శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


ప్రియమైన సైన్స్ బ్లాగర్లకి,

70 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

ఈ సందర్భంలో సైన్స్ అంశంగా గల ఓ కథ పోస్ట్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ లో ఇంతవరకు సైన్స్ వ్యాసాలు, నవలల అనువాదాలు తప్ప స్వచ్ఛంద కథ రాయడం ఇదే మొదలు.

అతి సామాన్యమైన సామాజిక, ఆర్థిక నేపథ్యం నుండి వచ్చి కూడా, చదువంటే బాగా ఇష్టం గల, స్వాధ్యాయంతో ఎంతో చదువుకున్న ఓ స్త్రీ పాత్ర గురించి కొంత కాలంగా ఆలోచిస్తున్నాను. అలాంటి పాత్రకి రూపం పోస్తే అది ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నా నమ్మకం. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టు ఈ కథ.

ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘రత్నశ్రీ.’ ఈమె ఓ ఇంట్లో ‘పనమ్మాయి’ గా పని చేస్తుంటుంది. ఈమె జీవితంలో కొన్ని గంటల వృత్తాంతమే ఈ ‘మంగళ్యాన్’ కథ. ఆ కొన్ని గంటల్లో ఆమెకి కలిగిన అతి సామాన్యమైన అనుభవాలకి, భారతీయ అంతరిక్ష ప్రయాసలోనే తలమానికం అని చెప్పుకోదగ్గ మంగళ్యాన్ మిషన్ కి మధ్య ఓ ఆసక్తికరమైన సారూప్యం ఆధారంగా కథ నడుస్తుంది…

మీకు నచ్చుతుందని ఆశిస్తూ…

-      శ్రీనివాస చక్రవర్తి




మంగళ్యాన్ – ఓ చదువుకున్న ‘పనమ్మాయి’ కథ
-   -    వి. శ్రీనివాస చక్రవర్తి
నేను రాను, రాను. రానంటే రానే!”
బండలా మొండికేసి కూర్చున్నాడు సాకేత్.
ఇంటికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న వాళ్ల అరుణత్తఇంట్లో దింపమనిఅమ్మగారిఆదేశం ఒక పక్క. అడుగడుగునా అడ్డు చెప్తూ అల్లరి చేసే అబ్బాయిగారి ఆవేశం మరో పక్క

దేవుడా! గండం గట్టెక్కేలా చూడు ప్లీజ్!” మనసులోనే మరో లోకానికి ఎస్.ఎమ్.ఎస్. పంపించింది రత్నశ్రీ.
రోజు అమ్మగారు చాలా పెద్ద భారమే తన నెత్తిన పెట్టింది. ఫోన్ లో ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం అమ్మగారి వంతు. అమలు చెయ్యడం తన వంతు. మరి కొడుకుని పార్కులకి, పెద్దమ్మగారి ఇళ్లకి తిప్పుతూ కాలక్షేపం చేసేటంత తీరిక స్టార్టప్ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా ఆమె చేసే ఉద్యోగం ఇవ్వదు. ఇక తండ్రి ఆటోమోబైల్ స్పేర్ పార్ట్ల కంపెనీలో సేల్స్ మేనేజర్. ఆయన ఇంట్లోనే కాదు, ఊళ్లో ఉండడమే తక్కువ. తల్లిదండ్రులకి ప్రతినిధిగా, ప్రతిరూపంగా తనేబాబుఆలనాపాలనా చూసుకుంటూ ఉంటుంది.

ఇంతలో బయటి నుండిఐస్ క్రీమ్అన్న కేక వినిపించింది. ‘హాయ్ ఐస్ క్రీమ్అంటూ బయటికి పరుగెత్త బోయాడు సాకేత్.
బాబూ! ఇప్పుడు టైమ్ లేదు. త్వరగా మీ అరుణత్త గారి ఇంటికి చేరుకున్నామంటే అక్కడ కావలసినన్ని ఇప్పిస్తాగా!” నచ్చజెప్పి మనసు మార్చాలని చూసింది రత్న.

ఉహూ! కుదరదు. నాకు ఇప్పుడే కావాలి.” పై గొళ్లెం అందక, తలుపు తీయడం చాతకాక రెండు చేతుల్తో తలుపు మీద బాదడం మొదలెట్టాడు.

ఇలాంటి పరిస్థితుల్లోబాబుదారికి తను వెళ్లడం తప్ప తన దారికి బాబుని తెచ్చుకోవడం అంత సులభం కాదు. సంగతి రత్నకి బాగా తెలుసు. అలాగే బాబు దారికి తను వెళ్తున్నట్టు చేసి, నెమ్మదిగా తన మాటే దక్కించుకోవడం ఎలాగో కూడా అమ్మాయి అనుభవం మీద నేర్చుకుంది. అనుభవాన్నే ఇక్కడ ప్రయోగించింది.

సరే అయితే. పద ఐస్క్రీమ్ కొనుక్కుందాంఅంటూ వెళ్లి వీధి తలుపు తీసింది.

వింటి నుండి బాణంలా ఐస్క్రీమ్ బండి కేసి దూసుకుపోయాడు సాకేత్. ఇంతలో రత్న తను ముందే సేకరించి పెట్టుకున్న బాబు వస్తువులు - బట్టల జత, కొన్ని కలరింగ్ పుస్తకాలు, లెగో కన్స్ట్రక్షన్ సెట్, తనకి ఇష్టమైన, రంగురంగుల అధునాతన కార్ల బొమ్మలు వున్న పుస్తకం, నర్సరీ రైమ్స్ వున్న మీడియా ప్లేయర్, చిన్న డబ్బాలో పెరుగన్నం, రెండు గ్రనోలా బార్లు, రెండు అరటి పళ్లు, చిన్న సీసాలో  ఆపిల్ జూస్, మినరల్ వాటర్ బాటిల్ వ్యోమగామి అంతరిక్ష యానానికి సన్నాహాలు చేసుకున్నంత శ్రద్ధగా బాబుకి అవసరమయ్యే సరంజామా అంతా సంచీలో సర్దుకుంది. సంచీ భుజానికి తగిలించుకుని, చకచకా చెప్పులేసుకుని, తలుపుకి గొళ్లెం పెట్టి, తాళం వేసి బాబు వెంటే ఐస్క్రీమ్ బండి దిశగా వడిగా అడుగులు వేసింది.

బండి వాడితో బేరసారాలు త్వరగానే ముగిశాయి. తనకి ఇష్టమైన బటర్ స్కాచ్ బార్ బండివాడి చేతిలోంచి లాక్కుని పరుగు అందుకోబోయాడు. అంతలో రత్న మెరుపులా కదిలి ఒక చేత్తో బాబు చెయ్యి అందుకుని, మరో చేత్తో పర్స్ లోంచి డబ్బులు తీసి, బండివాడికి డబ్బులిచ్చి,  బాబు చెయ్యి అలాగే వదలకుండా పట్టుకుని రోడ్డు దాటించింది.
పద అక్కడ గట్టు మీద కూర్చుని హాయిగా తిందువుగాని.”

ఐస్క్రీమ్ బార్ కి రాపర్ చింపి, ఐస్క్రీమ్ కారి చేతికి అంటకుండా దాని కిందే పేపర్ నాప్ కిన్ ని అందంగా చుట్టి, బాబుకి అందించింది

గట్టు వెనకే  ఎగసిపడుతున్న సముద్రపు కెరటాలని కూడా పట్టించుకోకుండా ఐస్ర్కీమానందంలో మునిగి తేలిపోతున్నాడు బాబు. లేచిన క్షణం నుండి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పని  చేసిన అలసట ఇప్పుడు తెలిసొస్తోంది రత్నకి.

బాబుని పది నిముషాల పాటు పట్టించుకోనక్కర్లేదని గ్రహించిన రత్న కెరటాల వైపే కన్నార్పకుండా చూస్తూ కూర్చుంది. సముద్రం విషయంలో తనకి ఎప్పుడూ ఒక విషయం చిత్రంగా తోస్తుంది. అంత అలజడిగా, అల్లకల్లోలంగా కదిలే అలలని చూస్తుంటే మనసులో ఎందుకంత హాయి కలుగుతుంది

అలా అలల చలనాలని తనివితీరా చూస్తూ కూర్చున్న సమయంలో కాలికి ఏదో తలిగినట్టయి ఇటు తిరిగి చూసింది. ఏదో చిత్తుకాగితం. ఏమిటా అని ఉత్సుకతతో తీసి చూసింది.

ఏదో పత్రికలో కాగితంలా వుంది. అల్లంత దూరంలో ఉన్న మిక్స్చర్ బండి నుండి కొట్టుకొచ్చినట్టు వుంది. దాని మీద తెలుగు అక్షరాలు. చిత్తుకాగితాలలో 87% తెలుగు దినపత్రికలు, వారపత్రికల నుండి వచ్చినవేనని ఎక్కడో చదివింది. నిజమే కాబోలు.

ఏదో వ్యాసంలా వుంది. ‘అంగారక దర్శనానికి నోచుకున్న భారతీయ వ్యోమనౌక…’ పెద్ద ఎర్ర అక్షరాలతో వ్యాసం పేరు చదవగానే ఉత్సాహం పెరిగింది రత్నకి.

మంగళ్యాన్ మిషన్ గురించి అంతకు ముందు తను వినకపోలేదు. ఇంట్లో అయ్యగారు టీవీ చూస్తుంటే తను పని చేసుకుంటూ తెలుగు వార్తల నుండీ సేకరించిన నాలుగు పొడిపొడి ముక్కలు ఇంకా గుర్తున్నాయి. కాని ఇంకా తెలుసుకోవాలని ఎన్నో సార్లు అనిపించినా అవకాశం దొరకలేదు

బాబు మళ్లీ మారాం మొదలెట్టే లోపు నాలుగు విషయాలు తలకెక్కించుకోవాలి. ఆత్రంగా చదవడం మొదలెట్టింది.

విశాఖపట్నం (గురువారం) – ఇస్రో మాజీ చైర్మన్ శ్రీ కె. రాధాకృష్ణన్ ఆంధ్రా యూనివర్సిటీలో ఇచ్చిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు. “చంద్రయాన్ విజయం తరువాత భారతీయ అంతరిక్ష సాంకేతిక నైపుణ్యం విషయంలో ఇస్రో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక తదుపరి మెట్టు గ్రహాంతర యానమే నని మా సంస్థలో ఎంతో మంది అభిప్రాయ పడ్డారు. గ్రహాంతర యానానికే పూనుకున్నట్లయితే పొరుగు గ్రహం అయిన మార్స్ కన్నా మంచి లక్ష్యం మరొకటి ఉండదు. కనుక మార్స్ విషయంలో ఏకాభిప్రాయం త్వరలోనే ఏర్పడింది. అయితే ఫ్లయిబై (flyby) తో తృప్తి పడి ఊరుకోవాలా, లేక వ్యోమనౌకని మార్స్ కక్ష్యలో పెట్టాలా అన్న విషయం మీద మొదట్లో కాస్త తర్జనభర్జనలు జరిగాయి. ఇంతా శ్రమపడి మిషన్ ని రూపొందిస్తున్నాం కనుక ఏకంగా ఆర్బిటర్ కోసం సన్నాహలు జరుపుకుంటే బావుంటుందని…”
 

ఐస్క్రీమ్ ఐపోయింది.” చెయ్యి కుదుపుతూ సాకేత్ అన్న మాటలకి ఉలిక్కిపడి గ్రహం మీద వాలింది రత్న. “పద ఇంటికెళ్దాం.”
మార్స్ మిషన్ సంగతేమో గాని మారాం చేసే మొండి పిల్లాణ్ణి మచ్చిక చేసుకోవడం రాధాకృష్ణన్ గారి తరం కాదు,’ మనసులోనే అనుకుంది రత్న.  ఇప్పుడు అరుణత్తప్రసక్తి తెస్తే కథ మొదటి కొస్తుంది. కనుక కథనం మార్చింది.
 ఇంటికి వెళ్దామా? సరదాగా మరింక ఎక్కడికైనా వెళ్దామా?”
  తమ  చిన్నారి జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకోవాలని ఎన్నో సార్లు పిల్లలు  తాపత్రయ పడుతుంటారు. పెద్దవాళ్ల దృష్టిలో అదేమొండితనంగా కనిపిస్తుంది. తల్లిదండ్రుల దగ్గర తన ఆటలు చెల్లవని బాబుకి బాగా తెలుసు. కనీసం రత్న దగ్గరైనా ప్రతీ నిర్ణయంలోను తనదే పై చేయి కావాలి

 ఇంకేవైనానా?” కాస్త అనుమానంగా అడిగాడు సాకేత్. “వద్దు ఇంటికే వెళ్దాం.”
ఓటమి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఒడుపుగా పావులు కదిలించింది రత్న.
సరే అయితే,” అని వెంటనే సంచీ భుజానికి ఎత్తుకుని లేవబోయింది.

c, c! ఇంటికొద్దు. ఇంకెక్కడికైనా వెళ్దాం. కాని ఎక్కడికెళ్దాం?”
పోయిన నెల  మమ్మీ, డాడీలతో వండర్ ప్లానెట్ కి వెళ్లాం గుర్తుందా?”
హాయ్! వండర్ ప్లానెట్ కా?” బాబు ముఖం వెలిగిపోయింది. “కాని మమ్మీ ఒప్పుకుంటుందా?”
సంగతి నేను చూసుకూంటాగా?”
అయితే సరే.”
రత్న నెత్తి మీద బరువు ఎవరో దింపినట్టయ్యింది. ఇక ఆలస్యం చెయ్యకుండా బయల్దేరాలి. బాబుని ఎక్కడికి తీసుకెళ్లినా టాక్సీలోనే వెళ్లమంటారుఅమ్మగారు.’ ఒకసారి టాక్సీ దొరక్క బాబుని తనతో ఆటోలోసెంట్రల్సూపర్ మార్కెట్ కి తీసుకెళ్తే అమ్మగారు తలవాచేలా పెట్టిన చీవాట్లు ఇంకా గుర్తు.
వెంటనేహలో కాబ్స్కి ఫోన్ చేసి తమ ఆచూకీ చెప్పింది. చుట్టుపక్కలే తమ డ్రయివర్ ఉన్నాడని, రెండు నిముషాల్లో  కారు పంపుతామని ఆపరేటర్ చెప్పింది.
ఇప్పుడేమో మన కోసం బుల్లి, పచ్చటి కారొస్తుంది. సరేనా?”
కారు వచ్చేలోపు తను ఇందాక చదువుతున్న వ్యాసం చదువుతూ మళ్లీ గట్టు మీద చతికిలబడింది.

“…పే లోడ్ ని పంపడానికి ఇంజిన్ సముచితంగా ఉంటుంది అన్న విషయంలో కాస్త వివాదం ఏర్పడింది. జి. ఎస్. ఎల్. వి. అయితే కాస్త బలమైన ఇంజిన్. కాని గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా జి. ఎస్. ఎల్. వి. వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ…”

కారు ఎప్పుడొస్తుంది?” అసహనంగా భుజం కదిలిస్తూ అడిగాడు సాకేత్.
ఇదుగో మరో రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది…” వ్యాసం మీద నుండి దృష్టి మరల్చకుండా అంది.

“… క్రయోజెనిక్ ఇంజిన్ల రూపకల్పన ఇంకా పరిశోధన స్థాయి లోనే వుంది. అవి సిద్ధంగా ఉన్నట్లయితే తప్పకుండా వాటినే వాడి వుండేవాళ్లం. కాని అవి సిధ్ధం కావడానికి కనీసం మరి కొన్నేళ్లు పడుతుంది. అంత కాలం ఎదురు చూడాలా, లేక ఉన్న రాకెట్ ఇంజిన్లతో…”

కారు ఇంకా రాలేదేం?”
కారు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే బాబు ప్రాణాలు తోడేస్తాడు. వెంటనే ఏదో ఒక బండి ఎక్కాల్సిందే.
దారే పోయే షేర్ ఆటోని చెయ్యూపి ఆపింది.
బాబూ! షీలా నగర్కి వస్తావా?”
ఎక్కండమ్మా! బేరం కుదిర్తే మార్స్ కైనా మోసుకుపోతా!” పళ్లికిలిస్తూ అన్నాడు ఆటోవాడు. జనానికి టీవీ బాగా వంటబట్టింది రోజుల్లో.

బండి ఎక్కబోతూ సారి తలెత్తి చూసి గతుక్కు మంది రత్న. గోదారి పుష్కరాలలో నది గట్టులా ఆటో కిటకిటలాడుతోంది. నానా రకాల ఒళ్లతో, కళ్లతో, మోకాళ్లతో, మోచేతులతో, ఏవేవి ఎవరెవరివో తెలీని అయోమయ పరిస్థితి.  చూస్తేనే బెంబేలు పుడుతోంది. ఇక గత్యంతరం లేక, గుండె దిటవు చేసుకుని, ముందుగా బాబుని చాకచక్యంగా ప్రవేశపెట్టి, చోట కుదేసి, పక్కనే తనూ సర్దుకుని కూర్చుంది. బండి కదిలింది

సారి ఆటోలోని శాల్తీలని పరిశీలనగా చూసింది రత్న. సాకేత్ పక్కన జులపాల జుట్టుతో పెద్దాయన జర్దా నములుతున్నాడు. అక్కడితో ఆగక ఆగాగి లోకం మీద కసి తీరా పదార్థాన్ని వెదజల్లుతున్నాడు. ఎదురు గాలి వల్ల అందులో కొంత రక్తాక్షతల్లా లోపల వున్న వారిని పావనం చేస్తోంది. ఇక రత్నకి ఇవతల ముసల్ది కూర్చుంది. దాని నోట్లో చుట్ట కంపు. దాని పక్కనే చేపల గంప కంపు. ఎదుటి వరుసలో కిటికీ పక్కగా కుర్రాడు. కుర్రాడి చేతిలో జోలె సంచీ. సంచీ లోంచి బయటికి పొడుచుకొస్తున్న రెండు వేణువులు. ఆటోలోని అంతరంగ పరిస్థితులని పట్టించుకోకుండా ఎటో నిశీధిలోకి చూస్తూ సన్నగా ఏదో రాగం తీస్తున్నాడు.

 ఎదురుగా ఆంటీ’. పక్కనే  స్కూలు యూనిఫామ్ లో పాప. పాప తన చేతిలో  పుస్తకాన్ని తలెత్తకుండా చదువుతోంది. దండకం చదువుతున్నట్టుగా గొణుగుతూ వల్లె వేస్తోంది. పాపం పాప తలెత్తినప్పుడల్లా పక్కన ఆంటీ మొట్టికాయలు మొడుతోంది

అల్లకల్లోలంగా వున్న ఆటోలో ఇక మిగతా శాల్తీల ఆనవాళ్లు స్పష్టంగా తెలియడం లేదు. మరీ గుచ్చి గుచ్చి చూస్తే బాగోదని ఆలోచన మానుకుంది. పైగా ఆటో కన్నా ఆసక్తికరమైన వ్యాసం చేతిలో వుంది. ముందు జాగ్రత్తగా సంచీ లోంచి మీడియా ప్లేయర్ తీసి, బాబు చెవికి అమర్చి, మళ్లీ  తన వ్యాసం ధ్యాసలో పడింది రత్న.

“…చివరికి పి.ఎస్.ఎల్.వి. రాకెట్లనే వాడాలని నిర్ణయించుకున్నాం. విధంగా అనుకున్నట్లే నవెంబర్ 5, 2013 నాడు మంగల్యాన్ మిషన్ లాంచి శ్రీహరికోటలో జరిగింది…”

పక్కనే రాకెట్ ఫోటో రత్న కళ్లని ఆకట్టుకుంది. భగభగ మని నిప్పులు కక్కుతున్న పి.ఎస్.ఎల్.వి. రాకెట్ల భుజాల మీదెక్కి, మార్స్ కాదుగదా సౌరమండలం అంచులు తాకి తిరిగి రాగలిగేటంత ధీమాతో, పొగబాట వేసుకుంటూ ఆకాశంలోకి దూసుకుపోతున్న మార్స్ నౌక చిత్రం చూస్తుంటే రత్న ఒళ్లు పులకరించింది.
 


ఇంతలో తన ముఖం మీద ఏదో పొగ ముసురుతున్నట్టనిపించి పొగ వచ్చిన పక్కకి తల తిప్పింది.  ఇంతసేపు వ్యాసం ధ్యాసలో పడి పట్టించుకోలేదు. చేపల బుట్టతో, పొగచుట్టతో తనని ఆటోలోకి స్వాగతించిన అవ్వ ఇంకా పక్కనే వుంది. ముసలి ముక్కు నుండి మోటైన ఇత్తడి ముక్కుపుడక వేలాడుతోంది. ముడుతలు పడ్డ నుదురు. నాలుగు పొగాకు పీలికలని తాడేసి కట్టి, చుట్ట అనిపించి, గట్టిగా దమ్ము లాగింది. అవ్వ నోట్లోంచి గుప్పు గుప్పని వెలువడుతున్న పొగ సాంభ్రాణిలా ఆటో అంతా వ్యాపించింది

సిగరెట్టు పొగ అంటేనే చిర్రెత్తుకొస్తుంది రత్నకి. ఇంట్లోఅయ్యగారుఎప్పుడైనా మూడ్ లో వున్నప్పుడు ఏకాంతంగా బాల్కనీలో ధూపం వెలిగిస్తారు. నచ్చకపోయినాఅమ్మగారుక్షమిస్తారేమో గాని రత్న మాత్రం ఇంట్లో మూల పని చేసుకుంటున్నా హుటాహుటిన  అయ్యగారి దగ్గరికెళ్లి మర్యాదగా చెప్పి ధూపం ఆర్పేయిస్తుంది. ఇక చుట్టపొగకి ఆమెకి కడుపులో దేవుతున్నట్టుగా వుంది.

పొగ తాగడం ప్రమాదకరం అని తెలియదా అవ్వా నీకు? పొగ తాగితే కాన్సర్ అని భయంకరమైన వ్యాధి వస్తుందట. కాన్సర్ ఒంట్లో ఎక్కడ రాదని అడుగు. ఊపిరి తిత్తులు, ముక్కు, స్వరపేటిక, గొంతు, గొంతుని కడుపుని కలిపే ఇసోఫేగస్ అనే గొట్టం, కడుపు, మూత్రపిండాలు, మలాశయం  తాగిన వాళ్లకే కాదు, పొగ పీల్చిన ఇరుగు పొరుగు వాళ్ళ ఆరోగ్యానికి కూడా ప్రమాదమేనట…”

సున్నితంగా, సవివరంగాస్టాట్యూటరీ వార్నింగ్ని అవ్వకి విడమర్చి చెప్పింది.
అవునా అమ్మా? ఏంటిపై నుండి కింద దాకా…?” ఎదురుగా ఆంటీ కాస్త బెదుర్తూ అడిగింది.
అవునండీ. జనానికి అర్థం కాదు..” పెదవి విరుస్తూ అంది రత్న.

భుగభుగలు క్షణకాలం ఆగాయి. తల సారి ఇటు తిప్పి, రత్నని వెర్రి దాన్ని చూసినట్టు చూసి, మళ్లీ తన పన్లో పడిపోయింది.

రత్న అవస్థ చూసి ఒళ్లుమండిన ఆంటీ శివంగిలా అవ్వ మీద విరుచుకు పడింది.
ఏటే ఇందాకట్నించి సూస్తన్నను. యదవ సుట్ట, యదవ కంపు, యదవ గోల! పిల్ల పాపం అంత యిదిగా సెప్తే  బుర్ర కెక్కదేటి? ఎర్రగ కాల్తంది సూడూ.. నోట్లోంచి సుట్టపీక పీకి  పీకలో గుచ్చీగల్ను జార్త!”
కేకకి హుషారుగా బండి తోలుతున్న షేర్ ఆటో వాడు కస్సున బ్రేకేశాడు

తేడా వస్తే సద్దుకుపోవాలి గాని, జుట్టు జుట్టు అట్టుకోడానికి ఇదేటి అసెంబ్లీ అనుకున్నారేటమ్మా?” ఆటో వాడు ఆందోళనగా అన్నాడు.
ఆంటీకి ఇంతసంస్కృతంవచ్చని ఊహించని రత్న ఆవిడ విజృంభిస్తుంటే కళ్లింత చేసుకుని ఆశ్చర్యంగా చూసింది.
దెబ్బకి హడలెత్తిన ముసలవ్వ, చుట్ట అవతల పారేసి,  గంప దింపుకుని హడావుడిగా వెళ్లిపోయింది.
ఆటోలో పొగ పలచనై వాతావరణం కాస్త తెరిపి పడింది. రత్న మళ్లీ తన వ్యాసంగంలో మునిగిపోయింది.

“… లాంచి జరిగాక సుమారు పదిహేను నిముషాల పాటు నిప్పులు కక్కిన రాకెట్ ఇంజెన్లు మార్స్ ఆర్బిటర్ ని 23  వేల కిమీల ఎత్తులో భూమి చుట్టూ కక్ష్యలో పెట్టాయి. పి.ఎస్.ఎల్.వి. ఇంజిన్లు… ”

ఇలాంటి శాల్తీలకి నెమ్మదిగా చెప్తే ఎక్కదు. వాళ్లకి అర్థమైన భాషలోనే చెప్పాలి,” ఆంటీ తనతో మాట కలుపుతోందని అర్థమైన రత్న తలెత్తి ఆంటీని చూసింది.

పాపం లేండి. చదువు రాని వాళ్లు,” ముసలవ్వని వెనకేసుకొస్తూ అంది. “వాళ్లకి రూస్లు అవీ ఏం తెలుస్తాయి? చదువుకున్న వాళ్లే, రూల్సు బాగా తెలిసిన వాళ్లే రోజుల్లో ఇష్టా రాజ్యం చేస్తుంటేనూ…”
అవును. అదీ నిజమే. ఇప్పుడు ఇదుగో జర్దా బాబాయిలకి ఏం రోగం.” ఎదుటి సీట్లో కూర్చున్న జర్దా బాబుకి కేసి చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది ఆంటీ. “ఊళ్లో సందు చూసినా కుంకుమ నీళ్లతో కడిగినట్టు యెదవల నిర్వాకమే!”

పొంచి వున్న ప్రమాదాన్ని అర్థం చేసుకున్నాడు జర్దా బాబు.
ఇదుగో చూడు బాబూ! వచ్చే బస్టాప్ లో దింపేయ్!”
అదేటి సార్! మీ స్టాపు పెద వాల్తేరు కదా? మరో రెండు స్టాపులు ఉంది.”
వొద్దులే బాబు. నడిచెళ్లిపోతా…”

జర్దాబాబు తో మరి ఇద్దరు అదే స్టాపులో దిగిపోయారు. ఒక్కొక్క స్టాపులో జనం దిగుతుంటే  ఆటోలో వాతావరణం కాస్త తెరిపి పడుతూ వచ్చింది. దారి పొడవునా ఆగుతూ ఏదో తెలియని గమ్యం దిశగా గజిబిజి బాటలో ఆటో సాగిపోతోంది.

“…పి.ఎస్.ఎల్.వి. ఇంజిన్లు అంత బలమైనవి కావు కనుక ఏకబిగిన పలాయన వేగాన్ని చేరుకుని మార్స్ కేసి దూసుకు పోవడం వీలుపడదు. అంచెలంచలుగా కక్ష్యని పైకెత్తి భూమి నుండి తగినంత దూరం వచ్చాకనే భూమి గురుత్వపు సంకెళ్లు తెంచుకుని మార్స్ దారి పట్టాలి…”


ఎక్కే వోళ్లని, దిగే వోళ్లని దిక్కులు చూడొద్దన్నానా? మళ్లీ తలెత్తితే లెంపలు వాచిపోగలవంతే!” ఆంటీ స్కూలు పిల్ల మీద విరుచుకు పడింది. కేకకి ధ్యానభంగం అయిన రత్న తలెత్తి చూసింది. ఎదురుగా వున్న యూనీఫామ్ పాప ని చూస్తే జాలేసింది

బూర్ల బుగ్గలతో కాస్త ముద్దుగా, మరికాస్త బొద్దుగా వుందా పాప. చేతులోని పుస్తకం ఇంకా బొద్దుగా వుంది. నచ్చిన పుస్తకాన్ని ఎవరి ప్రమేయమూ లేకుండా చదవడంలో ఎంత ఆనందం వుందో, నచ్చని పుస్తకాన్ని (పైగా లావుపాటి పుస్తకాన్ని!) ఎవరో అంకుశంతో పొడుస్తూ ఉంటే చదవాల్సి రావడం అంత నరకం.

పుస్తకాలంటే రత్నకి చెప్పలేని మోజు. లావుపాటివి ఐతే మరీను. ఇంట్లో టీవీ గదిలో పెద్ద, ముద్దొచ్చే గాజు షెల్ఫ్ లో బోలెడు పుస్తకాలు ఉన్నాయి. ఎప్పుడూ తాళం వేసిన షెల్ఫ్ లో పుస్తకాలు దొంగల భయం లేకుండా ఉంటాయి.   అమ్మగారు గాని, అయ్యగారు గాని వాటిని ఎప్పుడూ తీసి తిరగేసిన గుర్తు తనకి లేదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు తనే తాళాలు తెచ్చి, షెల్ఫ్ తెరిచి, పుస్తకాలు తీసి చదువుతూ ఉంటుంది. తనకి బాగా నచ్చిన పుస్తకాల గురించి వేరేగా తనదైన నోట్ బుక్స్ లో రాసుకుంటూ ఉంటుంది. విధంగా గురువు, బడి అనే జంఝాటం లేకుండా, నిశ్శబ్దంగా, ఏకాంతంగా సాగుతుంది రత్న చదువు.

పుస్తకానికి రత్నకి మధ్య అనుబంధం అలాంటిది.
తను ఎక్కడికి వెళ్లినా  చుట్టుపక్కల ఎవరి చేతిలోనైనా పుస్తకం కనిపిస్తే ఇక మనసు ఆగదు. అడిగి తీసుకుని కాసేపు తిరగేయాల్సిందే!
 ఏం పుస్తకం చదువుతున్నావు పాపా?” ఉండబట్టలేక అడిగింది.
పదో క్లాసు లెక్కల గైడు.” ఏదో పాపం చేసినట్టు బింకంగా చెప్పిందా పాప.
పుస్తక ప్రపంచంలో రత్నకి ససేమిరా గిట్టనివి రెండేరెండు - పరీక్ష గైడ్లు, బూతు పుస్తకాలు. ఇక విషయం మీద రెట్టించలేదు.

మీ బాబా?” సారి ఆంటీ మాట కలిపింది.
రత్నకి ప్రశ్న క్షణం అర్థం కాలేదు.
అయ్యో! కాదండి,” కాస్త నవ్వి ఊరుకుంది రత్న.
మరి మీ పక్కింటోళ్ల బాబా?” విషయం తేల్చకుండా వొదిలిపెట్టేలా లేదు ఆంటీ. చిత్రమైన ప్రశ్నకి అంత వరకు నిశీధిలోకి చూస్తూ మౌనంగా కూర్చున్న కుర్రాడు తల తిప్పి ఆంటీ వైపు చూశాడు.

అయ్యో కాదండి. షీలా నగర్ లో ఉండే వాళ్ల  అత్త ఇంట్లో దింపమని మా అమ్మగారు పంపారు. టాక్సీ దొరక్క పిల్లాడు మారాం చేస్తుంటే ఇలా బయల్దేరాం.” కథంతా చెప్పక తప్పలేదు రత్నకి.

అంటే నువ్వుపని మనిషివా?” మాటలకినిశీధి కుర్రాడు ఉలిక్కిపడ్డాడు. ఆంటీతో ఏదో అనాలని విప్పిన నోటికి పనిపెట్టబోయాడు.

పెదవాల్తేరు వచ్చేసింది  దిగండమ్మా,” అంతలో ఆటో వాడు కేకేశాడు.
పదవే! నీకు రావాల్సిన రెండు మార్కులూ ఇవాళ మీ లెక్కల మేష్టరుతో కక్కించకపోతే నా పేరు మార్చుకుంటాను.” ఆంటీ స్కూలు పాప రెక్క పుచ్చుకుని, “వాల్టేర్ ఇంటర్నేషనల్ స్కూలుయొక్క జైలు గేట్ల లాంటి విశాలమైన గేట్ల లోంచి పాపని బరబర లాక్కెళ్లింది.

పక్కనే ఖాళీ ఏర్పడడంతో నిశీధి కుర్రాడు కాస్త పక్కకి జరిగి విశాలంగా కూర్చున్నాడు. ఆంటీ అన్న మాటలకి ఎదురుగా కూర్చున్న అమ్మాయి ఏమనుకుందో? కొంత మందికి ఎంత వయసొచ్చినా ఎలా మాట్లాడాలో తెలీదు. కనీసం కొత్త వాళ్లతో నైనా ఎలా ప్రవర్తించాలో తెలియద్దూ? ఎదురుగా కూర్చున్న రత్న కేసి సారి ఎగాదిగా చూశాడు.

తెలుపు మీద చిన్న పూలున్న వాయిల్ చీర కట్టుకుంది. మూడు అంగుళాలు మించని ముద్దెచ్చే మల్లె దండ జడలో తురుముకుంది. నుదుట చక్కటి ఎర్రటి చుక్కబొట్టు. కచ్చితమైన మధ్యపాపిటతో తీరుగా దువ్వుకున్న జుట్టు. మూడు సన్నని పాములు గాఢంగా పెనవేసుకున్నట్టు ముందుకు వేసుకున్న జడ. చెరగని చిరునవ్వు. దివ్వెల్లాంటి కళ్లు. హుందాగా, తెలివిగా, నాజూకుగా, సంస్కారవంతంగా కనిపించే పడతినిపనిమనిషిఅని సంబోధించడానికి మనిషికి నోరెలా వచ్చింది?

సారి రత్నని విస్మయంగా చూస్తూ నిశీధి కుర్రాడు కూడా అదే స్టాపులో దిగిపోయాడు.
ఆటో మళ్లీ కదిలింది. రత్న మళ్లీ తన చదువులో పడిపోయింది.

“…నవెంబరు 6, 7, 8, 10, 11, 15  తారీఖుల్లో మార్స్ నౌక కక్ష్యని క్రమంగా ఇంకా ఇంకా ఎత్తుకి తీసుకెళ్లడం జరిగింది. నవెంబరు 15  నాటి కక్ష్యని పెంచే ప్రక్రియతో మార్స్ నౌక భూమి నుండి సుమారు రెండు లక్షల కిమీల దూరానికి వచ్చింది…”

ఎమ్.వి.పి కాలనీఎమ్. వి.పి కాలనీ.” ఆటో వాడి అరుపులకి సారి ఉలిక్కిపడి తలెత్తి చూసింది రత్న.
ఇంత సేపూ వ్యాసం చదువుతున్న పరధ్యానం వల్లనో, ఆటోలోని గందరగోళ పరిస్థితి వల్లనో అసలు ఆటో ఎటుపోతోందో కూడా పెద్దగా ఆలోచించలేదు. ఆటోలో తను, బాబు తప్ప మరెవరూ లేరు. బయటికి తొంగి చూసింది.

ఏం బాబూ? అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఎమ్.వి.పి. కాలనీ అంటావేంటి? షీలానగర్ కి వెళ్తుందన్నావు?”
వెళ్తుందమ్మా వెళ్తుంది. ఎవరికి యక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్తుంది. మరి బేరం కుదరొద్దూ?”
బేరం కుదరలేదని మాకు ఊరంత చూపిస్తావా ఏంటి? మంచి వాడివే. బాబూ లే. దిగిపోదాం పద. మరో ఆటో తీసుకుందాం.”

రెండొందలు ఇస్తానంటే వస్తా.” ఆటో వాడు బేరం చెప్పాడు.
సరే అయితే. కాని ఇక్కణ్ణుంచి సూటిగా షీలానగర్ కే వెళ్లాలి. మధ్యలో ఇక మజిలీలు ఉండకూడదు. ఇంకెవర్నీ ఎక్కించుకోకూడదు.”
బేరం కుదిర్తే ఇక నాన్ స్టాప్ సర్వీసే. ఆటో మీ సొంతం అనుకోండి.” మాటలతోనే దేశం చూపెట్టేట్టు ఉన్నాడు ఆటోవాడు.

ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. ఇక ఊళ్లోంచి పోవద్దు. ఎన్.హెచ్. 5  మీదుగా పోనీయ్.  వేగంగా పోవచ్చు.”
త్వరలోనే ఆటో నాలుగు లేన్ల హైవే ఎక్కి వేగంగా గమ్యం దిశగా పరుగు పెట్టింది.
పాటలు వింటూ సాకేత్ చెవిలో హెడ్ ఫోన్స్ కూడా తియ్యకుండా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. రత్న మీదే ఒరిగి హాయిగా కునుకు తీస్తున్నాడు.
మళ్లీ వ్యాసం సంగతి చూడడానికి రత్నకి అవకాశం దొరికింది.

“…నవెంబర్ 30 2013  నాడు భూమి కక్ష్యని వదిలిపెట్టి సూర్యుడి గురుత్వ ప్రభావానికి లోనవుతూ సాగే పారాబోలిక్ ఆకారపు కక్ష్యమీదుగా మార్స్ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది మార్స్ ఆర్బిటర్. సుదీర్ఘ ప్రయాణం ఎనిమిది నెలలు పైగా సాగింది…”

అంతలో ఆటోకి అడ్డుగా పరుగెత్తిన గోమాత బారి నుండి తన ఆటో కాపాడుకోడానికి ఆటోవాడు కస్సున బ్రేకేశాడు. కుదుపుకి సాకేత్ లేచి కూర్చున్నాడు. ఇయర్ ఫోన్ తీసి పక్కన పెడుతూ రత్న కేసి తిరిగి,
ఆకలేస్తోంది,” అన్నాడు.
వెంటనే సంచీలోంచి అరటిపండు తీసి, దాన్ని చిన్న ముద్దలుగా చిదిమి, స్పూన్ తో బాబుకి పెట్టింది.
వండర్ ప్లానెట్ కి వచ్చేశామా?” అరటి పండు నముల్తూ అమాయకంగా అడిగాడు సాకేత్.
ఇదుగా ఇంకో పది నిముషాల్లో వచ్చేస్తాంగా. నువ్వీ పండు తినేసి మళ్లీ హాయిగా బజ్జో. వండర్ ప్లానెట్ రాగానే నిన్ను లేపుతాను. సరేనా?”


కడుపు నిండాక మళ్లీ నిద్ర వచ్చినట్టుంది. రత్న ఒళ్లో తలపెట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు. ప్రయాణం బడలిక వల్ల రత్న కూడా బాబు తల మీద తన తల పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకుంది. వ్యాసం కాగితం మాత్రం ఒక చేత్తో గట్టిగా పట్టుకుంది.
ఇంతలో ఖంగు మన్న సెల్ఫోన్ రింగ్ కి రత్నకి మత్తు వదిలింది. రింగ్ టోన్ బట్టి ఎవరో గుర్తుపట్టి,
అమ్మగారూ! చెప్పండిఅంటూ కాల్ అందుకుంది.
ఏంటే రత్నా! చేరిపోయారా?”
లేదమ్మగారు. ఇంకా దార్లో వున్నాం. ఇంకో పది నిముషాలేమో.”
 పోన్లే ఒకందుకు మంచిదే. ఎందుకంటే   చిన్న change of plan. మీరు వెళ్లాల్సింది షీలా నగర్ కాదు. నరసింహ పురానికి. అరుణా వాళ్లు రోజు సుశీల దగ్గరికి వెళ్తున్నారట. పాటికి చేరిపోయి ఉంటారు. ఇప్పుడే కాల్ చేసి చెప్పారు.”

ఇంతకీ నరసింహ పురం అంటే…”
గోపాల పట్నం అవతలమీరు వెళ్లే దారేలే…” వెళ్లాల్సిన ఇంటి చిరునామా వివరాలు చెప్పి ఫోన్ పెట్టేసింది అమ్మగారు.
బాబూఇదుగో..” ఆటో వాడు ఏవంటాడో అని కాస్త బెదుర్తూ విషయం చెప్పింది. “ఇప్పుడే మా అమ్మగారు ఫోన్ చేశారు. నరసింహపురం అంటే ఎక్కడో తెలుసా?”
తెలీకేవండి? గోపాల పట్నం అవతల కదా?”
మరే? అక్కడికెళ్లాల…”
రత్న వాక్యం పూర్తి చేసిందో లేదో ఆటో ఒక పక్క అమాంతం పైకి లేచింది. ఎన్. . డి. కొత్త రోడ్డు జంక్షన్ లో నేరుగా ముందుకి పోబోతున్న ఆటో కాస్తా తొంభై డిగ్రీలు పక్కకి కోస్తూ కుడి పక్కగా పోతున్న రోడ్డు మీదకి తిరిగింది.
ఏంటి బాబూ డ్రయివింగ్?  భూకంపం వచ్చిందనుకుని హడలిపోయాను.” రత్న విసుక్కుంటూ అంది.
మరెం చెయ్యడం అమ్మా? మరొక్క క్షణం ఆలస్యం అయితే యూ టర్న్ తిరిగి రావడానికి నాలుగు కిలోమీటర్లు తిరగాలి.”
పోన్లే బాబూ. మూడు చక్రాలు కాస్త నేల మీద ఆనేలా పోనిస్తుండు,” నుదుటి మీద ముచ్చెమటలు అద్దుకుంటూ అంది. సరే గాని నరసింహ పురం ఇక్కణ్ణించి ఎంత దూరం?”
పది నిముషాల్లో దిగబెట్టేస్తానుండండి.”
గమ్యం చేరేలోపు వ్యాసం పూర్తి చెయ్యాలి. ఆదరాబాదరాగా చదడవం మొదలెట్టింది రత్న.

“…సూర్యకేంద్రక కక్ష్యలో గ్రహాంతర యాత్ర కొనసాగిస్తున్న మార్స్ ఆర్బిటర్ కి మార్గ మధ్యంలో నాలుగు చోట్ల కక్ష్యకి సవరణలు జరపాలని అనుకున్నాం. మొట్టమొదటి కక్ష్య సవరణ డిసెంబర్  11  న్ జరిగింది. 40  సెకన్ల పాటు రాకెట్ ఇంజిన్లు మండి రాకెట్ గతిని కొద్దిగా మళ్లించాయి. మళ్లీ ఏప్రిల్ 2014  లో కక్ష్య సవరణ జరగాల్సి వుంది. కాని ఏప్రిల్ నెలలో వ్యోమ నౌక ఉన్న స్థానాన్ని పరిశీలించిన మీదట అది అనుకున్న కక్ష్యని చాలా సన్నిహితంగా అనుసరిస్తోందని తెలిసింది. కనుక ఏప్రిల్ లో  కక్ష్య సవరణ జరగలేదు. … మూడవ కక్ష్య సవరణ 22 సెప్టెంబర్ 2014  లో జరిగింది. సారి దిశని మార్చడమే కాక వేగం తగ్గేలా రాకెట్ ఇంజిన్లు పని చేశాయిచివరికి 24  సెప్టెంబర్  2014  నాడు వ్యోమనౌక మార్స్ చుట్టూ కక్ష్యలోకి ప్రవేశించింది…”

ఇదుగోండమ్మా. ఇదే నరసింహ పురం.”
ఆటో నరసింహ పురం అని పెద్ద బోర్డు వున్న సందులోకి తిరిగింది. అది అప్పుడప్పుడే అభివృధ్ధి చెందుతున్న పేటలా వుంది. అక్కడక్కడ ఎత్తైన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. మధ్యలో ఖాళీ స్థలాలు. దార్లో కొన్ని కిరాణా కొట్లు కనిపించాయి. వీధుల పేర్లు సూచిస్తూ చిన్న పచ్చటి బోర్డులు ఉన్నాయి. ఇల్లు కనుక్కోవడం కష్టం కాదని అనిపించింది.

రెండవ మెయిన్ స్ట్రీట్, ఏడవ క్రాస్ స్ట్రీట్,” ఆటో వాడికి చిరునామా గుర్తు చేస్తూ అంది. “పద్మినీ రెసిడెన్సీ.”
కిరాణా కొట్టు దగ్గర ఆగి వాకబు చేశాడు ఆటోవాడు. రెండు వీధులు దాటి అడగమన్నాడు కిరాణా వాడు.
రెండు వీధులు దాటాక అడగడానికి ఒక్క పురుగు కూడా కనిపించలేదు. ఇంతలో మళ్లీ ఫోన్ మోగింది. అమ్మగారు.

ఏంటే? చేరారా లేదా?”
లేదమ్మగారు. పేటలోకి వచ్చేశాం. వీధి వెతుక్కుంటున్నాం.”
అదేంటి ఎవర్ని అడిగినా చెప్తారంది సుశీల! మర్చిపోయాను. అక్కడో ట్రాన్స్ ఫార్మర్ ఉంటుందట.”
తమ దేవులాటనిట్రాన్స్ ఫార్మ్చేసే ట్రాన్స్ ఫార్మర్ కోసం వెతుక్కుంటూ నరసింహపురం అంతా కాసేపు ప్రదక్షిణలు చేశారు

ఇంతలో ఆకాశం నుండిసాకేత్అని పెద్ద ఆర్తనాదం వినిపించింది.
రత్న ఆటో లోంచి బయటికి తొంగి చూసింది. పక్కనే తెల్లని భవంతి లో రెండో అంతస్థు నుండి ఆడమనిషి ఆగమని చెయ్యూపుతోంది.

ఇదుగో ఆటోబాబూ! పక్కన ఆపేయ్!”  ఆటో వాడికి డబ్బులిచ్చి పంపేసింది రత్న.

బిల్డింగ్ లోంచి ఒకరి తరువాత ఒకరు బిలబిల మంటూ బంధు వర్గం ఊడిపడ్డారు. “హాయ్! సాకేత్అంటూ చిన్న పిల్లాడి చుట్టూ మూగారు. “వెధవని రెండు నెలల అప్పుడు చూశాను. మళ్లీ ఇదే చూడ్డంఅంది ఒకావిడ

ఏరా నేను గుర్తున్నానా,”  మెరిసే పలువరుసతో, మెరిసే బట్టతలతో నవ్వుతూ అడిగాడు పెద్దాయన. “సాకేత్! నీ కోసం బాట్ మాన్ కాస్ట్యూమ్ తెచ్చా తెలుసా?” చిన్న పాప వచ్చి సాకేత్ ని ఆప్యాయంగా పలకరించింది.
రత్నని మాత్రం ఎవరూ ఏమీ అన్లేదు.

అలా బంధుబృందంబాబుని ఆదరంగా లోపలికి తీసుకెళ్తుంటే చూస్తూ అక్కడే నించుండిపోయింది.
ఒక చేతిలో బాబుకి సంబంధించిన వస్తువుల బుట్టతో, మరో చేతిలో మహోన్నత భారత విజయానికి సంబంధించిన వ్యాసపు పుటతో ఇంటి ముందు వరండాలో ఒంటరిగా మిగిలిపోయింది రత్నశ్రీ.

అపరిచిత గ్రహం మీద పాదం మోపిన ప్రప్రథమ వ్యోమగామిలా.

(సమాప్తం)

3 comments

  1. chaalaa baagundi.

     
  2. Thank you Manohar garu!

     
  3. superted143 Says:
  4. Nice story. Finishing baagundi.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts