టీచరు
పట్ల తన మనోభావాలని కప్పిపుచ్చుకోలేని అపరాధానికి చిక్కుల పాలయ్యాడు పాపం ఆల్బర్ట్. ఎప్పుడూ క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటూ పిల్లల్ని రాచి రంపాన పెట్టడం తప్ప పిల్లల్లో చదువు అంటే సహజమైన ప్రేమ ఎలా అంకురింపజేయాలో తెలీని ఈ టీచర్లని చూస్తేనే ఆల్బర్ట్ కి చిర్రెత్తుకు
వచ్చేది.
ఇలాంటి ధోరణి వల్ల బడిలో ఇమడలేకపోయాడు.
ఆల్బర్ట్
ధోరణి తోటి పిల్లలకి మొదటి నుంచే కాస్త విడ్డూరంగా కనిపించింది. టీచర్లకే కనిపించని ఆల్బర్ట్ ప్రతిభ ఇక తోటి పిల్లలకి కనిపించే అవకాశం తక్కువ. పైగా టీచర్లన్నా, పరీక్షలన్నా గిట్టని ఆల్బర్ట్ కి పరీక్షల్లో పెద్దగా మార్కులు వచ్చేవి కావు. తను చదివే పుస్తకాలు మార్కుల కోసం కాదు. వాటికి పరీక్షలకి పెద్దగా సంబంధం లేదు. ఎప్పుడూ ఆఖరి బెంచీలో కూర్చునే మరో మొద్దు స్వరూపం అనుకున్నారు తోటి పిల్లలు. పైగా ఆల్బర్ట్ లౌక్యం తెలీని పసివాడు. ఎప్పుడూ అబద్ధాలు ఆడేవాడు కాడు. అది చూసి తోటి పిల్లలు ఆటపట్టించేవారు. ‘బీడర్ మయర్’ (biedermeier) - అంటే ‘చలివిడి ముద్ద’ - అని హేళన చేసేవారు.
సేనలకి
ఇచ్చే శిక్షణని పోలి వున్న ఈ రకమైన విద్యావ్యవస్థలో కూడా ఆల్బర్ట్ మనసుని ఆకట్టుకున్న కొన్ని అంశాలు ఉన్నాయి. తనకి ప్రత్యేకంగా నచ్చిన సబ్జెక్ట్ జ్యామితి (geometry). ఆల్బర్ట్
కి అత్యంత ప్రీతిపాత్రుడైన ఒక బాబాయ్ ఉండేవాడు. అతడి
పేరు రూడీ ఐన్ స్టయిన్. ఆల్బర్ట్
కి పెన్నెండేళ్ల వయసులో ఈ రూడీ జ్యామితి గురించి ఓ చక్కని పుస్తకం బహుకరించాడు. అలా పుట్టిన జ్యామితి మీద తన మక్కువ గురించి ఐన్ స్టయిన్ తదనంతరం ఇలా వ్రాసుకున్నాడు, “పన్నెండేళ్ళ వయసులో నన్ను బాగా ప్రభావితం చేసిన అద్భుతం
ఒకటి జరిగింది. యూక్లిడ్ బోధించిన తల జ్యామితి (plane geometry) గురించిన
ఓ చిట్టి పుస్తకం చేతికి చిక్కింది. పుస్తకం నిండా జ్యామితికి చెందిన సిద్ధాంతాలెన్నో వున్నాయి. ఉదహరణకి త్రిభుజాలకి చెందిన ఓ సిద్ధాంతం ఇలా ఉంటుంది. ఒక త్రిభుజంలో వివిధ శీర్షాల నుండి అవతలి భుజాల మీదకి గీసిన లంబాలు ఒక బిందువు వద్ద కలుస్తాయి అంటుందా సిద్ధాంతం. ఇది చూడ్డానికి అంత స్వయం విదితంగా ఏమీ ఉండదు. కాని దీన్ని కచ్చితంగా, నిస్సందేహంగా నిరూపించవచ్చు. ఈ రకమైన నిశ్చయత్వం, స్పష్టత నా మనసు మీద ప్రగాఢ ముద్ర వేశాయి. సిద్ధాంతం వెనుక వున్న మూల భావన (axiom) ని
నిరూపణ లేకుండా స్వీకరించాలన్న విషయం నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. అసలు ఆలోచనలోను
అంత ఉత్కృష్టమైన నిశ్చయత్వాన్ని, నిర్మలత్వాన్ని మనిషి సాధించగలడు అన్న విషయాన్ని మొట్టమొదటిసారి అనుభూతి చెందినప్పుడు చెప్పరాని అబ్బురపాటు కలుగుతుంది. జ్యామితి ద్వార అలాంటి శుద్ధ తర్కం సాధ్యమని ప్రాచీన గ్రీకులు మనకి నిరూపించారు.”
ఆల్బర్ట్
విద్యాభ్యాసంలో
మనకు ఓ ప్రత్యేకమైన లక్షణం కనిపిస్తుంది. చదువు నేర్చుకోవడం కోసం బడి మీద, టీచర్ల మీద ఆధారపడకుండా, తనకి నచ్చిన విషయాలని తనే పూనుకుని నెమ్మది నెమ్మదిగా నేర్చుకుని, దాని గురించి లోతుగా ఆలోచించి, దాని సారాన్ని గాఢంగా మనసుకి పట్టించుకుని పురోగమించేవాడు. ఈ ప్రయత్నంలో తనకి టీచర్లు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ ప్రయాణంలో తనకి బాసటగా నిలిచింది కొన్ని విలువైన పుస్తకాలే.
నిర్ద్వంద్వమైన వివరణ,
పదునైన తర్కం అంటే ఇష్టపడే ఆల్బర్ట్ కి మరి సహజంగా గణితం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆ అభిమానం జ్యామితితో ఆగిపోక ఇతర గణిత అంశాలకి కూడా విస్తరించింది. ఆ అంశాలని కూడా ఎక్కువగా తనే సొంతంగా శ్రమిస్తూ నేర్చుకునే ప్రయత్నం చేశాడు. “పన్నెండు నుండి పదహారేళ్ల వయసులో అవకలన మరియు సంకలన క్యాల్కులస్ కి చెందిన ప్రాథమిక సూత్రాలతో పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో అదృష్టవశాత్తు నాకు కొన్ని మంచి పుస్తకాలు ఎంతో ఉపకరించాయి. పాఠ్యపుస్తకాల లాగా విషయాన్ని మరీ కఠోరంగా, శుష్కంగా కాకుండా కాస్త సున్నితంగా, సరదాగా, మూల సూత్రాలు మాత్రం సులభంగా అర్థమయ్యేలా విషయాన్ని ప్రకటించేలా వున్నాయి ఈ పుస్తకాలు. అదే విధంగా భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాలలో కూడా మూల భావాలని, ముఖ్య ఫలితాలని, మౌలిక విధానాలని సులభశైలిలో వ్యక్తం చేసే పుస్తకాల ద్వారా ఎంతో సైన్స్ నేర్చుకున్నాను. ఆ పుస్తకాల ధ్యాసలో పడితే అసలు ఇంకేమీ గుర్తుండేది కాదు.”
(ఇంకా వుంది)
0 comments