పైన ఇంత వరకు
మనం చెప్పుకున్న వాదనలలో ఒక విషయం గోచరిస్తోంది.వాయువు ఏదైనా, అందులో వున్నవి అణువులైనా,
పరమాణువులైనా వాటి మధ్య దూరాలు మాత్రం ఒక్కటే నన్న విషయం ప్రస్ఫుటం అవుతోంది.అంటే ఒక
నియత సంఖ్యలో రేణువులు ఉన్న వాయువు, ఆ వాయువు ఏదైనా సరే, దాని ఘనపరిమాణం ఒక్కటే కావాలి.
ఒకే సంఖ్యలో
రేణువులు ఉన్న వాయువు ఘనపరిమాణం ఎప్పుడూ ఒక్కటే కావాలి అని మొట్టమొదట సూచించిన వాడు
ఇటాలియన్ రసాయన శాస్త్రవేత్త అమేడియో అవొగాడ్రో (1776-1856).1811 లో చేయబడ్డ ఈ ప్రతిపాదనని అవొగాడ్రో ప్రతిపాదన అంటారు.
అవొగాడ్రో ప్రతిపాదనని కచ్చితంగా అర్థం చేసుకుంటే హైడ్రోజన్ పరమాణువులకి, హైడ్రోజెన్
అణువులకి మధ్య తేడా గుర్తించొచ్చు. అలాగే ఇతర
వాయువుల యొక్క అణువులకి, పరమాణువులకి మధ్య తేడా కూడా గుర్తించొచ్చు.అయితే అవొగాడ్రో
కాలం తరువాత ఒక అర్థశతాబ్ద కాలం పాటు ఈ ప్రతిపాదనని ఎవరూ పట్టించుకోలేదు.ముఖ్యమైన వాయువుల
విషయంలో కూడా అణువులకి, పరమాణువులకి మధ్య తేడా తెలుసుకోకుండా అయోమయంగా వ్యవహరించేవారు
రసాయన శాస్త్రవేత్తలు.ఆ కారణం చేత ఎన్నో ముఖ్యమైన మూలకాల విషయంలో కూడా పరమాణుభారాన్ని
అంచనా వెయ్యడంలో ఎంతో అనిశ్చితి ఉండేది.
అదృష్టవశాత్తు
పరమాణు భారాలలోని దోషాలని సరిదిద్దటానికి ఇతర మార్గాలు బయటపడ్డాయి. ఉదాహరణకి 1818 లో
పియర్ లూయీ దులాంగ్ (1785-1838) అనే ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త, అలెక్సీ పియర్ పెతీ
(1791-1820) అనే ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త కలిసి కృషి చేస్తూ అలాంటి ఓ మార్గాన్ని
కనుక్కున్నారు. మూలకాల విశిష్టోష్ణం (specific heat) (ఒక కచ్చితమైన ఉష్ణాన్ని ఒక వస్తువు గ్రహించినప్పుడు
దాని ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుందో ఈ రాశి తెలుపుతుంది) వాటి పరమాణుభారానికి విలోమంగా
(inversely) మారుతుందని వాళ్లు కనుక్కున్నారు. ఉదాహరణకి x అనే మూలకం యొక్క పరమాణుభారం y అనే మూలకం యొక్క పరమాణు భారానికి రెండు రెట్లు ఉన్నట్లయితే,
ఈ మూలకాలతో చెయ్యబడి ఒకే ద్రవ్యరాశి గల రెండు వస్తువులని తీసుకుంటే, ఆ రెండు వస్తువులు
ఒకే విలువ గల ఉష్ణాన్ని గ్రహిస్తే, x యొక్క
ఉష్ణోగ్రత పెరిగిన విలువ y యొక్క ఉష్ణోగ్రత
పెరిగిన విలువలో సగమే ఉంటుంది. అంటే పరమాణు భారాలు ఎక్కువగా ఉండే మూలకాలు అంత సులభంగా
వేడెక్కవు అన్నమాట. దీన్నే పరమాణు ఉష్ణ నియమం (Law of atomic heat) అంటారు.
ఆ కారణం చేత
తెలియని పరమాణు భారం గల ఒక మూలకం యొక్క విశిష్టోష్ణాన్ని కొలిస్తే దాని పరమాణు భారం
గురించి చూచాయగా నయినా తెలుస్తుంది.అయితే ఈ పద్ధతి ఘనరూపంలో ఉండే మూలకాల విషయంలో మాత్రమే
పని చేసింది.కాని ఏమీ లేని దాని కన్నా ఈ పాక్షిక ఫలితమైనా మేలేనని అనుకోవాలి.
తదనంతరం ఐల్హార్డ్
మిట్షర్లిష్ (1794-1863) అనే జర్మన్ రసానయ శాస్త్రవేత్త మరో ఆసక్తికరమైన సత్యాన్ని
కనుక్కున్నాడు.1819 లో ఇతడు ఒకే పరమాణువిన్యాసం గల సమ్మేళనాలు కలిసి స్ఫటికీకరిస్తాయి
అన్న విషయాన్ని కనుక్కున్నాడు.అంటే ఒక సమ్మేళనానికి చెందిన అణువులు అలాంటి ఆకారమే గల
రెండవ సమ్మేళనానికి చెందిన అణువుల మధ్య ఇంపుగా ఒదిగిపోతాయి అన్నమాట.
ఈ రకమైన ఏకరూపతా
నియమానికి (Law of isomorphism) ఓ ముఖ్యమైన పర్యవసానం కనిపించింది.రెండు సమ్మేళనాలు
కలిసి స్ఫటికీకృతం కాగలవని తెలిస్తే, వాటిలో ఒక దాని నిర్మాణం తెలిస్తే, రెండవ దాని
నిర్మాణం కూడా అదే విధంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.ఆ విధంగా ఏకరూపమైన స్ఫటికలతో
చేసిన అధ్యయనాల ఆధారంగా ప్రాయోగికులు పరమాణు భారంలో వచ్చిన దోషాలని కొంతవరకు సరిదిద్దుకోగలిగారు.
0 comments