వివిధ మూలకాల
పరమాణు భారాల మధ్య సరళ పూర్ణాంక నిష్పత్తులు లేవన్న వాస్తవం పరమాణు భారాల కొలమాన విధానాలని
కొత్తగా సమీక్షించేలా చేసింది.హైడ్రోజన్ ని ప్రమాణంగా తీసుకుని పరమాణుభారాలని అంత వరకు
వ్యక్త చేస్తూ వచ్చారు కనుక ఆ ప్రమాణాన్ని మరో సారి పరిశీలించేలా చేసింది. తేలికైనది
కనుక హైడ్రోజన్ పరమాణు భారం 1 అనుకోవడం అత్యంత
సహజమైన విషయంలా తోచింది. డాల్టన్, బెర్జీలియస్ లు ఇద్దరూ ఆ ప్రమాణాన్ని స్వీకరించారు.
కాని ఆ ప్రమాణాన్ని స్వీకరించడం వల్ల ఆక్సిజన్ పరమాణు భారం 15.9 అని వచ్చింది. పరమాణు భారాల కొలతలలో ఆక్సిజన్ కి
ముఖ్య స్థానం వుంది.ఎన్నో మూలకాలతో సులభంగా చర్య జరిపే ఆక్సిజన్ ని వివిధ మూలకాలు ఏ
నిష్పత్తులలో కలుస్తాయో తేల్చుకోడానికి ఆక్సిజన్ ని వాడేవారు.
అందుచేత హైడ్రోజన్
ని ప్రమాణంగా తీసుకోకుండా ఆక్సిజన్ ని ప్రమాణంగా తీసుకుని దాని పరమాణు భారాన్ని పూర్ణాంకం
వచ్చేలా కొద్దిగా సవరించారు. ఆ విధంగా 15.9
అనుకున్న ఆక్సిజన్ పరమాణు భారం 16.0
అయ్యింది. ఆక్సిజన్ పరమాణు భారం
16 అనుకుంటే తదనుగుణంగా హైడ్రోజన్ పరమాణు
భారం 1.008 అనుకోవాల్సి వచ్చింది. ఆక్సిజన్
= 16 అనే ప్రమాణాన్ని ఇరవయ్యవ శతాబ్దపు మధ్య
దశ వరకు వాడుతూ వచ్చారు. ఆ దశలోనే పరమాణు భారాలని కాస్త సవరించి మరింత సహేతుకమైన ప్రమాణాన్ని
ఎంచుకున్నారు.
పరమాణు సిద్ధాంతాన్ని
స్వీకరించడం జరిగాక ప్రతీ అణువులోను ఒక నియత సంఖ్యలో కొన్ని ప్రత్యేక మూలకాలకి చెందిన
పరమాణువులు ఉంటాయని ఊహించుకోడానికి వీలయ్యింది.పరమాణువులని చిన్న చిన్న చక్రాలుగా వ్యక్తపరుస్తూ
అణువులని అలాంటి చక్రాల సముదాయాలుగా చిత్రీకరించడానికి వీలయ్యింది.
ఈ విధమైన చిత్రీకరణని
విస్తృతంగా వాడినవాళ్లలో డాల్టన్ ఒకడు.ఆక్సిజన్ ని ఓ మామూలు చక్రంతో వ్యక్తం చేసేవాడు.హైడ్రోజన్
పరమాణువుని లోన ఓ చుక్క వున్న చక్రంతో వ్యక్తం చేసేవాడు.నైట్రోజన్ పరమాణువుని లోన్న
ఓ నిలువు గీత వున్న చక్రంతో వ్యక్తం చేసేవాడు.కార్బన్ ని ఓ నల్లని చక్రంతో వ్యక్తం
చేసేవాడు.ఇలా ప్రతీ మూలకానికి ఓ ప్రత్యేకమై చిత్రాన్ని ఊహించడం కొంచెం కష్టం కనుక చక్రాల్లో
ఓ అక్షరాన్ని చొప్పిస్తూ కొన్ని మూలకాలకి ప్రతీకలు తయారుచేశాడు. ఉదాహరణకి సల్ఫర్ యొక్క
ప్రతీకలో చక్రంలో ‘S’ అక్షరం ఉంటుంది. ఫాస్ఫరస్
ప్రతీకలో చక్రంలో ‘P’ అక్షరం ఉంటుంది.
ఈ చక్రాల చిత్రాలన్నీ
చూసిన బెర్జీలియస్ అసలీ చక్రాలు అనవసరం అని, ఊరికే అక్షరాలని మూలకాలకి ప్రతీకలుగా వాడితే
సరిపోతుందని భావించాడు.ప్రతీ మూలకాన్ని ఓ అక్షరంతో సూచించాలని, ఆ అక్షరం ఆ మూలకాన్నే
కాక ఆ మూలకానికి చెందిన పరమాణువుని కూడా సూచించాలని అతడు ప్రతిపాదించాడు.ఆ అక్షరం ఆ
మూలకం యొక్క లాటిన్ పేరులోని ప్రథమాక్షరం కావాలన్నాడు.(ఇలాంటి ఏర్పాటు ఇంగ్లీష్ భాష
మాట్లాడే వారికి ఎంతో సౌకర్యంగా తోచింది. ఎందుకంటే మూలకాల లాటిన్ పేర్లు, ఇంగ్లీష్
పేర్లు ఇంచుమించు ఒకేలా ఉంటాయి).రెండు మూలకాల పేర్లలో మొదటి అక్షరం ఒక్కటే అయినప్పుడు
రెండవ అక్షరం కూడా జత చేసేవారు.ఆ విధంగా మూలకాల యొక్క రసాయన చిహ్నాలు ఆవిర్భవించాయి.ఆ
చిహ్నాలే అంతర్జాతీయంగా స్వీకరించబడి ఇప్పటికీ వాడుకలో వున్నాయి.
ఆ ప్రకారంగా
కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ లు వరుసగా C, H, O, N, P, S అనే చిహ్నాలని సంతరించుకున్నాయి. అదే విధంగా కాల్షియమ్,
క్లోరిన్ ల చిహ్నాలు వరుసగా Ca, Cl అయ్యాయి. కార్బన్ కి చిహ్నంగా C ని ముందే
వాడడం జరిగింది కనుక ఈ రెండు మూలకాల విషయంలో రెండవ అక్షరాన్ని వాడవలసి వచ్చింది. లాటిన్
పేర్లకి, ఇంగ్లీష్ పేర్లకి మధ్య మరీ ఎక్కువ తేడా వున్నప్పుడు ఇవ్వబడ్డ రసాయన చిహ్నాలు
కాస్త విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకి బంగారం (), వెండి (), సీసం () మూలకాలకి ఇవ్వబడ్డ
చిహ్నాలు వరుసగా Au (“Aurum”), Ag (“Argentum”), Pb (“Plumbum”) అయ్యాయి.
ఈ చిహ్నాలతో
ఒక అణువులో ఎన్ని పరమాణువులు ఉంటాయో కూడా సూచించవచ్చు.హైడ్రోజన్ అణువులో రెండు హైడ్రోజన్
పరమాణువులు ఉంటాయి కనుక దాన్ని H2 తో సూచిస్తారు.
నీటి అణువులో రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు ఉంటుంది కనుక దాన్ని
H2O తో సూచిస్తారు. మూలకం చిహ్నం పక్కన అంకె
లేకపోతే ఆ మూలకానికి చెందిన ఒకే పరమాణువు ఉందన్నమాట. అలాగే కార్బన్ డయాక్సయిడ్ చిహ్నం
CO2, సల్ఫ్యురిక్ ఆసిడ్ చిహ్నం H2SO4, హైడ్రోజన్ క్లోరైడ్ చిహ్నం HCl. ఈ సమ్మేళనాల
రసాయనిక సూత్రాలు స్వయం విదితాలు.
(ఇంకా వుంది)
0 comments