భారాలు – చిహ్నాలు
మన కథలో తదుపరి
ముఖ్యమైన మలుపు స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త జోన్స్ జేకబ్ బెర్జీలియస్ రంగప్రవేశం చెయ్యడంతో జరిగింది. డాల్టన్ తరువాత
పరమాణు సిద్ధాంతాన్ని కచ్చితంగా స్థాపించడంలో ఇతడు కీలకమైన పాత్ర పోషించాడు.1807 లో
బెర్జీలియస్ వివిధ సమ్మేళనాల పరమాణు విన్యాసాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మునిగి వున్నాడు.వందలాని
విశ్లేషణలు చేసి ‘నియత నిష్పత్తుల నియమాని’కి ఎన్నో తార్కాణాలు కనుక్కున్నాడు.అన్ని
ఆధారాలు బయట పడ్డాక ఇక రసాయనిక సమాజాలు ఆ నియమాన్ని నిర్లక్ష్యం చెయ్యలేకపోయాయి.క్రమంగా
పరమాణు సిద్ధాంతానికి మద్దతు పెరిగింది.ఆ విధంగా నియత నిష్పత్తుల నియమంలో వేళ్లూని
పరమాణు సిద్ధాంతం స్థిరంగా ఎదిగింది.
ఆ తరువాత బెర్జీలియస్
లోగడ డాల్టన్ వాడిన విధానాల కన్నా అధునాతన విధానాలు వాడి పరమాణుభారాలని కొలవడానికి
ప్రయత్నించాడు.ఈ ప్రయత్నంలో బెర్జీలియస్ గతంలో డులాంగ్ మరియు పెతీ లు, మిట్షర్లిష్
లు సాధించిన వైజ్ఞానిక ఫలితాలని వాడుకున్నాడు.అలాగే గే లుసాక్ ప్రతిపాదించిన మేళవించే
ఘనపరిమాణాల నియమాన్ని కూడా స్వీకరించాడు. (కాని అవొగాడ్రో ప్రతిపాదనను మాత్రం వినియోగించ లేదు.)
1828 లో బెర్జీలియస్ ప్రచురించిన మొట్టమొదటి
పరమాణు భారాల పట్టిక, రెండు మూడు మూలకాల విషయంలో తప్ప, ఆధునిక విలువలతో చక్కగా సరిపోతోంది.
డాల్టన్ పట్టికకి
బెర్జీలియస్ పట్టికకి మధ్య ఓ ముఖ్యమైన తేడా వుంది.డాల్టన్ విషయంలో లాగా కాక బెర్జీలియస్
పట్టికలో పరమాణుభారాలలో చాలా మటుకు పూర్ణ సంఖ్యలు కావు. డాల్టన్ అంచనా వేసిన విలువలు,
హైడ్రోజెన్ పరమాణు భారం 1 అన్న భావన మీద ఆధారపడి వున్నాయి కనుక, అవన్నీ పూర్ణ
సంఖ్యలుగా ఇవ్వబడ్డాయి. ఈ భావనని పురస్కరించుకుని బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియమ్
ప్రూస్త్ ఓ చిత్రమైన సూచన చేశాడు.1815 లో ఇతగాడు హైడ్రోజన్ తో కూర్చబడ్డవే నని సూచించాడు.(తోటి
శాస్త్రవేత్తల విమర్శకి భయపడి కాబోలు మొదట్లో ఇతడు ఈ సూచనని అజ్ఞాతంగా చేశాడు.)ఈ వాదన
ప్రకారం వివిధ పరమాణువులకి వివిధ పరమాణు భారాలు ఉండడానికి కారణం వాటిలో వివిధ సంఖ్యలో
హైడ్రోజన్ పరమాణువులు ఉండడమే.ఈ వాదనకే తదనంతరం ప్రూస్త్ ప్రతిపాదన అని పేరొచ్చింది.
ఈ సరళమైన, ఆకర్షణియమైన
వాదనని బెర్జీలియస్ పట్టిక వ్యతిరేకిస్తున్నట్టు అయ్యింది. (ఇది ఆకర్షణీయమైన వాదన ఎందుకయ్యింది
అంటే ఇది మూలకాలు అన్నిటికీ మూలంగా ఒకే పదార్థం
వుందని, అదే హైడ్రోజన్ అని సూచిస్తోంది. ఒక విధంగా అది గ్రీకుల భావాలకి కొత్త ఊపిరి
పోస్తున్నట్టు అయ్యింది. అలా అనుకుంటే విశ్వంలో అందమైన క్రమం, సౌష్టవం ఉన్నట్టు అనిపించింది). కాని హైడ్రోజన్
= 1 అనే కొలమానాన్ని స్వీకరిస్తే, ఆ కొలమానం
ప్రకారం ఆక్సిజన్ పరమాణుభారం 15.9 అవుతుంది.
కాని ఆక్సిజన్ పరమాణువులో 15 సంపూర్ణ హైడ్రోజన్ పరమాణువులు, మరియు ఒక హైడ్రోజన్
పరమాణువులులో 9/10 భాగం ఉంటాయని అనుకోడానికి ఇబ్బంది కరంగా అనిపించింది.
మరో శతాబ్ద కాలం
పాటు ఇంకా ఇంకా కచ్చితమైన, నిర్దుష్టమైన పరమాణు భారాల పట్టికలు ప్రచురించబడుతూ వచ్చాయి.వీటిని
బట్టి వివిధ మూలకాల పరమాణు భారాలు హైడ్రోజన్ పరమాణు భారానికి పూర్ణసంఖ్య గుణకాలు కావన్న
విషయం క్రమంగా తేటతెల్లం కాసాగింది.
1860 లలో జాన్
సర్వే స్టాస్ (1813-1891) అనే బెల్జియన్ రసాయన శాస్త్రవేత్త బెర్జీలియస్ చేసిన దాని
కన్నా మరింత కచ్చితంగా పరమాణు భారాలు కొలిచాడు. అలాగే ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశలలో
తియోడోర్ విలియమ్ రిచర్‍డ్స్ (1868-1928) అనే అమెరిక రసాయన శాస్త్రవేత్త అసామాన్యమైన
జాగ్రత్తలు తీసుకుంటే, రసాయన విధాలతో సాధ్యమైనంత వరకు అత్యంత నిర్దుష్టమైన రీతిలో పరమాణుభారాలు
కొలిచాడు.
బిర్జీలియస్
కృషిలో ఏమైనా లొసుగులు ఉంటే ఆ లొసుగులని స్టాస్, రిచర్‍డ్స్ ల కృషి పూరించింది.పరమాణు
భారాల యొక్క అపూర్ణ సంఖ్యాత్మక విలువలని ఒప్పుకోక తప్పలేదు.ఈ అధ్యయనాలన్నీ ప్రూస్త్
ప్రతిపాదన మీద చావుదెబ్బ కొడుతున్నట్టు అయ్యింది.
కాని రిచర్‍డ్స్
వంటి వారు ఒక పక్క అత్యంత నిర్దుష్టమైన ఫలితాలని ప్రకటిస్తున్నా మరో పక్క పరమాణు భారాల
సమస్యని మూలం నుండి శోధించాల్సిన అవసరం కనిపించింది.అసలు పరమాణు భారం అంటే ఏమిటి అన్న
ప్రశ్నకి కొత్తస సమాధానాలు వెతకాల్సిన అవసరం కనిపించింది.దాంతో సమాధి అయిపోయింది అనుకున్న
ప్రూస్ట్ ప్రతిపాదన మళ్లీ కొత్త ఊపిరి పోసుకుంది.
(ఇంకా వుంది)
0 comments