ఆ నిష్పత్తులని
మార్చాలంటే y యొక్క ఒక పరమాణువు x యొక్క ఒక పరమాణువు కన్నా కాస్త పెద్ద అంశంతోనో,
కాస్త చిన్న అంశంతోనో కలవాలి. కాని డెమాక్రిటస్ కాలం నాటి నుండి కూడా పరమాణువుని విభజించడానికి,
హెచ్చించడానికి గాని వీలు కాదన్న నమ్మకం చలామణిలో వుంది. కనుక ఒక మూలకం యొక్క పరమాణువు
యొక్క పరిమాణాన్ని పెంచడానికి గాని, తగ్గించడానికి గాని వీలు కాదు.
అందుచేత పదార్థం
అంతా పరమాణు మయం అని అనుకుంటే ‘నియత నిష్పత్తుల నియమం’ దాని సహజ పర్యవసానం అవుతుంది.
అంతేకాక, నియత నిష్పత్తుల నియమం అనేది ఒక వాస్తవం కనుక, దాని కారణంగా పరమాణు సిద్ధాంతం
కూడా నిజమని నమ్మాల్సి వస్తుంది.
డాల్టన్ సిద్ధాంతం
జాన్ డాల్టన్
(1766-1844) అనే బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త ఆ కోణం నుండి ఆలోచిస్తూ వచ్చాడు. అతడి
ఆలోచనలకి అతను చేసిన కొన్ని అధ్యయనాలు మద్దతు నిచ్చాయి. కొన్ని సందర్భాల్లో రెండు మూలకాలు
పలు నిష్పత్తుల వద్ద కలవగలవని అతడు గుర్తించాడు. అంతేకాక ఒక్కొక్క నిష్పత్తి వద్ద ఒక
ప్రత్యేక సమ్మేళనం పుడుతోందని గుర్తించాడు.
అందుకు ఉదాహరణగా
కార్బన్, ఆక్సిజన్ లు కలిసిన సమ్మేళనాలు తీసుకుందాం. (భారాన్ని బట్టి) మూడు భాగాల కార్బన్
ఎనిమిది భాగాల ఆక్సిజన్ తో కలిసినప్పుడు కార్బన్ డయాక్సయిడ్ పుడుతుంది. కాని మూడు భాగాల
కార్బన్ నాలుగు భాగాల ఆక్సిజన్ తో కలిసినప్పుడు కార్బన్ మోనాక్సయిడ్ పుడుతుంది. అలాంటి
పరిస్థితుల్లో ఒక కచ్చితమైన కార్బన్ రాశితో కలిసే ఆక్సిజన్ మొత్తాన్ని పరిగణిస్తే,
ఆ రెండు మొత్తాల భారం యొక్క నిష్పత్తిని సరళమైన పూర్ణ సంఖ్యల రూపంలో వ్యక్తం చెయ్యొచ్చని
గుర్తించాడు డాల్టన్. కార్బన్ డయాక్సయిడ్ లో ఉండే ఎనిమిది భాగాల ఆక్సిజన్, కార్బన్
మోనాక్సయిడ్ లో ఉండే నాలుగు భాగాల ఆక్సిజన్ కి సరిగ్గా రెండు రెట్లు వుంది.
దీన్నే బహుళ
నిష్పత్తుల నియమం (law of multiple proportions) అంటారు. ఎన్నో రసాయన చర్యలలో ఈ నియమం
పని చేస్తుందని గుర్తించిన డాల్టన్ 1803 లో
దీనికొన నియమంగా ప్రకటించాడు.
ఈ బహుళ నిష్పత్తుల
నియమం కూడా కచ్చితంగా పరమాణు సిద్ధాంతంతో సరిపోతోంది. ఉదాహరణకి ఆక్సిజన్ పరమాణువులు
కార్బన్ పరమాణువుల కన్నా 4/3 రెట్లు బరువు ఉన్నాయనుకుందాం. ఒక కార్బన్ పరమాణువు ఒక
ఆక్సిజన్ పరమాణువుతో కలిసి ఒక కార్బన్ మోనాక్సయిడ్ ఏర్పడినప్పుడు ఆ సమ్మేళనంలో భారాన్ని
బట్టి మూడు భాగాల కార్బన్ నాలుగు భాగాల ఆక్సిజన్ ఉండి తీరాలి.
అలాగే మరి ఒక
కార్బ పరమాణువు రెండు ఆక్సిజన్ పరమాణువులతో కలిసి కార్బన్ డయాక్సయిడ్ ఏర్పడినప్పుడు
అందులో మూడు భాగాల కార్బన్, ఎనిమిది భాగాల ఆక్సిజన్ ఉండాలి.
ఆ విధంగా సరళమైన
నిష్పత్తులలో మూలకాలు కలుస్తాయని గుర్తించినప్పుడు, సంపూర్ణ పరమాణువుల కలయిక చేత అణువులు
ఏర్పడుతాయని అర్థం చేసుకోవచ్చు. మరి పదార్థంలో సర్వత్ర వున్నది పరమాణువులే నని అనుకుంటే
పదార్తానికి పదార్థానికి మధ్య తేడా అందులోని పరమాణువుల కూర్పులోనే వస్తోందని సులభంగా
గ్రహించవచ్చు. అందుచేత బహుళ నిష్పత్తుల నియమం ఎలా వచ్చిందో తెలుస్తుంది.
నియత నిష్పత్తుల
నియమాన్ని, బహుళ నిష్పత్తుల నియమాన్ని ఆధారంగా చేసుకుంటూ 1803 లో డాల్టన్ తన సొంత పరమాణు
సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు, అందులో డెమాక్రిటస్ సిద్ధాంతాలని ప్రస్తావించాడు.
పదార్థంలో అతి సూక్ష్మమైన, అవిభాజ్యమైన అంశాలకి డెమాక్రిటస్ వాడిన ‘atom’ అన్న పదాన్నే
అతడు కూడా వాడాడు.
1808 లో అతడు
‘నూతన రసాయన తత్వం’ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. అందులో తన పరమాణు సిద్ధాంతాన్ని విపులంగా
చర్చించాడు. అదే సంవత్సరం అతడి బహుళ నిష్పత్తుల సిద్ధాంతాన్ని మరో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త
స్వతంత్రంగా పరీక్షించి నిర్ధారించాడు. ఆ రసాయన శాస్త్రవేత్త పేరు విలియమ్ హైడ్ వొలాస్టన్
(1766-1828). రసాయనిక సమాజాలలో మంచి పరపతి గల ఈ వొలాస్టన్ డాల్టన్ సిద్ధాంతానికి వత్తాలు
పలికాడు. ఆ కారణం చేత డాల్టన్ సిద్ధాంతాలని త్వరలోనే రసాయనిక శాస్త్ర సమాజం సమ్మతించింది.
కాని పరమాణు
సిద్దాంతాన్ని సమ్మతిస్తే ఒక విధంగా పరుసవేదులు నమ్మినట్టుగా నిమ్న జాతి పదార్థాలని
ఉత్తమ జాతి పదార్థాలుగా రూపాంతరీకరించ వచ్చన్న భావనకి సమాధి కట్టినట్టే అయ్యింది. ప్రత్యేక
లోహాలలో ప్రత్యేక జాతి పరమాణువులు ఉంటాయన్న భావనకి ఆధారాలు పెరుగుతూ వచ్చాయి. పరమాణువులు
అవిభాజ్యాలు కనుక, మార్పుకి లొంగనివి కనుక ఎట్టి పరిస్థితుల్లోని సీసపు పరమాణువుని
బంగారపు పరమాణువుగా మార్చే ప్రసక్తి రాదని అర్థమయ్యింది. అందుచేత సీసాన్ని బంగారంగా
మార్చడం అసంభవం.
డాల్టన్ ప్రతిపాదించిన
పరమాణువులు మరీ చిన్నవి గనుక వాటిని సూక్ష్మదర్శినిలో చూడడానికి వీలుపడదు. కనుక ప్రత్యక్షంగా
చూసి వాటి ఉన్కిని నిర్ధారించడం అసంభం. కాని పరోక్షంగా చేసిన కొలతల సహాయంతో వాటి ఉన్కిని
గుర్తించడమే కాక వాటి సాపేక్ష భారాలని కూడా తెలుసుకోడానికి వీలయ్యింది.
(ఇంకా వుంది)
0 comments