పెర్కిన్ సాధించిన
ఘనవిజయాన్ని చూసిన రసాయన శాస్త్రవేత్తలకి రసాయనిక సంయోజనం మీదకి దృష్టి మళ్లింది. అది
జరిగిన కొంత కాలానికే కేకులే తన నిర్మాణ సూత్రాలని ప్రతిపాదించి అసలు ఈ రంగం మొత్తానికి పునాదులు వేశాడు. ఆ పునాదుల
ఆధారంగా తగు రసాయన చర్యలని నడిపించడానికి అవసరమైన విధానాలని రూపొందించ గలిగారు. నిర్మాణ
సూత్రాలని ఆధారంగా చేసుకుని ఒక అణువుని మరో అణువుగా మార్చడానికి అవసరమైన పద్ధతులని
రూపొందించ గలిగారు. పెర్కిన్ చేసినట్టుగా కాకతాళీయంగా రసాయన సమ్మేళనాలని తయారు చెయ్యడం
కాకుండా, సంకల్ప పూర్వకంగా రసాయనాలని సంయోజించే ప్రయత్నం మొదలుపెట్టారు.
అలా రూపొందించ
బడ్డ రసాయన చర్యలకి తరచు వాటి నిర్మాతల పేరు పెట్టడం జరిగేది. ఉదాహరణకి ఒక అణువుకి
రెండు కార్బన్ పరమాణువులని కలిపే చర్యకి పెర్కిన్ చర్య అని పేరు పెట్టారు. అలాగే నైట్రోజన్
పరమాణువుని కలిగిన ఓ పరమాణువలయాన్నిబద్దలు కొట్టగల చర్యని పెర్కిన్ గురువైన హోఫ్మన్ కనిపెట్టాడు. ఆయన పేరు మీదే ఆ చర్యకి ‘హోఫ్మన్ నిమ్నీకరణము’
(Hoffman degradation) అని పేరు పెట్టారు.
1864 లో హోఫ్మన్ తిరిగి జర్మనీ కి వెళ్లిపోయాడు. తన యువ
శిష్యుడు అంకురార్పణ చేసిన ఈ కొత్త సంయోజక కర్బన రసాయన శాస్త్రంలో పూర్తిగా నిమగ్నం
కావాలని నిశ్చయించాడు. ఆ విధంగా హోఫ్మన్ జర్మనీ లో సంయోజక కర్బన రసాయన శాస్త్రానికి
శంకుస్థాపన చేశాడు. జర్మనీ లో అలా ఆరంభమైన ఆ రంగంలో మొదటి ప్రపంచ యుద్ధం వరకు కూడా
జర్మనీ మొత్తం ప్రపంచంలోనే అగ్రస్థానాన నిలిచింది.
సహజ అద్దకాలని
ప్రయోగశాలలలో పునరుత్పత్తి చేసేవారు. 1867
లో బాయర్ (strain theory ని ప్రతిపాదించింది ఇతడే) ఈ రంగంలో ఓ ప్రత్యేక పరిశోధనా కార్యక్రమాన్ని ఆరంభించాడు. ఆ ప్రయత్నంలో
ఇండిగో సయోజనం సాధ్యమయ్యింది. ఈ విజయం వల్ల (ఇండియా వంటి) తూర్పు దేశాలలో మొక్కల నుండి
ఇండిగో తయారు చేసే పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. 1868 లో బాయర్ శిష్యుడైన కార్ల్ గ్రేబే
(1841-1927) అలిజరిన్ (alizarin) అనే మరో ముఖ్యమైన సహజ అద్దకాన్ని సంయోజించాడు.
ఇలాంటి ప్రప్రథమ
విజయాల పునాదుల మీద అనువర్తిత రసాయన శాస్త్రం (applied chemistry) అనే మహాసౌధం నిలిచింది.
గత శాతాబ్దం లోనే ఆ రంగం మన జీవితాల మీద గణనీయమైన ప్రభావం చూపించింది అన్న విషయం మనకి
తెలుసు. ఉన్న కర్బన రసాయన అణువులని రూపాంతరీకరించడానికి, లేని వాటిని రూపొందించడానికి
లెక్కలేనన్ని కొత్త విధానాలు కనిపెడుతూ వచ్చారు. ఆ పరిణామాల గురించి తెలుసుకోవాలంటే
సాంప్రదాయక రసాయన సిద్ధాంతం నుండి కాస్త పక్కకి తప్పుకుని ఆ విధానాలలో కొన్ని ప్రధానమైన
వాటిని పరిశీలించాలి. ఇంతవరకు మనం చెప్పుకున్న రసాయన శాస్త్రచరిత్రలో ఒక కచ్చితమైన
క్రమం, ఇతివృత్తంలో ఒక పొందిక ఉంది. కాని ఈ అధ్యాయంలోను, ఇంకా వచ్చేఅధ్యాయంలో కూడా
కథని ధారావాహికంగా చెప్పకుండా కొన్ని ప్రత్యేక విజయాలని, మైలురాళ్లు అని చెప్పుకోదగ్గ
కొన్ని ప్రత్యేక పరిణామాలని మాత్రం వర్ణించడం జరుగుతుంది. ఆ సంఘటనలు ఒక దానితో ఒకటి
పెద్దగా సంబంధం లేనట్టుగా కనిపించొచ్చు. ముఖ్య కథతో సంబంధం లేనట్టు కనిపించినా ఈ పరిణామాలు
మానవ సమాజం మీద రసాయన శాస్త్ర ప్రభావానికి అద్దం పట్టే తార్కాణాలు. కనుక వాటిని ప్రస్తావించక
తప్పదు. అలాంటి తార్కాణాలని వర్ణించిన తరువాత ఆఖరు మూడు అధ్యాయాలలో ఇక్కడి దాకా చెప్పుకున్న
కథని మళ్లీ కొనసాగించి ధారావాహికంగా చెప్పుకుందాము.
(ఇంకా వుంది)
మంచి విషయాలు తెలిచేసారు నమస్కారము
మంచి విషయాలు తెలిచేసారు నమస్కారము