గాలి లోంచి పట్టకం లోకి ప్రవేశించే కాంతి గాలికి పట్టకానికి మధ్య
సరిహద్దు వద్ద
వంగుతుంది. మళ్లీ పట్టకం లోంచి గాల్లోకి ప్రవేశించేటప్పుడు మరో
సారి వంగుతుంది.
అయితే ఈ వంగడానికి రంగులకి మధ్య ఏంటి సంబంధం?
దీనికి సమాధానంగా న్యూటన్ ఇలా ఆలోచించాడు.
తెల్లని కాంతిలో పలు రంగుల కిరణాలు కలిసే వుంటాయి.
కాని వివిధ రంగుల కిరణాలు వక్రీభవించే తీరు
వేరుగా వుంటుంది. కొన్ని ఎక్కువగాను కొన్ని తక్కువగాను వక్రీభవిస్తాయి. కింద
చిత్రంలో కనిపిస్తున్నట్లు ఎర్రని కాంతి తక్కువగా వక్రీభవిస్తుంది. అందుకే పట్టకానికి అవతలి పక్క పడ్డ రంగుల చారలలో ఎర్రని చార అన్నిటికన్నా పైన
వుంటుంది. అలాగే వయొలెట్ రంగు ఎక్కువగా వంగుతుంది. అందుకే చిత్రంలో వయొలెట్ చార
అన్నిటికన్నా కిందన వుంటుంది.
కాని
‘వివిధ రంగుల కిరణాలు’ అంటే
ఏంటి? వివిధ రంగుల కిరణాల మధ్య
భేదాలకి కారణ
భూతమైన లక్షణం ఏంటి?
ఈ విషయాన్ని వివరించడానికి న్యూటన్ ‘కాంతి కణ సిద్ధాంతం’
(Corpuscular theory of light) ని ప్రతిపాదించాడు.
ఆ సిద్ధాంతం ప్రకారం
కాంతి తేలికైన,
అతి సూక్ష్మమైన పరిపూర్ణ కణాలతో కూడుకున్న ప్రవాహం. ఇవి
అతి సూక్ష్మమైన కణాలు కనుక గాజు మొదలైన యానకాల ద్వార కూడా ప్రయాణించగలవు. కాంతిలో వున్నది కణ ప్రవాహం అని ప్రతిపాదించాక ఆ భావన సహాయంతో ఒక
యానకం నుండి మరో యానకం లోకి ప్రవేశించే కాంతి వక్రీభవనం ఎందుకు చెందుతుందో ఇలా వివరించాడు.
ఒక యానకం లోంచి కాంతి కణాలు ప్రసరిస్తున్నప్పుడు చుట్టూ అన్ని దిశలా యానకం ఒకే విధంగా ఉంటుంది కనుక
కాంతి కణాల మీద ఆ యానకం
యొక్క గురుత్వం అన్ని దిశలలోను ఒకే విధంగా ఉంటుంది. కనుక
ఫలితంగా కాంతి కణం మీద కనిపించే గురుత్వబలం సున్నా అవుతుంది.
ఏ బల ప్రభావమూ లేకపోవడం వల్ల కాంతి కణం ఋజురేఖలో ప్రసరిస్తుంది.
కాని రెండు యానకాల మధ్య సరిహద్దు వద్ద పరిస్థితి వేరుగా ఉంటుంది. గాలి లాంటి విరళ యానకం లోంచి గాజు లాంటి సాంద్ర యానకం లోకి కాంతి కణం ప్రవేశిస్తున్నప్పుడు సరిహద్దు వద్ద
గాజు యొక్క అధికమైన గురుత్వం పని చెయ్యడం వల్ల
కొద్దిగా సరిహద్దు యొక్క లంబం దిశగా వంపు తిరుగుతుంది.
కాని గాజులోకి పూర్తిగా ప్రవేశించాక మళ్లీ అన్ని దిశలా గాజు యొక్క పదార్థం ఒకే
విధంగా విస్తరించి వుండడం వల్ల ఆ తరువాత దిశ
మారకుండా ఋజురేఖలో ప్రయాణిస్తుంది.
ఈ విధంగా కాంతి కణ సిద్ధాంతం కాంతి వక్రీభవనాన్ని వివరించడానికి ప్రయత్నించింది.
అయితే మరి వివిధ రంగుల కణాలు వివిధ కోణాల వద్ద ఎందుకు వక్రీభవనం చెందుతాయి? దీనికి న్యూటన్ వివరణ ఇలా వుంది. వివిధ రంగుల కాంతి కణాల మధ్య ద్రవ్యరాశిలో భేదం
వుంటుంది. ఎర్ర
కాంతి కణాలు మరింత భారమైనవి.
అందుకే అవి
పట్టకం లోంచి ప్రసరించినప్పుడు ఎక్కువగా వంగకుండా ముందుకి సాగిపోతాయి. అందుకు విరుద్ధంగా వయొలెట్ కణాలు చాలా తేలికైనవి. అందుకే బాగా వంగుతాయి.
ఈ విధంగా పట్టకం లోంచి తెల్ల కాంతి ప్రసరించినప్పుడు అందులోని వివిధ కాంతి కణాలు ఎందుకు వేరుపడతాయో న్యూటన్ తన కాంతి కణ సిద్ధాంతం సహాయంతో వర్ణించగలిగాడు.
(ఇంకా వుంది)
0 comments