శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

రామానుజన్ హార్డీల స్నేహం

Posted by V Srinivasa Chakravarthy Thursday, June 25, 2015


అలాంటి పరిస్థితుల్లో రామానుజన్ కి హార్డీ అందించిన స్నేహం కొంత వరకు ఆ ఒంటరితనాన్ని భరించగలిగేలా చేసింది అనడంలో సందేహం లేదు. గణిత రంగంలో పరస్పర పూరకమైన శక్తులు గల వీరిద్దరూ కలిసి సాధించిన విజయాలు ఇద్దరికీ గణిత లోకంలో శాశ్వత యశస్సుని సంపాదించిపెట్టాయి.  ‘విభాగాల’ సిద్ధాంతం మీద వీరు చేసిన కృషి ఒక్కటి చాలు, గణితవేత్తలుగా వీరి జీవితాలని సార్థకం చెయ్యడానికి.
గణితవేత్తగా పాశ్చాత్య గణిత ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉన్నవాడు హార్డీ. పాశ్చాత్య గణిత సాంప్రదాయంలో మహోత్కృష్ట సారాన్ని పుణికి పుచ్చుకున్న వాడు. ఎక్కువగా లోజ్ఞానం మీద ఆధారపడి శరవేగంతో ముందుకు దూసుకుపోయే రామానుజన్ వడికి ఒక స్థిరత్వాన్ని, పొరబడని గమనాన్ని ఆపాదించింది హార్డీ స్వభావం. 

ఎప్పుడూ రామానుజన్ ని సమర్ధించేవాడు, ప్రోత్సహించేవాడు, ప్రశంసించేవాడు. మారని స్నేహాన్ని రామానుజన్ కి అందించి తన వారికి దూరంగా ఓ మహోన్నత లక్ష్యసాధన కోసం పని చేస్తున్న రామానుజన్ కి ఆ లక్ష్యసాధన మరింత సులభం అయ్యేలా  పరిస్థితులు కల్పించాడు. హార్డీ ప్రోత్సాహం ఒక విధంగా రామానుజన్ గణిత ప్రయాసలని పోషించే ఓ అక్షయమైన ఇంధనం అయ్యింది. సహృదయంతో అందించినా ఆ ప్రోత్సాహం, ప్రోద్బలం రామానుజన్ జీవితంలో కొన్ని విచిత్ర కారణాల వల్ల ఒక విధంగా చూస్తే దుష్పరిణాలుగా దాపురించాయి.
ఇండియాలో ఉన్న రోజుల్లోనే గణితమే లోకం అన్నట్టుగా కాలం గడుపుతూ వచ్చాడు రామానుజన్. కాలేజిలో రోజుల్లో లెక్కల్లో తప్ప ఇతర రంగాల్లో అభిరుచి లేదని తెలిసిపోయాక, పూర్తిగా గణితం మీదే తన సమయం అంతా వెచ్చించాడు. పోర్ట్ ట్రస్ట్ లో చేసిన ఉద్యోగం కూడా పొట్ట కూటి కోసం తప్ప ఉద్యోగం మీద మక్కువ చేత కాదు. స్కాలర్షిప్ వచ్చాక ఆ కాస్త ప్రయాస కూడా తప్పింది. ఇక పూర్తిగా గణితానికే  అంకితమైపోయాడు. గణితం ధ్యాసలో పడి ఇక ఆహారం, విరామం మొదలైనవన్నీ విస్మరించి గణితంలోనే మునిగితేలేవాడు.

ఇంగ్లండ్ వెళ్లాక తను వచ్చిందే గణితం కోసం కనుక ఈ ధోరణి మరింత తీవ్రమయ్యింది. ఆహారవ్యవహారాదుల వల్లనైతేనేమి, బ్రిటిష్ వారి ముభావ స్వభావం వల్లనైతే నేమి, తన ఒంటరితనాన్ని పూరించుకోడానికి గణితంలో తన పరిశ్రమని మరింత ఉధృతం చేశాడు. ఇలాంటి నేపథ్యంలో హార్డీతో స్నేహం, హార్డీ తనతో వ్యవహరించే తీరు యజ్ఞంలా సాగే ఆ గణితసాధనలో మరి కాస్త ఆజ్యం పోసిందే గాని, క్రమంగా తన చుట్టూ ఏర్పడుతున్న ఆ బంగారు పంజరం లోంచి తప్పించలేకపోయింది.

మహోత్కృష్టమైన ఆదర్శాల కోసం తప్ప నిమ్నజాతి లక్ష్యాల కోసం ప్రాకులాటని హార్డీ ఎప్పుడూ సమర్ధించేవాడు కాడు. చిన్న ఫలితాన్ని సాధించి దాన్ని గొప్పగా ప్రదర్శించుకోవాలని చూసే రకాలని నిర్దాక్షిణ్యంగా కడిగేసేవాడు. రాజీ పడని విద్యాప్రమాణాలు గల వాడు. ఆ  ప్రమాణాలని అన్యులకే కాక, తనకి కూడా కచ్చితంగా వర్తింపజేసుకుంటూ జీవించేవాడు. అందుకే తన చుట్టూ పని చేసే వారు తమ శాయశక్తులా ప్రయత్నించి అత్యుత్తమ ఫలితాలని సాధించడానికి ప్రయత్నిస్తారు. హార్డీ గురించి బాగా తెలిసిన జె.సి. బర్కిల్ అనే గణిత వేత్త హార్డీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది అంటాడు. తనతో మాట్లాడితే “మనం తక్కువ వాళ్ళం” అన్న భావన కలుగుతుంది అనేవాడు. ఒక సారి లూయి జె. మార్డెల్ అనే గణితవాత్త తను రాసిన ఓ వ్యాసాన్ని ఎన్నో పత్రికలు అన్యాయంగా తిప్పికొట్టాయని,  ఆ వ్యాసాన్ని ఓ సారి పరిశీలించి తన అభిప్రాయం చెప్పమని హార్డీకి పంపాడు. సానుభూతి చూపించి మెచ్చుకుంటాడని ఆశిస్తుంటే, ఆ వ్యాసానికి హార్డీ స్పందన పుండు మీద కారంలా అనిపించింది. “మీరు పంపిన వ్యాసం మీద మూడు గంటలు వెచ్చించాను… ఒక్క  పేజీలోనే ముప్పై తప్పులు కనిపించాయి…అవన్నీ ‘అల్పమైన’ విషయాలు అని మీరు పట్టించుకోకపోయి వుండొచ్చు…” హార్డీ  దృష్టిలో ఏదీ అల్పం కాదు. ఒక్క పొరబాటు కూడా దొర్లకుండా, మహోన్నత ప్రమాణాల అనుసారం చెయ్యని గణితం అసలు గణితమే కాదు.

అలా నిక్కచ్చిగా వ్యవహరించే తీరు వెనుక  అసూయ మాత్రం  లేదు.  హార్డీ స్వభావం గురించి మాట్లాడుతూ “కుటిలత్వం ఏ కోశానా లేని ఉదారస్వభావుడు, అసూయ అన్నది ఎరగని వాడు” అంటాడు బ్రిటిష్ రచయిత సి. పి. స్నో (C.P. Snow). కనుక హార్డీ అవతలి వారిలో తప్పులు ఎన్నితే దానికి కారణం కుటిలత్వమో, అసూయో కాదు. అవతలి వారికి నచ్చినా, నచ్చకున్నా గణిత రంగంలో హార్డీ  ప్రమాణాలు అలాంటివి.
అలాంటి ప్రమాణాలు గల స్నేహితుడు దొరకడం ఒక విధంగా రామానుజన్ అదృష్టం. ఒక విధంగా  ఆ ప్రమాణాలే రామానుజన్ మీద ఒత్తిడి పెంచి ఇంగ్లండ్ లో తన బ్రతుకును మరింత దుర్భరం చేశాయి.

ఒక సారి రామానుజన్ అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ సమయంలో హార్డీ తన స్నేహితుడికి రాసిన జాబు ఇలా వుంది – “…నువ్వు ఈ సమయంలో బయట ఉంటే ఎంతో బావుండేది. ప్రస్తుతం నా వద్ద కొన్ని అధ్బుతమైన (గణిత) సమస్యలు ఉన్నాయి. నువ్వు వచ్చాక వాటి మనిద్దరం వాటి మీద పనిచెయ్యొచ్చు. నా నీ ప్రస్తుత పరిస్థితుల్లో  అలాంటి కఠినమైన సమస్యల మీద పని చెయ్యగలవో లేదో మరి తెలీదు…” అని రాస్తూ ఆఖర్లో మాత్రం “ప్రస్తుతానికి మాత్రం నువ్వు డాక్టర్లు చెప్పినట్టు నడచుకోవడం తప్ప మరేమీ చెయ్యలేవనుకుంటాను. కాని ఈ (గణిత) విషయాల గురించి ఓ సారి ఆలోచించగలవేమో చూడు. ఇవి చాలా ఆసక్తికరమైన విషయాలు.”
స్నేహితుడు ఆసుపత్రిలో మంచం పట్టి ఉన్న పరిస్థితుల్లో కూడా హార్డీ అతణ్ణి ఊపిరి తీసుకోనివ్వడం లేదు.  రామానుజన్ స్పందన కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేది. ఆసుపత్రిలో తనకి ఇచ్చిన గదిలో మరీ చలిగా వుందని, బాత్ రూమ్ మాత్రం మరింత వెచ్చగా వుందంటూ రామానుజన్  హార్డీకి ఇలా జవాబు రాశాడు – “బాతు రూమ్ లు హాయిగా, వెచ్చగా ఉన్నాయి. రోజూ పెన్ను, కాగితం తీసుకుని వెళ్లి బాత్ రూమ్ లో ఓ గంట కూర్చుంటాను. త్వరలోనే రెండు, మూడు వ్యాసాలు పంపగలను. ఈ ఆలోచన అంతకు ముందు రాలేదు సుమా. వచ్చి వుంటే ఇప్పటికే ఎంతో రాసి వుండేవాణ్ణి…. ఒక్కటి మాత్రం నీకు నమ్మకంగా చెప్పగలను. నేను బాత్ రూమ్ కి వెళ్లేది స్నానం చెయ్యడానికి కాదు, లెక్కలు చెయ్యడానికి.”

అంత అనారోగ్యంలో కూడా తగినంత స్థాయిలో గణితం చెయ్యలేక పోతున్నందుకు స్నేహితుణ్ణి క్షమాపణ అడుగుతున్నట్టుగా వుంది  రామానుజన్ ఉత్తరం.
ఆ విధంగా నిద్రాహారాల గురించి పట్టించుకోని ఎడతెగని శ్రమ రామానుజన్ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts