ఇలా వుండగా ఇటాలియన్ భౌతికశాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా
(1745-1827) ఓ కొత్త విషయాన్ని కనుక్కున్నాడు.
రెండు లోహపు
బద్దలని, వాటి మధ్య విద్యుదావేశానికి ప్రవేశాన్ని ఇచ్చే ద్రవం ఉండేలా అమర్చినప్పుడు
అలాంటి ఏర్పాటు వల్ల నిరంతరాయంగా విద్యుదావేశం ప్రవహిస్తుందని నిరూపించాడు. ఆ విధంగా
అతడు మొట్టమొదట బ్యాటరీని కనుక్కున్నవాడు అయ్యాడు. బ్యాటరీ సహాయంతో అతడి విద్యుత్ ప్రవాహాన్ని
పుట్టించాడు.
రెండు లోహాలు,
వాటిని వేరు చేసే ద్రావకం కారణంగా ఈ విద్యుత్ ప్రవాహం ఏర్పడింది. వోల్టా కృషి వల్ల
విద్యుత్తుకి రసాయన చర్యలకి మధ్య ఏదో సంబంధం వుందన్న సూచన బయటపడింది. కాని ఆ సూచన యొక్క పర్యవసానాలని విపులీకరించడానికి
మరో శతాబ్ద కాలం ఆగాల్సి వచ్చింది. రసాయన్న చర్య వల్ల విద్యుచ్ఛక్తి పుట్టినప్పుడు,
అందుకు వ్యతిరేక దిశలో ఆలోచిస్తే విద్యుచ్ఛక్తి వల్ల రసాయన చర్య జరగవచ్చన్న అవకాశం
గోచరించింది.
నిజానికి వోల్ట్
తన కృషిని ప్రకటించిన ఆరు వారాల లోపే విలియమ్ నికోల్సన్ (1753-1815), ఆంథొనీ కార్‍లైల్
(1768-1840) అనే ఇద్దరు బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్తలు ఆ వ్యతిరేక ప్రభావాన్ని నిరూపించారు.
నీట్లోంచి విద్యుత్ ప్రవాహాన్ని పోనిచ్చినప్పుడు నీట్లో ముంచిన లోహపు బద్దల వద్ద ఏదో
వాయువు బుడగల రూప్ంలో ఏర్పడడం ఆ శాస్త్రవేత్తలు గమనించారు. ఒక లోహపు బద్ద వద్ద ఏర్పడ్డ
వాయువు హైడ్రోజెన్, రెండవ లోహపు బద్ద వద్ద ఏర్పడ్డ వాయువు ఆక్సిజన్ అని వాళ్లు నిరూపించారు.
కార్లైల్, నికోల్సన్
లు సాధించింది ఏమిటంటే నీటిని హైడ్రోజెన్, ఆక్సిజన్ వాయువులుగా విశ్లేషించ వచ్చని నిరూపించడం.
విద్యుత్ ప్రవాహాన్ని వాడి ఆ విధంగా పదార్థాన్ని విశ్లేషించే ప్రక్రియని ‘ విద్యుత్
విశ్లేషణ’ అంటారు. కావెండిష్ నిరూపించిన ఫలితానికి
వ్యతిరేక ఫలితాన్ని వీళ్లు నిరూపించారు. హైడ్రోజెన్, ఆక్సిజన్ లని కలిపితే నీరు పుడుతుందని
కావెండెష్ నిరూపిస్తే, నీటిని ఆ రెండు వాయువులుగా వేరు చేయొచ్చని ఈ ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలు
నిరూపించారు.
ఈ ప్రయోగం ద్వార
హైడ్రోజెన్, ఆక్సిజన్ వాయువులని పుట్టించి వాటిని వేరు వేరు పాత్రలలో సేకరించినప్పుడు
ఆక్సిజన్ కన్నా హైడ్రోజెన్ ఘనపరిమాణం రెండు రెట్లు ఉందని గుర్తించబడింది. హైడ్రోజెన్
పరమాణువు ఆక్సిజన్ పరమాణువు కన్నా తేలికైనది అని తెలిసిందే. కాని దాని ఘనపరిమాణం ఎక్కువగా
వుందంటే నీట్లో ఆక్సిజన్ కన్నా హైడ్రోజెన్ పరమాణువులు ఎక్కువగా ఉండాలని తెలుస్తోంది.
అంతే కాక పైన
చెప్పుకున్న ప్రయోగం హైడ్రోజన్ ఘనపరిమాణం ఆక్సిజన్ ఘనపరిమాణం కన్నా రెండు రెట్లు వుంది
కనుక, ఒక్క నీటి అణువులు రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు ఉంటుందని
అనుకోడానికి అవకాశం ఏర్పడుతుంది. డాల్టన్ ఊహించినట్టు నీటి అణువులో ఒక హైడ్రోజన్ పరమాణువు,
ఒక ఆక్సిజన్ పరమాణువు ఉండకపోవచ్చు.
ఘనపరిమాణం విషయం
అలా ఉంటే బరువు విషయం కాస్త భిన్నంగా వుందని ముందు చూశాం. భారం బట్టి చూస్తే నీట్లో
ఒక భాగం హైడ్రోజన్ ఎనిమిది భాగాల ఆక్సిజన్ తో కలుస్తోంది. అంటే ఒక ఆక్సిజన్ పరమాణువు
బరువు, రెండు హైడ్రోజన్ పరమాణువుల మొత్తం బరువు కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువై ఉండాలి.
అంటే ఒక హైడ్రోజన్ పరమాణువు బరువు కన్నా ఒక ఆక్సిజన్ పరమాణువు బరువు పదహారు రెట్లు
బరువు ఎక్కువై ఉండాలి. అందుచేత హైడ్రోజన్ బరువు 1
అనుకుంటే ఆక్సిజన్ బరువు 16 కావాలి, 8 కాదు.
(ఇంకా వుంది)
(ఇంకా వుంది)
0 comments