శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


ఔషధాలు

పెర్కిన్ సాధించిన విజయం తరువాత ఇంకా ఇంకా సంక్లిష్టమైన సహజ సమ్మేళనాలని కృత్రిమంగా సంయోజించే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇండిగో వంటి అరుదైన సందర్భాలలో తప్ప, వ్యాపార దృష్టితో చూసినప్పుడు, ఈ సంయోజిత సమ్మేళనాలు సహజ సమ్మేళనాలతో పోటీ పడలేకపోయాయి. అయినా కూడా సంయోజనం వల్ల కొన్ని లాభాలు లేకపోలేదు. సంయోజనం చేత పదార్థాల అణువిన్యాసాన్ని నిర్ధారించుకోడానికి వీలయ్యింది. అణువిన్యాసం తెలిస్తే అందుకు సైద్ధాంతిక ప్రయోజనాలే కాక, ఎన్నో ప్రాపంచిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అలాంటి ఒక తార్కాణంగా జర్మన్ రసాయన శాస్త్రవేత్త రిచర్డ్ విల్‍స్టాటర్ (1872-1942) సాధించిన విజయాన్ని చెప్పుకోవచ్చు. ఇతగాడు మొక్కల పచ్చదనానికి కారణమైన క్లోరోఫిల్ (chlorophyll) అణువిన్యాసాన్ని శోధించి తేల్చుకున్నాడు. మొక్కల్లో ఉండే ఈ పదార్థం కాంతిని లోనికి గ్రహించగలుగుతుంది. ఈ అణువు వల్లనే కాంతిలోని శక్తిని వాడి కార్బన్ డయాక్సయిడ్ నుండి కార్బోహైడ్రేట్ ని ఉత్పత్తి చెయ్యడానికి వీలవుతుంది.




రిచర్డ్ విల్స్టాటర్

హైన్రిచ్ ఆటో వీలాండ్ (1877-1957) మరియు అడోల్ఫ్ విండౌస్ (1876-1859)  స్టీరాయిడ్ ల (steroids) యొక్క, తత్సంబంధిత ఇతర సమ్మేళనాల యొక్క అణువిన్యాసాలని శోధించారు. (స్టీరాయిడ్ ల జాతికి చెందిన రసాయనాలలో ఎన్నో ముఖ్యమైన హార్మోన్లు ఉన్నాయి.)

ఆటో  వాలాక్ (1847-1931) అనే మరో జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఎంతో ప్రయాసపడి టర్పీన్లు అనబడే వృక్షతైలాల అణువిన్యాసాన్ని తెలుసుకున్నాడు. (అలాంటి తైలాల కుటుంబంలో మెథనాల్ ఓ ముఖ్యమైన ఉదాహరణ.) అలాగే హన్స్ ఫిషర్ (1881-1945) అనే మరో రసాయన శాస్త్రవేత్త నెత్తుటికి ఎర్రనిరంగు నిచ్చే ‘హీమ్’ (heme) అనే అణువు యొక్క విన్యాసాన్ని శోధించాడు.

విటమిన్లు, హార్మోన్లు, ఆల్కలాయిడ్లు మొదలగు రసాయన జాతులన్నీ ఇరవయ్యవ శాతాబ్దంలో శోధించబడ్డాయి. వాటిలో ఎన్నో అణువుల విన్యాసం తేటతెల్లమయ్యింది. ఉదాహరణకి 1930 లలో స్విస్ రసాయన శాస్త్రవేత్త పాల్ కారర్ (1889-1971) కెరటినాయిడ్ లు అనబడే జాతికి చెందిన రసాయనాల అణు విన్యాసాన్ని శోధించాడు. ఇవి చెట్ల నుండి పుట్టే అద్దకాల జాతి. వీటికి విటమిన్ ఏ కి సన్నిహితమైన సంబంధం వుంది. 

బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ రాబిన్సన్ (1886-1975) ఆల్కలాయిడ్ లని క్రమబద్దంగా శోధించాడు. ఇతడు సాధించిన అత్యుత్తమ విజయం 1925 లో ‘మార్ఫిన్’ అణువిన్యాసాన్ని ఛేదించడం. (ఒక్క పరమాణువు వద్ద మాత్రం అతడు పొరబడ్డాడు.) అలాగే 1946  లో అతడు స్‍ట్రిక్నిన్   (strychnine) విన్యాసాన్ని శోచించాడు. రాబిన్సన్ సాధించిన విజయాలని తదనంతరం అమెరికన్ రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ బర్న్స్ వుడ్వర్డ్స్ (1917-1979) నిర్ధారించాడు. వుడ్వర్డ్ తన అమెరికన్ సహోద్యోగి అయిన విలియమ్ ఫాన్ ఎగ్గర్స్ డోయరింగ్ (1917-2011) తో కలిసి రసాయనిక సంయోజనలో ప్రయత్నాలు మొదలెట్టాడు. ఇరువురూ కలిసి 1944  లో క్వైనైన్ ని సంయోజించారు. ఆ విధంగా ఆదిలో పెర్కిన్ తలపెట్టి సాధించలేకపోయిన లక్ష్యాన్ని ఈ అమెరికన్ రసాయన శాస్త్రవేత్తలు సాధించారు.

వుడ్వర్డ్ ఇంకా ముందుకి వెళ్లి మరింత జటిలమైన అణువులని కూడా సంయోజించాడు. 1951  లో అతడు కొలెస్టరాల్  (cholesterol, ఇదొక సర్వసామాన్యమైన స్టిరాయిడ్) ని సంయోజించాడు. అదే ఏడాది అతడు కార్టిసోన్ ని (cartisone) కూడా సంయోజించాడు.  ఇదొక స్టిరాయిడ్ హార్మోన్. 1956   లో అతడు రిసెర్పీన్ (resperpine) ని సంయోజించాడు. మత్తు మందుల్లో ఇది మొదటిది. 1960  లో ఇతడు క్లోరోఫిల్ ని సంయోజించాడు. 1962  లో అతడు ఓ ప్రత్యేకమైన, సంక్లిష్టమైన సమ్మేళనాన్ని సంయోజించాడు. ఆ సమ్మేళనానికి ఆంటీబయాటిక్ అక్రోమైసిన్ తో సంబంధం వుంది.

మరో నవ్య దిశలో కృషి చేస్తున్న రష్యన్-అమెరికన్ రసాయన శాస్త్రవేత్త ఫోబస్ ఆరన్ థియోడోర్ లెవీన్ (1869-1940) న్యూక్లియోటైడ్ లు అనబడే అణువుల కుటుంబాన్ని శోధించాడు. (జన్యువులకి మూర్తిరూపాలైన డీ.ఎన్.ఏ. అణువులలో ఇవి ముఖ్యాంశాలు). అతడి పరిశోధనా ఫలితాలని తదనంతరం స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త అలెగ్జాండర్ రాబర్టస్ టాడ్ (1907-1997) నిర్ధారించాడు. 1940, 1950 లలో ఇతగాడు వివిధ న్యూక్లియోటైడ్ లని, తదితర అణువులని, సంయోజించాడు.

అలా సంయోజించబడ్డ అణువులలో ఆల్కలాయిడ్ ల వంటి అణువులకి ఎన్నో వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ‘ఔషదాలు’ అనే కుటుంబం లోకి ఈ సమ్మేళనాలని చేర్చవచ్చు. పూర్తిగా కృత్రిమంగా సంయోజించబడ్డ సమ్మేళనాలకి కూడా అలాంటి ప్రయోజనాలు ఉంటాయని, వాటిని కూడా మందుల లాగా వినియోగించవచ్చని ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశలలోనే గుర్తించారు.

అలా సంయోజించబడ్డ ఆర్స్‍ఫినమిన్ (arsphenamine) అనే సమ్మేళనాన్ని 1909 లో జర్మన్ బాక్టీరియాలజిస్ట్ అయిన పాల్ ఎహర్లిక్ (1854-1915) సిఫిలిస్ వ్యాధికి మందుగా వాడాడు. ఈ మొదటి మెట్టే ‘రసాయనిక చికిత్స’ (chemotherapy) అనే సాంప్రదాయానికి పునాది అయ్యింది అంటారు. ప్రత్యేక రోగాలకి ప్రత్యేక మందులని వాడి చికిత్స చేసే పద్ధతినే కెమోథెరపీ అంటారు.


పాల్ ఎహర్లిక్

1908  లో సల్ఫానిలమైడ్ (sulfanilamide) అనే ఓ సమ్మేళనం సంయోజించబడింది. ప్రయోజనాలు తెలియకుండా సంయోజించబడ్డ లెక్కలేనన్ని సమ్మేళనాల జాబితాలో ఈ సమ్మేళనం కూడా చేరింది. కాని 1932 లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త గెర్హార్డ్ డోమాక్ (1895-1964) యొక్క పరిశోధనల వల్ల సల్ఫానిలమైడ్, తదితర సమ్మేళనాలని, ఎన్నో అంటువ్యాధుల చికిత్సలో వాడొచ్చని తెలిసింది. కాని ఈ విషయంలో మాత్రం సహజోత్పత్తుల నుండి పుట్టిన సమ్మేళనాల వాడకం సంయోజిత సమ్మేళనాలని మించిపోయింది. అలాంటి సమ్మేళనాలలో ముందుగా చెప్పుకోదగ్గది పెన్సిలిన్. దీని గురించి 1928 లో స్కాటిష్ బాక్టీరియాలజిస్ట్  అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (1881-1955) కాకతాళీయంగా కనుక్కున్నాడు. ఫ్లెమింగ్ స్టెఫిలోకాకస్ క్రిములు ఉన్న ఓ మిశ్రమాన్ని మూత తెరిచి వొదిలేశాడు. కొన్ని రోజుల తరువాత వచ్చి చూడగా ఆ మిశ్రమానికి బూజు పట్టి ఉండడం కనిపించింది. జాగ్రత్తగా పరిశీలించి చూడగా బూజు ఉన్న చోట అంతా బాక్టీరియా క్రిములు నిర్మూలించబడి వుండడం కనిపించింది. అందులో ఏదైనా క్రిమినాశక ఔషధం దాగి వుందేమో నని ఆ మిశ్రమాన్ని విశ్లేషించాడు. కాని విశ్లేషణ మరీ జటిలం కావడంతో విషయం ఎటూ తేలలేదు.


అలెగ్జాండర్ ఫ్లెమింగ్

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts