ఉదాహరణకి ఒక
భాగం హైడ్రోజెన్ ఎనిమిది భాగాల ఆక్సిజన్ తో కలిసినప్పుడు నీరు ఏర్పడుతుంది. ఒక నీటి
అణువులో ఒక హైడ్రోజెన్ పరమాణువు, ఒక ఆక్సిజ్న పరమాణువు ఉంటాయని అనుకుంటే హైడ్రోజెన్
పరమాణువు కన్నా ఆక్సిజన్ పరమాణువు బరువు ఎనిమిది రెట్లు ఎక్కువ అని అర్థమవుతుంది. కనుక
హైడ్రోజెన్ పరమాణువు బరువులు విలువ 1 అని ప్రమాణాత్మకంగా
తీసుకున్నారు. హైడ్రోజెన్ పరమాణువు యొక్క బరువు 1
అయితే, ఆక్సిజన్ పరమాణువు బరువు 8 కావాలి.
అలాగే 1 భాగం
హైడ్రోజెన్ 5 భాగాల నైట్రోజెన్ తో కలిసి అమ్మోనియా
ఏర్పడుతుంది. ఈ సందర్భంలో కూడా ఒక అమ్మోనియా అణువులో ఒక హైడ్రోజెన్ పరమాణువు, ఒక నైట్రోజెన్
పరమాణువు ఉన్నాయని అనుకుంటే నైట్రోజెన్ పరమాణువు యొక్క బరువు 5 అని అనుకోవాలి.
ఈ పద్ధతిలో వాదిస్తూ
డాల్టన్ మొట్టమొదటి పరమాణు భారాల పట్టికని ప్రకటించాడు. ఆ పట్టిక డాల్టన్ సాధించిన
వైజ్ఞానిక విజయాలలో కెల్లా అత్యంత ముఖ్యమైనదే అయినా అందులో ఎన్నో దోషాలు ఉన్నాయని తరువాత
తేలింది.
ఆ దోషాలకి ఒక
మూల కారణం వుంది. రెండు పరమాణు జాతులు కలిసి ఒక అణువు ఏర్పడినప్పుడు సామాన్యంగా ఒక్కొక్క జాతి నుండి ఒక్కొక్క పరమాణువు కలిసి ఆ
అణువు ఏర్పడింది అని భావించడమే డాల్టన్ చేసిన తప్పు. ఇక తప్పనిసరి అయితే తప్ప ఈ నమ్మకాన్ని వొలిదిపెట్టేవాడు
కాడు.
తదనంతరం జరిగిన
అధ్యయనాలలో ఒక్కొక్క పరమాణువు మాత్రమే కలిసి అణువులు ఏర్పడాలన్న నియమేమీ లేదని తేటతెల్లం
అయ్యింది. నిజానికి నీరు విషయంలో ఆ నియమం ఉల్లంఘింపబడుతుంది అన్న విషయం డాల్టన్ తన
పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి ముందే తెలిసింది.
ఈ సందర్భంలోనే
విద్యుత్ రంగానికి, రసాయనిక రంగానికి మధ్య మొట్టమొదటి సారిగా సంబంధం ఏర్పడుతుంది.
ప్రాచీన గ్రీకుల
కాలం నుండి కూడా విద్యుచ్ఛక్తిని గురించిన పరిజ్ఞానం వుంది. ఆంబర్ ని (amber) రుద్దినప్పుడు
అది వస్తువులని ఆకర్షించే లక్షణాన్ని సంతరించుకుంటుందని వారికి తెలుసు.
ఎన్నో శతాబ్దాల
తరువాత బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త విలియమ్ గిల్బర్ట్ (1540-1603) ఈ రంగంలో మరింత
ముందుకు వెళ్లాడు. రుద్దితే ఆకర్షణ శక్తి పుట్టటం అనేది కేవలం ఆంబర్ కి మాత్రమే పరిమితం
కాదని, మరెన్నో పద్దార్థాలు ఆ లక్షణాన్ని ప్రదర్శిస్తాయని అతడు గమనించాడు. 1600 ప్రాంతాల్లో
అతడు ఈ రకమైన పదార్థాలన్నిటికి ఉమ్మడిగా ‘ఎలక్‍ట్రిక్స్’ అని పేరు పెట్టాడు. (ఆంబర్
కి గ్రీకు పదం ‘ఎలక్‍ట్రిక్’)
ఆ విధంగా రుద్దటం
చేత గాని, మరే ఇతర ప్రక్రియ చేత గాని ఆకర్షణ శక్తిని సంతరించుకునే పదార్థాలలో ‘విద్యుదావేశం’ (electric charge) లేదా విద్యుత్తు
(electricity) ఉంటుందన్న భావన పుట్టుకొచ్చింది.
ఇలా వుండగా ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త చార్ల్ ఫ్రాన్సువా
ద సిస్టర్నే దు ఫే (1698-1739) మరో ముఖ్యమైన సత్యాన్ని కనుక్కున్నాడు. 1733 లో ఇతగాడు రెండు రకాల విద్యుదావేశాలు ఉన్నాయని తెలుసుకున్నాడు.
మొదటి రకం విద్యుదావేశాన్ని గాజులో పుట్టించవచ్చు. దీనికి vitreous electricity అని
పేరు పెట్టారు. రెండవ రకం విద్యుదావేశాన్ని ఆంబర్ లో పుట్టించవచ్చు. దీన్ని resinous
electricity అన్నారు. ఒక రకం విద్యుదావేశం గల వస్తువు రెండవ రకం విద్యుదావేశం గల వస్తువుని
ఆకర్షిస్తుంది. కాని ఒకే రకం విద్యుదావేశం గలవస్తువులు పరస్పరం వికర్షించుకుంటాయి.
మరి రెండు రకాల
విద్యుదావేశాలు ఎందుకు ఉన్నాయి, వాటి మధ్య సంబంధం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తింది. అందుకు
సమాధానంగా ఓ ముఖ్యమైన సూచన చేసినవాడు అమెరికన్ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాన్క్‍లిన్
(1706-1790). బెంజమిన్ ఫ్రాన్క్‍లిన్ శాస్త్రవేత్త కావడమే కాక గొప్ప రాజకీయ నేత, దూత
కూడా. ఇతడు ఒక దశలో అమెరికా అధ్యక్షుడు అవుతాడు. 1740 ప్రాంతాలలో విద్యుచ్ఛక్తికి సంబంధించి ఇతగాడు ఓ
ఆసక్తికరమైన సూచన చేశాడు. ఒక విధమైన విద్యుత్ ద్రవం ఉంటుందని ఇతడు సూచించాడు. ఏదైనా
పదార్థంలో మామూలుగా కన్నా ఎక్కువ మోతాదులో ఆ విద్యుత్ ద్రవం ఉన్నప్పుడు అందులో ఒక రకమైన
విద్యుదావేశం ఉంటుంది. మామూలుగా కన్నా తక్కువ మోతాదులో విద్యుత్ ద్రవం ఉన్నప్పుడు అందులో
రెండవ రకం విద్యుదావేశం ఉంటుంది.
(మెరుపులో ఉండేది విద్యుత్ శక్తేనని నిరూపించడానికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ చేస్తున్న ప్రయోగం)
గాజులో మామూలుగా
కన్నా ఎక్కువ మోతాదులో విద్యుత్ ద్రవం ఉంటుందని
ఫ్రాన్క్‍లిన్ భావించాడు. అందుచేత గాజులో ఉన్న దాన్ని ధనాత్మక విద్యుదావేశం
(positive charge) అన్నాడు. అందుకు వ్యతిరేకంగా రెసిన్ (resin) లో వున్నది ఋణాత్మక విద్యుదావేశం
(negative charge) అన్నాడు. ఫ్రాన్క్‍లిన్ పరిచయం చేసిన పరిభాష ఇప్పటికీ వుంది. ఆ కారణం
చేతనే మనం విద్యుత్ ప్రవాహపు దిశని వాస్తవ దిశకి వ్యతిరేకంగా నిర్వచించడం జరిగింది.
0 comments