శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.




6. ప్రిన్సిపియా

వివాదాలతో విసిగిపోయి, హూక్ వంటి తోటి వైజ్ఞానికుల మీద అలిగిన న్యూటన్ కొన్నేళ్ళ పాటు మౌనవ్రతం పట్టాడు. రాయల్ సొసయిటీ తో గాని, దాని సభ్యులతో గాని సంబంధాలు పెట్టుకో కుండా ఏకాంతంగా తన పరిశోధనల్లో మునిగిపోయాడు. ధోరణి అలాగే కొనసాగి వుంటే తరువాత కాలంలో న్యూటన్ సాధించిన ఎన్నో వైజ్ణానిక విజయాల గురించి మనకి తెలియకుండా పోయేదేమో.  కాని కుర్ర బ్రిటిష్ ఖగోళ వేత్త జోక్యం చేసుకోవడం వల్ల అలాంటి పరిణామం నివారించబడింది.

ఖగోళ వేత్త పేరు ఎడ్మండ్ హాలీ. 1673  లో హాలీ ఆక్స్ ఫర్డ్ లో చదువుకునే రోజుల్లో జాన్ ఫ్లామ్ స్టీడ్ అనే ప్రఖ్యాత ఖగోళ వేత్త పరిచయం అయ్యాడు. ఫ్లామ్ స్టీడ్ రోజుల్లో  బ్రిటిష్ రాజు రెండవ చార్లెస్ వద్ద ఆస్థాన ఖగోళ వేత్తగా పని చేసే వాడు. దూరదర్శిని సహాయంతో తారల స్థానాలని కచ్చితంగా నిర్దేశించేందుకు గాను రాజుగారి సౌజన్యంతో పెద్ద ప్రాజెక్ట్ ని నిర్వహిస్తున్నాడు ఫ్లామ్ స్టీడ్. దూరదర్శిని సహాయంతో ఖగోళాన్ని పరిశీలించే సాంప్రదాయం గెలీలియోతో మొదలయ్యింది. అంటే పదిహేడవ శతాబ్దపు ఆరంభ కాలంలో అన్నమాట. అంతవరకు కేవలం కంటి తో చూస్తూ సెక్స్ టెంట్ మొదలైన పరికరాల సహాయంతో తారల స్థానాలని కనిపెట్టి ఆకాశ పటాలు చిత్రించేవారు. తారల స్థానాలు నిర్దిష్టంగా తెలియడం నావికులకి ఎంతో అవసరం. శక్తివంతమైన నౌకాదళంతో ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం సాధించే కార్యక్రమంలో వున్న బ్రిటిష్ పాలకులు దోషరహితమైన ఆకాశపటాల రూపకల్పనలో శ్రద్ధ వహించడంలో ఆశ్చర్యం లేదు.
ఎడ్మండ్ హాలీ

ఫ్లామ్ స్టీడ్ ఉత్తరగోళార్థం నుండి కనిపించే తారల స్థానాల గురించి ఎన్నో కచ్చితమైన పటాలు తయారు చేశాడు. అలాంటి కృషి ఇప్పుడు దక్షిణ గోళార్థపు తారల విషయంలో కూడా చెయ్యాల్సి వుంది. అలాంటి కార్యాన్ని చేపడతానని ముందుకొచ్చాడు హాలీ. తండ్రి నుండి దక్కిన ఆస్తిని, చార్లెస్ రాజు అందించిన ధన సహాయాన్ని ఆధారంగా చేసుకుని హాలీ 1676  లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఓడలో బయల్దేరాడు. రెండేళ్ల పాటు దక్షిణ గోళార్థం అంతా సంచరించి 341  తారల రేఖాంశ, అక్షాంశాలని కచ్చితంగా కొలిచాడు. సూర్యుడి ముందు నుండి మెర్క్యురీ గ్రహం యొక్క అంతర్యానాన్ని (transit) పరిశీలించాడు. పరిశీలనల వల్ల దక్షిణ ఖగోళాన్ని పరిశీలించిన మేటి ఖగోళ వేత్తగా గొప్ప పేరు పొందాడు.

ఖగోళ వేత్తగా పేరు పొందిన హాలీకి ప్రముఖ్య వైజ్ఞానిక సదస్సులలో ప్రవేశం దొరికింది. మేటి శాస్త్రవేత్తలతో పరిచయం పెరిగింది. ఒక సందర్భంలో హూక్ ని కలుసుకున్న హాలీ ఎంతో కాలంగా తన మనసుని దొలిచేస్తున్న ఒక ఖగోళ సమస్యని హూక్ ముందు ఉంచాడు.
ఖగోళ వస్తువుల మధ్య ఒక ఆకర్షణ బలం ఉంటుందని, దూరం పెరుగుతున్న కొద్ది అది వర్గ విలోమంగా తగ్గుతుందని విన్నాను. అది నిజమేనా?’ అడిగాడు హాలే.
! ! నెమ్మదిగా అడుగుతా వేంటబ్బాయ్! అది పచ్చినిజం. విశ్వచలనాలు అన్నిటినీ శాసించే ప్రగాఢ సత్యం,” ధీమాగా అన్నాడు  హూక్.
కాని దాన్ని ఎలా నిరూపించగలం?” మళ్ళీ అడిగాడు హాలీ.
నిరూపణప్రసక్తి రాగానే హూక్ కి పచ్చివెలక్కాయ మింగినట్టయ్యింది. నిరూపణ అంటే గణితపరమైన నిరూపణ. విషయాల గురించి పైపైన హుందాగా వ్యాఖ్యానించడం తప్ప గణితపరమైన విశ్లేషణ జోలికి పోని హూక్ కి నిరూపణ ఎలా సాధ్యమో తెలీదు.

ఇవన్నీ నేను ఎప్పుడో నిరూపించాశా!” బొంకాడు హూక్. “లోకం దాని విలువేంటో గుర్తించగలిగిన స్థాయికి ఎదిగిన నాడు దాన్ని వెల్లడి చేస్తా.”
లోకం నిరూపణ విలువ గుర్తించలిగే మాట దేవుడెరుగు గాని హూక్ మాత్రం నిరూపణని వెల్లడి చేసిన పాపాన పోలేదు. హూక్ ధోరణితో విసిగిపోయిన హాలీ న్యూటన్ ని కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. గణితపరంగా ఖగోళాన్ని వర్ణించడంలో న్యూటన్ దిట్ట అని విన్నాడు.



అప్పటికే న్యూటన్ శాస్త్ర సదస్సులతో కలుగజేసుకోకుండా తన కలుగులో దూరి ఒంటరిగా బతుకుతున్నాడు. పైగా అప్పటికి రెండు నెలల క్రితమే తన తల్లి హన్నా కి అస్వస్థత చెయ్యడం వల్ల ఆమెకి తోడుగా ఉండాలని వూల్స్ థార్ప్ కి వెళ్లాడు. ఏదో పేరు తెలియని జ్వరంతో బాధపడుతున్న తల్లికి సపర్యలు చేస్తూ అక్కడ కొంత కాలం వున్నాడు. కాని అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె కొద్ది రోజుల్లో కన్నుమూసింది. ఒక్కడే సంతానం కనుక తల్లి యావదాస్తి న్యూటన్ కే సంక్రమించింది. దాంతో ఎప్పుడూ డబ్బు గురించి పట్టించుకోని న్యూటన్ వున్న పళంగా ఆస్తిపరుడు ఐపోయాడు.

తల్లి మరణం తరువాత న్యూటన్ కి తన జీవితంలో ఒంటరితనం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక తనవారంటూ ఎవరూ మిగల్లేదు. చేదు వాస్తవాన్ని దిగమింగడం కోసం పూర్తిగా పనిలోనే మునిగిపోవాలని నిశ్చయించాడు. పని, పని, పనిఇది తప్ప మరో ధ్యాస లేకుండా అయిపోయింది అతడి జీవితం. “విహారం, వినోదం, వ్యాయామం వంటివి ఏమీ లేకుండా ఎప్పుడూ తన చదువులో మునిగిపోయేవాడు. అసలు తన గది నుండీ బయటికి కూడా ఎక్కువగా వచ్చేవాడు కాడు,” అంటాడు ఒక దూరపు బంధువు.

వేళకి భోజనం, నిద్ర వంటివి ఎప్పుడో మర్చిపోయాడు. తన బల్ల మీద ఉంచబడ్డ భోజనం చల్లారిపోయేది. తరువాత ఎప్పుడో చూసుకుని పరాకుగా నిలుచునే రెండు మెతుకులు తిని మళ్లీ తన చదువులో పడిపోయేవాడు. రాత్రి ఒంటిగంట, రెండు గంటల దాకా మేలుకుని బట్టలు కూడా మార్చుకోకుండా నిద్రలోకి జారుకునేవాడు. మళ్లీ తెల్లారే ఆరు గంటల కల్లా లేచి పూర్తి ఉత్సాహంతో తన అధ్యయనాలకి ఉపక్రమించేవాడు.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

  • Total Posts: 1105
  • Total Comments: 1564
Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts