ఆ విధంగా హార్డీ ప్రోత్సాహంతో,
కేంబ్రిడ్జ్ ఇచ్చిన గుర్తింపుతో రామానుజన్ క్రమంగా గణితలోకపు శిఖరాలని ఎగబ్రాకాడు.
ఆధునిక భారతానికి చెందిన అత్యుత్తమ గణితవేత్తగా మన్ననలు అందుకున్నాడు. ఆయిలర్, జెకోబీ
లాంటి గణిత ప్రపంచపు మహానుభావులతో పోల్చబడ్డాడు. ఈ విధంగా రామనుజన్ కీర్తి దిశ దిశలా
వ్యాపిస్తుంటే పైపైన చూసే వారికి అంతకన్నా అదృష్టవంతుడు లేడని అనిపిస్తుంది. ఏ మనిషైనా
ఇంత కన్నా కోరుకునేది ఏముంది? కుంభకోణంలో గడిపిన రోజులలా కాక ఇప్పుడు నిత్యావసరాల కోసం
చూసుకోవలసిన పని లేదు. వంశానికి, ప్రాంతానికి మాత్రమే కాక మొత్తం దేశానికే గణితంలో
తరగని కీర్తి గణించాడు. కాని ఒక పక్క ఇన్ని సత్ఫలితాలు సాధిస్తున్నా రామానుజన్ లో మరో
పక్క ఆంతరికంగా ఓ కనిపించని దుష్పరిమాణం చోటుచేసుకుంటోంది. ఒక పక్క లోకం అంతా గౌరవించే
గణితవేత్త, ఆంతరికంగా తనకంటూ పెద్దగా ఎవరూ లేని ఒంటరివాడు అయిపోయాడు. ఒక పక్క ఇంగ్లండ్
దేశం తనకి ఆకాశానికెత్తి ఓ గొప్ప గణితవేత్తగా తనని గుర్తించినా, ఆ దేశంలో పరాయివాడిగా,
విదేశీయుడిగా, ఓ బానిస దేశం నుండి వచ్చిన ఓ కందిశీకుడిగా, తన వారికి తన దేశానికి దూరంగా
గడిపిన రోజులు తనని కృంగదీశాయి. తగినంత సంపద
ఉన్నా తనకి అనువైన ఆహారానికి నోచుకోలేక ఆరోగ్యాన్ని క్రమంగా పాడుచేసుకున్నాడు. ఈ విపరీత
పరిస్థితులకి ఆధారమైన కారణాలు ఎలా పరిణమించాయో
గమనిద్దాం.
ఇంగ్లండ్ కి రమ్మని హార్డీ
రామానుజన్ ని ఆహ్వానించినప్పుడు రామానుజన్ పెట్టిన షరతులలో ఒకటి – తనకి శాకాహార సదుపాయం
ఏర్పాటు చెయ్యాలి. అలాగేనని ఒప్పించి రప్పించాడు హార్డీ. శ్రోత్రియ బ్రాహ్మణ వంశం నుండి
వచ్చిన వాడు కనుక ఆహర వ్యవహారాలలో చాలా నిష్టగా ఉండేవాడు రామానుజన్. ఆహారవ్యవహారాలలో
కొన్ని వర్గాల వారు ఇంత నిష్టగా ఉండడానికి కారణం వుంది. మనం తినే ఆహారం మన ఆలోచనలని,
స్వభావాన్ని మలచుతుంది అన్న భావనే అందుకు కారణం. ఈ భావనకి నిదర్శనంగా ఓ కథ చెప్తారు.
ఒక నిరుపేద బ్రాహ్మణుడు విపరీతమైన
ఆకలితో ఇంటింటికీ యాచిస్తూ పోయాడట. ఒక గడప వద్ద ఓ వ్యక్తి పిలిచి భోజనం పెట్టాడట. బాగా
ఆకలి మీద ఉండటంతో ఆ ఇచ్చింది ఎవరో ఏమిటో కూడా చూడకుండా తినేశాడట ఆ బ్రాహ్మణుడు. ఆకలి
తీరాక కొంత దూరం పోయాక చీకటి పడింది. తలదాచుకోడానికి ఓ ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటాయన
లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాడట. ఆ రాత్రి తనకి ఆతిథ్యం ఇచ్చిన ఇంట్లో ఓ బంగారు విగ్రహాన్ని
చూశాడట. ఇంటాయన చేసిన మేలు మరచి ఆ విగ్రహంతో పరారయ్యాడట ఆ బ్రాహ్మణుడు. కొంత దూరం పోయాక
పశ్చాత్తాపం కలిగి విగ్రహాన్ని తిరిగి తెచ్చి తనకి ఆతిథ్యం ఇచ్చిన ఇంటాయన్ని క్షమించమని
అడిగాడట. “ఫరవాలేదులే, బాధపడకు,” అన్నాడట ఆ ఇంటాయన. “నిన్ను నీకు అన్నం పెట్టింది ఓ
దొంగ. నువ్వు అతడు పెట్టిన అన్నం తింటున్నప్పుడే చూసి అనుకున్నాను, ఇలాంటిదేదో జరుగుతుందని.”
ఆహార వ్యవహారాలలో రామనుజన్ పాటించిన నియమాల గురించి వివరాలు పెద్దగా
లేవు. అయితే పరమ నిష్టగా ఉండేవాడని మాత్రం మిత్రులు చెప్తారు. ఉల్లి తినేవాడు కాడంటారు.
అసలు టొమాటోలు కూడా తాకేవాడని మరి కొందరు. ఇంగ్లండ్ కి వెళ్లిన కొత్తల్లో ఒకటి రెండు
సార్లు బంగాళ్ల దుంపల వేపుడు కావాలని అడిగితే కాలేజి మెస్ లో అలాగే చేసి ఇచ్చారు. అయితే
ఆ వేపినది పంది కొవ్వులో! అది తెలిసిన రామానుజన్ కాలేజి మెస్ లో తినడం మానేశాడు. తనే
సొంతంగా పప్పుదినుసులు తెప్పించుకుని తనకి అలవాటైన సాంబారు, పెరుగు, తనకి అత్యంత ప్రియమైన
‘రసం’ (చారు), ఘాటైన వేపుళ్ళు, మొదలైనవి చేసుకుని తినేవాడట. ఈ ఏర్పాటు వల్ల భోజనాల
దగ్గర అందరితో కలిసి సరదాగా తినే అవకాశాన్ని కోల్పోయాడు. తక్కిన సమయాలలో శాస్త్ర విషయాలలో
లోతైన చర్చలో పడిపోయినా, భోజనాల వద్ద మాత్రం కాలేజి ప్రొఫెసర్లంతా సరదాగా కాలేక్షేపం
చేసేవారు. వేరేగా తినడం వల్ల తన సహోద్యోగులతో సరదాగా గడిపే అవకాశం పోగొట్టుకున్నాడు.
ఒంటరితనాన్ని కొని తెచ్చుకున్నాడు రామనుజన్.
ఆహారవ్యవహారాల వల్ల వచ్చిన
ఇబ్బందులు ఇలా ఉండగా అసలు ఓ విదేశీయుడిగా ఇంగ్లండ్లో
ఉండడం వల్ల ఇతర ఇబ్బందులు తలెత్తాయి. ఓ గణిత వేత్తగా కేంబ్రిడ్జ్ లోని గణిత సమాజం తనని
గౌరవించినా, విశ్వవిద్యాలయపు గోడలు దాటి బయటి ప్రపంచంలోకి అడుగుపెడితే తను కేవలం ఓ
విదేశీయుడు మాత్రమే. అదీ గాక రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన ఓ బానిస
దేశానికి చెందిన సామాన్యుడు. పైగా రూపురేఖలలో తెల్ల వారి గుంపులో ప్రత్యేకంగా, ప్రస్ఫుటంగా
కనిపించే నల్లని ఛాయ వాడు. నల్లని ఛాయగల వారి
పట్ల తెల్లవారు సహజంగా కనబరిచే జాత్యహంకారాన్ని ఆ రోజుల్లో బ్రిటన్ లో భారతీయులు ఎన్నో
సందర్భాలలో ఎదుర్కుంటూ ఉండేవారు.
దీనికి తోడు బ్రిటిష్ వారికి
భారతీయులకి మధ్య స్వభావంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.
మనం ఒకరి ఇంటికి అతిథిగా
వెళ్లినప్పుడు, ఆ ఇంటివాళ్లు కలుపుగోరుగా ఉంటూ, గలగలా మాట్లాడే స్వభావం గలవారైతే అతిథికి
సంతోషంగా ఉంటుంది. ఆ ఇంటికి, ఇంటి వాతావరణానికి సులభంగా అలవాటు పడగలుగుతాడు. అట్లా
కాకుండా ఇంట్లో వారు ముభావంగా, మౌనంగా ఉంటూ, ‘నన్ను తాకబోకు నా మాల కాకి’ అనే ధోరణిలో
ఉంటే ఇంటికి వచ్చిన అతిథికి నరకం అయిపోతుంది.
బ్రిటిష్ వారు స్వాభావికంగా
కొత్తవారితో సులభంగా మాట్లాడరు. పూనుకుని మాటకలపడానికి ప్రయత్నించినా త్వరగా స్పందించరు.
కొత్తవారి పట్ల వారు ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరి తెలీని వారికి పొగరుపోతుతనంలా కనిపిస్తుంది.
బ్రిటన్లో జీవించిన ఎందరో భారతీయులు బ్రిటిష్ వారి యొక్క ఈ లక్షణం వల్ల తాము ఎలా ఇబ్బంది
పడిందీ, పరాయి దేశంలో ఎలా ఒంటరితనాన్ని అనుభవించినదీ చెప్పుకుంటారు. పోనీ నోరు మెదపి
మాట్లాడినా పైపై విషయాల గురించి, బాహ్య విషయాల గురించి మాట్లాడాలి. వ్యక్తిగత విషయాల
గురించి మనసు విప్పి బాహాటంగా మాట్లాడడం వారి సంస్కృతికి విరుద్ధం. కాని అలాంటి పద్ధతి
మన సంస్కృతికి విరుద్ధం! ఇద్దరు భారతీయులు కలిస్తే ఐదు నిముషాలలో ఒకరి వ్యక్తిగత విషయాలు
ఒకరికి, అడగకుండానే, క్షుణ్ణంగా తెలిసిపోతాయి! ఇలాంటి సంస్కృతిలో మనసులో ఏదైనా బాధ
ఉన్నప్పుడు, సులభంగా పొరుగువాడితో చెప్పుకుని స్వాంతన పొందే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం
లేని బ్రిటన్ లో విదేశీయులకి, ముఖ్యంగా ఆనాటి భారతీయులకి, ఒంటరితనం పెరగడంలో ఆశ్చర్యం
లేదు.
రామానుజన్ ఒంటరితనాన్ని పెంచడానికి
కొంతవరకు కుంభకోణంలో తన కుటుంబంలో వచ్చిన పరిణామాలు కూడా కారణం కావచ్చు. రామనుజన్ తరచు
తన ఇంటికి ఉత్తరాలు రాస్తుండేవాడు. తరచు తన ఇంటి నుండి కూడా ఉత్తరాలు వస్తుండేవి. ఎక్కువగా
తల్లి రాస్తుండేది, అప్పుడప్పుడు జానకి కూడా రాస్తుండేది. కాని క్రమంగా జానకి నుండి
ఉత్తరాలు తగ్గిపోయి ఒక దశలో పూర్తిగా ఆగిపోయాయి. ఇంట్లో ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు.
ఎంతో మంది అత్తగార్లలాగానే కోమలతమ్మ జానకిని తన గుప్పెట్లో ఉంచుకోడానికి చూసేది. జానకిని
సూటిగా భర్తకి ఉత్తరాలు రాయనిచ్చేది కాదు. జానకి మీద కొడుక్కి చాడీలు చెప్పేది. జానకికి
తన గోడు చెప్పుకునే అవకాశం ఇచ్చేది కాదు. ఒక
సారి రామానుజన్ కి ఓ పార్సెలు పంపాల్సి వుంది. ఇంటి నుండి నానా రకాల భోజనపదార్థాలు,
పప్పు దినుసులు రామానుజన్ కి రవాణా అవుతుండేవి. ఒక సారి అలాంటి పార్సెల్ లో అత్తగారు
ఇంట్లో లేని సమయం చూసి జానకి ఓ చిన్న చీటీ రాసి పెట్టింది. ఇంటికి తిరిగొచ్చిన అత్తగారు
అది చూసి చీటీ పెట్టినందుకు తిట్టి పోసింది. భర్త లేని ఆ ఇంట్లో జానకి బతుకు దుర్భరం
అయిపోయింది. అత్తగారు తనకి కట్టుకోడానికి ఎప్పుడూ నాసిరకం చీరలే ఇచ్చేది. తన కంటూ చిల్లి
గవ్వ కూడా ఉండనిచ్చేది కాదు. కావేరికి వెళ్ళి నీళ్లు తేవడం దగ్గర్నుంచి, ఇంటిల్లి చాకిరీ
తన నెత్తిన పడేది. మద్రాస్ లో ఉండే రోజుల్లో భర్తతో పాటు ఒకే చూరు కింద జీవించే రోజుల్లో
కూడా భర్తతో పెద్దగా మాట్లాడనిచ్చేది కాదు. పెళ్లయింది అన్నమాటే గాని భర్తతో కాపురం
చేసింది లేదు. ఒక దశలో రామానుజన్ అనారోగ్యం సంగతి ఇంట్లో తెలిసింది. దురదృష్ట జాతకురాలైన
జానకిని పెళ్ళి చేసుకోవడం వల్లనే తన కొడుక్కి ఇలాంటి దుస్థితి పట్టిందని కోమలతమ్మ కోడలిని
ఆడిపోసుకునేది. ఎప్పుడూ నోరు విప్పని రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యంగారు కూడా ఒక
దశలో భర్య చేస్తున్న అన్యాయాన్ని బలంగా ఖండిస్తూ,
కోడలిని సమర్ధించాడు. భర్త అభిప్రాయానికి ఎప్పుడూ విలువ ఇవ్వని భార్య ఈ సందర్భంలో కూడా
భర్తని పట్టించుకోలేదు. ఇల్లు విడిచి పారిపోవడం తప్ప జానకికి వేరే గత్యంతరం కనిపించలేదు.
ఒక
సారి జానకమ్మ తమ్ముడి పెళ్ళి నిశ్చయమయ్యింది. పెళ్ళి తమ సొంతూరు అయిన రాజేంద్రం లో
జరగనుంది. పెళ్ళికని వెళ్ళిన జానకమ్మ మళ్ళీ కుంభకోణానికి తిరిగి రాలేదు. ఆ రోజుల్లో
జానకి తమ్ముడు పాకిస్తాన్ లోని కరాచిలో పని చేసేవాడు. తమ్ముడి తో పాటు కరాచికి వెళ్లిపోయింది.
మళ్ళీ రామానుజన్ ఇండియాకి తిరిగి వచ్చినంత వరకు తన మెట్టింటి వారి ముఖం చూడలేదు.
ఇంటి
నుండి వెళ్ళిపోయిన భార్య నుండి ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. ఇంట్లో ఏం జరిగిందో రామానుజన్
కి తెలీదు. కొంత కాలం వరకు బాధని మనసులోనే దాచుకున్నాడు. ఒక దశలో ఇక ఉండబట్టలేక హార్డీ
తదితరులతో తన కష్టాన్ని పంచుకున్నాడు.
(ఇంకా వుంది)
0 comments