ఆధ్యాయం 10
సంయోజక కర్బన
రసాయన శాస్త్రం (Synthetic Organic Chemistry)
అద్దకాలు
పందొమ్మిదవ శతాబ్దపు
మొదటి భాగంలో బెర్థెలొ మొదలగు వాళ్లు రసాయన సమ్మేళనాలని సంయోజించే తొలి ప్రయత్నాలు
చేస్తున్న దశలో, తమకి తెలిసిన సైన్స్ పరిధిని గణనీయంగా విస్తరింపజేస్తున్నారు. వారి
పరిశోధనలని వాస్తవ భౌతిక ప్రపంచానికే పరిమితం చెయ్యకుండా, ప్రకృతి చేసే సృజనకి ప్రతి
సృజన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకనాడు ఆ సృజనలో ప్రకృతినే మించి పోవాలని చూస్తున్నారు.
సంయోజక కొవ్వు పదార్థాల విషయంలో బెర్థెలొ చేసిన కృషి ఆ దిశలో ఓ చిన్న మొదటిమెట్టు.
అయితే ఆ దిశలోఇంకా ఎంతో దూరం వెళ్లాల్సివుంది.
అణువుల గురించి
అసంపూర్ణమైన జ్ఞానం ఉండడం వల్ల పందొమ్మిదవ శతాబ్దపు మధ్య దశలో కర్బన రసాయన శాస్త్రవేత్తల
పురోగతి కుంటువడింది. కాని ఈ అసంపూర్ణతే ఒక సన్నివేశంలో ఈ రంగంలో ప్రగతికి ఎంతో దొహదం
చేసింది.
1840 దరిదాపుల్లో ఇంగ్లండ్లో పెద్దగా చెప్పుకోదగ్గ కర్బన
రసాయన శాస్త్రవేత్తలు ఎవరూ లేరు. లీబిగ్ తో పాటు పనిచేసిన ఆగస్ట్ విల్హెల్మ్ ఫాన్ హోఫ్మన్ (1818-1892) ని జర్మనీ నుండి లండన్ కి పిలిపించుకున్నారు. కొన్నేళ్ళ తరువాత విలియమ్ హెన్రీ
పెర్కిన్ (1838-1907) అనే చిన్న కుర్రాణ్ణి అనుచరుడిగా పెట్టుకున్నాడు హోఫ్మన్. ఒకసారి
పెర్కిన్ సమక్షంలో హోఫ్మన్ ఏవో శాస్త్రవిషయాలు చర్చిస్తూ క్వైనైన్ (quinine)ని సంయోజించే
విషయంలో తన ఊహల గురించి వివరించాడు. క్వైనైన్ మలేరియా వ్యాధికి మందు. తారు నుండి వెలికి
తీయగల రసాయనాల గురించి అప్పటికే హోఫ్మన్ ఎన్నో పరిశోధనలు చేశాడు. తారు నుండి వెలికి
తీయగల అనిలిన్ (aniline) నుండి క్వైనైన్ ని
సంయోజించడం సాధ్యమవుతుందా అని ఆలోచించాడు. క్వైనైన్ని ఆ విధంగా కృత్రిమంగా సంయోజించ
గలిగితే అది చాలా గొప్ప పరిణామం అవుతుందని గుర్తించాడు. అంతవరకు యూరొప్ కి క్వైనైన్ ఉష్ణమండల ప్రాంతాల (tropics) నుండి సరఫరా
అయ్యేది. ఈ రసాయనాన్ని కృత్రిమంగా తయారు చెయ్యగలిగితే ఆ పరాధీనత అంతమవుతుంది.
అది విన్న పెర్కిన్
ఉత్సాహంగా తన సొంతూరికి తిరిగి వెళ్లాడు. అక్కడ తన సొంత ప్రయోగశాలలో క్వైనైన్ ని సంయోజించే
ప్రయత్నం మొదలెడదామని బయల్దేరాడు. పెర్కిన్కి గాని, హాఫ్మన్కి గాని క్వైనైన్ అణువిన్యాసం
గురించి తెలిసి వుంటే పందొమ్మిదవ శతాబ్దపు మధ్యదశలో లభ్యమై వున్న రసాయనిక విధానాలతో
ఆ సంయోజనని సాధించడం అసంభవం అని తెలిసివుండేది. కాని అవేవీ తెలియని పెర్కిన్ ఉత్సాహంగా
రంగంలోకి దిగిపోయాడు. అనుకున్నది సాధించ లేకపోయినా అంతకన్నా విలువైన ఓ విషయాన్నికనుక్కున్నాడు.
1856 లోఈస్టర్
సెలవల్లో అతడు అనిలిన్ ని, పొటాషియమ్ డై క్రోమేట్ తో కలిపి చూశాడు. ఆ కలయిక వల్ల ఏర్పడ్డ
ఓ అవిశేష మిశ్రమాన్ని చూసి మళ్లీ ప్రయత్నం విఫలమయ్యిందని అనుకుని ఆ మిశ్రమాన్ని పారేయ
బోతుంటే అందులో ఒక చోట ఓ చక్కని నేరేడుపండు రంగు (purple) మెరుపు తన కళ్లని ఆకట్టుకుంది.
అప్పుడా మిశ్రమానికి ఆల్కహాలు కలిపి చూశాడు. అప్పుడా మిశ్రమం పూర్తిగా నేరేడు రంగుకి
మారిపోయింది.
పెర్కిన్కి అదేదో
అద్దకంలాగా వుందని అనిపించింది. అక్కడితో చదువు నిలిపేసి ఉన్న ఆస్తి మొత్తం వెచ్చించి
ఓ పరిశ్రమ ప్రారంభించాడు. ఆరు నెలలు తిరిగే లోపు ‘అనిలిన్ పర్పుల్’ (aniline
purple) అనే ఓ అద్దకాన్ని తయారు చెయ్యడం ప్రారంభించాడు. ఫ్రాన్స్ కి చెందిన అద్దకపు
ఉత్పత్తిదారులని ఈ కొత్త అద్దకం ఆకర్షించింది. ఆ కొత్త రంగుకి వాళ్లు ‘మావ్’
(mauve) అని పేరు పెట్టారు. ఆ కాలంలో ఆ రంగు
ఎంత ప్రసిద్ధి పొందింది అంటే ఆ దశాబ్దాన్ని ‘మావ్ దశాబ్దం’ అని పిలవ సాగారు. ఆ విధంగా
సుసంపన్నమైన కృత్రిమ అద్దకాల పరిశ్రమని సంస్థాపించిన పెర్కిన్ ముప్పై ఐదేళ్లకే గొప్ప
ఆస్తిపరుడిగా ఉద్యోగ విరమణ చేశాడు.
(ఇంకా వుంది)
0 comments