతనమైన యోచన లోనుండి
పుట్టుకొచ్చిన భయం కాదు. ఆ సంశయం అతడి మానసాన్ని ఒక్కసారిగా క్రమ్ముకుంటుంది. దాని
సమ్మోహక శక్తి మీద అతడి బొత్తిగా నిగ్రహం లేకుండా పోతోంది.
ఈ విధంగా తన సమస్యని ఒక నాగరికుడు
అంత సులభంగా వెలిబుచ్చడు. ఓ అనాగరికుడు అయితే తన సమస్యలకి కారణం ఏదో దయ్యం తనని వేధించడమే
నని మరింత సులభంగా ఒప్పుకుంటాడు. దెయ్యాలు అనేవి ఉంటాయని, వాటికి ఏదో దుష్టప్రభావం
వుంటుందనే భావన ఓ అనాగరిక సంస్కృతిలో సమ్మతమే కావచ్చు. కాని ఒక ఆధునికుడికి తన సమస్యలు
కేవలం మనోజన్యాలు అని ఒప్పుకోవడం మరింత కష్టం అవుతుంది. ఈ విధంగా చిత్తంలో లోతుగా నాటుకుపోయి,
సులభంగా మార్చరాని, వొదిలించుకోలేని భావననే obsession అంటారు. ఇది చాలా ప్రాచీనమైన
మానసిక పరిణామం. ఆనాడు, ఈనాడు అది ఒక్క రీతిలోనే వుంది. దానికి కారణం ఏమిటి అని అన్వయించే
ప్రయత్నంలోనే అప్పటికి ఇప్పటికి తేడా వుంది.
ఆధునికులకి, అనాగరికులకి మధ్య
ఈ రకంగా ఎన్నో పోలికలు గుర్తించవచ్చు. మానవ చిత్తంలో ప్రతీకలని పుట్టించే ప్రవృత్తిని
అర్థం చేసుకోడానికి ఈ రకమైన తులనాత్మక పరిశీలన అవసరం. ఎందుకంటే ఎన్నో కలలలో మనకి ఎదురయ్యే
ప్రతీకలకి ప్రాచీన భావనలతోను, గాధలతోను, ఆచారాలతోను సంబంధం వుంటుంది. ఈ స్వప్న చిత్రాలనే
మన చిత్తంలో మిగిలిన “ప్రాచీన అవశేషాలు” అంటాడు ఫ్రాయిడ్. అతి సుదూరమైన గతానికి చెందినవై
మనలో మిగిలిన చైతన్యాంశాలు అన్నమాట. అచేతనని కేవలం చేతన యొక్క పొడిగింపు గానో, లేక
కాస్త దృశ్యాత్మకంగా చెప్పాలంటే సచేతన మానసంలో పుట్టే చెత్త అంతా తనలో పోగు చేసుకునే
ఓ చెత్తడబ్బా లాగానో (ఫ్రాయిడ్ లాంటి) కొంతమంది నిపుణులు పరిగణిస్తూ వుంటారు.
ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశోధించిన
మీదట అచేతనని ఈ విధంగా పరిగణించడం పొరబాటని అనిపించింది. అచేతన నుండి ఉద్భవించే ఈ రకమైన
ప్రతీకలు, చిత్రాలు విశ్వజనీనాలు అని తెలిసింది. స్వాప్నికుడి చదువుకున్న వాడైనా, నిరక్షరాస్యుడైనా,
తెలివైన వాడైనా వట్టి మొద్దు అయినా అచేతనా చిత్రాలు మాత్రం ఒక్కటేనని గుర్తించాను.
ఆ చిత్రాలు కేవలం అర్థం లేని ‘అవశేషాలు’ కావు. ఇప్పటికీ వాటికి ఒక ప్రాముఖ్యత వుంది.
డా॥ హెండెర్సన్ గారు చెప్పినట్టు వాటి చారిత్రాత్మక లక్షణం దృష్ట్యా వాటికి ఆ విధమైన
ప్రాముఖ్యత అబ్బుతుంది. మన ఆలోచనలని మనం సచేతనంగా వ్యక్తం చేసే తీరుకి, లేక అచేతనంగా
చిత్రాలతోను, పలు వన్నెలతోను వ్యక్తం చేసే తీరుకి మధ్య ఈ చిత్రాలు వంతెనలా పని చేస్తాయి.
సచేతన ప్రపంచానికి అచేతన లోకానికి మధ్య ఈ “చారిత్రాత్మక” సంబంధాలు లంకెలు.
మన సచేతన మానసంలో జాగృత స్థితిలో
పుట్టే ఆలోచనలకి, స్వప్న స్థితిలో లభ్యమయ్యే
ఈ చిత్ర సంపదకి మధ్య తేడా గురించి అంతకు ముందు చర్చించాను. ఆ తేడాకి మరో కారణం ఇప్పుడు
మనకి కనిపిస్తోంది. మన నాగరిక జీవనంలో మనం వాడే ఎన్నో భావాలు శక్తివిహీనం అయిపోయాయి,
పేలవంగా మారిపోయాయి. వాటికి మనం స్పందించడం మానేశాం. వాటిని మాటల్లో అలవాటుగా వాడుతాం.
అవతలి వాళ్ళు వాటి గురించి ప్రస్తావించినప్పుడు పరిపాటిగా స్పందిస్తాం. కాని అవి మన
చిత్తం మీద గాఢమైన ముద్ర వెయ్యవు. మన నడత మీద వాటికి పెద్దగా ప్రభావం వుండదు. మన మనోభావాలని,
నడతని మార్చాలంటే మరింకేదో కావాలి. అదే ఈ “స్వప్న భాష.” కలల ప్రతీకలలో ఎంతో చైత్య శక్తి
దాగి వుంటుందంటే వాటిని పట్టించుకోకుండా వుండలేం.
(ఇంకా వుంది)
0 comments