లువిస్-లాంగెముయిర్ సిద్ధాంతం ముఖ్యంగా కర్బన సమ్మేళనాల విషయంలో చక్కగా సరిపోయింది. రెండు కార్బన్ పరమాణువుల మధ్య బంధాలు గాని, ఒక కార్బన్
కి ఒక హైడ్రోజన్ కి మధ్య బంధాన్ని గాని ఈ విధంగా చక్కగా వివరించడానికి వీలయ్యింది. ఎన్నో కర్బన సమ్మేళనాలని ‘ఎలక్‌ట్రాన్ సూత్రాల’ సహాయంతో వ్యక్తం చెయ్యడానికి వీలయ్యింది. కేకులే సూత్రాలలోని ‘గీత’ కి బదులు పంచుకోబడ్డ ఎలక్ట్రాన్ జంటతో సూచించడం మొదలెట్టారు.
1920 లలో ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త నెవిల్ విన్సెంట్ సిడ్జ్‌విక్ (1873-1954) ఈ ఎలక్‌ట్రాన్ జంటల భాగస్వామ్యం వల్ల ఏర్పడే సహసంయోజకత అనే భావనని అకర్బన రసాయనాలకి కూడా వర్తింపజేశాడు. వెర్నెర్ సూచించిన coordination
compounds కి కూడా వీటిని విస్తరింపజేశాడు. ఈ coordination compounds విషయంలో కేకులే సిద్ధాంతాలు సరిగ్గా పని చెయ్యవు.
ఈ రసాయన
చర్యలు అన్నిట్లోను బదిలీ అయ్యేవి ఎలక్ట్రాన్ లు మాత్రమే. ఒక్క సందర్భంలో తప్ప ప్రోటాన్లు సురక్షితంగా కేంద్రంగా ఒదిగి ఉంటాయి. ఆ మినహాయింపు హైడ్రోజన్. ఎందుకంటే అందులో ఒకే ప్రోటాన్ ఉంటుంది. అయనీకరణ జరిగినప్పుడు హైడ్రోజన్ లోని ఒక్కగానొక్క ఎలక్ట్రాన్ తొలగించబడితే, ఇక ఒంటరి ప్రోటాన్ మాత్రమే మిగులుతుంది.
1923 లో డేనిష్ రసాయన శాస్త్రవేత్త జోహానెస్ నికొలాస్ బ్రాన్స్టెడ్ (1879-1947) ఆసిడ్లు-బేస్ లు (acids-bases) విషయంలో ఓ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఒక ప్రోటాన్ ని ఇచ్చే లక్షణం గల సమ్మేళనం ఆసిడ్ అని ఇతడి నిర్వచనం. అలాగే ఒక ప్రోటాన్ తో చర్యజరిపే లక్షణం గలది బేస్. ఈ
కొత్త సిద్ధాంతంతో పాత సిద్ధాంతం చెప్పిన వన్నీ వివరించడానికి వీలయ్యింది. అంతే కాకుండా ఆసిడ్-బేస్ భావనని పాత సిద్ధాంతానికి అందని సందర్భాలకి కూడా సునాయాసంగా విస్తరింపజేయడానికి వీలయ్యింది.
(ఇంకా వుంది)
0 comments