ఆల్బర్ట్
కి మాక్స్ టాల్మూడ్ అని ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇతడు ఆల్బర్ట్ కన్నా
కొన్నేళ్లు పెద్దవాడు. తదనంతరం ఇతగాడు వైద్య విద్యలోకి ప్రవేశించాడు. ఈ కుర్రవాడు సెలవు దినాల్లో వచ్చి ఐన్ స్టయిన్ వాళ్ల ఇంట్లో ఉండేవాడు. అలా ఓ సారి వచ్చినప్పుడు ఆరన్ బర్న్ ష్టయిన్ (Aaron Bernstein) రాసిన కొన్ని సైన్స్ పుస్తకాలు పట్టుకొచ్చాడు. ఈ పుస్తకాలు భూమి, సౌరమండలం, విశ్వం మొదలుకొని గొప్ప వైవిధ్యం గల అంశాలని సులభ శైలిలో వర్ణించాయి. ఆల్బర్ట్ మనసుని ఈ పుస్తకాలు మొదటి చూపులోనే ఆకట్టుకున్నాయి. ఒక పక్క యూక్లిడ్, మరో పక్క ఆరన్ బర్న్ ష్టయిన్ ఇద్దరూ కలిసి ఆల్బర్ట్ ని మనసుని పూర్తిగా దోచుకున్నారు.
ఒక
పక్క వ్యక్తిగతంగా, స్వయంకృషితో, స్వాధ్యాయంతో సైన్స్, గణిత రంగాల్లో ఆల్బర్ట్ ఇంతగా పురోగమిస్తున్నా మిగతా రంగాల మీద మనసులేక పోవడం వల్ల అంతగా పురోగమించలేకపోయేవాడు. ముఖ్యంగా భౌగోళిక శాస్త్రం, చరిత్ర మొదలైన రంగాల్లో మార్కులు అంతంత మాత్రంగా ఉండేవి. టిచర్లంటే గౌరవం లేని ఈ కుర్రవాడంటే టీచర్లకి అంతగా అభిమానం ఉండేది కాదు. ఆల్బర్ట్ మనో స్థితిని వర్ణిస్తూ “ఎప్పుడూ ఏవో అర్థం లేని కలలలో కొట్టుకుపోతూ ఉంటాడు” అన్నాడో టీచరు. పిల్లవాడు
ఎందుకూ కొరగాడని కొట్టిపారేశారు టీచర్లు.
తన
కొడుకు గురించి టీచర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తండ్రి హర్మన్ చాలా బాధపడ్డాడు. గణిత, విజ్ఞాన రంగాల్లో అంత ప్రతిభ చూపిస్తున్న కొడుకు, మిగతా సబ్జెక్ట్ లలో ఎందుకు రాణించలేకపోతున్నాడో ఆ తండ్రికి అర్థమయ్యేది కాదు. ఎప్పుడూ సైన్సు, లెక్కలు అని గంగవెర్రులు
పోకుండా మిగతా విషయాల మీద కూడా ధ్యాస పెట్టాలని కొడుకుని మందలించాడు. కాని అంత చిన్న వయసులోనే అన్యమనస్కంగా సైన్స్ కే అంకితమైపోయిన ఆల్బర్ట్ చిత్తం మీద ఆ మందలింపులు పని చెయ్యలేదు.
ఆల్బర్ట్
కి బడి జీవితం దుర్భరంగా తోచడానికి మరో కారణం వుంది. అది చదువుకి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది. ఐన్ స్టయిన్ కుటుంబీకులు యూదు (Jews) మతస్థులు. క్లాసులో తక్కిన పిల్లల్లో అధిక శాతం మంది క్రైస్తవులు. యూదు మతానికి, క్రైస్తవ మతానికి చారిత్రకంగా ఒక విధమైన స్పర్థ వుంది. క్రీస్తుని శిలువ వేసింది యూదు మతస్థులు. ఆ కారణం చేత ఆల్బర్ట్ కి క్లాసులో ఎన్నో సార్లు ప్రతికూలత ఎదురయ్యింది. ఆ ప్రతికూలత కొన్ని సార్లు కాస్త నాటకీయంగా వ్యక్తమయ్యేది. ఓ సారి ఓ టీచర్ ఓ పెద్ద మేకు తెచ్చి క్లాసులో పిల్లలు అందరికీ చూపించాడు. జీసస్ ని శిలువ వేసింది ఇలాంటి మేకులతోనే అని ప్రకటిస్తూ ఓ సారి ఆల్బర్ట్ కేసి చూశాడు. క్లాసులో పిల్లలంతా ఆల్బర్ట్ కేసి విచిత్రంగా చూశారు. ఆల్బర్ట్ సిగ్గుతో తల వంచుకున్నాడు. జీసస్ ని శిలువ వేయడానికి కారణం తానే అన్నంత బాధ కలిగింది. తదనంతరం ఐన్ స్టయిన్ జీవితంలో మతసంబంధమైన అసహనం ఎంతో బాధకి కారణమయ్యింది. ఎన్నో విపత్కర పరిస్థితులకి కూడా దారి తీసింది.
(ఇంకా
వుంది)
0 comments