న్యూటన్ జీవన క్రమం ఇలా సాగుతున్న దశలో హాలీ అతడి ఇంటి తలుపు తట్టాడు. అసలు మనుషుల పొడ అంటేనే గిట్టని న్యూటన్ తనని ఎలా ఆదరిస్తాడో నని ఒక పక్క హాలీకి సందేహంగానే వుంది. కాని హాలీని చూడగా న్యూటన్ సాదరంగా లోనికి ఆహ్వానించాడు. ఇద్దరూ ఎన్నో శాస్త్ర విషయాలని చర్చించుకున్నారు. కాసేపయ్యాక హాలీ తన మనసులోని ప్రశ్నని బయట పెట్టాడు.
“సూర్యుడికి గ్రహాలకి మధ్య ఉండే ఆకర్షణ బలం దూరం యొక్క వర్గ విలోమంగా మారుతోంది అనుకుంటే గ్రహ కక్ష్యల ఆకారం ఎలా ఉంటుంది?”
“దీర్ఘ వృత్తం!” న్యూటన్ ఠక్కున సమాధానం చెప్పాడు.
“అలా ఎల చెప్పగలుగుతున్నారు?”
అడిగాడు
హాలీ.
“అది నేను కచ్చితంగా లెక్కించాను.”
“ ఆ వివరాలేవో కాస్త చూపించగలరా?”
ఆ లెక్కలు చేసిన కాగితాల కోసం న్యూటన్ తన గదిలో వెతికాడు. కాగితాల, పుస్తకాల గుట్టలతో గందరగోళంగా వున్న ఆ గదిలో ఆ సమయంతో తను వెతకబోయిన కాగితాలు దొరకలేదు. నిరుత్సాహంతో లేచి బయల్దేరబోయిన హాలీకి అప్పుడు న్యూటన్ ఇచ్చిన వాగ్దానంతో మళ్లీ ఉత్సాహం వచ్చింది.
“ఆ లెక్కలన్నీ మళ్లీ చేసి త్వరలోనే పంపిస్తాను.”
మాట ఇచ్చినట్టుగానే మూడు నెలల పాటు శ్రమించి, లోగడ చేసిన లెక్కలన్నీ మళ్లీ చేసి ఓ తొమ్మిది పేజీల వ్యాసాన్ని రాశాడు న్యూటన్. దాని పేరు De Motu Corporum
in Gyrum (పరిభ్రమించే
వస్తువుల
చలనాలు).
ఆ
వ్యాసాన్ని
పోస్ట్
లో
హాలీకి
పంపిచాడు.
వ్యాసం
చదివిన
హాలీ
తన
కళ్లని
తానే
నమ్మలేకపోయాడు.
కేవలం
సౌరమండలం
యొక్క
గ్రహగతులే
కాదు,
అసలు
విశ్వచలనాలు
అన్నిటినీ
వర్ణించగల
గణిత
సారం
ఆ
క్లుప్తమైన
వ్యాసంలో
నిక్షిప్తమై
వుంది.
ఒళ్లు
గగుర్పొడిచేలా
వున్న
ఆ
గణిత
విజయం
గురించి
వీలైనంత
త్వరగా
వైజ్ఞానిక
సదస్సుకి
తెలియజేయాలి
అనుకున్నాడు
హాలీ.
1684 డిసెంబర్ 10 నాడు హాలీ రాయల్ సొసయిటీ సమావేశంలో న్యూటన్ కి తనకి మధ్య సమావేశం గురించి, న్యూటన్ రాసిన వినూత్న వ్యాసం గురించి విపులంగా చెప్పాడు. ఇంత కాలం తరువాత మళ్లీ న్యూటన్ పరిశోధనల గురించి వింటున్న సొసయిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆ విషయాలన్నీ న్యూటన్ కి రాస్తూ వీలైనంత త్వరగా ఆ వ్యాసాన్ని ప్రచురించమని ప్రోత్సహించాడు హాలీ.
హాలీ ప్రోత్సాహంతో న్యూటన్ కేవలం ఒక వ్యాసంతో ఆగిపోకుండా ఓ అసమాన వైజ్ఞానిక గ్రంథ రచనా కార్యానికి పూనుకున్నాడు. అసలు వైజ్ఞానిక చరిత్రలోనే నభూతో అన్నట్లుగా పద్దెనిమిది నెలల పాటు అహోరాత్రాలు సాగిన మహోగ్ర కృషి అది. ఆ పుస్తకానికి న్యూటన్ Philosophae
Naturalis Principia Mathematica అని పేరు పెట్టాడు (ప్రకృతి తత్వన్ని వర్ణించే గణిత సూత్రాలు). దాన్నే మరింత సంక్షిప్తంగా Principia (ప్రిన్సిపియా) అంటారు. ఏప్రిల్ 1686 లో న్యూటన్ స్వయంగా వచ్చి రాయల్ సొసయిటీ లో మూడు భాగాలు గల ఆ పుస్తకం యొక్క మొదటి భాగాన్ని ప్రదర్శించాడు. సొసయిటీ ఖర్చుతో ఆ పుస్తకాన్ని అచ్చు వేయించాలని ముందు సభ్యులు అభిప్రాయపడ్డారు. కాని సొసయిటీ ఖజానా ఖాళీ అయ్యిందని తెలిసి ఆ ఆలోచన మానుకున్నారు. అలాంటి తరుణంలో హాలీ తన సొంత ఖర్చుతో ఆ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందుకొచ్చాడు.
ప్రిన్సిపియా గ్రంథంలో న్యూటన్ కేవలం కొన్ని ప్రత్యేక గణిత సిద్ధాంతాలని వర్ణించలేదు. కేవలం గ్రహ గతులని మాత్రమే వివరించలేదు. ప్రిన్సిపియాలో న్యూటన్ వైజ్ఞానిక లోకానికి అందించింది ఓ వినూత్న విశ్వదర్శనం. ఒక ఏకైక బ్రహ్మాండమైన గణిత భావ జాలంలో విశ్వచలనాలన్నిటినీ అభివర్ణించడం ఆ గ్రంథం యొక్క లక్ష్యం. విశ్వంలో దేన్ని అర్థం చేసుకోవాలన్నా దాని వెనుక వున్న చలనాన్ని అర్థం చేసుకోవాలి. గ్రహాలు, కాంతి, శబ్దం, ఉష్ణం, ద్రవాలు – ఇవన్నీ చలనంతో కూడుకున రాశులు, లేక తత్వాలు. వీటిని అధ్యయనం చెయ్యడం అంటే పదార్థంలోని చలనాలని అర్థం చేసుకోవడమే. చలనానికి కారణం అయిన భౌతిక రాశి బలం (force). కనుక ప్రిన్సిపియాలో అత్యంత కీలకమైన భావనలు రెండు – ఒకటి చలనం, రెండవది దాన్ని కారణమైన బలం. వివిధ సందర్భాలలో, వివిధ వ్యవస్థల్లో బలాలు చలనాలని ఎలా శాసిస్తున్నాయో చెప్తుంది ప్రిన్సిపియా. విశ్వంలో ప్రతీ వ్యవస్థా బలాల ప్రేరణ వల్ల కలిగే చలనంగా అభివ్యక్తం చేస్తుంది.
(ఇంకా వుంది)
0 comments